విశాఖపట్నం, జూలై 15: ఇష్టానుసారం విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు, వారి పేరిట స్వాహాకు పాల్పడుతున్న పారిశుద్ధ్య కాంట్రాక్టర్లకు జివిఎంసి చెక్ పెట్టనుంది. ముఖ్యంగా ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల విషయంలో చోటుచేసుకుంటున్న అవకతవకలపై అనేక ఫిర్యాదులున్నాయి. జివిఎంసి పరిధిలో 3993 మంది పారిశుద్ధ్య కార్మికులు ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరితో పాటు నైట్ శానిటేషన్‌లో మరో 800 మంది వరకూ పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరు విధులకు హాజరైనా కాకున్నా మస్తర్ మాత్రం పడుతోంది. కొంతమంది శానిటరీ ఇనస్పెక్టర్లు లోపాయికారీ వ్యవహారంతో పనిచేయని సిబ్బందికి సైతం జీతాలు మంజూరవుతున్నాయి. దీనిపై జివిఎంసి కమిషనర్‌కు కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు అందాయి. కమిషనర్ ఆకస్మిక తనిఖీల్లో సైతం మస్తర్ రిజిస్టర్‌లో ఉన్న సంఖ్యకు హాజరైన పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యకు పొంతన లేదు. దీంతో పారిశుద్ధ్య కార్మికుల తీరుపై కమిషనర్ ఎంవి సత్యనారాయణ దృష్టి సారించారు. పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని కమిషనర్ నిర్ణయించారు. జివిఎంసి పరిధిలోని అన్ని వార్డుల్లో పారిశుద్ధ్య కార్మికులకు బయోమెట్రిక్ మస్తర్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. బయోమెట్రిక్ మస్తర్ విధానంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రతినెలా 5వ తేదీన జీతాలు చెల్లిస్తామని కమిషనర్ స్పష్టం చేశారు. బయోమెట్రిక్ విధానంలేని కార్మికుల జీతాలు నిలిపివేయాలని జోనల్ కమిషనర్లను కమిషనర్ ఆదేశించారు. వీరికి థర్డ్‌పార్టీ విచారణ జరిపిన తర్వాతే జీతాలు చేల్లించాలని స్పష్టం చేశారు. కొంతమంది పారిశుద్ధ్య కాంట్రాక్టర్లు, కార్మికులు బయోమెట్రిక్ విధానాన్ని వ్యతిరేకిసుతన్నట్టు వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఎవరు అంగీకరించకున్నా బయోమెట్రిక్ విధానం అమలు జరుపుతామని స్పష్టం చేశారు. పారిశుద్ధ్య విధానాన్ని మెరుగుపరిచేందుకు ఈవిధానం దోహదం చేయడమే కాకుండా జీతాలు సకాలంలో చెల్లించేందుకు వీలు పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. థర్డ్‌పార్టీ విచారణ కారణంగా జీతాలు చెల్లింపులో జాప్యం చోటుచేసుకుంటుదని ఆయన పేర్కొన్నారు. బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేసే విషయంలో కాంట్రాక్టర్లు, కార్మికులు, అధికారులు సహకరించాలని కమిషనర్ కోరారు.
కాలం చెల్లిన భవనాలను కూల్చేస్తాం
* కమిషనర్ సత్యనారాయణ
విశాఖపట్నం, జూలై 15: కాలం చెల్లిన శిధిల భవనాలను తొలగించే విషయంలో రాజీకి తావులేదని జివిఎంసి కమిషనర్ ఎంవి సత్యనారాయణ స్పష్టం చేశారు. నగర పరిధిలో శిధిల భవనాల గుర్తింపు, తొలగింపు అంశాన్ని సోమవారం ఆయన పరిశీలించారు. నగర పరిధిలో 70 ఏళ్లు నిండిన ప్రైవేటు భవనాలను తొలగించనున్నట్టు ఆయన తెలిపారు. ఇప్పటికే నగర పరిధిలో 375 కాలం చెల్లిన భవనాలను గుర్తించామని, వీటి యజమానులకు నోటీసులు జారీ చేసినట్టు పేర్కొన్నారు. నగర పరిధిలోని అన్ని జోన్లలో శిధిలావస్థకు చేరిన భవనాలను గుర్తించి, స్ట్రక్చరల్ ఇంజనీర్లు వాటిని పరిశీలించి యజమానులకు నోటీసులు జారీ చేస్తున్నట్టు తెలిపారు. శిధిల భవనాలన్నింటినీ తొలగించడం జరుగుతుందన్నారు. మూడవ జోన్ 28వ వార్డు పరిధిలోని వెంకటేశ్వర మెట్టలో 70 ఏళ్ల కిందట నిర్మించిన మూడంతస్తుల ప్రైవేటు భవనాన్ని సోమవారం కూల్చివేశారు. ఈ భవనంలోని తొమ్మిది పోర్షన్లున్నాయని, వీటిలో నివసిస్తున్న వారిని హెచ్చరించి ఖాళీ చేయించినట్టు తెలిపారు. భవనం కూల్చివేత ప్రక్రియ కొనసాగుతోందని, పక్కనున్న భవనాలకు, వాటిలో నివాసం ఉండే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
ఉన్న ఇళ్లు 1200
దరఖాస్తులు అక్షరాలా 2,30,000
* ఇంకా కొనసాగుతున్న దరఖాస్తుల స్వీకరణ
* ఇళ్ళ లేవని స్పష్టం చేయని అధికారులు
* ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న పేదలు
ఆంధ్రభూమి బ్యూరో, విశాఖపట్నం
పేదల కోసం ప్రభుత్వం పథకాలను ప్రవేశపెడుతుంది. అవి పేదలకు చేరేదేమాత్రమో అందరికీ తెలిసిందే. అయినా పేదలు ఆయా పథకాల కోసం వెంపర్లాడ్డం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా ఇల్లు, రేషన్ కార్డు, పించను. వీటిలో ఏ ఒక్కటి వచ్చినా సంబరపడిపోతారు పేదలు. వీరి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగా గృహాలను, పించన్లను, రేషన్ కార్డులను అందుబాటులోకి తీసుకురాలేకపోయింది ప్రభుత్వం. రేషన్ కార్డులను ఏదో రకంగా జనాలు సంపాదించుకున్నా, గృహాలు, పించన్ల విషయంలో మాత్రం లక్షలాది మంది ఇంకా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణం చేస్తునే ఉన్నారు. గ్రేటర్ విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో ఇళ్ళ కోసం పేదలు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. ఇవ్వడానికి ఇళ్ళు లేవని అధికారులు చెప్పరు. ఇది తెలియని మహిళలు మండుటెండలో చంటి పిల్లలతో కలెక్టరేట్ వచ్చేస్తున్నారు. అసలు విషయం తెలిస్తే.. దరఖాస్తుదారులు గొల్లుమనక తప్పదు.
