Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

మోడిలో ఎన్నికల బహిష్కరణ

$
0
0

మొగల్తూరు, జూలై 15: అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆ గ్రామంలో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించటానికి ఆ గ్రామస్థులు సమిష్టిగా నిర్ణయించుకున్నారు. మండలంలోని మోడి గ్రామంలో ప్రజలకు కావలసిన వియర్ ఛానల్ పనులు ముందుకు సాగకపోవటం, మోడి - మొగల్తూరు గ్రామాలను కలుపుతూ వెస్ట్ కుక్కులేరుపై వంతెన పనులు మధ్యలో ఆగిపోవటం వంటి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించటంలో అటు పాలకులు ఇటు ప్రభుత్వం విఫలమయ్యిందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అసహనానికి గురైన గ్రామస్థులు పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ విషయం జిల్లా కలెక్టర్ దృష్టికి వెళ్లింది. మోడి గ్రామ పంచాయతీ 1977లో ఏర్పడింది. ఇక్కడ వంతెన నిర్మాణానికి అనేకమార్లు శంకుస్థాపనలు చేశారు. పనులూ ప్రారంభించారు. అయితే ఆ పనులు కాస్తా మధ్యలో ఆగిపోవటంతో గ్రామస్థులంతా ఎన్నికలు బహిష్కరించటంతో ఇప్పుడందరి దృష్టి మోడి గ్రామంపై పడింది. గ్రామ సమస్యల పట్ల ఐక్యంగా వుండి ప్రజలు ఎన్నికలు వద్దంటూ నినదించటం మిగిలిన గ్రామాలకు స్ఫూర్తిగా నిలిచిందనే చెప్పాలి. తమ గ్రామంలో నిలిచిపోయిన వియర్ ఛానల్, మోడి వంతెన పనులను వెంటనే పూర్తిచేస్తే అప్పుడు ఎన్నికల గురించి ఆలోచిస్తామని ఆ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌లు దాసరి ప్రసాదరావు, కడలి ధర్మారావు, దాసరి మాణిక్యాలరావు (చిట్టిబాబు), బి లక్ష్మణరావు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ మద్దతిచ్చిన వారే గెలుస్తారు
-మంత్రి పితాని ధీమా
మొగల్తూరు, జూలై 15: రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతు ప్రకటించిన అభ్యర్థులే గ్రామ పంచాయతీ ఎన్నికలలో అత్యధికంగా గెలుపొందటం ఖాయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి పితాని సత్యనారాయణ ధీమా వ్యక్తంచేశారు. మొగల్తూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి ఎన్నికల ప్రచార కార్యాలయంలో సోమవారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సమరంలో ప్రాంతీయ పార్టీలైన వైఎస్సార్ కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తమ పార్టీల మద్దతుతో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించాలని పిలుపునివ్వటంతో తాము కూడా కాంగ్రెస్ మద్దతుతో రాష్ట్రంలో ఎక్కువ స్థానాలు సాధించుకుంటామన్నారు. పంచాయతీల ఎన్నికల సమరంలో కాంగ్రెస్ ప్రభుత్వం, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డి పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి పథకాలే తమ పార్టీ బలపర్చే అభ్యర్థులకు శ్రీరామరక్షని అన్నారు. పంచాయతీ ఎన్నికల ద్వారా గ్రామ స్వరాజ్యం ఏర్పడుతుందని మంత్రి పితాని చెప్పారు. డిసిసి అధ్యక్షుడు, నరసాపురం ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల సమరంలో 70శాతం కాంగ్రెస్ మద్దతిచ్చిన సర్పంచ్‌లు గెలుపొందటం ఖాయమని జోస్యం చెప్పారు. నరసాపురం, మొగ ల్తూరు మండలాల్లో ఎక్కవ శాతం తమ పార్టీ మద్దతిచ్చిన అభ్యర్థులు నెగ్గనున్నారని సుబ్బారాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో మొగల్తూరు పంచాయతీకి కాంగ్రెస్ మద్దతుతో ఎన్నికల బరిలో నిలిచిన దూది శారదాంబ, కాంగ్రెస్ నేతలు అనంతపల్లి రాధాకృష్ణ, కలవకొలను నాగతులసీరావు, డిసిసిబి డైరెక్టరు ఎం రాంభాస్కరరావు, దూదిబాబు, ఎవిఎంఎల్ నాగేశ్వరరావు, కాంగ్రెస్ మండల శాఖ అధ్యక్షుడు పి రాంబాబు, బ్లాక్ టూ కాంగ్రెస్ అధ్యక్షుడు కె కనక సుబ్బారావు, గురుజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

