Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పారదర్శకంగా ‘పంచాయతీ’

$
0
0

వరంగల్, జూలై 15: గ్రామపంచాయతీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించవలసిన బాధ్యత సూక్ష్మ పరిశీలకులదేనని రాష్ట్ర ప్రభుత్వ ఎన్నికల పరిశీలకుడు హరిప్రీత్‌సింగ్ అన్నారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో విధులు నిర్వహించే సూక్ష్మ పరిశీలకులకు ఎన్నికల విధానం, సూక్ష్మ పరిశీలకుల విధులు, బాధ్యతలపై సోమవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్‌లో శిక్షణా తరగతులు నిర్వహించారు. జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకుడు హరిప్రీత్‌సింగ్, జిల్లా ఎన్నికల అధికారి జి.కిషన్, జిల్లా అదనపు ఎన్నికల అధికారి ప్రద్యుమ్న శిక్షణా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. సాధారణ పరిశీలకులు హరిప్రీత్‌సింగ్ మాట్లాడుతూ సూక్ష్మ పరిశీలకులు ఎన్నికల ప్రక్రియకు చెవులు, కళ్ల వంటి వారని పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమాల ప్రకారం పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది పరిశీలించాలని అన్నారు. అవసరమైన సూచనలు చేయడంతోపాటు ఎన్నికల ప్రక్రియను ఎప్పటికప్పుడు తమకు తెలియచేయాలని, కానీ ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవద్దని సూచించారు. మొదటిసారి గ్రామపంచాయతీ ఎన్నికలలో సూక్ష్మ పరిశీలకుల నియామకం జరిగిందని, సాధారణ ఎన్నికలకు భిన్నంగా పోలింగ్‌తోపాటు కౌంటింగ్, ఉపసర్పంచ్ ఎన్నిక వరకు మొత్తం ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు పాల్గొని సమాచారాన్ని చెక్ మెమోలో పొందుపరచి తమకు అందజేయాలని తెలిపారు. కలెక్టర్ కిషన్ మాట్లాడుతూ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా, పారదర్శకంగా జరిగేలా చూడాలని సూక్ష్మ పరిశీలకులకు సూచించారు. గ్రామస్థాయిలో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉన్నందున పోలింగ్ కేంద్రాలలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులను సూక్ష్మ పరిశీలకులుగా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నియమించామని చెప్పారు. పోలింగ్ అధికారులు నిర్వహిస్తున్న ప్రక్రియను పరిశీలించి లోటుపాట్లను అధికారులకు వివరించాలని తెలిపారు. గ్రామపంచాయతీ ఎన్నికలలో ప్రతి ఓటు కీలకమేనని, ఎటువంటి సంఘటనలు జరిగినా తమకు సమాచారం అందించాలని, పరిస్థితులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని అన్నారు. పరిశీలకులకు వీడియోగ్రాఫర్‌ను కేటాయిస్తామని, ఇబ్బందికర సంఘటనలను వీడియోగ్రఫీ చేయాలని తెలిపారు. సూక్ష్మ పరిశీలకుల విధులపై స్పష్టంగా శిక్షణ ద్వారా తెలియచేస్తామని, అందుకు అనుగుణంగా వ్యవహరించి ఎన్నికలను సాఫీగా జరిగేలా సూక్ష్మ పరిశీలకులు చూడాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు కీలకపాత్ర పోషిస్తారని అన్నారు. పోలింగ్ ప్రక్రియలోని ముఖ్య ఘట్టాలను నిర్థేశించిన నిర్ణీత నమూనాలో పొందుపరచాలని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా జరుగుతున్నదా అనే అంశంతోపాటు ఎన్నికల నిబంధనలను పాటిస్తున్నది గమనించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మధు, డిఆర్‌డిఎ ఎపిడి రాము తదితరులు పాల్గొన్నారు.