నగరంలో ఇంటి కోసం దరఖాస్తు చేసుకునే వారిలో కొంతమంది కలెక్టరేట్‌కు, మరికొంతమంది జివిఎంసి కార్యాలయానికి వెళ్లి దరఖాస్తులు ఇస్తున్నారు. వీరిలో కొంతమంది రెండు చోట్లా దరఖాస్తులు ఇచ్చారు. ఇలా కలెక్టర్ కార్యాలయంలో లక్షకు పైగా దరఖాస్తులు పేరుకుపోయాయి. జివిఎంసి కార్యాలయంలో అచ్చంగా ఇళ్ళ కోసం వచ్చిన దరఖాస్తులు అక్షరాలా 1,60,000. వీటిలో 1,30,000 దరఖాస్తులు చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. వెరసి ఈ రెండు కార్యాలయాల్లో 2,30,000 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్న మాట. అయితే నగరంలో ఉన్న ఇళ్ళు కేవలం 1200 మాత్రమే. అంటే ఒక్కో ఇంటికి రెండు వేల మంది దరఖాస్తు చేసుకున్నారన్నమాట. ఈ దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఉన్న ఇళ్ళను మంజూరు చేయడానికి కూడా ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ సమావేశమై లబ్దిదారులను ఎంపిక చేయాల్సి ఉంటుంది. గతంలో జివిఎంసి అధికారులు నగరంలోని ఇల్లు లేని నిరు పేదలు ఎంతమంది ఉన్నారన్న విషయమై సర్వే నిర్వహించింది. ఇందులో గుడెసలలో ఉన్న వారు 30 వేలమంది. సెమీ పక్కా భవనాల్లో ఉన్న వారు 20 వేల మంది. అద్దె ఇళ్ళలో నివాసం ఉంటున్న వారు 60 వేల మందికిపైగా ఉన్నారు. గతంలో జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్ళు నిర్మించే సమయంలో వీరిలో ఐదు వేల మందికి ఆ గృహాలను కేటాయించారు. ఆ తరువాత అందులో రెండు వేల మంది అనర్హులని తేలింది. ఆ తరువాత ఆయా ఇళ్ళను పేదలకు మంజూరు చేయగా, మిగిలినవి 1200 ఇళ్ళు మాత్రమే. వీటిని ఎంతమంది ఏ ప్రాతిపదికన ఇవ్వగలరు. కేవలం రాజకీయ పలుకుబడి ఉన్న వారికి మాత్రమే వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ప్రభుత్వం ఇప్పట్లో కొత్త ఇళ్ళను నిర్మించే అవకాశం లేదు. ఇటీవల జిల్లా అధికారులు ఓ కొత్త ఆలోచన చేశారు. ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి, అందులో కొంత భాగం ఆ వ్యక్తి వెంచర్ వేసుకునేందుకు, మరో కొంత భాగంలో పేదలకు ఇళ్ళు నిర్మించి ఇచ్చే విధంగా పిపిపి పద్ధతిన కార్యక్రమం మొదలుపెట్టాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాదని తేలిపోయింది. దీంతో సమీప భవిష్యత్‌లో నగరంలో కొత్త ఇళ్ళ నిర్మాణం సాధ్యం కాదన్నది సుస్పష్టం.
