Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

అక్రమంగా జిల్లాకు మద్యం రాకుండా ఆరు చెక్‌పోస్టులు

$
0
0

ఒంగోలు, జూలై 15: జిల్లాలో జరుగుతున్న పంచాయితీ ఎన్నికల సందర్భంగా అక్రమమద్యం జిల్లాకు ప్రవేశకుండా ఆరుచెక్‌పోస్టులు, 14మొబైల్ టీంలను ఏర్పాటుచేసినట్లు ఒంగోలు డివిజన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం భాస్కరరావువెల్లడించారు. సోమవారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల సందర్భంగా టంగుటూరులోని టోల్‌గేట్, చీరాల మండలంలోని ఈపూరుపాలెం, అద్దంకి మండలంలోని పుట్టావారిపాలెం, మార్కాపురం ప్రాంతంలోని దిగువమెట్ట, దోర్నాలలో, పామూరు దగ్గర ఒక చెక్‌పోస్టును ఏర్పాటుచేశామన్నారు. అదేవిధంగా జిల్లాలోని 14 ఎక్సైజ్ పోలీసు స్టేషన్ల పరిధిలో 14 మొబైల్ పార్టీలను ఏర్పాటుచేశామని ఆ పార్టీలు ఈనెల 10న నాకాబందీని నిర్వహించాయని ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఇతర జిల్లాల నుండి అక్రమ మద్యం జిల్లాలోకి రాకుండా ఉండేందుకు సోమవారం ఇంటర్ జిల్లాల అధికారులు ముమ్మర దాడులు చేపట్టినట్లు ఆయన వివరించారు. జిల్లాకు సరిహద్దుప్రాంతమైన స్టువర్టుపురం ప్రాంతంలో దాడులు చేయగా నాలుగు కేసులు నమోదుచేసి 30లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకుని ఆరువందల లీటర్ల ఊటను ధ్వంసం చేసినట్లు ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఇద్దరిని అరెస్టుచేసినట్లు ఆయన వివరించారు.
జిల్లాలో ఎక్కడైనా బెల్టుషాపులు ఉంటే వాటిపై విజిలెన్స్‌దాడులు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల సందర్భంగా గత సంవత్సరం మద్యం షాపునకు ఎంత అయితే మద్యం బాటిళ్ళు సరఫరా చేస్తామో అదే సరఫరా జరుగుతుంది తప్ప ఎక్కువమోతాదులో మద్యం బాటిళ్ళను విడుదల చేయమని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాలో ఇప్పటివరకు పంచాయతీ ఎన్నికల సందర్భంగా అనధికార బెల్టుషాపుల నిర్వాహకులపై 225కేసులు నమోదుచేసినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా 63మందిపై బైండోవర్‌కేసులు పెట్టామన్నారు. 1761 మద్యంబాటిళ్ళను అనధికార మద్యంబెల్టుషాపుల వద్ద సీజ్‌చేసినట్లు భాస్కరరావు తెలిపారు.
జిల్లావ్యాప్తంగా మిగిలి ఉన్న 47 మద్యంషాపులకు టెండర్లు పిలిచేందుకు సోమవారం నోటిఫికేషన్ జారీచేసినట్లు ఆయన వివరించారు. ఈనెల 21వతేదీన దరఖాస్తులు తీసుకునేందుకు తుదిగడవని, 22వతేదీన లాటరీపద్దతిన టెండర్లను తీస్తామని ఆయన తెలిపారు.
ఒంగోలు సర్కిల్ పరిధిలో తొమ్మిది, చీమకుర్తి సర్కిల్ పరిధిలో మూడు, పొదిలి సర్కిల్‌పరిధిలో నాలుగు, దర్శి సర్కిల్ పరిధిలో రెండు, కనిగిరి సర్కిల్ పరిధిలో ఏడు, చీరాల సర్కిల్ పరిధిలో తొమ్మిది, పర్చూరు సర్కిల్ పరిధిలో ఒకటి, అద్దంకి సర్కిల్‌పరిధిలో రెండు, కందుకూరు సర్కిల్ పరిధిలో మూడు, శింగరాయకొండ సర్కిల్ పరిధిలో నాలుగు, గిద్దలూరు సర్కిల్ పరిధిలో మూడు మద్యంషాపులకు టెండర్లను పిలుస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా అక్రమ మద్యం నిరోధానికి పకడ్బంధీ ఏర్పాటుచేసినట్లు ఒంగోలు డివిజన్ ఇఎస్ భాస్కరరావు తెలిపారు.