స్వల్పంగా తగ్గిన నామినేషన్లు
ఏలూరు, జూలై 15 : జిల్లాలో పరిశీలన అనంతరం పంచాయతీ నామినేషన్ల సంఖ్యలో స్వల్పంగా తగ్గుదల కనిపిస్తోంది. నామినేషన్ల దాఖలు గడువు ముగిసిన తరువాత పరిశీలన అనంతరం మొత్తంగా నామినేషన్లు తగ్గుముఖం పట్టాయి. ఇంతకుముందు సర్పంచ్ పదవులకు 5,182 నామినేషన్లు, వార్డులకు 27,968 నామినేషన్లు దాఖలు కాగా వాటిని పరిశీలించిన అనంతరం అధికారులు కొన్ని నామినేషన్లను తిరస్కరించారు. అనంతరం ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి, సర్పంచ్ పదవులకు 4,883 నామినేషన్లు, వార్డు సభ్యులకు 27,149 నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని తేల్చారు. ఇదే సమయంలో తమ నామినేషన్లు తిరస్కరణకు గురి కావడంతో కొంతమంది అభ్యర్ధులు వాటిపై అప్పీళ్లకు వెళ్లారు. జిల్లాలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసి తిరస్కరణకు గురైన 17 మంది, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసి తిరస్కరణకు గురైన 103 మంది సోమవారం అయా ఆర్డీవోల వద్ద అప్పీలు చేసుకున్నారు. తమ నామినేషన్లను ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో స్పష్టంగా చెప్పాలని వారు కోరారు. ఈ విధంగా నర్సాపురం డివిజన్ పరిధిలో వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు దాఖలు చేసి తిరస్కరణకు గురైన 19 మంది, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో సర్పంచ్ పదవులకు నామినేషన్లు దాఖలు చేసి తిరస్కరణకు గురైన అయిదుగురు, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు వేసి తిరస్కరణకు గురైన 26 మంది, కొవ్వూరు డివిజన్ పరిధిలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు తిరస్కరణకు గురైన ముగ్గురు, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు తిరస్కరణకు గురైన 22 మంది, ఏలూరు డివిజన్ పరిధిలో సర్పంచ్ పదవులకు నామినేషన్లు తిరస్కరణకు గురైన తొమ్మిది మంది, వార్డు సభ్యుల పదవులకు నామినేషన్లు తిరస్కరణకు గురైన 36 మంది అప్పీళ్లకు వెళ్లారు. ఇక పరిశీలన అనంతరం జిల్లాలో నామినేషన్ల ముఖ చిత్రాన్ని పరిశీలిస్తే సర్పంచ్ పదవులకు 4883, వార్డు సభ్యుల పదవులకు 27149 నామినేషన్లు సక్రమంగా వున్నట్లు తేల్చారు. దీనిలో ఏలూరు డివిజన్ పరిధిలో సర్పంచ్ పదవులకు 1826, వార్డు సభ్యుల పదవులకు 10840 నామినేషన్లు, కొవ్వూరు డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 1191, వార్డు సభ్యుల పదవులకు 6614, జంగారెడ్డిగూడెం డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 582, వార్డు సభ్యుల పదవులకు 3088, నర్సాపురం డివిజన్ పరిధిలో సర్పంచ్ పదవులకు 1284, వార్డు సభ్యుల పదవులకు 6607 నామినేషన్లు సక్రమంగా వున్నట్లు అధికారులు ధృవీకరించారు. వీటిలో ఏలూరు డివిజన్ పరిధిలో ఎన్నికలు ఈ నెల 23న జరగనున్న విషయం తెలిసిందే. మరో వైపు పరిశీలన పూర్తికావడంతో ఉపసంహరణ గడువుపైనే ఇప్పుడు అందరి దృష్టి కేంద్రీకృతమైవుంది. పంచాయితీల పరిధిలో పోటీని తగ్గించుకునేందుకు రంగంలో వున్న అభ్యర్ధులు ఒకరితో ఒకరు సంప్రదింపులు జరుపుకుంటూ కొంతమందిని నామినేషన్లు ఉపసంహరణకు అంగీకరింపచేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ నెల 17తో ఈ గడువు ముగుస్తుండటంతో దానికి మరో 48 గంటలు మాత్రమే సమయం ఉండటంతో ఈ సంప్రదింపుల పర్వం ఊపందుకుంది.

