Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఊగిసలాట!

$
0
0

శ్రీకాకుళం, జూలై 15: గ్రేటర్ మున్సిపాలిటీ విలీన సమస్య పెండింగ్‌లో ఉన్న ఖాజీపేట, పాతృనివలస, తోటపాలెం, కుశాలపురం పంచాయతీల్లో ఎన్నికల సందడిపై ఊగిసలాట నెలకొంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్న ఈ పంచాయతీల్లో ఆదివారం సాయంత్రం ఆందోళన చెలరేగింది. తొలుత ఈ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించవద్దని ఎన్నికల కమీషన్ నిర్ణయించింది. దీనిపై ఆయా గ్రామాల మాజీ సర్పంచ్లు హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, నామినేషన్ స్వీకరణ కూడా పూరె్తైంది. సర్పంచ్ పదవులపై ఆశలు పెంచుకున్న అభ్యర్థులు మందీమార్భలంతో రంగంలో దిగి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు సర్వం సిద్ధం చేశారు. అంతేకాకుండా తొలివిడత ఎన్నికల ప్రచారాన్ని కూడా పూర్తిచేసి అక్కడ ఓటర్లకు తాయిళాలు అందించే పనిలో బరిలో ఉన్న అభ్యర్థులుండగా ప్రభుత్వం ఈ పంచాయతీలపై మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ పిటీషన్ వేయడంపై కలకలం మొదలైంది. ఈ విషయం తెలుసుకున్న కొంతమంది ఆశావహులు హైకోర్టుకు పరుగులు తీసి నామినేషన్‌పత్రాలను కూడా న్యాయస్థానం ముందుంచి మధ్యంతర ఉత్తర్వులు కొనసాగేలా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం సవాల్ చేసిన పిటిషన్‌ను సోమవారం విచారించి తీర్పు వెలువరిస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. సర్పంచ్ పదవుల కోసం పోటీలో ఉన్న అభ్యర్థులు ఇప్పటికే లక్షలాది రూపాయలు ఖర్చు చేయడమే కాకుండా ఓటర్లు కూడా ఎన్నికలు జరుగుతాయని ఆశలు పెంచుకున్నారు. ఇంతలో హైకోర్టు తీర్పు ఎలా ఉంటుందోనన్న పుకార్లు షికార్లు చేయడంతో ఇటు ఆశావహులు, అటు ఓటర్లు ఒకింత ఉత్కంఠకు లోనవుతున్నారు. మధ్యంతర ఉత్తర్వులపై మంగళవారం తీర్పు వెలువడుతుందని రాజధాని వర్గాలు ఇచ్చిన సమాచారంపై ఈ నాలుగు పంచాయతీల్లో వాడివేడి చర్చ సాగుతోంది. తాత్కాలికంగా ప్రచారాలకు తెరదింపి కోర్టు ఉత్తర్వుల కోసం ఆశావహులు నిరీక్షించడంతో నిశ్శబ్ధ వాతావరణం చోటుచేసుకుంది. ఎన్నికల సందడి ఎక్కడ తప్పిపోతుందోనన్న భయం ఓటర్లను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఈ ఊగిసలాటకు ఎలా తెరపడుతుందో వేచిచూడాలి మరి.

