Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల తుది జాబితా నేడు ఖరారు

$
0
0

ఒంగోలు, జూలై 16: పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల తుదిజాబిను బుధవారం సాయంత్రం మూడు గంటల తరువాత ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు బుధవారం సాయంత్రం మూడు గంటలకు ముందుగా ఉపసంహరించుకునే వీలుంది. కాగా ఒక్కొక్క పంచాయతీలో వివిధ పార్టీలకు చెందిన సానుభూతిపరులు ఎక్కువ సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేశారు. వారందరినీ బుజ్జగించి ఉపసంహరింప చేసి వారు అనుకున్న అభ్యర్థిని రంగంలోకి దించేందుకు నేతలు కసరత్తులు చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ పర్వం కొన్ని గంటల పాటు మాత్రమే ఉండటంతో ప్రధాన రాజకీయ పార్టీల నేతలు గ్రామాల్లోనే తిష్టవేసి పరిస్థితులను గమనిస్తున్నారు. కొంతమంది అభ్యర్థులను బుజ్జగించేందుకు వారికి తాయిలాలు కూడా ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలలైతే పంచాయతీ ఎన్నికలు ముగిసిన తరువాత కాంట్రాక్టు పనులు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలైతే నగదు ముట్టచెప్పేలా చర్చలు జరుపుతున్నారు. ప్రధానంగా పంచాయతీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అభ్యర్థులు రంగంలో ఉండాల్సి ఉండగా ఒక్కొక్క పంచాయతీకి పదుల సంఖ్యలో నామినేషన్లను దాఖలు చేశారు. దీంతో మండల, జిల్లాస్థాయి నేతలకు తలనొప్పిగా మారింది. ఇక పోటీలో ఉన్న అభ్యర్థులు 20 లక్షల నుండి కోటి రూపాయలకు పైగానే ఖర్చు చేసేందుకు వెనకంజవేయని పరిస్థితి నెలకొంది. కాగా పోటీలో ఉన్న వారు నియోజకవర్గ నేతలు, మండల స్థాయి నేతల వద్దకు రాయబారాలు పంపుతూ తమకు 20 లక్షల రూపాయల వరకు పార్టీపరంగా ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులకంటే నియోజకవర్గ నేతలు, మండల స్థాయి నేతలకే ఆర్థికభారం పెరిగినట్లైంది. ఇదిలాఉండగా ఓసి జనరల్ కేటగిరీ కింద ఉన్న పంచాయతీల్లో ఓటుకు వెయ్యి నుండి 25వేల రూపాయల వరకు ఖర్చు చేసేందుకు నేతలు వెనకాడని పరిస్థితులు ఏర్పడ్డాయి. అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ఒక కుటుంబానికి లక్ష రూపాయలు కూడా పోటీలో ఉన్న అభ్యర్థ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే పంచాయతీ ఎన్నికల్లో నగదును అభ్యర్థులు లెక్కలేకుండా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తంమీద పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని బిందెలు, చీరలు, జాకెట్లు, కుంకుమ బరిణెలు, ముక్కుపుడకలకు కూడా డిమాండ్ పెరగనుంది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలి
టిడిపి నేత కరణం పిలుపు
ముండ్లమూరు, జూలై 16:స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించి సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర రైతు సంఘం అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన ముండ్లమూరులోని తన అతిధిగృహంలో వివిధ గ్రామాల కార్యకర్తలతో స్థానిక ఎన్నికలపై చర్చించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని, గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. మండలంలోని 19 గ్రామ పంచాయతీల గురించి ఆయన కార్యకర్తలను అడిగి తెలుసుకున్నారు. కార్యకర్తలంతా ఐకమత్యంతో పనిచేసి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వేముల మాజీ సర్పంచ్ భూమా వెంకటేశ్వరరెడ్డి, మానం నాగేశ్వరరావు, మేదరమెట్ల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ హాస్టళ్లను సందర్శించిన ఎఐఎస్‌ఎఫ్ నేతలు
ఒంగోలు అర్బన్, జూలై 16: ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను ఎఐఎస్‌ఎఫ్ నేతలు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా అనేక సమస్యలు వారి దృష్టికి వచ్చాయి. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎఐఎస్‌ఎఫ్) జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని పలు సంక్షేమ వసతిగృహాలను సందర్శించినట్లు జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి పరచూరి కుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వసతిగృహాలు తెరిచి నెలా పదిహేను రోజులు కావస్తున్నప్పటికీ నేటికీ పలు హాస్టళ్ళల్లో మెను సక్రమంగా అమలుకావడం లేదన్నారు. వసతిగృహాల్లో ఉండే విద్యార్థులు సమస్యలతో అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యలతో ఎంతకాలం సహవాసం చేయాలని ప్రశ్నించారు. ఇప్పటివరకు ప్రభుత్వ సంక్షేమ వసతిగృహాలను అధికారులు పరిశీలించిన పాపాన పోలేదన్నారు. పేద విద్యార్థులంటే అధికారులకు చులకనగా మారిందని మండిపడ్డారు. వసతిగృహాల్లో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాధుడే కరవయ్యారన్నారు. అసలే ఒకవైపు వర్షాలు కురుస్తున్నాయని, అద్దె భవనాల్లో ఉన్న సంక్షేమ వసతిగృహాలు నీటిమయంగా మారుతున్నాయన్నారు. తాగేందుకు సక్రమంగా నీరులేదని, మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉందన్నారు. సంక్షేమ వసతిగృహాల సమస్యలపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులను కలిసి విద్యార్థుల సమస్యలపై వినతిపత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్ జిల్లా కౌన్సిల్ సభ్యులు కె రజని, లక్ష్మి, నారాయణ, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.