పరిమితి దాటితే ఖర్చు రాసేస్తాం
ఏలూరు, జూలై 15: ఎన్నికల సంఘం నిర్ధేశించిన ఎన్నికల పరిమిత వ్యయాన్ని మించి ఖర్చు చేస్తే అనర్హత వేటు తప్పదని జిల్లా సాధారణ ఎన్నికల పరిశీలకులు కె దేవానంద్ హెచ్చరించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం మండల స్థాయి ఎన్నికల వ్యయ పరిశీలనా ఆడిటర్ల సమావేశంలో అభ్యర్ధుల ఎన్నికల వ్యయ నివేదికలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా దేవానంద్ మాట్లాడుతూ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధుల దొంగ లెక్కలకు కాలం చెల్లిందని ప్రజాస్వామ్య వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని, దానికి అనుగుణంగా అభ్యర్ధులు నడుచుకోకపోతే విజయం సాధించిన తర్వాత కూడా పదవి నుండి తొలగించే పరిస్థితి ఉంటుందన్నారు. వాస్తవ ఎన్నికల వ్యయాన్ని నిర్ధారించడానికి నిరంతర నిఘా ఏర్పాటు చేసిందని, రోజువారీ ఎన్నికల వ్యయం అదే రోజు రికార్డులలో నమోదు చేయాలని ఆ లెక్కలు సక్రమంగా ఉన్నాయా? లేదా అని పరిశీలించడానికి ప్రత్యేక వ్యవస్థను కూడా ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిందన్నారు. ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్ధులు ఫలితాలు ప్రకటించిన 45 రోజుల్లోగా తమ ఎన్నికల వ్యయ వివరాలను సమర్పించాలన్నారు. నిర్ధేశించిన మొత్తాలకు మించి ఖర్చు చేసినట్లు రుజువైతే ఎంన్నిక రద్దవుతుందన్నారు. ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధి ప్రచారం నిమిత్తం వాహనాలకు చెల్లించే అద్దె, కరపత్రాలు, పోస్టరు, బహిరంగ సభలు, సభ నిర్వహణకు ఉపయోగించే (మిగతా 6వ పేజీలో)
టెంట్లు, మైక్, అనుచరుల భోజన ఖర్చులు వంటి వన్నీ వ్యయ ఖాతాలకు వెళతాయన్నారు. జిల్లా కలెక్టర్ సిద్దార్ధ్‌జైన్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందని, ధన, మద్య ప్రవాహాల ప్రభావంతో స్వేచ్ఛాయుత ఎన్నికలకు విఘాతం కలుగకుండా అధికారులు కృషి చేయాలన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలలో ధన, మద్య ప్రవాహాలను అరికట్టడానికి అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలన్నారు. ఎన్నికలలో అభ్యర్ధుల వ్యయాలను నియంత్రించేందుకు ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల వ్యయ పరిమితి, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించి ముద్రించిన ప్రతులను ఎన్నికలలో పోటీ చేసే ప్రతీ అభ్యర్ధికి అందిస్తున్నామని, ఈ విషయాలపై ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల వ్యయ పరిశీలకులు శ్రీకంఠనాథరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధుల వ్యయ వివరాలను పరిశీలించేందుకు జిల్లా, డివిజన్, మండల స్థాయిలలో ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందని, ఈ బృందాలు వారి పరిధిలో అభ్యర్ధులు చేసే ప్రచార, ఇతర వ్యయాలను పరిశీలించి నివేదికలు రూపొందిస్తారన్నారు.