‘ ఉపాధి’ పీకేస్తాం!
శ్రీకాకుళం, జూలై 15: రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉన్న మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకమే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు ప్రధాన ఆయుధంలా అధికార పార్టీ నేతలు వినియోగిస్తున్నారు. పంచాయతీ ఓటర్లలో 30 శాతం మంది ఓటర్లు ఉపాధి హామీ పథకంలో జామ్ కార్డు దారులే! సుమా రు ఐదు లక్షల మంది ఓటర్లు తాము సూచించిన అభ్యర్ధులకే ఓటు వేస్తారన్న ప్రగాఢ విశ్వాసంతో ఆ శాఖ ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు. వారంతా పంచాయతీ ఎన్నికల వేళ ప్రచార సారథుల్లా పనిచేయడం ఆరంభించారు. జిల్లా అంతటా ఇదే తీరు ఉన్నప్పటికీ, శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ పంచాయతీ ఓటర్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సౌరభ్‌గౌర్‌కు సోమవారం ఫీల్డు అసిస్టెంట్‌పై ఫిర్యాదు చేసారు. ఓటర్లను బెదిరించి జాబ్ కార్డులు పీకేస్తామని, ‘ఉపాధి’ లేకుండా చేస్తామని హెచ్చరికలు చేస్తున్న వైనాన్ని సానివాడ ఓటర్లు వెలుగులోకి తీసుకువచ్చారు. ఓటర్లను హెచ్చరిస్తూ అధికార పార్టీ అభ్యర్ధులకే ఓట్లు వేయాలంటూ కొంతమంది ఫీల్డు అసిస్టెంట్లు హెచ్చరికలు జారీ చేస్తున్న కథనాలు జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ ముందుకు రావడంతో పంచాయతీల్లో ‘అథికార’ దుర్వినియోగం బట్టబయలు అయ్యింది. పంచాయతీ ఎన్నికలలో తాము సూచించిన అభ్యర్థికి ఓటు వేయని పక్షంలో ఉపాధి హామీ పనులు చేయు కూలీలకున్న జాబ్ కార్డులు రద్దు చేస్తామని శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ పంచాయతీకి చెందిన ఓటర్లు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. కొంతసేపు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసారు. ఓ ఫీల్డ్ అసిస్టెంటు నేరుగా ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, జాబ్ కార్డులు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారని వారంతా ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ సౌరభ్‌గౌర్ స్పందిస్తూ విచారణ జరిపించి బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటానంటూ ఫిర్యాదుదారులైన లక్ష్మీ, అప్పలనర్సమ్మలకు భరోసా ఇచ్చారు. ఇటువంటి సంఘటనలు జిల్లాలో అన్నీ పంచాయతీల్లో ఉన్నాయి. కాని - సానివాడ ఓటర్లు స్పందించి కలెక్టర్ దృష్టికి తీసుకురావడం గమనార్హం. ఇటీవల టెక్కలి డివిజన్‌లో కూడా ఇటువంటి హెచ్చరికలు వినిపించాయి. కేంద్ర ప్రభుత్వంచే అమలు చేస్తున్న మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండోవిడతగా 2007, మే 3న రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపథం కార్యక్రమంలో ప్రారంభించారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో శ్రీకాకుళం జిల్లా ఈ పథకాన్ని అమలు చేస్తుందని ముఖ్యమంత్రి చేతులమీదుగా ఇటీవలే జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ అచీవ్‌మెంటు అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల కోసం ఆ శాఖకు చెందిన ఫీల్డు అధికారులే ఓటర్లకు జాబ్‌కార్డులు తొలగిస్తామంటూ బెదిరించడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అటువంటి ఫీల్డ్ ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకునేందుకు ప్రత్యేక బృందాన్ని విచారణ నిర్వహించాలంటూ ఆదేశించారు. జిల్లాలో 38 మండలాల్లో 1104 పంచాయతీల్లో 4369 ఆవాసాలకు 5,06,004 జాబ్‌కార్డులు మంజూరు చేసారు. అయితే, 38 మండలాలకు 1099 పంచాయతీల్లో 15,63,838 ఓటర్లు ఉన్నారు. ఇందులో 30 శాతం వరకూ ఉపాధి హామీ కూలీలు ఉండడంతో వారి ఓటుబ్యాంకు అధికార పార్టీ అభ్యర్ధులు దక్కించుకునేందుకు ఫీల్డు అసిస్టెంటులను ప్రచార సారథులుగా వినియోగించుకుంటున్నారు. ఏడేళ్ల తర్వాత ఎన్నికలు జరిగినంతమాత్రన పంచాయతీల తలరాత అమాంతం మారిపోతుందని విశ్వసించగల వీల్లేదు. అట్టడుగు స్థాయి చట్టసభగా పౌరజీవనం మెరుగుదలకు ఊరంతా ఒక్కమాటపై సమిష్టి కృషి సాగించాల్సిన పంచాయతీలకు అసలు ఈ చౌకబారు రాజకీయాలతో పనేముంది? గ్రామపంచాయతీ ఎన్నికలను ఆసాంతం రాజకీయాల్లో ముంచి తేలుస్తున్న పార్టీలే ప్రలోభస్వామ్యానికి, విలువల ఖూనీకి పోటాపోటీగా పాల్పడుతున్నాయి. గ్రామస్వరాజ్యాన్ని ఎండమావిగా స్థీరీకరిస్తున్నాయి! అందుకు తార్కణమే జిల్లాలో ఉపాధిహామీ పథకం పటిష్టంగా అమలు చేయాల్సిన ఫీల్డు ఆఫీసర్లు కొందరు పంచాయతీ ఎన్నికల ప్రచార సారధులుగా మారి జాబ్ కార్డులు పీకేస్తాం...ఉపాధి లేకుండా చేసేస్తాం...తాము సూచించిన అభ్యర్ధులకు ఓట్లు వేయకపోతే రోజూ కూలీలు కట్! అంటూ చేసే బెదిరింపులు పంచాయతీ బ్యాలెట్‌పై ధనం, మద్యం ప్రభావం లేకుండా అవసరమైన చర్యలన్నీ చేపడతామంటున్న ఎన్నికల అధికారి ప్రకటన ఏ మేరకు అమలవుతుందన్నదే అంతిమంగా ఎన్నికల వాసిని నిగ్గుతేల్చే కీలకాంశం!

