నిజామాబాద్ , జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వచ్చే ఓటర్లు తప్పనిసరిగా తమ వెంట గుర్తింపు కార్డు తేవాలని జిల్లా ఎన్నికల అధికారి, ఇన్‌చార్జి కలెక్టర్ కె.హర్షవర్ధన్ సోమవారం ఒక ప్రకటనలో సూచించారు. ఓటరు గుర్తింపు కార్డులను 22రకాలుగా ఎన్నికల సంఘం గుర్తించిదన్నారు. ఎలక్షన్ ఐడెంటిటీ కార్డు, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, ఆదాయపు పన్ను గుర్తింపు కార్డు, సర్వీస్ గుర్తింపు కార్డు (సంబంధిత శాఖాధికారులతో జారీ చేయబడినది), బ్యాంకులు, పోస్ట్ఫాసుల ద్వారా ఫొటోలతో జారీ చేయబడిన పాస్‌బుక్‌లు, రైతుల గుర్తింపు కార్డులు, పాస్ పుస్తకాలను గుర్తింపు కార్డులుగా పరిగణిస్తామన్నారు. ఆస్తి, పట్టా దస్తావేజులు, రిజిస్ట్రార్ డీడ్స్, రేషన్‌కార్డు, ఎస్సీ, ఎస్టీ, బిసి ధ్రువీకరణ పత్రాలు, పెన్షన్ డాక్యుమెంట్లు, స్వాతంత్య్ర సమరయోధుల గుర్తింపు కార్డులు, ఆయుధాల లైసెన్సులు, అంగవైకల్య ధ్రువీకరణ పత్రాలు, ఫొటోలతో కూడిన ఎటిఎం కార్డులు, బార్ కౌన్సిల్ ద్వారా సభ్యులుగా గుర్తించిన కార్డులు, లోక్‌సభ, రాజ్యసభ సభ్యులుగా, పార్లమెంటు సభ్యులుగా సచివాలయం ద్వారా జారీ చేసిన గుర్తింపు కార్డులు, ఉపాధి హామీ జాబ్‌కార్డులు, హెల్త్ ఇన్సూరెన్స్ పథకాల కార్డులు, స్మార్ట్‌కార్డులు, పట్టాదార్ పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు కూడా ఓటరు గుర్తింపు కార్డుగా పరిగణిస్తామన్నారు. పైన పేర్కొన్న 22 రకాల కార్డులలో ఏదైనా ఒక కార్డును ఓటర్లు తప్పనిసరిగా తమవెంట తీసుకుని రావాల్సి ఉంటుందని, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ కోరారు.
జిల్లా అదనపు జెసిగా బాధ్యతలు స్వీకరించిన శేషాద్రి
నిజామాబాద్ టౌన్, జూలై 15: జిల్లా అదనపు జెసిగా నియమితులైన డాక్టర్ శేషాద్రి సోమవారం జిల్లా కేంద్రానికి చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. ఇన్‌చార్జి ఎజెసి జయరామయ్య నుండి ఆయన చార్జ్ తీసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎజెసిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం ఎజెసి మాట్లాడుతూ, అందరి సహాయ సహకారాలతో జిల్లాను అభివృద్ధిపథంలో నడుపుతానని స్పష్టం చేశారు. తనకు గతంలో బోధన్ ఆర్డీఓగా పనిచేసిన అనుభవం ఉందని, జిల్లాలోని పరిస్థితులు తెలుసని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరికి అందేలా చర్యలు తీసుకుంటానని ఆ దిశగా తనవంతు కృషి చేయడం జరుగుతుందని వెల్లడించారు. ఇదిలాఉండగా, ఇప్పటివరకు ఎజెసిగా పనిచేసిన శ్రీరాంరెడ్డి గత నెలాఖరులో పదవీ విరమణ పొందిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో వరంగల్ డిఆర్వోగా పనిచేస్తూ పదోన్నతి పొందిన శేషాద్రి నిజామాబాద్ ఎజెసిగా నియమితులయ్యారు. సోమవారం ఆయన చాంబర్‌లో బాధ్యతలు తీసుకోగా, నిజామాబాద్ ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, తహశీల్దార్ రాజేందర్, రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యప్రకాశ్, ఆర్‌ఐ విజయ్‌కాంత్, సంక్షేమ శాఖాధికారులు, సిబ్బంది తదితరులు కలిసి అభినందనలు తెలిపారు.