వినూత్నం కాదు విపరీతం
ఏలూరు, జూలై 15: కొద్దిరోజులుగా చెత్త ఎత్తే సంఘాలు సమ్మెలో వున్నాయి. సహజంగానే దీనివల్ల నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. అయినప్పటికీ వాటిని భరిస్తూ వచ్చిన ప్రజానీకానికి సోమవారం మాత్రం షాక్ తగిలినట్లైంది. ఉదయం లేచి బయటకు వచ్చే సరికి ఊరంతా చెత్త వెదజల్లి ఉంది. ఇళ్లల్లోనుంచి చెత్తను తీసుకువెళ్లి మరీ ప్రధాన కూడళ్లలోనూ చల్లారు. ఫైర్‌స్టేషన్ సెంటర్ లాంటి కీలకమైన ప్రాంతాల్లో దాదాపు గుమ్మరించారనే చెప్పుకోవాలి. మరికొన్ని చోట్ల చెత్తకు తీసుకువెళ్లే ట్రాక్టర్ల టైర్లలో గాలి తొలగించి రోడ్డుకు అడ్డంగా వదిలేశారు. ఇదంతా ఏమిటని ప్రశ్నించే నాధుడు లేకపోవడంతో ఈ పరిస్థితి శృతిమించి రాగాన పడినట్లు భావిస్తున్నారు. అయితే మరోవైపు ఈ పరిణామాన్ని వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారని చెప్పుకొస్తుండటం మరింత విచిత్రం. ఈ విధంగా వినూత్నం పేరుతో విపరీత పోకడలకు దారితీస్తే దాన్ని గమనించి పర్యవేక్షించి తగిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగం కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం మరింత విమర్శలకు కారణమైంది. సోమవారం నాటి పరిస్థితి పట్ల నగర ప్రజలు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని సంఘాలు ఈ పరిస్థితిపై విమర్శలు సందిస్తూ వినూత్న రీతిలో ఉద్యమం చేయాలనుకుని ఈ విధంగా చేస్తే అది ఎంత మాత్రం సమంజసం కాదని, అవసరమైతే బాధ్యులైన అధికారుల ఇళ్ల వద్ద ఈ విధంగా చేస్తే అసలు విషయం ఏమిటో తేలిపోతుందని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతూ కొద్దిరోజులుగా అల్పపీడనం కారణంగా భారీ వర్షాలు పడుతున్న తరుణంలో ఈ విధంగా చెత్తను వెదజల్లే వినూత్న నిరసన ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందన్న ఆందోళన కూడా వారు వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఇదే విధమైన నిరసన బారిన నగర ప్రజలు పడటం గుర్తుండే వుంటుంది. అప్పుడు కూడా ఇంతకుమించిన విమర్శలు వెల్లువెత్తాయి. అయినప్పటికీ మళ్లీ అదే పరిస్థితిని తీసుకువచ్చారు. గత కొద్దిరోజులుగా తమకు మూడు నెలల వేతన బకాయిలు ఇప్పించాలని డిమాండ్ చేస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కాంట్రాక్టు కార్మికులు ఆందోళన నిర్వహిస్తూ వచ్చారు. కార్మికులు స్థానిక నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ధర్నా, బైఠాయింపు, సమ్మె, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేయడం తదితర రూపాల్లో తమ నిరసనను వ్యక్తం చేసి జీతం బకాయిలు తక్షణం చెల్లించాలని కోరుతూ వచ్చారు. అయితే కార్పొరేషన్ అధికారులు ఈ విషయంపై స్పందించలేదు. సుమారు 270 మంది డ్వాక్వా, సిఎంఇవై కార్మికుల సమస్యల పట్ల పర్మినెంటు కార్మికులు కూడా స్పందించి సోమవారం తమ విధులను బహిష్కరించారు. ఇందులో భాగంగా వారు నగర పాలక సంస్థ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అంతకుముందు కొంతమంది కార్మికులు నగరంలో పలు ప్రాంతాల్లో చెత్తను తీసుకువెళ్లకుండా సేకరించిన దానిని రోడ్లపై వెదజల్లారని ఆయా ప్రాంతాల ప్రజలు చెబుతున్నారు. ప్రజల సానుభూతిని కోల్పోతే ఉద్యమాలు విజయం సాధించవన్న విషయాన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు మరచిపోవడం పట్ల పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నగరపాలక సంస్థ అధికారులు కూడా ఈ రకంగా వ్యవహరించే సిబ్బంది పట్ల ఉదాసీన వైఖరి అనుసరిస్తుండటాన్ని పలువురు తప్పుపడుతున్నారు.