కానీ కలెక్టరేట్‌లో సోమవారం చూస్తే, ఒక జాతరను తలపించే విధంగా జనం వచ్చారు. ముఖ్యంగా మహిళలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. దరఖాస్తులు అధికారులకు అందచేయడానికి నానా యాతనా పడ్డారు. గ్రీవెన్స్ సెల్‌లో దరఖాస్తులు ఇచ్చేందుకు గంటల తరబడి వేచి ఉన్నారు. ప్రజల నుంచి తీసుకున్న దరఖాస్తులను పరిశీలించి, ఒక్కో దరఖాస్తుకు ఒక నెంబర్ ఇస్తున్నారు. వాటిని గ్రీవెన్స్ సెల్ దగ్గర బోర్డులో పొందుపరుస్తున్నారు. అందులో సంబంధిత అధికారులు మీమీ ఇళ్ళకు వచ్చి, వాస్తవ పరిస్థితులను పరిశీలిస్తారని పేర్కొంటున్నారు. కానీ అధికారులు దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లడం లేదు. మర్నాడు దరఖాస్తుదారులు వచ్చి తమ పేరు బోర్డు మీద ఉండడాన్ని చూసి, తమకు ఇళ్ళు మంజూరైపోయినట్టు భావిస్తున్నారు. వీరు వెళ్లి తమతమ ప్రాంతాల్లోని వారికి చెపుతున్నారు. వారంతా తరలివచ్చి దరఖాస్తుల మీద దరఖాస్తులు ఇచ్చేస్తున్నారు. సాక్షాత్తూ కలెక్టర్ కార్యాలయంలో ఇంత తంతు నడుస్తున్నా అధికారులు స్పందించడం లేదు. ఉన్న దరఖాస్తులను పరిశీలించి అర్హులైన వారి జాబితాను తయారు చేయడం ఒక పని. ఆ ప్రక్రియ పూర్తి చేయడంతోపాటు, కొత్త ఇళ్ళ నిర్మాణానికి కనీసం సన్నాహాలు ప్రారంభించే వరకైనా కొత్త దరఖాస్తులు స్వీకరించడాన్నైనా నిలిపివేయాలి. ఇళ్ళు, పింఛన్లు, రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవద్దని స్పష్టంగా అధికారులు బోర్డులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తొలి లోక్‌సభ సభ్యులు
తిలక్, మోహన్‌రావులకు టిఎస్సార్ సత్కారం
విశాఖపట్నం , జూలై 15: నిస్వార్థ ప్రజాసేవకుడు,తొలి లోక్‌సభ సభ్యుడు ప్రథమ పార్లమెంట్ సభ్యుడు కందాళ సుబ్రహ్మణ్యం తిలక్‌ను ఆదర్శంగా తీసుకొని సేవలందించాలని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి యువతకు పిలుపునిచ్చారు. తెలుగుశక్తి ఆధ్వర్యంలో సోమవారం ఓ హోటల్‌లో తిలక్ 93వ జన్మదినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఆయన కేట్ కట్ చేశారు. అనంతరం టిఎస్సార్ మాట్లాడుతూ పార్లమెంటు ప్రారంభ సమయంలో తొలి ఎంపీలుగా కెఎస్ తిలక్, కెఎస్ మోహనరావులు ఎన్నికయ్యారని గుర్తు చేశారు. వారి సేవలకు గుర్తింపుగా తెలుగుశక్తి సంస్థ సత్కరించడం ఆనందదాయక మన్నారు. మాజీ మంత్రి భాట్టం శ్రీరామమూర్తి మాట్లాడుతూ పదవులు ఎవరికీ శాశ్వతం కాదని, చేసిన సేవలే శాశ్వతమన్నారు. ప్రతిఒక్కరికీ సేవలందిస్తేనే నిజమైన నేతలుగా అందరి మన్ననలు పొందుతారన్నారు. భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పరమేశ్వర రావు, ఉప్యాక్షులు శ్రీనివాసరావు తిలక్‌ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బెహరా భాస్కర రావు, కనకమహాలక్ష్మి దేవస్థానం మాజీ చైర్మన్ కె.తాతారావు, ఇంటక్ నేతలు కెఎస్ మోహన్ కుమార్, మంత్రి రాజశేఖర్, తెలుగుశక్తి అధ్యక్షుడు బివిరామ్, తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా హెచ్‌పిసిఎల్ వ్యవస్థాపక దినోత్సవం
విశాఖపట్నం, జూలై 15: హెచ్‌పిసిఎల్ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో జిఎం (టెక్నికల్) జిఎస్ ప్రసాద శర్మ మాట్లాడుతూ సంస్థ సాధించిన లక్ష్యాలను వివరించారు. అలాగే భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు. ఈ సందర్భంగా సంస్థ ఉద్యోగులు పునరంకిత ప్రతిజ్ఞ చేశారు. సంస్థలను అభివృద్ధి దిశగా నడిపించేందుకు కృషి చేస్తామని వారు ప్రతినపూనారు. సంస్థ చైర్మన్ కం మేనేజింగ్ డైరక్టర్ సందేశాన్ని ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నరసింహం చదివి వినిపించారు. సంస్థ ఇంత అభివృద్ధి చెందడానికి గతంలో ఇక్కడ పనిచేసిన ఉద్యోగుల శ్రమేనని అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రస్తుత సిబ్బంది కూడా సంస్థను దేశంలోనే అగ్రగామిగా నిలపాలని అన్నారు. గతంలో దేశంలోని అభివృద్ధి చెందిన కర్మాగారాల్లో హెచ్‌పిసిఎల్ 500 స్థానంలో ఉండేదని, ఇప్పుడు అది 260కి చేరుకుందని అన్నారు. ఈ సందర్భంగా పదవీ విరమణ చేసిన సిబ్బంది సత్కరించారు.