ఎన్నికల విధులకు హాజరుకాని వారిపై చర్యలు
శ్రీకాకుళం, జూలై 15: ఎన్నికల విధులకు గైర్హాజరయ్యే వారిపై కఠిన చర్యలు చేపడతామని జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై సోమవారం సాయంత్రం మండల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల విధులకు నియమించిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా విధులకు హాజరుకావాలని సూచించారు. ఎన్నికల ప్రవర్తనా నియామవళి విధిగా పాటించాలని పేర్కొన్నారు. ప్రతి మండలానికి ఒక బృందాన్ని నియమించామని, ఆ బృందం అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి నివేదిక సమర్పిస్తుందని చెప్పారు. ఏకగ్రీవంగా ఎన్నికైన వార్డులు ఒక పంచాయతీలో ఉంటే అటువంటి చోట్ల పోలింగ్ కేంద్రాలు తగ్గించే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఆరువందల మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునే వెసులుబాటు రాష్ట్ర ఎన్నికల సంఘం కల్పించిందని పేర్కొన్నారు. మండలాల్లో రూట్లు, జోన్ల వివరాలను పూర్తిస్థాయిలో అందించాలని ఆదేశించారు. ఈ నెల 18వ తేదీన స్టేజి-2 అధికారుల శిక్షణా కార్యక్రమ్నా ఏర్పాటు చేయాలన్నారు. స్టేజ్-2 అధికారులుగా 452 మందిని నియమించామని చెప్పారు. పోలింగ్ అధికారి మెటీరియల్, కౌంటింగ్ మెటీరియల్ ఈ నెల 18వ తేదీ నాటికి అందించుటకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఎన్నికలసామాగ్రి పంపిణీ కేంద్రాలను చక్కగా ఏర్పాటుచేయాలన్నారు. పోలింగ్ సిబ్బంది అందరూ సాధ్యమైనంత వరకు సమయపాలన పాటించాలన్నారు. వీడియోకాన్ఫరెన్స్ విధానం మండల స్థాయిలో ఏర్పాటు చేసిన తరువాత మండలాలతో జిల్లాకలెక్టర్ మొదటిసారిగా నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో అదనపు జాయింట్ కలెక్టర్ ఆర్.ఎస్.రాజ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి నూర్‌భాషాఖాసీం, డిఆర్‌డిఏ పి.డి రజనీకాంతరావు, జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వరరావు, ఆర్డీఒ గణేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. అంతకుముంతు ఆర్టీసి అధికారులతో కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఒక మండలం నుండి మరో మండలానికి ఎన్నికల విధులకు హాజరు కావడానికి అవసమరగు బస్సులను సకాలంలో నడిపేందుకు చర్యలు చేపట్టాలని ఆర్టీసి ప్రాంతీయ మేనేజర్ అప్పన్న, డిప్యూటీ సిటిఎం సత్యనారాయణలను ఆదేశించారు.