ఎన్నికల సమాచారానికి మీడియా కేంద్రాలు
ఏలూరు, జూలై 15: జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సమాచారాన్ని అందించడానికి మీడియా కేంద్రాలను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టరు సిద్ధార్ధ జైన్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం పంచాయితీ ఎన్నికల మీడియా కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సమాచారాన్ని గ్రామస్థాయిలో ఎప్పటికప్పుడు సేకరించి జిల్లాస్థాయికి సత్వరమే అందించాలని ఆదేశించారు. జిల్లా స్థాయి మీడియా సెంటర్‌ను ఏలూరు డిపివో కార్యాలయంలో, కొవ్వూరు, నరసాపురం, జంగారెడ్డిగూడెం డివిజన్ స్థాయి మీడియా సెంటర్లను ఆయా ఆర్‌డివో కార్యాలయాల్లో ఏర్పాటుచేసి అవసరమైన ఎన్నికల సమాచారాన్ని సిద్ధం చేసుకోవాలని పౌర సంబంధాల అధికారులను ఆదేశించారు. ఈ నెల 17వ తేదీన పంచాయతీ ఎన్నికలకు సంబంధించి స్పష్టమైన సమాచారం వస్తుందని, ఉపసంహరణ అనంతరం బరిలో నిలిచిన వారి సమాచారాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పంచాయతీ ఎన్నికల్లో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌ను అమలు చేస్తున్న దృష్ట్యా దీనిపై పోటీ చేసే అభ్యర్ధులకే కాకుండా ప్రజల్లో కూడా అవగాహన కలిగించడానికి విస్తృత ప్రచారాన్ని నిర్వహించాలని సిద్ధార్ధ్‌జైన్ చెప్పారు. ధన బలంతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలను వమ్ము చేయడానికి ప్రతీ గ్రామంలోనూ ప్రత్యేక నిబంధనల కమిటీ ఏర్పాటు చేసామని అవసరమైతే వీడియో నిఘా కూడా పెంచుతామన్నారు. జిల్లా పంచాయతీ సాధారణ ఎన్నికల పరిశీలకులు కె దేవానంద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం మార్పులను చేపట్టిందని వాటిని అమలు చేయాల్సిన బాధ్యత ఉద్యోగుల బాధ్యతన్నారు. ఎన్నికల సంఘం తీసుకునే నిర్ణయాలను సామాన్య ప్రజలకు కూడా తెలిసే విధంగా మీడియా కేంద్రాలు కీలకపాత్ర పోషించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిపిఒ అల్లూరి నాగరాజు వర్మ, జిల్లా పౌర సంబంధాల అధికారి ఆర్‌వి ఎస్ రామచంద్రరావు, డివిజనల్ పౌర సంబంధాల అధికారి కె రామ్మోహనరావు, ఎం భాస్కరనారాయణ, సహాయ పౌర సంబంధాధికారులు సిహెచ్‌కె దుర్గాప్రసాద్, టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంతానం సమాచారం దాచిపెడితే చర్యలు
ఏలూరు, జూలై 15 : జిల్లాలో పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులలో ఇద్దరు కన్నా ఎక్కువ మంది సంతానం ఉండి నామినేషన్‌లలో వాస్తవాలను దాచిపెట్టిన అభ్యర్ధులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ తెలిపారు. 1995 సంవత్సరం తదుపరి ఇద్దరు కన్నా ఎక్కువ సంతానం కలిగిన వారు ఎన్నికల్లో పోటీకి అనర్హులన్నారు. అయితే నామినేషన్ ఫారంలో ఇద్దరు కంటే ఎక్కువ పిల్లలున్నారనే వాస్తవాలను దాచిపెట్టి, ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులు తదనంతరం పదవిని కోల్పోతారన్నారు. అంతేకాక, వారిని చట్టప్రకారం శిక్షించడం జరుగుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఇటువంటి విషయాలపై జిల్లాలో పలు ఆరోపణలు వస్తున్నాయన్నారు. కావున వాస్తవాలను దాచిపెట్టిన అభ్యర్ధులు తక్షణమే తమ నామినేషన్‌లు ఉపసంహరించుకోవాలని కలెక్టర్ సూచించారు.