ఆగస్టులో ఫ్లైఓవర్ ప్రారంభం
* పేరు ప్రతిపాదన ప్రభుత్వానిదే
విశాఖపట్నం, జూలై 15: ఆశీల్‌మెట్ట వద్ద జివిఎంసి నిర్మించిన ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించేందుకు యంత్రాంగం సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయ్యాయని, త్వరలోనే ప్రారంభిస్తామని కమిషనర్ ఎంవి సత్యనారాయణ స్పష్టం చేశారు. ఫ్లైఓవర్ ట్రయల్ రన్ సోమవారం నిర్వహించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ మిగిలిపోయిన పనులను సత్వరమే పూర్తిచేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. బ్రిడ్జిపై నిర్మిస్తున్న బిటి రోడ్డును, విద్యుదీకరణ పనులను సత్వరమే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. డిఆర్‌ఎం కార్యాలయం వద్ద ప్రహారీ నిర్మాణంతో పాటు తరలించిన సబ్‌స్టేషన్ భవనాన్ని తొలగించాలని అధికారులకు సూచించారు. సర్వీసు రహదారి నిర్మాణంలో అడ్డంకిగా ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ భవనం, రైల్వే డివిజనల్ ఇంజనీర్ భవనాలను తక్షణమే తొలగించి సర్వీసు రహదారి నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. నేవల్ ఇంజనీర్ విభాగానికి చెందిన ప్రహారీని కూల్చి కొత్తగా నిర్మించేందుకు సంబంధిత అధికారులతో సంప్రదించనున్నట్టు తెలిపారు. రోడ్ల పక్క డ్రైన్ల నిర్మాణాలను చేపట్టాలని సూచించారు.
ఫ్లైఓవర్‌కు ఎవరి పేరు పెట్టాలన్న అంశం తన పరిధిలో లేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇది ప్రభుత్వ పరిధిలోని అంశమని, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి, రాజీవ్‌గాంధీ, తెనే్నటి విశ్వనాథం, ద్రోణంరాజు సత్యనారాయణ తదితరుల పేర్లు పెట్టాల్సిందిగా విజ్ఞాపనలు అందాయని తెలిపారు. ఈ అంశంలో తుది నిర్ణయం ప్రభుత్వానిదేనన్నారు. జివిఎంసిలో భీమునిపట్నం, అనకాపల్లి మున్సిపాలిటీలతో పాటు 10 పంచాయతీల విలీనంపై రెండు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయిన తర్వాత వార్డుల పునర్విభజన, తదితర ప్రక్రియ పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు.
వామనావతారంలో దర్శనమిచ్చిన జగన్నాధుడు
విశాఖపట్నం, జూలై 15: జగన్నాధస్వామి దశావతారాల్లో భాగంగా స్వామివారు సోమవారం వామనావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. టర్నరుచౌల్ట్రీ ఆవరణలో వామనావతారంలో ఉన్న స్వామివారిని వేలాది మంది భక్తులు దర్శించుకున్నారు. ఈసందర్భంగా కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం తరపున ప్రభుత్వ విప్ ద్రోణంరాజు శ్రీనివాస్, కార్యనిర్వాహణాధికారి డి భ్రమరాంబ తదితరులు శ్రీసుభద్ర, బలభద్రసమేతుడైన స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరించారు. ఈసంద్భంగా విప్ ద్రోణంరాజు మాట్లాడుతూ టర్నరుచౌల్ట్రీ ఆధునీకరణకు కోటి రూపాయల నిధులు మంజూరైనట్టు తెలిపారు. చారిత్రాత్మక పురాతన కట్టడాలకు ఎటువంటి ముప్పువాటిల్లకుండా వాటిని ఆధునీకరించనున్నట్టు తెలిపారు. ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ తదితరులు జగన్నాధస్వామిని దర్శించుకున్నారు.
దేశ ఆర్థికాభివృద్ధికి సూచి స్థూల జాతీయోత్పత్తి
విశాఖపట్నం, జూలై 15: ఒకదేశం, రాష్ట్రం ఆర్థికాభివృద్ధిని తెలుసుకునేందుకు స్థూలజాతీయోత్పత్తి ముఖ్యప్రామాణికమని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మృణాల్ బౌమిక్ అన్నారు. ఎయు ప్లాటినం జూబ్లీ హాల్‌లో సోమవారం జరిగిన దక్షిణాది రాష్ట్రాల రీజనల్ వర్క్‌షాప్‌లో ఆయన పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ, రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయాన్ని తెలుసుకునేందుకు స్థూల జాతీయోత్పత్తి ఉపయోగపడుతుందన్నారు. కేంద్ర గణాంక సంస్థ దేశానికి సంబంధించిన స్థూలజాతీయోత్పత్తిని తయారు చేస్తుందని తెలిపారు. అలాగే అర్ధ గణాంకశాఖ రాష్ట్రానికి సంబంధించి స్దూలు జాతీయోత్పత్తిని, తలసరి ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుందన్నారు. వ్యవసాయానికి సంబంధించిన లెక్కలు, ధరలు, స్థానిక సంస్థలు, పబ్లిక్ అండర్ టేకింగ్ గణాంకాలు, సాంఘిక, ఆర్థిక గణనకు సంబంధించిన సమాచారం తదితరాల ద్వారా ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించి అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తుందని ఆయన తెలిపారు. భారత ప్రభుత్వం రూపొందించిన ఎఫ్‌ఆర్‌బిఎం చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి మధింపు విధానానికి ప్రాముఖ్యత లభించిందన్నారు. కేంద్రం విడుదల చేస్తున్న త్రైమాసిక స్థూల జాతీయోత్పత్తి అంచనాలతో సమానంగా రాష్ట్రం కూడా వీటిని రూపొందిస్తోందని వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్ర స్థూలజాతీయోత్పత్తి 7,45,782 కోట్ల రూపాయలు కాగా, రాష్ట్ర తలసరి ఆదాయం 78,177 రూపాయలుగా నమోదైందన్నారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 5.04శాతం పెరుగుదలగా గుర్తించినట్టు తెలిపారు. ఈవర్క్‌షాప్‌లో కేంద్ర గణాంక డైరెక్టర్ రీనాసింగ్, రాష్ట్ర గణాంక అధికారి డి దక్షిణామూర్తి, సిపిఓ సుధాకర్ రావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మైదాన ప్రాంతాలకు తరలిన మన్యం ప్రజాప్రతినిధులు