ఉగ్రమాతగా భద్రకాళి
వరంగల్, జూలై 15: శాకంభరీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఏడవరోజు సోమవారం భద్రకాళి అమ్మవారిని ఉగ్రమాతగా (ప్రత్యంగిర) అలంకరించి పూజారాధనలు జరిపారు. కాళిక అమ్మవారు తన భక్తులపై ప్రతీపశక్తులు ఈర్ష్యాద్వేషములతో ప్రయోగాది రూపేణ బాధలు పెట్టేవారిని ధ్వంసం చేస్తుంది. భద్రకాళి ఉగ్రస్వరూపమే ప్రత్యంగిర. అమ్మవారు సింహం మొహం కలిగి చేతియందు సర్పం, ఢమరుకం, త్రిశూలం, కపాలం ఇత్యాది భయంకరమైన ఆయుధాలు కలిగి దుష్టశక్తుల సంహారం చేసి భద్రకాళి అమ్మవారు భక్తులకు ఎల్లవేళలా కాపాడుతుందని వేదపండితులు చెబుతారు. సోమవారం హైదరాబాద్‌కు చెందిన ప్రఖ్యాత సలక్షణ ఘనపాఠి మహాగ్నిచిత్‌వూఢ్య పౌండరీకయాజీ అమ్మవారిని దర్శించి వేదమంత్రాలతో స్తుతించారు. అమ్మవారి భక్తులు ఆలయం వద్ద కోలాటాలతో అమ్మవారిని కీర్తించారు.

కాంగ్రెస్‌తోనే తెలంగాణ
* మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు
పరకాల టౌన్, జూలై 15: కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమని మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు అన్నారు. సోమవారం పరకాల ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌కు తెలంగాణ ఇవ్వడం ఇష్టం లేకపోతే తెలంగాణ అంశాన్ని కోర్ కమిటీలో పెట్టడం జరగదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించాలనే కోర్ కమిటీలో చర్చించి సిడబ్ల్యూసిలో చేర్చారని చెప్పారు. సిడబ్ల్యూసి నివేదిక ఇచ్చిన తరువాత తెలంగాణను ప్రకటిస్తారని చెప్పారు. డిసెంబర్ 9న ప్రకటన చేసింది వాస్తవమేనని అయితే, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రాత్రికి రాత్రి చేసిన రాజీనామా డ్రామాల వల్ల కమిటీ వేశారన్నారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణపై స్పష్టత ఉందని అందుకే సిడబ్ల్యూసిలో చేర్చడం జరిగిందన్నారు. కొందరు ఎన్నికల కోసమే అంటూ ప్రచారం చేస్తున్నారని ఎన్నికలు తెలంగాణ, సీమాంధ్రలో జరుగుతున్నాయని చెప్పారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ సాధ్యమన్నారు. తెలంగాణ ప్రక్రియ ప్రారంభమయిందని ఆయన ప్రజలకు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో నామినేషన్ల పర్వం ముగిసిందని, స్థానిక పరిస్థితులను బట్టి అక్కడక్కడ కొంత సర్దుబాటు చేసుకుంటామన్నారు. కాంగ్రెస్ పార్టీ స్వతంత్రంగా పోటీ చేస్తుందని, మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌కే దక్కుతుందన్నారు. ఈ సమావేశంలో పరకాల మండల, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, బండి సారంగపాణి, బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మడికొండ సంపత్, బొచ్చు క్రిష్ణారావు, బొద్దుల వీరన్న, రమేష్, మోహన్ తదితరులు పాల్గొన్నారు.

ప్రశాంత ఎన్నికలకు సహకరించాలి
రూరల్ ఎస్పీ పాలరాజు
కేసముద్రం, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పార్టీల నాయకులు, ప్రజలు సహకరించాలని వరంగల్ రూరల్ ఎస్పీ పాలరాజు సూచించారు. పోలీసులు అత్యంత సమస్యాత్మకంగా గుర్తించిన మండలంలోని ఇనుగుర్తిని సోమవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా హైస్కూల్ ఆవరణలో వివిధ పార్టీల నాయకులు, ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికల్లో వ్యిక్తిగత ఆరోపణలకు దిగకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రచారం చేసుకోవాలని, అనుమతి లేకుండా సభలు, ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. ప్రలోభాలకు గురిచేసే విధంగా వ్యవహరించకూడదని, మద్యం, డబ్బు పంపిణీ చేయకూదడని సూచించారు. గత ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్‌ను ఎన్నుకున్న ఇనుగుర్తి వాసులు ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా సహకరించి గ్రామానికున్న మంచిపేరును తిరిగి నిలబెట్టేందుకు కృషి చేయాలన్నారు. కాగా గ్రామాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టుషాపులు, గుడుంబా తయారిని తక్షణం మానుకోవాలని, తమకు దొరికితే కఠిణ చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో మహబూబాబాద్ డిఎస్పీ రమాదేవి, రూరల్ సిఐ సతీష్‌వాసాల, ఎస్సైలు కరుణాకర్, అమృత్ తదితరులు పాల్గొన్నారు.