పండుగలు, ఎన్నికలు ఖాకీలకు సవాల్!
నిజామాబాద్ , జూలై 15: పోలీసులకు నెల రోజుల పాటు అగ్ని పరీక్షగా మారింది. ఓ వైపు పండుగలు, మరోవైపు పంచాయతీ ఎన్నికల నిర్వహణ పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతోపాటు గ్రామాలలో ఎన్నికల వాతావరణం మరింత వేడెక్కింది. దీంతో సమస్యాత్మక గ్రామాలను గుర్తించిన పోలీసులు పక్కా నిఘా వేశారు. రంజాన్ పండుగ ఉపవాస దీక్షలు గురువారం నుండి ప్రారంభం కావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా చర్యలను వేగవంతం చేశారు. అసాంఘిక శక్తుల కార్యకలాపాలు గతంలో జిల్లాలో వెలుగుచూశాయి. దీంతో సమస్యాత్మక ప్రాంతాలను తమ గుప్పిట్లోకి తీసుకుని బందోబస్తును పటిష్టం చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దింపి నిఘాను పెంచారు. అదేవిధంగా బోనాల పండుగ ఇదే నెలలో జరుగనుండటంతో పోలీసులు సవాల్‌గా స్వీకరిస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు కొత్తగా వచ్చిన ఎస్పీ కెవి.మోహన్‌రావు జిల్లా వ్యాప్తంగా పోలీసులతో విస్తృతంగా సమావేశాలు నిర్వహించి మార్గదర్శకాలను నిర్దేశించారు. అత్యంత పకడ్బందీగా ఎన్నికలను నిర్వహించాలని, గొడవలకు తావు లేకుండా చూసుకోవాలని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ జిల్లా అధికారులతో పాటు పోలీసు శాఖకు సూచించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు మొదటి విడతగా పోలింగ్ జరిగే గ్రామాలపై దృష్టిసారించారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా భారీగా పోలీసు బలగాలను ఆయా గ్రామాలలో మోహరించారు. ఎన్నికల నిర్వహణతోపాటుగా పండుగలను సామరస్యంగా జరుపుకోవాలని ఎస్పీ మోహన్‌రావు జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే మంగళవారం నగర శివారులోని ఫంక్షన్ హాల్‌లో శాంతి కమిటీ సమావేశంను నిర్వహించగా, ఎస్పీ పాల్గొని సూచనలు చేశారు. ఇప్పటికే ఎన్నికల బందోబస్తుతో బిజీగా ఉన్న పోలీసులు పండుగలను సైతం ఎలాంటి అవాంతరాలకు తావులేకుండా జరిగేలా కార్యాచరణ రూపొందించారు. ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తేనే జిల్లా పోలీసు శాఖకు ఎన్నికల సంఘం నుండి ప్రశంసలు అందుతాయి. జిల్లా ఎస్పీగా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన మోహన్‌రావు సైతం జిల్లాలోని సవాళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు పక్కా వ్యూహాన్ని రూపొందించారు. రాజకీయ ఒత్తిళ్లను తిప్పికొట్టి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలకు రంగం సిద్ధం చేశారు. వేలం పాట నిర్వహించే గ్రామాలపై డేగ కన్ను వేసి చర్యలు తీసుకునే విధంగా పోలీసులను అప్రమత్తం చేశారు. ఏదేమైనా జూలై మాసం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారనుంది. ఇదిలాఉండగా, గత రెండు నెలలుగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ రేంజ్ డిఐజి పోస్టును ఎట్టకేలకు ప్రభుత్వం భర్తీ చేసింది. సిబిసిఐడి విభాగంలో డిఐజిగా పనిచేస్తున్న అనిల్‌కుమార్‌ను నిజామాబాద్ రేంజ్ డిఐజిగా నియమించింది. ఆయన రెండు రోజులు క్రితమే జిల్లాకు చేరుకుని బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో శాంతిభద్రతలపై పోలీసు అధికారులతో విస్తృతంగా చర్చలు జరిపారు. ఇదిలాఉండగా, ధర్పల్లి మండలంలోని పలు గ్రామాలలో మావోయిస్టుల పేరిట వాల్‌పోస్టర్‌లు వెలువడం పోలీసులకు కొత్త సమస్యలను తెచ్చిపెట్టింది. ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఓ వైపు భారీగా బలగాలను మోహరించిన పోలీసు శాఖకు డివిజన్ కార్యదర్శి జగన్ పేరిట వాల్‌పోస్టర్‌లు వెలుగుచూడడంతో ఆయా ప్రాంతాలపై నిఘాను పటిష్టం చేశారు. జిల్లాలో మావోయిస్టుల ప్రభావం లేదని చెప్పుకొచ్చిన పోలీసు అధికారులు, వాల్‌పోస్టర్‌లు నకిలీల పనేనని కొట్టిపారేస్తున్నారు. అయితే ప్రజాప్రతినిధులను మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. పోస్టర్‌లు అతికించడం వెనుక ఎవరి హస్తం ఉందనేదానిపై సీరియస్‌గా దృష్టిసారించి ఆ దిశగా దర్యాప్తును వేగవంతం చేశారు. మాజీలపై నిఘాను ఏర్పాటు చేశారు. వారి కదలికలను ఏప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవచ్చనే అనుమానాల మేరకు ఇప్పటికే పలువురు పాత నేరస్థులను బైండోవర్ చేశారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రితో మహేష్‌కుమార్ భేటీ
నిజామాబాద్ , జూలై 15: రాష్ట్ర గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన మహేష్‌కుమార్‌గౌడ్ సోమవారం హైదరాబాద్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న మార్కెటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి మహేష్‌గౌడ్‌ను ఆయన నివాసంలో కలుసుకుని కృతజ్ఞతలు ప్రకటించారు. తనకు కీలకమైన గిడ్డంగుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా నియమించేందుకు సహకరించిన తరహాలో, బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వర్తించేందుకు కూడా తగినవిధంగా సహకారం అందించాలని కోరారు.
శిథిల భవనాలను వారంలోగా కూల్చివేయాలి
బల్దియా అధికారులను ఆదేశించిన ఇన్‌చార్జి కలెక్టర్
నిజామాబాద్, జూలై 15: నిజామాబాద్ నగరంలో పురాతన కాలానికి చెంది ఉండి, శిథిలావస్థకు చేరిన భవనాల యజమానులకు తక్షణమే నోటీసులు జారీ చేసి, వారం రోజుల్లోపు కూల్చివేత చర్యలు చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ నగర పాలక సంస్థ అధికారులను ఆదేశించారు. ఈ విషయంలో నిర్లక్ష్యానికి తావు కల్పించే అధికారులను ఎంతమాత్రం ఉపేక్షించబోమని, దురదృష్టవశాత్తు ఏవైనా అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సోమవారం నగరంలోని మాలపల్లి కాలనీలో ఆయన పర్యటించి స్థానిక పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా పలుచోట్ల పురాతన కాలం నాటి భవనాలు శిథిలావస్థకు చేరడాన్ని గమనించి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ తరహా భవనాల యజమానులకు నోటీసులు ఇచ్చి, గడువులోపు కూల్చివేత చర్యలు చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు నగరంలో శిథిలావస్థకు చేరిన కేవలం 37 ప్రభుత్వ, ప్రైవేటు భవనాలకు సంబంధించి మాత్రమే నోటీసులు జారీ చేశారని, పురాతనమైనవి ఇంకా అనేకం ఉన్నాయని అన్నారు. ప్రతిచోట బల్దియా అధికారులు శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, తక్షణమే నోటీసులు అందించాలని, ఎవరైనా స్పందించని పక్షంలో గడువు అనంతరం బల్దియా అధికారులే కూల్చివేతలు చేపట్టి భవన యజమానులకు అపరాధ రుసుము విధించాలన్నారు. ఈ కార్యక్రమం ప్రాధాన్యతను గుర్తిస్తూ అధికారులు ప్రత్యేక చొరవ ప్రదర్శించాలని హితవు పలికారు. కాగా, మాలపల్లి కాలనీలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొని ఉండడాన్ని గమనించి ఇన్‌చార్జి కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రోడ్లపైనే మోకాలి లోతు వరకు గుంతలు ఏర్పడి, అందులో వర్షపు నీరు నిండి ఉండడం, రోడ్లపై బురద, మురికినీరు ప్రవహిస్తుండడం వంటి పరిస్థితులను గమనించి అధికారులపై అసహనం వెళ్లగక్కారు. సి.సి రోడ్లు చెడిపోవడం, ఇప్పటికీ పలుచోట్ల మట్టి రోడ్డే ఉండడం గమనించారు. ప్రజలకు మంచినీటిని సరఫరా చేసే వాటర్‌ట్యాంకు ప్రాంతంలో లీకేజీని చూసి మండిపడ్డారు. లీకేజీ వల్ల కలుషిత నీరు కుళాయిల ద్వారా సరఫరా అవుతుందని, తద్వారా ప్రజలు అనారోగ్యాల బారినపడే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే లీకేజీలకు మరమ్మతులు జరిపించాలని, ప్రజలకు రక్షిత మంచినీరు అందించేందుకు ప్రతి ఒక్కరూ చొరవ చూపాలన్నారు. మంచినీటి ట్యాంకు చుట్టూ పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని ఉన్నపళంగా తొలగింపజేయాలని ఆదేశించారు. మట్టి రోడ్ల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున సి.సి రోడ్ల నిర్మాణాలకు చర్యలు చేపట్టాలన్నారు. ఉర్దూమీడియం బాలికల జూనియర్ కళాశాల ఎదురుగా మురికి కాల్వతో పాటు సి.సి రోడ్ల నిర్మాణం పనులను త్వరితగతిన చేపట్టాలన్నారు. కాలనీలో నివాస ప్రాంతాల నడుమ చెత్తను పారవేసేందుకు వీలుగా డబ్బాలు ఏర్పాటు చేయాలని, పశువులను రోడ్లపై కట్టివేయకుండా యజమానులకు నోటీసులు అందించాలన్నారు. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షిస్తూ, మెరుగైన వసతులు కల్పించేందుకు బల్దియాలోని ప్రతి ఉద్యోగి పాటుపడాలని, ఏమరుపాటు ఎంతమాత్రం తగదని అన్నారు. ఇన్‌చార్జి కలెక్టర్ వెంట మున్సిపల్ ఇన్‌చార్జి కమిషనర్ మంగతాయారు, తహశీల్దార్ రాజేందర్, బల్దియా అధికారులు సిరాజుద్దీన్, రషీద్ తదితరులు ఉన్నారు.