కారులో తరలిస్తున్న రూ. 29 లక్షలు స్వాధీనం
ఇచ్ఛాపురం, జూలై 15: ఆంధ్రా నుండి ఒడిస్సాకు కారులో తరలిస్తున్న 29 లక్షల రూపాయలు పట్టుకున్నట్లు సిఐ రవికుమార్ తెలిపారు. స్థానిక ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ఆంధ్రా, ఒడిస్సా సరిహద్దులో పురుషోత్తపురం వద్ద ఎక్సైజ్ పోలీసు అధికారులు ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని ఏర్పాటు చేసారు. ఈ కేంద్రం వద్ద సోమవారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఒడిస్సాలో బెంకనాల్ సమీపంలో వున్న తాల్చేరుకు చెందిన బాబులాల్‌తుళ్, అతని కుమారుడు కిషాన్‌లాల్‌తుళ్‌లు ఆంధ్రా వైపు ఇండికా కారులో వస్తుండగా తనిఖీ చేసారు. కారులో రెండు సంచుల్లో 29 లక్షల రూపాయలు ఉండడాన్ని పోలీసులు గమనించారు. దీనిని ఎక్కడకు తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా తమకు తాల్చేరులో బంగారం షాపు ఉందని, వైజాగ్‌లో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు వెళ్తున్నామని పోలీసులకు చెప్పినట్లు తెలిపారు. తమకు వైజాగ్ దగ్గర అరకులో కూడ ఒక ఫ్యాన్సీదుకాణం ఉందని వారు తెలిపారన్నారు. దీనితో పోలీసులు నగదును స్వాధీనం చేసుకొని దానికి సంబంధించిన పత్రాలను తీసుకురావాలని వారిని ఆదేశించినప్పటికి సాయంత్రం 7 గంటల వరకు వారు ఎటువంటి పత్రాలు చూపించకపోవడంతో ఈ నగదును తహశీల్దార్ ముందు హాజరుపరిచారు. నగదును ట్రజరీలో జమచేయడంతోపాటు ఈ వివరాలను ఆదాయపుపన్ను శాఖాధికారులకు తెలియజేయడం జరుగుతుందని సి ఐ రవికుమార్ తెలిపారు.
మధనాపురంలో రెండు లక్షలు స్వాధీనం
బూర్జ : గ్రామ పంచాయతీల ఎన్నికల దృష్ట్యా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో మధనాపురం కూడలి వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఐ చలపతిరావు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం సాయంత్రం వాహనాలను తనిఖీచేసే సమయంలో పాలకొండ నుండి బూర్జవైపు వెళుతున్న కంఠ నరసింహమూర్తి అనే వ్యక్తివద్ద రెండు లక్షల రూపాయల నగదు ఉన్నట్లు గుర్తించామన్నారు. నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ తెలిపారు.

ఐ.టి ప్రవేశాలు వాయిదా
* ఎన్నికల కోడ్ అడ్డంకి
ఎచ్చెర్ల, జూలై 15: ఈ విద్యాసంవత్సరంలో ఐ.టి.ఐ కోర్సుల్లో అడ్మిషన్లు చేరగోరు అభ్యర్థులకు ఈ నెల 18 నుంచి నిర్వహించాల్సిన కౌనె్సలింగ్ పంచాయతీ ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడింది. జిల్లాలో 19 ప్రభుత్వ, ప్రైవేట్ ఐటిఐల్లో అడ్మిషన్ పొందేందుకు వీలుగా 44,091 దరఖాస్తులను విక్రయించారు. అయితే 2447 మంది ఆసక్తి కనబరిచి ఐటిఐ కోర్సుల్లో చేరేందుకు తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటినీ ఆన్‌లైన్‌లో పొందుపరిచి కౌనె్సలింగ్‌కు సర్వం సిద్ధం చేశారు. ఇంతలో పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వీటిని వాయిదా వేయాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో అభ్యర్థులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ నెల 18 నుంచి 24వ తేదీవరకు కౌనె్సలింగ్ ప్రక్రియ పూర్తిచేసేందుకు షెడ్యూల్‌ను ఖరారు చేసి కాల్‌లెటర్‌ను కూడా అభ్యర్థులకు బట్వాడా చేశారు. 3,150 సీట్లకు గాను 2,447 మంది దరఖాస్తు చేసుకోవడంతో ఐ.టి.ఐ అడ్మిషన్లపై ఆసక్తి తగ్గిందని అధికారులు చెప్పకనే చెబుతున్నారు. ప్రభుత్వ ఐ.టి.ఐ.లైన ఎచ్చెర్ల, డిఎల్‌టిసి,రాజాం, పలాస, సీతంపేటలలో 840 సీట్లు ఉండగా మిగిలిన 14 ఐటిఐలలో 2,310 సీట్లు ఉన్నాయి. దరఖాస్తులు తక్కువ కావడంతో సీట్ల భర్తీ ప్రశ్నార్ధకంగా మారే ప్రమాదంలేకపోలేదు.
అడ్మిషన్ల కౌనె్సలింగ్ వాయిదా
ఐటిఐ సీట్ల భర్తీకి ఈ నెల 18 నుంచి 24వ తేదీవరకు నిర్వహించాల్సిన కౌనె్సలింగ్ వాయిదా పడినట్లు ప్రభుత్వ బాలికల ఐ.టి.ఐ ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ రాడ కైలాసరావు స్పష్టంచేశారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. తిరిగి తేదీలు ఖరారు చేసిన అనంతరం సమాచారం అందిస్తామన్నారు.