‘గీత’ దాటొద్దు
నియమావళి ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్పీల హెచ్చరిక
నెక్కొండ/రాయపర్తి, జూలై 15: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను వరంగల్ అర్బన్, రూరల్ ఎస్పీలు ఆదేశించారు. నెక్కొండ మండలంలో ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ అలాంటి వ్యక్తులపై రౌడీషీట్లు తెరవాలని ఆదేశించారు. నెక్కొండ మండలం చిన్నకొర్పోలు గ్రామాన్ని సోమవారం సందర్శించి రెండురోజుల క్రితం గ్రామంలో నామినేషన్ల సందర్భంగా జరిగిన ఘర్షణలపై అడిగితెలుసుకున్నారు. డిఎస్పీ సరిత, సిఐ రాజశేఖర రాజు, ఎస్సై అమృతరెడ్డి, తహశీల్దార్ ప్రకాష్‌రావు, ఎంపిడిఓ కృష్ణప్రసాద్‌లతో పరిస్థితిని సమీక్షించి పలు సూచనలు చేశారు. గ్రామంలో పోలింగ్ స్టేషన్‌కు 200 గజాల దూరంలో బారికేడ్లను ఎర్పాటు చేయాలన్నారు. గతంలో జరిగిన ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని త్రాగునీరు, విద్యుత్ సౌకర్యం కల్పించాలన్నారు.
రాయపర్తి మండలంలో అర్బన్ ఎస్పీ..
స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘించాలని చూస్తే వారిపై కఠినచర్యలు తప్పవని వరంగల్ అర్బన్ ఎస్పీ వెంకటేశ్వర్‌రావు హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమవారం మండలంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. మండలకేంద్రంతోపాటు తిరుమలాయపల్లి, కొండూరు, కాట్రపల్లి, మైలారం గ్రామాలలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని పేర్కొన్నారు. అర్బన్ జిల్లా పరిధిలో జరిగే ఎన్నికలపై శాఖాపరంగా ముందస్తు చర్యలు తీసుకున్నామని వివరించారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఎటువంటి సభలు, సమావేశాలకు అనుమతులు లేవని తెలిపారు. ఎవరైనా సభలు, సమావేశాలు నిర్వహించాలనుకుంటే తప్పనిసరిగా ఎన్నికల అధికారులు, పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. ఎన్నికలలో మద్యం, డబ్బులను అక్రమంగా తరలించినా, ఓటర్లను ప్రభావితం చేసిన ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లేనని, వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా కావలసిన హింసకు దిగితే వారిపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై ఎన్నికల నిబంధనల ప్రకారం పంచాయతీరాజ్ చట్టం 221(బి) కింద చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎస్పీ వెంట మామునూరు డిఎస్పీ సురేష్, వర్థన్నపేట సిఐ మల్లయ్య, రాయపర్తి ఎస్సై రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్టాత్మకంగా పంచాయతీ ఎన్నికలు
రిటర్నింగ్ అధికారులతో కలెక్టర్ కిషన్
పరకాల టౌన్, జూలై 15: పంచాయతి ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎటువంటి వివాదాలకు తావులేకుండా నిర్వహించాలని కలెక్టర్ జి. కిషన్ అన్నారు. సోమవారం పరకాల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహిస్తున్న రిటర్నింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్నారు. గొడవలు పడవద్దని అవసరమైతే ఎంపిడిఓ, తహశీల్దార్ దృష్టికి తీసుకరావాలన్నారు. అభ్యర్థి తరుపున ఒకే ఏజెంట్ ఉండేలా చూడాలని, ఎలక్షన్ ఏజెంట్ సంతకం ప్రారంభం, ముగింపు తప్పని సరి అని చెప్పారు. అధికారులు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవద్దని సూచించారు. 24వేల పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించే అవకాశం ఉందన్నారు. పోలింగ్ కేంద్రాలలోకి పోలీసు అధికారులను రానివ్వవద్దని, విఆర్‌ఓ, విఆర్‌ఏలను లోపల ఉండనీయవద్దన్నారు. బ్యాలెట్ పత్రాలు ఎన్ని అవసరం ఉంటే అన్నింటికే సంతకాలు చేయాలని సూచించారు.

పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి
విధులకు డుమ్మా కొడితే కఠినచర్యలు * డిఎంహెచ్‌ఓ సాంబశివరావు
ఏటూరునాగారం, జూలై 15: ఏజెన్సీ గ్రామాలలో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి ప్రజలు రోగాల బారినపడకుండా చూస్తామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు అన్నారు. సోమవారం మండలంలోని దొడ్ల, మల్యాల, కొండాయి, చిన్నబోయినపల్లి గ్రామాలను డాక్టర్ సాంబశివరావు సందర్శించి జ్వరాల బారినపడిన రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఐటిడిఎ కార్యాలయంలోని డిప్యూటీ డిఎంహెచ్‌ఓ గదిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో వాగులు, వంకలు దాటి వెళ్లని గ్రామాలలో మందులను నిలువ చేసుకోవాలని వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. ఐటిడి ఎ పరిధిలోని 17 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలలో దోమల నివారణ మందు, క్లోరినేషన్, బ్లీచింగ్ చల్లించాలని డిప్యూటీ డిఎంహెచ్‌ఓను ఆదేశించారు. పిహెచ్‌సిలోని వైద్యులు వారికి కేటాయించిన గ్రామాలలోనే నివాసం ఉండాలని, పట్టణాలకు పరిమితమైతే కఠినచర్యలు తీసుకుంటామని అన్నారు. పారిశుద్ధ్యం నెలకొన్న ప్రాంతాలను గుర్తించి వెంటనే సహాయచర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజలకు ఎఎన్‌ఎంలు అందుబాటులో ఉంటూ జ్వరాల బారినపడిన రోగులకు మందులను పంపిణీ చేయడమేకాకుండా వారి ఆరోగ్యపరిస్థితిని ఉన్నతాధికారులకు సమాచారం అందించాలని అన్నారు. అధికంగా జ్వరాలు ఉన్న ప్రాంతాలలో ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి రోగుల ప్రాణాలను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని తెలిపారు. మురికిగుంటలు, కాలువలు, చెత్తాచెదారం పేరుకుపోయిన చోట బ్లీచింగ్, దోమల మందును తరచు పిచికారి చేయాలని అన్నారు. దోమలు వృద్దిచెందకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. ఎఎన్‌ఎం, గ్రామపంచాయతీ కార్యదర్శిలు సమన్వయంతో పనిచేసి పారిశుద్ధ్యాన్ని తొలగించాలని అన్నారు.

శాంతిభద్రతల పరిరక్షణలో కానిస్టేబుళ్ల పాత్ర కీలకం: డిఐజి
వరంగల్, జూలై 15: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు కానిస్టేబుళ్ల పాత్ర కీలకమని వరంగల్ రేంజ్ డిఐజి డాక్టర్ ఎం.కాంతారావు అన్నారు. వరంగల్ నగరశివారు మడికొండలోని వరంగల్ పోలీసు శిక్షణా కేంద్రాన్ని సోమవారం డిఐజి సందర్శించారు. శిక్షణా కేంద్రానికి చేరుకున్న డిఐజికి డిటిసి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, వరంగల్ రూరల్ అదనపు ఎస్పీ కె.శ్రీకాంత్ పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం డిఐజి శిక్షణా కేంద్రంలోని బ్యారెక్స్, పరేడ్ గ్రౌండ్‌ను పరిశీలించారు. కానిస్టేబుళ్లకు వివిధ విభాగాలలో ఇస్తున్న శిక్షణకు సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ట్రైనీ కానిస్టేబుళ్ల తరగతి గదులకు వెళ్లి కానిస్టేబుళ్ల వ్యక్తిగత వివరాలను తెలుసుకోవడంతోపాటు ఉన్నత విద్య అభ్యసించిన ట్రైనీ కానిస్టేబుళ్లకు భవిష్యత్తులో శాఖాపరంగా రాణించడానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రైనీ కానిస్టేబుళ్లను ఉద్దేశించి డిఐజి మాట్లాడుతూ పోలీసులు పేద, బలహీన వర్గాల పక్షాన నిలవాలని సూచించారు. పోలీసులు తమ శ్రేయోభిలాషులని ప్రజలు గుర్తించే విధంగా నేటితరం పోలీసులు కృషి చేయాలని కోరారు. చట్టాలను అతిక్రమించే వారిపై కఠినంగా వ్యవహరించడం పోలీసుల బాధ్యతగా గుర్తించాలని అన్నారు.

ఎన్నికల బాధ్యత సూక్ష్మ పరిశీలకులదే: హరిప్రీత్‌సింగ్
english title: 
transperancy

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>