* మంత్రి బాలరాజు పర్యటనకు చెక్
* నర్సీపట్నం ఎమ్మెల్యేకు పోలీసులు నోటీసు
నర్సీపట్నం,జూలై 15: మావోయిస్టుల వరుస సంఘటనలతో మన్యం ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసారు. ప్రధానంగా అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏజన్సీ, మైదాన ప్రాంత ప్రజాప్రతినిధులకు పోలీసు ఉన్నతాధికారులు నోటీసులు జారీ చేసారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు , ఇతర ప్రజాప్రతినిధులు ఏజన్సీలో పర్యటించవద్దని ఆదేశించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా మైదాన ప్రాంత ప్రజాప్రతినిధులను సైతం అప్రమత్తం చేయడం విశేషం. విశాఖ మన్యంలో గత 10 రోజులుగా మావోయిస్టులు వరుస ఘటనలకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. వారి ఇళ్ళను సైతం లూఠీ చేస్తున్నారు. చింతపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ వంతల సుబ్బారావును మట్టుపెట్టేందుకు ప్రయత్నించగా మావోల చేతిలో నుండి తృటిలో తప్పించుకున్నారు. అలాగే మరో ఇద్దరు కాంగ్రెస్ నాయకులకు కూడా దేహశుద్ధి చేసారు. పంచాయతీ ఎన్నికలను పురష్కరించుకుని ఏజన్సీలో ఘాతులకు పాల్పడాలనేది మావోయిస్టుల వ్యూహంగా కనిపిస్తోంది. ఈ నేపధ్యంలో ఏజన్సీ ప్రజాప్రతినిధులు మైదాన ప్రాంతాలకు తరలిపోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేసారు. పలువురు కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే మైదానానికి తరలిపోయారు. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పసుపులేటి బాలరాజు తరుచూ మన్యంలో పర్యటించడం పోలీసులకు మింగుడుపడడం లేద. ఒక వైపు మావోయిస్టులు ఆలజడులు సృష్టిస్తుండగా, మరో వైపు మంత్రి యద్దేశ్చగా మన్యంలో పర్యటించడం పోలీసు అధికారులకు కొంత ఇబ్బందిని కలిగిస్తోంది. దీంతో మంత్రి ఏజన్సీ గ్రామాల్లో పర్యటించడం మానుకోవాలని పోలీసు ఉన్నతాధికారులు కొంత కఠినంగానే హెచ్చరించినట్లు చెబుతున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా చింతపల్లి, జి.కె.వీధి, కొయ్యూరు మండలాల్లో మంత్రి బాలరాజు విస్తృతంగా పర్యటనలు చేస్తున్నారు. ఇదే అదునుగా మావోల నుండి ప్రమాదం పొంచి ఉండవచ్చని ముందు జాగ్రత్తతో ఏజన్సీలో పర్యటించవద్దని బాలరాజు సూచించినట్లు తెలుస్తోంది. దీంతో మంత్రి నర్సీపట్నం, పాడేరులకే పరిమితమై సమావేశాలు నిర్వహిస్తూ నాయకులకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. ఇదిలా ఉండగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా పోలీసు అధికారులు మైదాన ప్రాంత ప్రజాప్రతినిధులకు సైతం నోటీసులు పంపించారు. మన్యం ముఖద్వారమైన నర్సీపట్నం ఎమ్మెల్యే బోళెం ముత్యాలపాపకు పోలీసుల నుండి నోటీసు అందింది. ఎన్నికల పర్యటనకు వెళ్ళే ముందు తమకు సమాచారం ఇవ్వాలని, ఒంటరిగా పర్యటించవద్దని నోటీసుల్లో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇలా మావోయిస్టులకు అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులందరినీ పోలీసులు అప్రమత్తం చేసారు. ఎన్నికల పోలింగ్ ముగిసేలోగా మావోలు ఎలాంటి ఘాతుకాలకైనా పాల్పడే అవకాశం ఉండడంతో ముందస్తుగా పోలీసులు అన్ని జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
సీలేరులో మావోల యాక్షన్ టీమ్
సీలేరు,జూలై 15: జి.కె.వీధి మండలం సీలేరులో మావోయిస్టు యాక్షన్ టీమ్ సంచరిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పోలీసులకు కూడా యాక్షన్ టీమ్ రెక్కీ నిర్వహించినట్లు సమాచారం అందడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శనివారం జి.కె.వీధి మండలంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ఒడిషాకు చెందిన మహిళా మావోయిస్టు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈసంఘటనపై మావోయిస్టులు ప్రతీకారం తీర్చుకునేందుకు ఆంధ్రా - ఒడిషా సరిహద్దుకు చెందిన మావోయిస్టు యాక్షన్ టీమ్ సీలేరులో యాక్షన్ టీమ్ రెక్కీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీనిలో భాగంగా ఆదివారం వారపు సంతలో మావోయిస్టులు మధ్యాహ్నం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పోలీసుల కోసం రెక్కీ నిర్వహించినట్లు సమాచారం. సంతలో పోలీసులు వస్తే అదును చూసి దాడి చేసేందుకు యాక్షన్ టీమ విఫలయత్నం చేసినట్లు సమాచారం. యాక్షన్ టీమ్ బృందం ప్రయత్నాలు విఫలం చెందడంతో యాక్షన్ టీమ్ సభ్యులు వెనక్కి పోయినట్లు సమాచారం. ఈసంఘటనపై పోలీసులు యాక్షన్ టీమ్ సంచారంపై ఆరా తీస్తున్నారు.