ఎపి టెట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి
* డిఈవో అరుణకుమారి
శ్రీకాకుళం, జూలై 15: రాష్టవ్య్రాప్తంగా ఎపి టెట్-2013 విడుదలైందని, అర్హత కలిగిన అభ్యర్ధులు షెడ్యూల్ ప్రకారం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.అరుణకుమారి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి 31వ తేదీ వరకు ఎపి ఆన్‌లైన్, మీసేవా, ఈ సేవ కేంద్రాల్లో ఫీజు చెల్లించవచ్చన్నారు. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్లు అందజేయడానికి ఈ నెల 16వ తేదీ నుండి ఆగష్టు ఒకటవ తేదీ వరకు ఉందన్నారు. హాల్‌టిక్కెట్లను ఆగష్టు 25వ తేదీ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. సెప్టెంబర్ ఒకటవ తేదీన ఉదయం పేపర్ వన్, మద్యాహ్నం పేపర్ టూ పరీక్ష ఉంటుందన్నారు. ఫలితాలు సెప్టెంబర్ 20వ తేదీన వెలువడతాయన్నారు.

‘ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పాటించాలి’
పాతశ్రీకాకుళం, జూలై 15 : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధిగా పాటించాలని జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఉద్యోగులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం నిర్వహించారు. పలువురు ఉద్యోగులు పంచాయతీ ఎన్నికల్లో పాల్గొంటున్నట్లు పలు మండలాల నుంచి వచ్చిన ఫోన్‌కాల్స్‌పై కలెక్టర్ పై విధంగా స్పందించారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్న ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మోడల్ స్కూల్‌లో సీటును ఇప్పించాలని జలుమూరు మండలంకు చెందిన ఎస్.యర్రయ్య కోరారు. స్కూల్‌కు అదనపు తరగతుల భవనాన్ని మంజూరు చేయాలని పొందూరు మండలానికి చెందిన పలువురు కోరారు. తమ గ్రామానికి వౌళిక సదుపాయాలు కల్పించాలని పాలకొండకు చెందిన నాని కోరారు. తమకు పావలా వడ్డీ కింద బుణాలు మంజూరు చేయాలని పలాసా నుంచి మణి కోరారు. మంశదార కుడికాలువ 17 ఎల్ ద్వారా సాగునీటిని విడుదల చేయాలని సరుబుజ్జలికి చెందిన వరాహనర్శింహం కోరారు. జెడ్పీ ఉన్నత పాఠశాలకు తెలుగుపండిట్‌ను నియమించాలని మందస మండలం హరిపురం నుంచి కె వెంకట్రావు కోరారు. డయల్ యువర్ కార్యక్రమంలోడుమా పీడీ కళ్యాణ్ చక్రవర్తి, డి ఎం హెచ్ ఓ గీతాంజలి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రం సమైక్యంగానే ఉంటుంది
శ్రీకాకుళం, జూలై 15: రాజ్యాంగ స్పూర్తితో అధ్యయనం చేస్తే రాష్ట్రం సమైక్యంగానే ఉంటుందని, విభజన సాధ్యం కాదని మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ అన్నారు. సోమవారం స్థానిక తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు, 368 ప్రకారం మూడు అంశాలు పరిగణనలోకి వస్తాయన్నారు. సాధారణ మెజార్టీ, ప్రత్యేక మెజార్టీ, మెజార్టీ రాష్ట్రాల అనుమతి అవసరమన్నారు. అయితే ప్రస్తుతం కె.కె పేర్కొంటున్నట్లు సాధారణ మెజార్టీ సరిపోదన్నారు. తప్పనిసరిగా రెండు, మూడు అంశాలను అనుసరించాల్సిందే అన్నారు. దీనికి కారణం రాష్ట్రంలో ఆరు పాయింట్ల ఫార్ములా ఉండటం వలన, విభజన చేయాల్సి వస్తే రాజ్యాంగంలోని ఏడవ షెడ్యూల్ మార్చాల్సి ఉందని వివరించారు. ఏడవ షెడ్యూల్ మార్చాలంటే రాజ్యాంగం నిర్దేశించిన 2,3 పద్ధతులు తప్పనిసరిగా అనుసరించాల్సి ఉందన్నారు. అందుకే వీటన్నటినీ అధ్యయనం చేయడం ద్వారా రాష్ట్ర విభజన సాధ్యం కాదని తెలిపారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు మాదారపు వెంకటేష్, చిట్టి నాగభూషణరావు, రోణంకి మల్లేశ్వరరావు, గుత్తు చిన్నారావు, గొర్లె కృష్ణారావు, డి.పార్థసారధి, బి.రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

