విజయనగరం , జూలై 15: ప్రయాణికుల నుంచి వచ్చే పిర్యాదులను వారంరోజుల్లో పరిష్కరిస్తామని ఆర్టీసీ విజయనగరం డిపోమేనేజర్ కె.పద్మావతి తెలిపారు. సోమవారం డిపోమేనేజర్ పద్మావతి డయల్ యువర్ డి.ఎం. కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభించింది. పలు సమస్యలకు సంబంధించి 10 వినతులు వచ్చాయి. విజయనగరం నుంచి భోగాపురం గ్రామానికి, విజయనగరం నుంచి పినవేమలి, పెదవేమలి మీదుగా సిరిపురం గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని పలు గ్రామాలకు చెందిన ప్రజలు కోరారు. శృంగవరపుకోట, గజపతినగరం రూట్లలో అద్దెబస్సుల డ్రైవర్లు ఇష్టారాజ్యంగా బస్సులను నడుపుతున్నారని పలువురు ప్రయాణికులు ఫిర్యాదు చేశారు. అతివేగంగా బస్సులను నడపడం వల్ల ప్రయాణికులు భయభ్రాంతులకు గురవుతున్నారని వారు తెలిపారు. అలాగే బస్సులు కూడా పరిశుభ్రంగా ఉండటం లేదన్నారు. కొన్నిచోట్ల బస్సులను ఆపడం లేదని, దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని వారన్నారు. ఈ సమస్యలపై స్పందించిన డిపోమేనేజర్ పద్మావతి మాట్లాడుతూ ప్రయాణికుల సమస్యలను వారంరోజుల్లో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ట్రాఫిక్‌సూపర్‌వైజర్ బూర్లి ఆదినారాయణ, డిపోక్లర్క్ మెట్ల దుర్యోధన తదితరులు పాల్గొన్నారు.
నేడు సమైక్యాంధ్ర రక్తదాన శిబిరం
విజయనగరం , జూలై 15: సమైక్యాంధ్రకు మద్ధతుగా మంగళవారం ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో ఉచిత రక్తదానం నిర్వహించనున్నట్లు సమైక్యాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు తెలిపారు. సమైకాంధ్రకు మద్ధతుగా, తెలంగాణవాదులకు వ్యతిరేకంగా పట్టణంలో సోమవారం కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ను కొంతమంది తెలంగాణ వేర్పాటువాదులు తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం విభజించేందుకు కుట్రపనున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ సమైక్యంగా ఉంటడటం కలికే ప్రయోజనా, విడిపోతే ఏర్పడే అనర్థాల గురించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం కోసం కరపత్రాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తెలుగుప్రజలకు భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రాష్టమ్రేనన్నారు. విడిపోవడం వల్ల అనేకరకాలుగా రాష్ట్రం నష్టపోతుందన్నారు. సమైక్యాంధ్ర జెఎసి ప్రతినిధులు అబ్దుల్వ్రూఫ్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
రయింద్రాం పంచాయతీ ఏకగ్రీవం
బొండపల్లి, జూలై 15 : మండలంలోని రయింద్రాం గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. సర్పంచ్ పదవికి పల్లి రామదేవుడమ్మ, ఆమె భర్త పల్లి వెంకటరమణలు సర్పంచ్ పదవికి కాంగ్రెస్ పార్టీ మద్దతు దారులుగా నామినేషన్లు దాఖలు చేయగా సోమవారం భర్తపల్లి వెంకటరమణ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో సర్పంచ్‌గా రామదేవుడమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే పది వార్డు మెంబర్లు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
కారు ఢీకొని విద్యార్థి మృతి
బొండపల్లి, జూలై 15 : రోడ్డు దాటుతున్న విద్యార్ధిని సోమవారం మధ్యాహ్నం కారు ఢీ కొనడంతో మృతి చెందాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గొట్లాం గ్రామానికి చెందిన మహంతి అశోక్ (10) సైకిల్‌పై ఇంటికి వెళ్లెందుకు రోడ్డు దాటుతుండగా గజపతినగం నుంచి విజయనగరంపైపు వెళ్తున్న కారు ఢీ కొట్టింది. ఈమేరకు గాయపడి అశోక్‌ను వైద్య చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రాసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. స్థానిక హెచ్‌సి కేసు శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సమస్యల పరిష్కారానికి
ఉపాధ్యాయుల ధర్నా
మెంటాడ, జూలై 15 : స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం యుటిఎఫ్ సంఘ ఆధ్వర్యంలో ఉపాధ్యాయుల సమస్యలపై ధర్నా నిర్వహించారు. విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలు అయిదు వేల పుస్తకాలు ఇవ్వవలసి వుందని, యూనిఫారాలు పూర్తి స్థాయిలో పంపిణీ చేయలేదని డిమాండ్ చేసారు. మండలంలో 35 పాఠశాలలకు ప్రహరీల నిర్మాణ చేయాలని, తదితర సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఇన్‌చార్జ్ ఎంపిడిఓ గంటా వెంకటరావుకు అందజేశారు.