సమస్యలు పరిష్కరించాలని
కలెక్టరేట్‌కు తరలివచ్చిన బాధితులు
నిజామాబాద్ , జూలై 15: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ, పలువురు కల్టెరేట్‌కు తరలివచ్చారు. ప్రజావాణి కార్యక్రమాన్ని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ సోమవారం ప్రగతిభవన్‌లో నిర్వహించారు. దీంతో కలెక్టర్ కార్యాలయం బాధితుల తాకిడితో సందడిగా మారింది. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలను పరిష్కరించడంలో క్షేత్రస్థాయి అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హర్షవర్ధన్ దృష్టికి తీసుకొచ్చారు. ఎపి సివిల్ సప్లయిస్ హమాలీ యూనియన్ ఆధ్వర్యంలో హమాలీలు పెద్ద ఎత్తున కలెక్టరేట్‌కు తరలివచ్చారు. జిల్లాలో వెంటనే సివిల్ సప్లయిస్ గోదాంలు నిర్మించి హమాలీలకు ఉపాధి కల్పించాలని కోరుతూ ఇన్‌చార్జి కలెక్టర్‌కు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షుడు ఓమయ్య మాట్లాడుతూ, గత ఆరేళ్లుగా సివిల్ సప్లయిస్‌కు సొంత గోదాంలు నిర్మించాలంటూ హమాలీలు ఆందోళనలు చేస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలలో సొంత గోదాంలు నిర్మించేందుకు నిధులు మంజూరైనా అధికారులు పట్టించుకోకపోవడంతో నిధులు వెనక్కి మళ్లిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఇరవై ఏళ్లుగా సివిల్ సప్లయిస్ గోదాంలో పనిచేస్తున్న హమాలీలు, కూలీ పనులు లేక పూట గడవడమే గగనంగా తయారైందన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి సివిల్ సప్లయిస్‌కు సొంత గోదాంలను నిర్మించి హమాలీలను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాన కార్యదర్శి బోజన్న, వెంకటేశం గుప్తా, మహబూబ్‌తో పాటు హమాలీలు పాల్గొన్నారు. అదేవిధంగా ఎస్‌టి హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని జిల్లా బంజారా విద్యార్థి సేవా సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్‌కు చేరుకుని వినతి పత్రం అందచేశారు. అంతకుముందు విద్యార్థులతో కలిసి ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కేంద్రంలోని జిజి కళాశాల ప్రాంగణంలో ఉన్న ఎస్‌టి బాలికల వసతి గృహంలో దాదాపు 150 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారని సంఘం ప్రతినిధులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ఎస్‌టి వసతి గృహాలలో అరకొర వసతులతో విద్యార్థులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారని వారు తెలిపారు. జిజి కళాశాలలోని హాస్టల్‌లో మరుగుదొడ్లు, బాత్‌రూంలు లేక విద్యార్థినులు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులకు అన్ని రకాల వసతులు కల్పించినప్పుడే చదువులో రాణించేందుకు దోహదపడుతుందని సంఘం జిల్లా అధ్యక్షుడు రాథోడ్ పెరుమాల్ నాయక్ అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పేద విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలని, వసతి గృహాలలో వసతులను మెరుగుపర్చాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్‌ను కలిసి వినతి పత్రం అందచేశారు. వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీలో పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు అవకాశం కల్పించాలని కోరారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించిన అనంతరం తమ డిమాండ్లతో కూడిన వినతిని ఇన్‌చార్జి కలెక్టర్‌కు అందజేశారు. జీవో 075 ప్రకారం తమకు వివిధ పోస్టులలో అవకాశం కల్పించాలని వారు కోరారు.