నేడు డిజిపి దినేష్‌రెడ్డి రాక
-ఏలూరులో పోలీసు సబ్సిడరీ క్యాంటిన్ ప్రారంభం
ఏలూరు, జూలై 15 : డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వి దినేష్‌రెడ్డి మంగళవారం జిల్లా కేంద్రమైన ఏలూరు నగరానికి విచ్చేయనున్నట్లు జిల్లా ఎస్‌పి ఎం రమేష్ తెలిపారు. స్థానిక జిల్లా పోలీసు కార్యాలయ ఆవరణలో కొత్తగా నిర్మించిన సబ్సిడరీ పోలీస్ క్యాంటీన్‌ను డిజిపి ప్రారంభిస్తారని ఎస్‌పి తెలిపారు. అనంతరం ఏలూరు రేంజ్ పోలీసు అధికారులతో ఎన్నికల బందోబస్తు నిర్వహణ సమీక్షా సమావేశం జరిపిన అనంతరం మంగళవారం రాత్రి డిజిపి ఏలూరులోనే బస చేస్తారని ఆయన తెలిపారు. డిజిపితోపాటు కోస్తా ఆంధ్రా ఐజి సిహెచ్ ద్వారకాతిరుమలరావు కార్యక్రమాల్లో పాల్గొంటారని ఎస్‌పి తెలిపారు.
వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటేస్తే కరెంటు బిల్లులు రద్దు!
-మీటరు రీడింగు ముసుగులో ఓటర్లను ప్రలోభపెడుతున్న వ్యక్తి-
దేవరపల్లి, జూలై 15: దేవరపల్లి మండలం చిన్నాయగూడెం ఎస్సీ ఏరియాలో ఒక వ్యక్తి కరెంటు రీడింగు తీస్తూ పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే కరెంటు బిల్లులు రద్దు చేస్తారని ప్రచారం చేస్తున్నాడు. ఈ విషయం తెలిసిన స్థానిక నాయకులు ఎంపిడిఒ జె రేణుకమ్మకు ఫిర్యాదు చేయగా ఆమె సోమవారం ఆ వ్యక్తిని వివరణ కోరారు. తనకు ఏమీ తెలియదని, స్థానిక నాయకుడు ఒకరు ఈ విధంగా చేయాలని చెప్పడంతో చేశానని, క్షమించి తనను వదిలేయాలని వేడుకున్నాడు. ఎంపిడిఒ రేణుకమ్మ అతని వద్ద నుండి లిఖితపూర్వకంగా హామీ పత్రం తీసుకుని, దానిని కానిస్టేబుల్‌కు అప్పగించారు.
మహిళా సమాజం పేరుతో చందాలు
దేవరపల్లి, జూలై 15: నకిలీ రశీదు పుస్తకాలు సృష్టించి చందాలు వసూలు చేస్తున్న వ్యక్తికి సోమవారం దేవరపల్లి గ్రామస్థులు దేహశుద్ధి చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు. ఏలూరుకు చెందిన బండారు శ్రీరామ్ అనే వ్యక్తి నిడదవోలుకు చెందిన శ్రీ కస్తూరిబాయి మహిళా సమాజం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చర్ల సుశీల వృద్ధాశ్రమం బిల్లు పుస్తకాలు తయారుచేసి జిల్లాలో వివిధ గ్రామాల నుండి చందాలు వసూలు చేస్తున్నారు. కొన్నాళ్ల క్రితం ఈ విషయం తెలిసిన ఆశ్రమ వ్యవస్థాపకురాలు చర్ల విధాలకుమారి వివిధ దినపత్రికల్లో, టివిల్లో తమ పేరు చెప్పి దొంగ రశీదులు సృష్టించి చందాలు వసూలు చేస్తున్నారని ప్రకటనలు చేశారు. అయినా బండారు శ్రీరామ్ సోమవారం ప్రముఖ వ్యాపారవేత్త శ్రీకాకొళపు కాళీకృష్ణ ఇంటికి వచ్చి చందా అడిగాడు. రశీదు రెండో స్లిప్పుపై ఏ విధమైన చిరునామా లేకపోవడంతో అనుమానం వచ్చి నిడదవోలులో చర్ల సుశీల వృద్ధాశ్రమం నిర్వాహకులకు ఫోన్ చేశారు. ఆమె వచ్చి రశీదులు నకిలీవిగా చెప్పడంతో శ్రీరామ్‌కు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.