మద్యం మత్తులో గ్రామాలు
పట్టనట్లు వ్యవహరిస్తున్న అధికారులు
అనకాపల్లి, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ ఘట్టం ముగిసింది. ప్రధాన రాజకీయ పార్టీల తరపున దాదాపు అన్ని గ్రామాల్లోను అభ్యర్థిత్వాలు ఖరారయ్యాయి. దీంతో ప్రచార హోరు క్రమేపీ ఊపందుకుంటుంది. మరోవైపు ఓటర్లను ముందుగానే ప్రలోభాలకు గురిచేయడం ద్వారా ప్రత్యర్థి అభ్యర్థులు గూటిలోకి వెళ్లకుండా ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. ఇటువంటి తరుణంలో మందుబాబులను మచ్చిక చేసుకుంటే తప్ప ఎన్నికల ప్రచారానికి ఎన్ని వ్యయప్రయాసలకు ఓర్చినా ఊపుండే పరిస్థితి లేదు. ఇంటింటి ప్రచారంలోనైనా ప్రాంతాల వారీగా సమావేశాలు దిగ్విజయం చేయాలన్న మందుబాబుల హడావుడిపైనే ఎక్కువగా అధారపడి ఉంటుంది. సర్పంచ్‌ల ఎన్నికల నగారా మోగించిందే తడవుగా అనకాపల్లి, మునగపాక, అచ్యుతాపురం తదితర మండలాల్లో మద్యం పంపిణీ గుట్టుచప్పుడు కాకుండా సాగుతుంది. నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో కేవలం కొంతమందికే పరిమితమయ్యే మద్యం పంపిణీ మరింత ఎక్కువయింది. అత్యంత గోప్యంగా తమకు సన్నిహితులు, విధేయులైనవారి కమతాల్లోను, నివాసాల వద్ద మద్యాన్ని చేర్చి తమ మద్దతుదారులైన వార్డుమెంబర్లకు, విధేయత కలిగిన వార్డుమెంబర్లకు కూపన్లు ఇచ్చి మద్యం పంపిణీని అత్యంత గోప్యంగా చేస్తున్నారు. ప్రతీ ఎన్నికల మాదిరీగానే ఈ ఎన్నికల్లో కూడా ఎన్నికల ఖర్చులో సింహభాగం మద్యానికి కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. కొన్నిచోట్ల గ్రామంలో మద్యం దుకాణం యజమానితో ఒప్పందం కుదుర్చుకుని చీటిలు ఇచ్చి ఏరోజుకారోజు అవసరమయ్యే మద్యాన్ని తీసుకునే వెసులుబాటును కల్పించుకున్నారు. మద్యం విచ్చలవిడిగా లభ్యమవుతుండటంతో గ్రామాల్లోని మద్యం దుకాణాల్లో సైతం అమ్మకాలు పడిపోయాయని యజమానులు లబోదిబోమంటున్నారు. ఇదిలావుంటే అన్నివర్గాల వారికి మద్యం బాగా అందుబాటులో ఉండటంతో శాంతిభద్రతల సమస్య పెరిగిపోతుంది. మండలంలోని పిసినికాడ, సీతానగరం, కూండ్రం, కుంచంగి, కశింకోట మండలం అచ్చెర్ల, తీడ, చెరకాం తదితర గ్రామాల్లో మితీమీరి మద్యం సేవించిన మందుబాబులు తాము మద్దతు పలుకుతున్న అభ్యర్థులకు అనుగుణంగా ప్రత్యర్థులతో ఘర్షణలకు దిగుతున్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా ఏర్పాటు చేసిన పోలీస్ పికెట్‌లు సైతం నామమాత్రంగానే మిగులుతున్నాయి. మితీమీరి మద్యం సేవించిన మందుబాబులు ఇంట్లో భార్యాపిల్లలపై కూడా ఘర్షణకు దిగుతున్నారు. దీంతో కుటుంబ తగాదాలు కూడా పెరిగిపోతున్నాయి. మితిమీరి మద్యం సేవించిన మందుబాబులు రోడ్డుప్రమాదాల్లో మృత్యువాతకు గురయ్యే సంఘటనలు కూడా జరుగుతున్నాయి. సర్పంచ్‌ల ఎన్నికల ఘట్టం సమీపించే నాటికి మద్యం గ్రామాల్లో ఏరులై పారి అన్నివర్గాల వారికి విచ్చలవిడిగా అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉంది. దీంతో ఇంతవరకు మందు అలవాటు లేని యువకులు, పిల్లలు పలుచోట్ల మహిళలు సైతం ఉచితంగా వచ్చే మద్యాన్ని తీసుకుని మందుకు బానిసలయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయని గ్రామస్తులు కలవరం చెందుతున్నారు. సహజంగా ప్రతీ ఎన్నికల్లోను ముఖాముఖి పోటీ ఉండేది. అయితే ఈ పర్యాయం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష దేశంతోపాటు వైఎస్‌ఆర్ సిపి అభ్యర్థులు కూడా ప్రతీ పంచాయతీలోను ఎన్నికల బరిలో నిలవడంతో త్రిముఖ పోటీ జరుగుతుంది. దీంతో ప్రజలకు మద్యంతోపాటు ఇతరత్రా తాయిలాలు అందజేయడంలో సహజంగానే పోటీ పెరిగింది.