‘పెట్రో’ వడ్డనపై సర్వత్రా నిరసనలు
అందోళనలకు సిద్ధమైన ప్రతిపక్షాలు
నిజామాబాద్ , జూలై 15: నెలన్నర రోజుల వ్యవధిలోనే నాలుగు పర్యాయాలు పెట్రోలు ధరలు పెంచడం పట్ల సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం లీటరుకు రూపాయిన్నర చొప్పున అదనపు వడ్డింపులు విధించడం వల్ల జిల్లాలో వాహన వినియోగదారులు ప్రతిరోజు దాదాపు 10 లక్షల రూపాయల అదనపు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది. ముడి చమురు దిగుమతుల వ్యయం పెరగడాన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వ రంగ సంస్థలైన ఇండియన్ ఆయిల్, హిందుస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం సంస్థలు పెట్రోల్ ధరలను చీటికిమాటికి పెంచుతుండడం సామాన్య కుటుంబాలను కలవరపెడుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అనేక పర్యాయాలు పెట్రో ధరలను పెంచడం వల్ల పేద, మధ్య తరగతికి చెందిన వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పలుమార్లు వంటగ్యాస్, కిరోసిన్, డీజిల్ ధరల పెంపు వల్ల నిత్యావసర సరుకుల ధరలు సామాన్య ప్రజలకు అందనంత ఎత్తుకు వెళ్లాయి. దీంతో పాటు సంక్షేమ పథకాలు సైతం అమలుకు నోచుకోకపోవడం వల్ల పేద ప్రజలు అర్ధాకలితో కాలం వెళ్లదీస్తున్న దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రూపాయికి కిలో బియ్యం పథకం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేయకపోగా, విమర్శలు గుప్పిస్తున్నారు. మంచినూనె, పప్పులు, కూరగాయల ధరలు తగ్గించలేని ప్రభుత్వం, కేవలం రూపాయికి కిలో బియ్యం అందించి, వివిధ రకాల పన్నులను పెంచడం ద్వారా ఆర్థిక దోపిడీని కొనసాగిస్తోందని ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం మరోసారి పెట్రోల్ ధరలను పెంచడం వల్ల నిత్యావసర సరుకులపై అది మరింత ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వంద వరకు పెట్రోల్ బంకులు ఉన్నాయి. జిల్లాలో ప్రతిరోజు సగటున 5 లక్షల లీటర్ల డీజిల్, లక్షన్నర లీటర్ల పెట్రోల్ వినియోగం అవుతోంది. జిల్లాలో లక్షా 40 వేల వరకు ద్విచక్రవాహనాలు ఉండగా, ఆటోరిక్షాలు, కార్లు, బస్సులు, ట్రాక్టర్లు ఇతర వాహనాలు మరో 40 వేల వరకు ఉన్నాయి. ప్రస్తుతం పెట్రోల్ ధరలు ఎడాపెడా పెంచివేసి, తీవ్ర భారం మోపడంతో వాహనచోదకులు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు నింగినంటిన తరుణంలో సామాన్య, మధ్యతరగతి ప్రజానీకం బడ్జెట్ సర్దుబాటు కాక అపసోపాలు పడాల్సివస్తోంది. ప్రత్యక్షంగా వాహనదారులకు ఈ అదనపు పోటుకు తోడు బడుగు జీవులు సైతం చీటికిమాటికి పెరుగుతున్న పెట్రో ధరల కారణంగా చార్జీల రూపంలో వాతలను చవిచూడాల్సి వస్తోంది. చమురు ధరలు పెరగడాన్ని సాకుగా చూపిస్తూ ఆర్టీసీ యాజమాన్యం బస్సు ఛార్జీలను పెంచే అవకాశాలుండడం మధ్యతరగతి, సామాన్య, బడుగు జీవులపై ప్రభావం చూపనుంది. ప్రైవేట్ వాహన ఆపరేటర్లు కూడా ఇదే అదనుగా భావించి ఆర్టీసీ కంటే ఎక్కువ స్థాయిలో ధరలు పెంచడం జరుగుతుంది. ఈ పెట్రో మంటలను ఎలా తట్టుకోవాలన్న దానిపై బడ్జెట్ బాబులు తర్జనభర్జనలు పడుతున్నారు. పెట్రో ధరల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనలు చేపట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఈ పరిణామం పంచాయతీ ఎన్నికలపై ఎంతోకొంత ప్రభావం చూపుతుందనే ఆందోళన కాంగ్రెస్ అనుకూల ముద్ర వేసుకున్న అభ్యర్థులను వెంటాడుతోంది. పెరిగిన పెట్రో ధరల ప్రభావం వల్ల ఓటర్లు తమ పట్ల ఎక్కడ వ్యతిరేకత కనబరుస్తారోనని కాంగ్రెస్ మద్దతుదారులుగా బరిలోకి దిగిన అభ్యర్థులు హైరానాకు లోనవుతున్నారు.