వామనావతారంలో
జగన్నాథుడు
శ్రీకాకుళం(కల్చరల్), జూలై 15: జగన్నాథ రథోత్సవాలు ఆసక్తిగా కొనసాగుతున్నాయి. పట్టణంలోని ఇలిసిపురం గుడించా మందిరంలో జగన్నాథ స్వామి సోమవారం దర్శనమిచ్చారు. రోజుకో దర్శన భాగ్యం కలగడం ద్వారా జీవితం ధన్యమవుతోందని భక్తుల నమ్మకం. సాయం త్రం అయితే సరి ఆలయం వద్ద భక్తులు క్యూలైన్‌లో వెళ్లి స్వామిని దర్శించుకుంటున్నారు. పూరీకి చెం దిన రఘువీర్‌దాస్, బ్రహ్మాజీ, బావాజీల నిర్వహణలో ఒడిశా విధానాన్ని అనుసరించి ప్రత్యేక పూజలు జరిపారు. అదేవిధంగా గుజరాతిపేటలో తెలుగువారి సంప్రదాయాన్ని అనుసరించి పెంటా వంశీయులు స్వామిని నృసింహావతారంలో అలంకరించా రు. ఈ సందర్భంగా స్వామి వారి పేరున ప్రత్యేక పూజలు జరిపారు. అరసవల్లి సూర్యనారాయణదేవాలయం, మొండేటివీధి లక్ష్మీగణపతి ఆలయంలో జగన్నాథస్వామికి ప్రత్యేక పూజలుచేశారు.
జలుమూరులో...
జలుమూరు : మండల కేంద్రం జలుమూరులో వెలసియున్న జగన్నాథుడు సోమవారం వామనావతారంలో దర్శనమిచ్చారు. యధావిథిగా ఉదయం అర్చకులు వైద్యభూషణ భానూజీరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేసారు.
స్వామి తీర్ధప్రసాదాలను పలువురు భక్తులు స్వీకరించారు. ముఖ్యంగా ఐదవరోజు ఎరాపంచమ్ కావడం, కొన్ని ప్రాంతాల నుం డి సాయంత్రం స్వామివారిని దర్శిం చి తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జలుమూరుతోపాటు రామచంద్రాపురం, వెంకటాపురం, తమ్మయ్యపేట గ్రామాల నుండి భక్తు లు వచ్చి ఉత్సవంలో పాల్గొన్నారు.