‘ఆధార్ కార్డులు ఉచితంగానే ఇవ్వాలి’
విజయనగరం, జూలై 15 : ఆధార్ కార్డులను మీసేవా కేంద్రాల్లో కాకుండా ప్రభుత్వమే ఉచితంగా పంపిణీ చేయాలన్న తదితర డిమండ్లతో సిపిఐ(ఎంఎల్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు, కార్యకర్తలు, సోమవారం కలక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. నగదు బదిలీ పధకాని, సంక్షేమ పధకాలకు ఆధార్ కార్డులు తప్పని సరి అంటూ ప్రకటించిన ప్రభుత్వ వాటి పంపిణీ విషయంలో శ్రద్ధ కనబర్చడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఆధార్ కార్డులు లేని వారికి గ్యాస్, రేషన్, ఫించన్లు నిలుపుదల చేస్తారని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ప్రజానీకం ఆందోళన చెందుతున్నారన్నారు. ఉప్పటికీ ఆధార్‌కార్డులకు సంబంధించి పేర్లు నమోదు చేసిన వారికి ఉచితంగా అందజేయాలని, ఇప్పటి వరకు పేర్లు నమోదు చేయని వారికి షెడ్యుల్ ప్రకటించి ఆధార్ కార్డులు అందజేయాలని, నగదు బదిలీ కోసం బ్యాంకులో జీరో నగదుతో ఖాతాలను ప్రారంభించడానికి అవకాశం కల్పించాలని కోరారు. ఈ విషయమైన అధికారులు స్పష్టమైన ప్రకటన చేయాలని, అలాగే అప్రకటిత విద్యుత్ కోతలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ పేరుతో ప్రతి సోమవారం కలక్టరేట్‌లో నిర్వహించే గ్రీవెన్స్ డే రద్దు చేయడాన్ని నిరసిస్తున్నామని దానిని కొనసాగించాలని ఈ సందర్భంగా కోరారు. కార్యక్రమంలో నాయుకులు బి.శంకరరావు, రెడ్డినారాయణరావు, బి.పాండురంగారావు, జి.సత్యారావు, పాల్గొన్నారు.
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
విజయనగరం , జూలై 15: వి.టి అగ్రహారం బి.సి కాలనీకి చెందిన వెంపాడ ఉమా మహేశ్వరీ (38) అనుమానస్పద స్థితిలో మృతి చెందింది. ఉమా మహేశ్వరిని భర్త, ఇతర కుటుంబ సభ్యులే పొట్టన పెట్టుకున్నారని మృతిరాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా, భర్త కేశవ రెడ్డి, అత్త ఈశ్వరమ్మ ఇతర కుటుంబ సభ్యులు మాత్రం అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడిందని అంటున్నారు. పోలీసుల సమాచారం మేరకు విశాఖపట్నం కంచరపాలేనికి చెందిన ఉమామహేశ్వరికి, వి.టి అగ్రహారం బిసి కాలనీకి చెందిన వెంపాడ కేశవ రెడ్డితో వివాహం జరిగింది. వృత్తి రీత్యా కేశవ రెడ్డి ఆటోడ్రైవర్. ఉమామహేశ్వరినీ భర్త కేశవ రెడ్డి, అత్త ఈశ్వరమ్మలతోపాటు స్థానికంగా ఉండే ముగ్గురు ఆడపడుచులు తరచూ వేధించేవారని మృతిరాలి తల్లి చంద్రకళ, అన్న చంద్రశేఖర్‌లు ఆరోపించారు. ఆదివారం కేశవ రెడ్డి ఫోన్ చేసి ఉమా విషం తాగి ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఆడపడుచు ఫోన్‌చేసి ఫిట్స్ వచ్చి సొమ్మసిల్లి కిందపడిందని చెప్పినట్లు చెప్పారని తెలిపారు. ఆడపడుచులు త్రివేణి, ఎం.జయ, శాంతి మాట్లాడుతూ కొద్ది రోజుల క్రితం ఫైనాన్స్ చెల్లించలేదని ఆటోను తీసుకుని పోయారని, అప్పట్నుంచి ఉమామహేశ్వరీ మనోవేదనకు గురై ఈ అఘాయిత్యానికి పాల్పడిందని స్పష్టం చేశారు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
‘ఎన్నికల నిబంధనలు పట్టించుకోలేని అధికారులు’
విజయనగరం , జూలై 15: జిల్లాలో అధికారులు ఎన్నికల నిబంధనల గురించి పట్టించుకోవడంలేదని జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు ద్వారపురెడ్డి జగదీష్ ఆరోపించారు. సోమవారం ఇక్కడ అశోక్ బంగ్లాలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల నిబంధనలను అమలు చేయడంలో విఫలమవుతున్నారన్నారు. జిల్లాలో కొంతమంది అధికారులు అధికారపార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. నిష్పక్షపాతంగా వ్యవహిరించాల్సిన అధికారులు పక్షపాతంగా వ్యవహరించడం తగదన్నారు. జిల్లాలో కాంగ్రెస్, వైస్సార్ పార్టీలు లేనిపోని ఆరోపణలు చేస్తూ తెలుగుదేశంపార్టీపై బుదరజల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని ఆయన విమర్శించారు. ముఖ్యంగా పంచాయతీ ఎన్నికల్లో మోసపూరిత విధానాలతో ప్రజలను మభ్యపెడున్నాయని ఆరోపించారు. వైస్సార్ పార్టీ నాయకురాలు షర్మిల జిల్లాలో సాగిస్తున్న పాదయాత్ర విఫలమైందని, ప్రజల నుంచి ఎటువంటి స్పందన కనిపించడం లేదన్నారు. జిల్లా తెలుగుదేశంపార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపిరాజు మాట్లాడుతూ వార్డుల విభజనలో మున్సిపల్ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహంచారని ఆరోపించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు కనకల మురళీమోహన్, సైలాడ త్రినాధరావు, సువ్వాడ రవిశేఖర్, ఆల్తి వెంకటరమణ, ఎస్‌కెఎం భాషా తదితరులు పాల్గొన్నారు.