డమీ అభ్యర్థులపై నిఘా:జెసి
ఏలూరు, జూలై 15 : జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ పర్వం పూర్తి అయిన తర్వాత రంగంలో మిగిలిన డమీ అభ్యర్ధులపై ప్రత్యేక నిఘా పెట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో సోమవారం ఎన్నికల ఖర్చు తనిఖీ అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని ప్రాంతాలలో ఎన్నికల ఖర్చును తప్పించుకోవడానికి కొంత మంది డమీ అభ్యర్ధులను పెట్టుకుని తమతోపాటే ప్రచారానికి తిప్పుకుంటూ ఖర్చును డమీ అభ్యర్ధుల ఖాతాలో చూపించడానికి ప్రయత్నించే అవకాశాలున్నాయని సమాచారం అందుతోందని ఎవరైనా అభ్యర్ధి తన తరఫున ప్రచారం చేసుకోకుండా ఇతర అభ్యర్ధికోసం ప్రచారం చేపడితే అటువంటి వారిపై నిఘా పెంచుతామని ఈ డమీ అభ్యర్ధి ఖర్చు కూడా వాస్తవంగా ఎవరి తరఫున ప్రచారం చేస్తున్నాడో ఆ అభ్యర్ధి ఖర్చుగా లెక్కించడం జరుగుతుందని కావున ఇటువంటి డమీ అభ్యర్ధులపై ప్రత్యేక నిఘా ఉంచాలని వ్యయ తనిఖీ అధికారులను జెసి ఆదేశించారు. ఎన్నికల వ్యయాన్ని పూర్తిగా తగ్గించి నిబంధనలు మేరకే అభ్యర్ధి ఖర్చు చేసేందుకు ఈ నిఘా ముమ్మరం చేస్తామని ఆయన చెప్పారు. డమీ అభ్యర్ధుల కార్లు కూడా దుర్వినియోగం కాకుండా చూడాలని స్వేచ్ఛాయుత వాతావరణంలో పారదర్శకంగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించి రాష్ట్రానికే పశ్చిమగోదావరి ఆదర్శంగా ఉండేలా ఎన్నికల సిబ్బంది నిరంతరం ఒక సైనికుడిలా పనిచేయాలని అప్పుడే ఎన్నికల సంఘం ఆశించిన విధానం నెరవేరుతుందని జెసి చెప్పారు.