ఆర్టీసీని లాభాల బాటలో నడిపిస్తా
ప్రకాశం ఆర్‌ఎంగా నాగశివుడు బాధ్యతల స్వీకరణ
ఒంగోలు, జూలై 15:ప్రకాశం ఆర్‌టిసి రీజనల్ మేనేజన్‌గా వనరుల నాగశివుడు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడారు. జిల్లాలోని ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతికి చర్యలు తీసుకుంటానని ఆయన వెల్లడించారు. బస్సులు వేళకు వచ్చేలా చర్యలు తీసుకుని ప్రయాణికుల్లో ఆర్‌టిసి పట్ల నమ్మకాన్ని కలిగిస్తానని చెప్పారు. ప్రధానంగా రీజియన్‌లోని కార్మికులు, సిబ్బంది సహకారంతో లాభాల బాటలో పెట్టేందుకు తనవంతు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఆదాయం వచ్చే మార్గాల్లో సర్వీసులు పెంచుతానని ఆయన తెలిపారు. ప్రయాణికులు లేకుండా వృథాగా తిరిగే సర్వీసులపై ప్రత్యేక దృష్టిపెట్టి ఆ సర్వీసులను రద్దు చేస్తానని ఆయన వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ఆటోలు, జీపులపై పోలీసు శాఖ సహకారంతో చర్యలు తీసుకుంటానని నాగశివుడు తెలిపారు. కందుకూరు డిపో మేనేజరుగా 1987 నుండి 90వ సంవత్సరం వరకు నాగశివుడు జిల్లాలో పని చేశారు. గతంలో పనిచేసిన అనుభవంతో ఆయన సంస్థను లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఒంగోలు డిపో మేనేజరుగా 1990 నుండి 93వ సంవత్సరం వరకు, 1993 నుండి 95 వరకు తిరుపతి డిపో మేనేజర్ గాను, 95 నుండి 98 వరకు తిరుమల డిఎంగాను, 98 నుండి 2001 వరకు కడప సిటిఎంగాను, అనంతరం 2003వ సంవత్సరం వరకు తిరుపతి సిటిఎంగాను నాగశివుడు పనిచేశారు. 2003 నుండి 2004 సంవత్సరం వరకు నెల్లూరులో కంట్రోలు ఆఫ్ స్టోర్స్‌గాను, 2006 నుండి 2008 వరకు తిరుపతిలో వర్క్స్ మేనేజర్ గాను, 2009వ సంవత్సరంలో విజయనగరం ఆర్‌ఎంగాను, 2010వ సంవత్సరంలో కడప జిల్లా ఆర్‌ఎంగాను, 2011 నుండి తిరుపతి ఆర్‌ఎంగా పనిచేస్తూ బదిలీపై జిల్లాకు వచ్చినట్లు ఆర్‌ఎం నాగశివుడు వెల్లడించారు.

రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి
* నెల్లూరు ఎంపి మేకపాటి స్పష్టం
కనిగిరి రూరల్, జూలై 15: రాష్ట్రం కలిసి ఉంటేనే అభివృద్ధి చెందుతుందని, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకే వైఎస్‌ఆర్‌సిపి నడుచుకుంటుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు. సోమవారం స్థానిక మాజీ జడ్‌పిటిసి వైఎం ప్రసాద్‌రెడ్డి (బన్ని) నివాస గృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం విషయంలో వైఎస్‌ఆర్‌సిపి అభిప్రాయాన్ని గతంలోనే వ్యక్తం చేశామని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ పనితీరు సైగలతో సయ్యాటలాడుతూ ప్రజాసంక్షేమాన్ని కాంగ్రెస్ మరిచిపోయిందని ఆయన ఆరోపించారు. వైఎస్‌ఆర్‌సిపిని ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి చెల్లలేవని, జరగనున్న పంచాయతీ ఎన్నికలలో వైఎస్‌ఆర్‌సిపి అత్యధిక స్థానాలలో గెలుపొందడం ఖాయం అని, వైఎస్‌ఆర్‌సిపి కార్యకర్తలను అధికారపార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశంపార్టీ నాయకులు ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని అన్నారు. రాష్ట్రంలో ఏసమయంలోనైనా సాధారణ ఎన్నికలు నిర్వహిస్తే వైఎస్‌ఆర్‌సిపికి పట్టం కట్టేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసంక్షేమాన్ని విస్మరించి నిత్యావసర ధరలు, విద్యుత్ చార్జీలు, డీజిల్, పెట్రోల్ గణనీయంగా పెంచి సామాన్య ప్రజానీకం నడ్డి విరిసిందని ఆయన అన్నారు. ఈకార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి నాయకులు మాజీ మంత్రి ముక్కు కాశిరెడ్డి, పిచ్చాల శ్రీనివాసులరెడ్డి, గుడిపాటి ఖాదర్, పులి శ్రీనివాసులరెడ్డి, తమ్మినేని శ్రీనివాసులరెడ్డి, పాలూరి రమణారెడ్డి, నలందా రవి, కె గురవయ్య, కె రమణారెడ్డి, టి రామచంద్రారెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