సుంకెట దోషులను పట్టుకుంటాం
ఆర్మూర్ డిఎస్పీ రాంరెడ్డి
మోర్తాడ్, జూలై 15: మండలంలోని సుంకెటలో సర్పంచ్ అభ్యర్థులకు బెదిరింపు లేఖలు రాసిన వారిని త్వరలోనే పట్టుకుంటామని ఆర్మూర్ డిఎస్పీ ఆకుల రాంరెడ్డి తెలిపారు. మోర్తాడ్ పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కావాలనే కొందరు వ్యక్తులు ఆడిన నాటకం వల్లే సుంకెటలో ఈ పరిస్థితి ఉత్పన్నమైందన్నారు. దోషులను గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దేవాలయాలు, ప్రార్థనా స్థలాల వద్ద ఎట్టి పరిస్థితుల్లో ప్రచారం నిర్వహించరాదని ఆయన సూచించారు. ప్రజలకు రాజ్యాంగం ద్వారా ఓటు హక్కు సంక్రమించిందని, అది దుర్వినియోగం కాకుండా చూడాలన్నారు. చాలా గ్రామాల్లో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నట్టు సమాచారం అందుతోందని, ఎవరైనా సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేస్తే అలాంటి అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఏకగ్రీవాల కోసం వేలం పాటలు నిర్వహించవద్దని, ఇప్పటికే సబ్ డివిజన్ పరిధిలోని పడిగెల్‌లో కేసు నమోదు చేసామని చెప్పారు. వేలం పాటలు నిర్వహించే గ్రామ కమిటీలు చట్టపరంగా చర్యలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. డివిజన్ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. సుంకెటలో పరిస్థితిని చక్కదిద్దేందుకు పోలీస్ పికెట్‌లను ఏర్పాటు చేశామని, ఎన్నికలు ముగిసే వరకు ఈ పికెట్ కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. అనంతరం మోర్తాడ్‌లోని పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. డిఎస్పీ వెంట భీమ్‌గల్ సిఐ వహీదుద్దీన్, స్థానిక ఎస్‌ఐ సంతోష్‌కుమార్ తదితరులు ఉన్నారు.
‘రూరల్’ సెగ్మెంట్‌లో ఆధిపత్యం చాటుకునేదెవరో..?
డిఎస్, మండవలకు ప్రతిష్టాత్మకం
నిజామాబాద్, జూలై 15: ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలే ఇందుకు కారణమని చెప్పవచ్చు. ప్రధానంగా కాంగ్రెస్, టిడిపి మధ్య ఆధిపత్య పోరు తారస్థాయికి చేరిన నేపథ్యంలో, పంచాయతీ సమరంలో ఎవరిది పై చేయిగా నిలుస్తుందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గత కొన్నాళ్లుగా రూరల్ నియోజకవర్గం నుండి టిడిపి తరఫున ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న మండవ వెంకటేశ్వరరావుకు, పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్‌కు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కొనసాగుతోంది. 2009 సార్వత్రిక ఎన్నికలు, అనంతరం 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ సెగ్మెంట్ నుండి పోటీ చేసి వరుసగా ఓటమి పాలైన డిఎస్, రానున్న ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి బరిలోకి దిగుతారనే ప్రచారం పెద్దఎత్తున జరుగుతోంది. ఈ విషయాన్ని డిఎస్ సైతం కొట్టిపారేయకుండా, తాను జిల్లాలోని తొమ్మిది సెగ్మెంట్లలో ఎక్కడి నుండైనా పోటీ చేస్తానంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేస్తూ రూరల్ నియోజకవర్గంపై తన ఆపేక్షను