జంబ్లింగ్ విధానంలో పోలింగ్ సిబ్బంది నియామకం
ఏలూరు, జూలై 15 : జిల్లాలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించడానికి జంబ్లింగ్ పద్దతిలో పోలింగ్ సిబ్బందిని నియమిస్తున్నట్లు జిల్లా పంచాయితీ ఎన్నికల పరిశీలకులు కె దేవానంద్ చెప్పారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో సోమవారం కంప్యూటరు ద్వారా పోలింగ్ సిబ్బందిని జంబ్లింగ్ విధానంలో నియమించే పద్దతిని ఆయన పరిశీలించారు. తొలి దశగా ఏలూరు డివిజన్ పరిధిలోని గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమైన పోలింగ్ అధికారులను జంబ్లింగ్ పద్దతిలో నియామకాన్ని ఆయన అభినందించారు. ఈ పద్దతి వల్ల ఎక్కడా కూడా పక్షపాతానికి అవకాశం ఉండదని, ఇటువంటి విధానాన్ని అమలు చేస్తున్నందున పశ్చిమగోదావరి జిల్లా యంత్రాంగంపై దేవానంద్ ప్రశంసల జల్లు కురిపించారు. పారదర్శకంగా పోలింగ్ అధికారులను నియమించే పద్దతి ఇతరులకు ఆదర్శంగా నిలస్తుందని ఆయన చెప్పారు. నివాసము, ఉద్యోగం, స్వంత ఊరు కాకుండా వేరే ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న వారిని జంబ్లింగ్ పద్దతిలో విధులు కేటాయించడం వల్ల పోలింగ్ సిబ్బంది ఎక్కడా కూడా పక్షపాత ధోరణితో వ్యవహరించడానికి వీలు ఉండదని ఆయన చెప్పారు. మద్యం విక్రయాలపై కూడా నిఘా పెంచాలని పోలింగ్‌కు ముందు మద్యం షాపులు మూసివేసే నాటికి ఉన్న స్టాకు వివరాలను నమోదు చేసుకుని ఆ తర్వాత స్టాకును కూడా పరిశీలించాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ టి బాబూరావునాయుడు మాట్లాడుతూ రిజర్వ్‌లో ఉంచిన పోలింగ్ ఆఫీసర్లను కూడా ఖాళీగా ఉంచకుండా సమీప పోలింగ్ కేంద్రాలలో నియమిస్తామని దీనివల్ల ఆయా ప్రాంతాలలో సత్వరమే పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడగలుగుతారన్నారు.

నిబంధనలకు విరుద్ధంగా పశువులను తరలిస్తే చర్యలు
ఏలూరు, జూలై 15 : జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా వాహనాలలో పశువులను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి హెచ్చరించారు. స్థానిక డిటిసి కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఆమె రవాణా శాఖ ఇన్‌స్పెక్టర్లతో మాట్లాడుతూ జిల్లాలో బుధవారంనుండి ప్రత్యేక తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా సరుకులు చేరవేసే వాహనాలలో జంతువులను తరలిస్తుంటే వాటిని పట్టుకుని ప్రత్యేక కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. జంతువులను చేరవేసే వాహనాలు విధిగా నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, మేకలు, గొర్రెలు, పందులు, తదితర చిన్న చిన్న వాటికి ఒక్కొక్క జంతువుకు 60 సెంటీమీటర్లు వెడల్పు, 100 సెంటీమీటర్లు పొడవు ఉండాలని, పెద్ద జంతువులైతే 200 సెంటీమీటర్లు ఇన్‌టు 100 సెంటీమీటర్లు ప్రదేశం విధిగా ఉండాలని చెప్పారు. పశువులను తరలించే వాహనాలలో విధిగా గడ్డి పరిచి ఉంచాలని జంతువులను తాళ్లతో కట్టి ఉంచాలని ఆహారం, నీరు విధిగా వాహనంలో పశువులకు అందుబాటులో ఉంచాలని, గాలి, వెలుతురు ఉండే విధంగా చూడాలని ఆమె చెప్పారు. జంతువులును తరలించే వాహనం గంటకు 40 కిలోమీటర్ల వేగం మించి వెళ్లరాదని వాహనంలో మేకులు గానీ, ఇనుప రేకులు గానీ బయటకు వచ్చి జంతువుల భద్రతకు విఘాతం కలిగే విధంగా ఉంటే అటువంటి వాహనాలను కూడా స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అత్యవసర సమయాలలో జంతువుల ప్రథమ చికిత్సకు కావాల్సిన మందులను ఆ వాహనంలో అందుబాటులో ఉంచాలని జంతువులను ఇంజను వైపు ముఖం వచ్చేలా నిలిపి ఉంచాలని ఈ నిబంధనలను పాటించకపోతే జరిమానా విధించాలని ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ పశువువులను వాహనంలో తరలిస్తుంటే అటువంటి వాహనాలను స్వాధీనం చేసుకుని పశువులను గోశాలకు గానీ, పశుసంవర్ధక శాఖాధికారులకు గానీ అప్పగించాలని ఆయా వాహన యజమానుల నుండి అపరాధ రుసుం కూడా వసూలు చేయాలని ఆమె ఆదేశించారు.

అధికారుల నిర్లక్ష్యానికి నిరసనగా ఆ గ్రామంలో పంచాయతీ
english title: 
boycott

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>