1020 పంచాయతీల్లో 5,955 సర్పంచ్ అభ్యర్థులు
10302 వార్డుల్లో
25993 వార్డు సభ్యులు
మొదలైన ప్రచారం
ఒంగోలు, జూలై 15: జిల్లాలోని 1020పంచాయతీల్లో స్క్రూట్నీ తరువాత సర్పంచ్ అభ్యర్థులుగా 5,955మంది, వార్డుమెంబర్లుగా 25,993మంది ఎన్నికల బరిలో ఉన్నారు. ఒంగోలు డివిజన్‌లోని 346పంచాయతీలకు సర్పంచ్ అభ్యర్థులుగా 1833మంది, 3600వార్డులకు 9,631మంది అభ్యర్థులు, కందుకూరు డివిజన పరిధిలో 475పంచాయతీలు ఉండగా 2,786మంది సర్పంచ్ అభ్యర్థులు, 4,634 వార్డులకు11,607మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా మార్కాపురం డివిజన్ పరిధిలో 199పంచాయతీలు ఉండగా 13,36మంది సర్పంచ్ అభ్యర్థులు, 2,068వార్డులకుగాను 4,755మంది వార్డుమెంబర్లు ఎన్నికల బరిలో ఉన్నారు.పోటీలో ఉన్న అభ్యర్థులకు ఈనెల 17వతేదీన గుర్తులు రానున్నాయి. గుర్తులు రాకపోయినప్పటికి పోటీలో ఉన్న అభ్యర్థులు ముమ్మరప్రచారంలో మునిగితెలుతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులతోపాటు వారి బంధుగణం కూడా ప్రచారహోరెత్తిస్తున్నారు. ప్రధానంగా రాత్రి ఏడుగంటలు దాటితే చాలు ఓటర్ల ఇంటిముందు పోటీలో ఉన్న అభ్యర్థులు ప్రత్యక్షవౌతున్నారు. తాము పోటీలో ఉన్నాము తమకు ఓటు వేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు. కొంతమంది పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను బెదిరించే కార్యక్రమంలో కూడా నిమగ్నవౌతున్నారు. కోస్తాతీరప్రాంతంలో రొయ్యల చెరువులు ఉన్నాయి. ఆప్రాంతంలోని రొయ్యల చెరువుల యజమానుల వద్దనుండి బలవంతంగా నగదువసూలుచేయటమే కాకుండా ఓట్లుతమకు వేయకుంటే రొయ్యల చెరువుల అంతు చూస్తామంటూ కూడా బెదిరింపులు వస్తున్నట్లు సమాచారం. పోటీలో ఉన్న అభ్యర్థులకు రొయ్యల చెరువులు యజమానులు సహకరించకపోతే రొయ్యలు కౌంట్‌లో ఉన్న దశలో విషగుళికలు వేస్తారన్న భయంతో బిక్కుబిక్కుమంటున్నారు. పంచాయతీ ఎన్నికలు రొయ్యల చెరువుల యజమానులు ప్రాణసంకటంగా మారిందనే చెప్పవచ్చు.