ప్రదర్శించుకుంటున్నారు. ఈ పరిణామం కాస్తా సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మండవ వెంకటేశ్వరరావుకు ఏమాత్రం రుచించడం లేదు. గత కొన్ని రోజుల క్రితమే రూరల్ సెగ్మెంట్‌లో డిఎస్ ప్రత్యేక చొరవ చూపుతూ పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి చేతుల మీదుగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం సైతం అక్కడే నిర్వహించడంతో ఎమ్మెల్యే మండవ తన అనుచరులతో కలిసి వచ్చి తీవ్ర అభ్యంతరం తెలుపడం, ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాటలు చోటుచేసుకుని రభస నెలకొంది. ఈ సంఘటన అనంతరం మండవ వెంకటేశ్వరరావు డిఎస్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అర్బన్ సెగ్మెంట్‌లో ప్రజల తిరస్కారానికి గురై, రూరల్‌లో పోటీ చేసేందుకు డిఎస్ సిద్ధపడుతున్నారంటూ పత్రికాముఖంగా ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో పంచాయతీ ఎన్నికలను వేదికగా మల్చుకుని రూరల్ సెగ్మెంట్‌పై డిఎస్ పాగా వేయకుండా మండవ తన అనుచరుల ద్వారా పకడ్బందీగా పావులు కదుపుతున్నారు. నియోజకవర్గం పరిధిలోని డిచ్‌పల్లి, దర్పల్లి, నిజామాబాద్ మండలంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. ఇప్పటికే టిడిపి తరఫున అనుకూల అభ్యర్థులను బరిలో నిలుపుతూ, వారి గెలుపు కోసం మండవతో పాటు టిడిపి ఎమ్మెల్సీలు అర్కల నర్సారెడ్డి, విజి.గౌడ్, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు దినేష్‌కుమార్ తదితరులంతా తీవ్రంగా శ్రమిస్తున్నారు. పంచాయతీ సమరంలో కాంగ్రెస్ మద్దతుదారులు ఓటమిపాలైతే రూరల్ సెగ్మెంట్‌లో పోటీ చేయడం అంత సునాయసం కాదనే సంకేతాలు డిఎస్‌కు అందించినట్లవుతుందని భావిస్తున్నారు. దీంతో నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ వంటి ప్రక్రియలను తెదెపా నేతలు ఎంతో నిశితంగా గమనిస్తున్నారు. నిజామాబాద్ మండలం ముల్లంగి గ్రామంలో రెండు వార్డు స్థానాలకు కాంగ్రెస్ అనుకూల వర్గానికి చెందిన ఇద్దరు అభ్యర్థుల నామినేషన్లను తిరస్కరించిన సందర్భంగా టిడిపి, కాంగ్రెస్ వర్గాల మధ్య స్వల్పస్థాయిలో ఘర్షణ సైతం జరిగింది. ఇలా ప్రతీ విషయంలోనూ మండవ, డిఎస్‌లకు చెందిన వర్గీయులు ఈ నియోజకవర్గంలో పంచాయతీ పోరును సవాల్‌గా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ సైతం రూరల్‌లో మంచి పట్టు కలిగి ఉన్న తన ప్రధాన అనుచరుడైన నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్‌రెడ్డి ద్వారా పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం రూరల్ సెగ్మెంట్ పరిధిలోని స్థానిక సంస్థల్లో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ అనుకూల అభ్యర్థులు గెలుపొందితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అది తన గెలుపునకు దోహదపడుతుందనే భావనతో డిఎస్ సైతం పకడ్బందీగానే పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. మొత్తమీద ఇద్దరు నేతలకు ఈ నియోజకవర్గంలో తొలివిడతలోనే జరుగుతున్న పంచాయతీ పోరులో పై చేయిని చాటుకోవడం ప్రతిష్టాత్మకంగా మారింది.