పట్టుబడ్డ దొంగ ‘పోలీస్’

* నాలుగు బైక్‌లు స్వాధీనం
శ్రీకాకుళం , జూలై 15: దొంగలను పట్టుకొని ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసే దొంగగా మారి నాలుగు బైక్‌లు దొంగతనం చేసి పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్‌లకు చిక్కాడు. పట్టణంలో సంచలనం సృష్టించిన ఈ కేసు పూర్వాపరాలకు వెళ్తే...జిల్లాలోని జలుమూరు మండలానికి చెందిన జొన్న రవికుమార్ 2000 లో ఎపిఎస్‌పి కానిస్టేబుల్‌గా సెలక్టు అయి విజయనగరం ఎపిఎస్‌పి బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. మొదటి నుండి మద్యానికి బానిసైన ఆయన జల్సాలకు అలవాటు పడటం వలన పోలీస్‌బుర్రను దొంగతనానికి ఉపయోగించాడు. 2012లో ఓ పర్యాయం సస్పెండు కూడా అయ్యాడు. సస్పెండ్ కాలంలో జల్సాలకు అలవాటు పడిన ఆయన చేతిలో చిల్లిగవ్వలేని కారణంగా అధిక మొత్తం సంపాదనలో భాగంగా బైక్‌ల దొంగతనం సాగించడం మొదలుపెట్టాడు. ఈ విధంగా ఈ నెల వంజంగి గ్రామానికి చెందిన రొక్కం నర్శింహమూర్తికి చెందిన బైక్ దొంగతనంనకు గురికాగా ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం దర్యాప్తు చేస్తున్న పోలీసులకు స్థానిక ఏడురోడ్ల కూడలి వద్ద దొంగతనంనకు గురైన బైక్‌తో రవికుమార్ కనిపించాడు. వాహనాన్ని పోలీసులు ఆపినా ఆపకుండా వేగంగా దూసుకుపోవడంతో వెంబడించిన పోలీసులు మున్సిపల్ కార్యాలయం వద్ద ఆయనను పట్టుకొని బండికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో వెంటనే అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా మొత్తం బండారం బైటపడింది. ఈ వాహనమే కాకుండా మరో మూడు వాహనాలు తాను దొంగతనం చేసినట్లు నిందితుడు అంగీకరించడంతో నిందితుని నుండి ఎపి 30 ఎఫ్ 1993, ఎపి 30 ఎఫ్ 4890, ఎపి 30 డి 3852 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో రోడ్డు పక్కన పార్కింగ్ చేసి ఉంచిన ద్విచక్ర వాహనాలను నిందితుడు చాకచక్యంగా దొంగిలించేవాడని వన్‌టౌన్ ఎస్‌ఐ కె.్భస్కరరావు విలేఖర్లకు తెలిపారు. కేసును ఛేదించిన వారిలో ఎఎస్‌ఐ కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ సుధ, కానిస్టేబుళ్లు రమణ తదితరులున్నారు.

ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
జి.సిగడాం, జూలై 15: ఈ నెల 23న జరుగాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. సోమవారం ఎంపిడిఒ కార్యాలయంలో అదనపు ఎన్నికల అధికారి బి.హెచ్.శంకర్రావు ఆధ్వర్యంలో 67 మంది ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా తహశీల్దార్ నర్సయ్య మాట్లాడుతూ పోలింగ్ చేయు విధానం, ముందుగానే బ్యాలెట్ బాక్సులు సరిచూసుకుని షీల్‌లు వేసే విధానాలపై అవగాహన కలిగించారు. పోలింగ్ కేంద్రాల్లో సెల్‌ఫోన్లు వాడకూడదన్నారు. ఏజెంట్లు బ్లైండ్ ఓట్లు వేసేందుకు అనుమతించరాదని సూచించారు. అలాగే పోలింగ్ అయిన తరువాత కౌంటింగ్‌లో పాటించాల్సిన విషయాలను జిల్లా కలెక్టర్ పంపించిన నిబంధనలు వివరించారు. 67 మందికి శిక్షణ ఇవ్వగా వీరిలో 65 మంది రణస్థలంలో జరుగనున్న ఎన్నికల్లో పాల్గొంటారని, లావేరు మండలంలో ప్రిసైడింగ్ అధికారులుగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో ఇ.ఒ.పి.ఆర్.డి ఎం.శ్రీనివాసరావు, ఎక్సైజ్ సి.ఐ జి.చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