‘తెలుగుభాషకు వెలుగుదివ్వె ఘంటసాల’
ఒంగోలు , జూలై 15 : తెలుగుభాషకు వెలుగు దివ్వె అమరగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు అని పలువురు వక్తలు కొనియాడారు. ఘంటసాల నేషనల్ ఆర్డ్స్ అకాడమీ 108రోజుల పాటు నిర్వహిస్తున్న ఘంటసాల ఆరాధనోత్సవాల కార్యక్రమం రాష్ట్ర సంగీత సాహిత్య చరిత్రలో నూతన అధ్యాయనానికి నాంది పలుకుతుందని అర్బన్ బ్యాంకు మాజీ డైరెక్టర్ కుర్రా ప్రసాద్‌బాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం సివియన్ రీడింగ్ రూము ఆవరణలో నిర్వహిస్తున్న నిర్విరామ ఘంటసాల గాన సంగీత విభావరికి ముందుగా జిల్లాకు చెందిన సినీ హీరో బూచేపల్లి కమలాకర్ ఆకస్మిక మరణానికి సభ 2 నిమిషాల పాటు వౌనం పాటించి నివాళులు అర్పించింది. అనంతరం జరిగిన కార్యక్రమంలో అభినవ ఘంటసాల బాలయోగి గానామృతం శ్రోతలను తన్మయత్వంలో ఓలలాడించింది. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి సభా కార్యక్రమాన్ని ప్రారంభించిన కుర్రా ప్రసాద్‌బాబు మాట్లాడుతూ తెలుగు భాషా వికాసానికి వెలుగు దివ్వెల ఘంటసాల మన మధ్య నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటారని పేర్కొన్నారు. ఎంతో సాహసోపేతమైన ఈ నిర్విరామ ఘంటసాల సంగీత విభావరి కార్యక్రమాన్ని చేపట్టి అద్వితీయంగా నిర్వహిస్తున్న ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీకి ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు. సోమవారంతో సంగీత విభావరి కార్యక్రమం 65 రోజులు పూర్తి చేసుకున్నట్లు ఘంటసాల నేషనల్ ఆర్ట్స్ అకాడమీ అధ్యక్షుడు తాటికొండ విజయ్‌కాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అకాడమీ మేనేజర్ కళ్ళగుంట కృష్ణ, జిల్లా సాహిత్య సాంస్కృతిక సంస్థల ఐక్య వేదిక గౌరవాధ్యక్షులు ఎం మల్లికార్జున్‌రావు, ఇళయరాజ సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు డాక్టర్ సంతవేలూరి కోటేశ్వరరావు, చదరంగ సమాఖ్య అధ్యక్షుడు పివి కృష్ణ, యన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. గాయనీ గాయకులు తాటికొండ బాలయోగి, లక్ష్మీ తులసీ, అప్పికట్ల రత్తయ్య, కీ బోర్డు రవి, తబలా బాలాజీలు తమ ప్రతిభా పాఠవాలతో శ్రోతల అభిమానాన్ని చూరగొన్నారు.

కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి
ఒంగోలు, జూలై 15: కాంట్రాక్టు అధ్యాపకులను తక్షణమే క్రమబద్ధీకరించాలని, ఉద్యోగభద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఒంగోలులో ర్యాలీ నిర్వహించి స్థానిక చర్చి సెంటర్‌లో మానవహారం చేపట్టారు. 30 కళాశాలల నుండి కాంట్రాక్టు అధ్యాపకులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. స్థానిక చర్చి సెంటర్ నుండి నెల్లూరు బస్టాండ్ వరకు ప్లేకార్డులు ప్రదర్శించి ర్యాలీ చేపట్టారు. తమకు ఉద్యోగభద్రత కల్పించేంత వరకు సమ్మె ఆపేది లేదని అసోసియేషన్ అధ్యక్షులు కె సురేష్ తేల్చి చెప్పారు. కలెక్టరేట్ ఎదురుగా అధ్యాపకులు చేపట్టిన సమ్మె సోమవారం నాటికి 22వ రోజుకు చేరుకుంది. ఈ దీక్షా శిబిరాన్ని ఫోరంఫర్ గుడ్‌గవర్నెన్స్ జిల్లా కార్యదర్శి ఎస్‌కె షంషేర్ అహ్మద్ ప్రారంభించి మాట్లాడారు. చాలీ చాలని వేతనాలతో 13 సంవత్సరాల నుండి ఊడిగం చేయించుకొని క్రమబద్దీకరణ చేయక పోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రతినిధులు ఆర్‌సిహెచ్ రంగయ్య, పి మాధవరావు, సుబ్బారెడ్డి, నర్సారెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాసరావు, ఈశ్వరుడు, కాశీ రత్నం, బాబూరావు, సంయుక్త, హేమలత, పద్మజ, నాయక్, ఆంజనేయులు, వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