నామినేషన్ల తిరస్కృతి పట్ల అభ్యర్థుల ఆందోళన
చోడవరం, జూలై 15: పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా మండలంలో నిర్వహించిన పరిశీలనలో నామినేషన్లను తిరస్కరించిన పలువురు సర్పంచ్, వార్డుసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నామినేషన్లు తిరస్కరించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది రెవెన్యూ డివిజనల్ అధికారికి అప్పీల్ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. నామినేషన్లు తిరస్కరించిన వాటిలో ఆదివారం అడ్డూరు సర్పంచ్ అభ్యర్థి దాసరి అప్పలనాయుడుతోపాటు తాజాగా గౌరీపట్నానికి చెందిన సర్పంచ్ అభ్యర్థులు పల్లెల వరహాలుబాబు, పల్లెల భవానీ, కురచాల తాతయ్యలతోపాటు అదే గ్రామానికి మరో ఇద్దరు వార్డుమెంబర్లను కూడా నామినేషన్‌ల తిరస్కరించారు. దీనిపై వీరు రెవెన్యూ డివిజన్ అధికారికి అప్పీల్ చేసుకునేందుకు సన్నద్ధమవుతున్నారు. సోమవారం స్థానిక గాంధీగ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద గౌరీపట్నం గ్రామపంచాయతీకి చెందిన తిరస్క్రత అభ్యర్థులు పల్లెల వరహాలుబాబు, పల్లెల భవానీ, కె. తాతయ్యలు రిటర్నింగ్ అధికారి బి. జయలక్ష్మిని కలిసేందుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న గౌరీపట్నం గ్రామపెద్దలు న్యాయవాది వెంకట్రావు, కోన చంద్రరావులు వారి రాకపట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. అఫిడవిట్‌లు నిబంధనలకు విరుద్దంగా ఈరోజు అందజేస్తే తీసుకోరాదని ఎన్నికల అధికారి ముందు ఆందోళన వ్యక్తం చేసారు. దీంతో అక్కడి పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేసి కార్యాలయం వద్ద గుమిగూడిన జనాన్ని పంపించివేసారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారి జయలక్ష్మి మాట్లాడుతూ తాము నామినేషన్ల పరిశీలన తరువాత ఎవరి వద్దనుండి ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా ఎటువంటి దరఖాస్తులు స్వీకరించడం లేదని, కేవలం ఉపసంహరణకు మాత్రమే పరిశీలిస్తున్నామన్నారు. అలాగే నామినేషన్‌లు తిరస్కరించబడ్డ పల్లెల వరహాలబాబు, భవానీ, తాతయ్యలు తాము రెవెన్యూ డివిజన్‌కు అప్పీల్ చేసుకుంటున్నామని తెలియజేసారు. దీంతో అక్కడి పరిస్థితులు సద్దుమణిగాయి.
సేవలు మరింత విస్తృతం: టిఎస్సార్
విశాఖపట్నం, జూలై 15: ఫోరమ్‌ల సబ్ కమిటీల ద్వారా సేవలు విస్తృతం చేస్తున్నట్టు రాజ్యసభ సభ్యులు డాక్టర్ టి.సుబ్బరామిరెడ్డి అన్నారు. ఆయా వేదికల ప్రతినిధులతో సోమవారం ఆయన నివాసంలో వేర్వేరుగా చర్చించారు. ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఫోరం, ఫిషర్‌మెన్ వెల్ఫేర్ ఫోరం, బిసి వెల్ఫేర్, ఎస్సీఎస్టీ,క్రిస్టియన్, మహిళా, యూత్ తదితర ఫోరమ్‌ల నాయకులతో సమావేశమై సమస్యలపై మాట్లాడారు. ఫోరమ్‌ల కమిటీలకు అనుబంధంగా సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని టిఎస్సార్ సూచించారు. ప్రతి వార్డులో ఐదుగురు పెద్దలు, ఐదుగురు మహిళలు, మరో ఐదుగురు యువతతో సబ్ కమిటీలను ఏర్పాటు చేసి, తద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలన్నారు. ఫోరంల ద్వారా ప్రజలకు సేవలు అందించేందుకు వీలుగా వీటి కార్యాలయాలను ప్రారంభించాలన్నారు. కార్యాలయాల్లో ఇన్‌చార్జిలు సమస్యలను నమోదు చేసుకుంటారన్నారు. ప్రభుత్వపరంగా అందించే సహాయం అందే విధంగా కృషి చేయడంతోపాటు, సొంత నిధులతో పేదలకు స్వాంతన చేకూర్చే చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. చదువుకున్న యువతకు స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించేలా కృషి చేస్తామన్నారు. స్వయం ఉపాధి పొందేందుకుగాను ఆటోరిక్షాలు, బ్యాంకు రుణాలు మంజూరయ్యేలా చూస్తామన్నారు. పేద మహిళలకు కుట్టుమిషన్లు అందజేస్తామన్నారు. సులాభ్‌కాంప్లెక్స్‌ల కోసం స్థలాన్ని కేటాయించినట్టు అయితే నిర్మాణానికి సహకరిస్తామన్నారు. యువత క్రీడల్లో రాణించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. దేవాలయాలు, మసీదులు, చర్చిల