ఉప్పొంగిన వట్టిగెడ్డ.. 200 క్యూసెక్కుల విడుదల
జియ్యమ్మవలస, జూలై 15: మండలంలోని రావాడ వట్టిగెడ్డ రిజర్వాయర్‌లోకి వరదనీరు అధికంగా చేరడంతో సోమవారం 200 క్యూసెక్కుల నీటిని ఇరిగేషన్ అధికారులు దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల వరదనీరు రిజర్వాయర్‌లోకి చేరింది. 397 అడుగులకు మించి నీరు చేరడంతో ముందు జాగ్రత్త చర్యగా 200 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టినట్లు ఆశాఖ ఏ. ఇ. బి.వి.రఘు తెలిపారు. 399 అడుగులకు నీరు చేరిందంటే ప్రమాదం పొంచి ఉన్నట్లు గుర్తిస్తామని, అందుకే ముందుగా నీరు దిగువ ప్రాంతాలకువిడిచిపెట్టామన్నారు. అధిక స్థాయిలో ఇప్పటికే రిజర్వాయర్‌లోకి నీరు చేరుతున్నదని తెలిపారు.
రాకపోకలకు అంతరాయం
వట్టిగెడ్డ నీటిని దిగువ ప్రాంతాలకు విడిచిపెట్టడంతో రావాడ- టి.కె.జమ్ము ప్రధాన ఆర్.అండ్.బి. రహదారిపై గుండానీరు ప్రవహిస్తుండటంతో గిరిజనుల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. కొండపై గల 20 గ్రామాల ప్రజలు అసౌకర్యానికి గురవుతున్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
తలకిందులుగా నిలబడి కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన
విజయనగరం , జూలై 15: ఒప్పంద కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని సోమవారం తలకిందులు జపంతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఒప్పంద కార్మికులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం గత 22 రోజులుగా దీక్షలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోఛనీయమని ఆవేధన వ్యక్తం చేశారు. మా సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోని పక్షంలో విద్యార్థులుభవిష్యత్తు కూడా తలకిందులయ్యే ప్రమాదం ఉందన్నారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగుల స్థానంలో కొత్త నియామకాలు ఎందుకు చేపట్టడం లేదో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు.
సమస్యల పరిష్కారానికి ‘ గ్రీవెన్స్’: ఎస్పీ
విజయనగరం , జూలై 15: ఎస్పీ గ్రీవెన్స్, డయల్ యువర్ ఎస్పీ కార్యక్రమాల ద్వారా బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరిస్తున్నట్లు ఎస్పీ కార్తికేయ స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ఎస్పీ కార్తికేయ నిర్వహించిన గ్రీవెన్స్‌కు ఆరు ఫిర్యాదులు, డయల్ యువర్ ఎస్పీకి మూడు ఫిర్యాదులు అందాయి. సాలూరుపట్టణానికి చెందిన ఎం.సత్యన్నారాయణమ్మకు చెందిన కొంత వ్యవసాయ భూమి బాడంగి మండలంలో ఉందని, ఆభూమిని ఒకరు అక్రమంగా సాగు చేసుకుంటుంన్నారని తనకు న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. కొత్తవలస మండలం గంగపూడి గ్రామానికి చెందిన మహిళ తన భర్త, అత్తమామలపై పెట్టిన వరకట్న కేసుపై చర్యలు తీసుకోవాలని కోరారు. పట్టణంలోని గాజులరేగకి చెందిన డి.చంద్రకళ కొడుకు కొద్ది రోజుల క్రితం మృతి చెందినందున వృత్తిరీత్యా వచ్చే నగదు, ఇతర సదుపాయాలన్ని తన కోడలికే చెందాయని, తనకు బతికేందు ఆధారం లేకుండా పోయినందున న్యాయం చేయాలని విజ్ఞప్తి చేసింది.