పెంచిన పెట్రోల్ ధరలు తగ్గించాలని
కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం
ఒంగోలు అర్బన్, జూలై 15: పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఒంగోలు నగర సమితి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక అద్దంకి బస్టాండ్ సెంటర్‌లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నగర ముఠా కార్మిక సంఘం కార్యాలయం నుండి సిపిఐ కార్యకర్తలు ప్రదర్శనగా వెళ్ళి అద్దంకి బస్టాండ్ సెంటర్‌లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె అరుణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజలపై భారాలు మోపుతూ గత ఆరువారాల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెంచడం వలన సామాన్య మానవులపై అధిక భారం పడిందన్నారు. దీని ప్రభావం వలన నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. నగర కార్యదర్శి ఉప్పుటూరి ప్రకాశరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఒకవైపు అవినీతి పరులను ప్రోత్సహిస్తూ రూపాయి మారకపు విలువ పడిపోయిందనే సాకుతో విచ్చల విడిగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వ చర్యలను తిప్పి కొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నగర సిపిఐ నాయకులు కె సుభాన్ నాయుడు, ఎస్‌డి సర్థార్, చినిగే సుబ్బారావు, చంధ్రశేఖర్, వెంకటేశ్వర్లు, మురళి, కుమారి, మస్తాన్ , గాంధీ తదితరులు పాల్గొన్నారు.

నిరుద్యోగ యువతకు బ్యాంకర్లు ఆర్థిక సహాయం అందించాలి
జిల్లాకలెక్టర్ విజయకుమార్
ఒంగోలు, జూలై 15: జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధిమార్గాలపై శిక్షణ ఇచ్చి ఆర్థిక సహాయం అందించేందుకు బ్యాంకర్లు కృషిచేయాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సిపిఒ కాన్ఫరెన్స్‌హాలులో నిరుద్యోగ యువతకు, స్వయం సహాయక సంఘాలకు ఉపాధి మార్గాలపై రూడ్‌సెట్ ద్వారా అమలు జరుగుతున్న కార్యక్రమాలపై బ్యాంకర్లతో కలెక్టర్ సమీక్షించారు. ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో నిరుద్యోగ యువతకు సంక్షేమశాఖల ద్వారా ఆర్థిక సహాయం అందించేందుకు సమగ్ర ప్రణాళికను తయారుచేయటం జరుగుతుందన్నారు. జిల్లాలో సంక్షేమ శాఖల ద్వారా గ్రామాల్లో వివిధ పథకాల క్రింద నిరుద్యోగులకు రుణాలు అందించేందుకు గ్రామస్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. గ్రామస్థాయిలో ఉత్సాహంగా ఉన్న లబ్ధిదారులు వారు కోరుకున్న పరిశ్రమ స్థాపించేందుకు అవసరమైన శిక్షణ రూడ్‌సెట్ ద్వారా ఇప్పించనున్నట్లు చెప్పారు. జిల్లాలో గత సంవత్సరం నాలుగువందల కోట్లరూపాయలు స్వయం సహాయక సంఘాలకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.నిరుద్యోగుల ఉపాధి అవకాశాలపై శిక్షణ ఇవ్వటం, వారు కోరుకున్న యూనిట్లపై ఎంత సంపాదించవచ్చు, ఎంత బ్యాంకులకు చెల్లించవచ్చు అనే విషయాలు క్షుణ్ణంగా తెలుసుకుంటారన్నారు. ఈసమావేశంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ పద్మజ, లీడ్ డిస్ట్రిక్ మేనేజరు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

* 14 మొబైల్ టీంలు ఏర్పాటు * 47 మద్యంషాపులకు నోటిఫికేషన్ విడుదల * ఎక్సైజ్ ఇఎస్ భాస్కరరావు వెల్లడి
english title: 
check posts

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>