మరమ్మత్తుల కోసం మెటీరియల్ అందజేయనున్నట్టు తెలిపారు. ఇలా పలు విధాలుగా పేదల సంక్షేమం కోసం చేపట్టాల్సిన సేవా కార్యక్రమాలపై టిఎస్సార్ చర్చించారు. వేర్వేరుగా జరిగిన సమావేశాల్లో ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షుడు, పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎస్‌ఏ రెహ్మాన్, ఫిషర్‌మెన్ వెల్ఫేర్ ఫోరం గౌరవ అధ్యక్షులు, పిసిసి ప్రధాన కార్యదర్శి పులుసు జనార్దనరావు, మాజీ కార్పొరేటర్ నీలకంఠం, మహిళా వెల్ఫేర్ ఫోరం గౌరవ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, ఎస్సీ,ఎస్టీ,క్రిస్టియన్ వెల్ఫేర్ ఫోరం గౌరవ అధ్యక్షులు కొప్పుల వెంకట్రావు, అధ్యక్షులు కొల్లాబత్తుల వెంగళరావు, ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పెద్దాడ రమణ, బిసి వెల్ఫేర్ ఫోరం గౌరవాధ్యక్షులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు బెహరా భాస్కరరావు, బిసి వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులు పొన్నాడ మోహనరావు, యూత్ వెల్ఫేర్ ఫోరం గౌరవ చైర్మన్ కొంతం అరుణ్‌కుమార్, చైర్మన్ సేనాపతి వెంకటేష్, అధ్యక్షులు లక్కరాజు రామారావు, యాదవ వెల్ఫేర్ ఫోరం అధ్యక్షులుగా గొంపా గోవింద్‌యాదవ్, పల్లా యుగంధర్‌యాదవ్ పాల్గొన్నారు.
సమస్యలు పరిష్కరించాల్సిందే
* కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయుల ధర్నా
విశాఖపట్నం, జూలై 15: విశాఖపట్నం, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు 010 పద్దు కింద జీతాలు మంజూరు చేయాలని కోరుతూ ఉపాధ్యాయుల సంఘాల ఐక్య కార్యచరణ సమితి (జెఏసి) ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. ఈ పట్టణాల్లో ప్రభుత్వం నాలుగు విడతలుగా గ్రాంట్-ఇన్-ఎయిడ్ 310-311 పద్దు కింద ప్రస్తుతం జీతాలు చెల్లిస్తున్నారన్నారు. కాని రాష్ట్రంలో అన్ని మునిసిపల్, మునిసిపల్ కార్పొరేటర్లను ప్రభుత్వ పాఠశాలలు, మండల పరిషత్, జిల్లా ప్రజాపరిషత్ పాఠశాలల్లో 010 పద్దు కిందే జీతాలు చెల్లిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా ఎపిటిఎఫ్ కన్వీనర్ సింగంపల్లి వెంకటరమణ మాట్లాడుతూ విశాఖ,విజయవాడ మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వమే గ్రాంట్-ఇన్-ఎయిడ్ కింద జీతాలు చెల్లిస్తున్నారన్నారు. గ్రాంట్ సకాలంలో రాకపోవడం వలన వీటిల్లో పనిచేసే ఉపాధ్యాయులకు సకాలంలో జీతాలు, ఏరియర్స్ అందక ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్ధి ఇబ్బందులతో సతమతమవుతున్నారన్నారు. అందువల్ల 010 పద్దు కింద జీతాలు చెల్లించాలన్నారు. వీరికి జీతాలు చెల్లించనందున జిల్లాపరిషత్ పాఠశాలలు, మండల పరిషత్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులు, ఇతర సౌకర్యాలు, ఈ మునిసిపాలిటీల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పొందలేక పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ఆషాడ పౌర్ణమి ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు
సింహాచలం, జూలై 15: శ్రీ వరాహ లక్ష్మీ నృసింహ స్వామి వారి దేవాలయంలో జరిగే సంవత్సరోత్సవాల్లో ఆషాఢ పౌర్ణమి ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంది. చందనోత్సవం తర్వాత వేలాదిగా భక్తులు సింహగిరికి తరలివచ్చి సింహాచలేశుని దర్శించుకునే ఉత్సవం ఆషాఢ పౌర్ణమి. ఈ వేడుకనే గిరి పౌర్ణమిగా, గురు పౌర్ణమిగా కీర్తిస్తారు. ఆషాఢ శుద్ధ చతుర్ధశి రోజున సింహగిరి చుట్టూ కాలినడకన ప్రదక్షిణ చేసి పౌర్ణమినాటి ఉదయం సింహాద్రినాధున్ని దర్శించుకోవడం ఇక్కడ శతాబ్ధాల కాలంగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం. ప్రతి ఏటా ఎంతో వైభవంగా జరిగే ఆషాఢ పౌర్ణమి ఉత్సవాన్ని ఈ ఏడాది కూడా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు కార్యనిర్వహ ణాధికారి కె.రామచంద్ర మోహన్ సారధ్యంలో దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.