ప్రజాకవి గరిమెళ్లకు నివాళి
పోలాకి, జూలై 15: తన కళానికి గళాన్ని జోడించి స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ప్రజలను మేల్కొలిపిన ప్రజాకవి గరిమెళ్ల సత్యనారాయణ 120వ జయంతిని పురస్కరించుకుని మండలంలో ప్రియాగ్రహారం గ్రామంలో సోమవారం కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉన్న గరిమెళ్ల విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ గరిమెళ్ల సాహిత్యం గూర్చి, స్వాతంత్య్రం పోరాటంలో ఆయన పంథాను గూర్చి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కె.ఎ.ఎన్.్భక్తా, మాజీ ఎం.పి.పి కె.ఎల్.ఎన్.్భక్తా, ఉపాధ్యాయ సంఘ నాయకులు భానుమూర్తి, సాహితీ వేత్త నాగరాజు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉన్నతపాఠశాలలో గత విద్యాసంవత్సరంలో పదోతరగతిలో ఉత్తములుగా నిలిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించారు.
ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ
లావేరు, జూలై 15: మండలంలో జరుగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 80 మంది ప్రిసైడింగ్ అధికారులకు సోమవారం మండలకేంద్రంలో శిక్షణ ఇచ్చారు. ఎన్నికల్లో వీరి విధులకు సంబంధించిన అంశాలపై మండల ఎన్నికల అధికారి ఎం.కిరణ్‌కుమార్, సహాయ ఎన్నికల అధికారి చంటిబాబులు సూచనలిచ్చారు. మంగళవారం మరో 80 మందికి శిక్షణ ఇస్తామన్నారు.
ఎన్నికల సందర్భంగా పలువురిపై బైండోవర్ కేసులు
శ్రీకాకుళం, జూలై 15: పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అతి సమస్యాత్మకంగా ఉన్న గ్రామాల్లో పలువురిపై బైండోవర్‌కేసులు నమోదు చేసినట్లు తహశీల్దార్ ఎం.కాళీప్రసాద్ తెలిపారు. శిలగాం సింగువలస పంచాయతీకి సంబంధించి దేశం పార్టీ వర్గీయులు 11 మంది, కాంగ్రెస్ పార్టీ వర్గీయులు 11 మంది, వైఎస్సార్‌సీపీ వర్గీయులు 11 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశామన్నారు. అలాగే కిష్టప్పపేటలో ఎ-గ్రూపులో 28 మంది, బి-గ్రూపులో 28 మందిపై, కనుగులవానిపేటలో ఎ-గ్రూపులో 37 మంది, బి-గ్రూపులో 37 మందిపై, బైరిలో ముగ్గురిపై బైండోవర్ కేసు నమోదు చేసి సొంత పూచీకత్తులపై విడుదల చేశామన్నారు. మండలంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు బృందాన్ని ఏర్పాటుచేశారని, బృంద సభ్యులలో తహశీల్దార్‌తోపాటు అగ్రికల్చర్ ఎ.డి రవికిరణ్, ఎస్సై అవతారం, ఎక్సైజ్ ఎస్.ఐ బి.నర్సింహమూర్తిలు ఉన్నారన్నారు. గ్రామాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు తెలిపారు.
అదనపు మద్యం సరఫరా చేయలేం
* ఎక్సైజ్ సి.ఐ స్పష్టీకరణ
సారవకోట, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా లైసెన్స్‌పొందిన దుకాణదారుడు కోరిన విధంగా అదనపు మద్యాన్ని సరఫరా చేయలేమని కోటబొమ్మాళి ఎక్సైజ్ సి.ఐ ఎన్.శ్రీనివాసరావు స్పష్టంచేశారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గడిచిన ఏడాది ఇదే నెలలో ఆయా షాపులకు తమ శాఖ సరఫరా చేసిన మేరకు మాత్రమే ఈ నెలలో సరఫరా చేస్తామన్నారు. బెల్టుషాపులను ఇప్పటికే నివారించామని, ఎక్కడైనా విడివిడిగా విక్రయాలు జరిపితే అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు. మద్యం అక్రమ రవాణా అరికట్టేందుకు స్థానిక పోలీసులు, రెవెన్యూ యంత్రాంగంతో కలిసి కృషిచేస్తున్నామన్నారు.

గ్రేటర్ మున్సిపాలిటీ విలీన సమస్య పెండింగ్‌లో ఉన్న
english title: 
oscillation

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>