‘జగన్ జైలులో ఉన్నా.. ప్రజాదరణ తగ్గలేదు’
మార్కాపురం, జూలై 16: వైఎస్‌ఆర్‌సిపి నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి జైలులో ఉన్నా ఆ పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ తగ్గలేదని మార్కాపురం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు డాక్టర్ రంగారెడ్డి అన్నారు. మంగళవారం మాజీఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సిపి సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి స్వగృహంలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ లబ్ధికోసం కొన్ని పార్టీలు కలిసి జగన్‌ను ప్రజల నుంచి దూరం చేసేందుకు అక్రమంగా జైలుకు పంపినప్పటికీ ప్రజల్లో మాత్రం ఆయనపై ఆదరణ తగ్గలేదని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా డాక్టర్ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ఉన్న సమయంలో పేదప్రజల కోసం, అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు చేరాయని, ఆ అభిమానంతోనే ప్రజలు జగన్‌ను ఆదరిస్తున్నారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేదప్రజల కోసమని ఎంతో ఆర్భాటంగా చేపట్టిన అభయహస్తం అబాసుపాలైందని అన్నారు. జగన్‌ను దెబ్బతీసేందుకు రాయల్ తెలంగాణ అంటూ కాంగ్రెస్ అధిష్థానం కుటిల యత్నాలు చేసినా రెండు రాష్ట్రాలుగా విభజించిన వైఎస్‌ఆర్‌సిపి రెండు ప్రాంతాల్లో అధికారం చేపట్టడం ఖాయమని రంగారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అత్యధికశాతం స్థానాలు వైఎస్‌ఆర్‌సిపి కైవసం చేసుకుంటుందని అన్నారు. ఈసమావేశంలో మాజీఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి, గిద్దలూరు మండల వైఎస్‌ఆర్ సిపి కన్వీనర్ హిమశేఖర్‌రెడ్డి, ఉడుముల కోటిరెడ్డి, పి వెంకటరెడ్డి, ఎం మహేశ్వరరెడ్డి, జె నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలు రాజధాని ఏర్పాటుపై
షికార్లు చేస్తున్న పుకార్లు
పరుగులు తీస్తున్న రియల్టర్లు
ఒంగోలు, జూలై 16: తెలంగాణా అంశం తెరపైకి రావటం, ఒంగోలును రాజధాని చేస్తారనే ముమ్మర ప్రచారం జిల్లాలో సాగుతోంది. చివరగా సిడబ్ల్యుసిలో తెలంగాణ అంశం తేలనుందని, అందువలన తెలంగాణా ఇవ్వటం ఖాయమని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీంతో జిల్లాలో స్తబ్ధతగా ఉన్న భూముల రేట్లు పెరుగుతున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుండి జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం పూర్తిగా పడిపోయింది. తెలంగాణ అంశం తెరపైకి రావటంతో భూములను కొనుగోలు చేసేందుకు రియల్టర్లు ముందుకు వస్తున్నట్లు సమాచారం. ప్రధానంగా కోస్తాప్రాంతానికి చెందిన బడా వ్యాపారులు, రియల్టర్లు, రాజకీయనేతలు కొంతమంది హైదరాబాదులోని భూములను అమ్ముకుని ఒంగోలులో కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణా ఇస్తే ఒంగోలు రాజధాని అవుతుందని అందువలన ఇప్పటినుండే భూములను కొనుగోలు చేస్తే లాభపడవచ్చుననే భావనలో రియల్టర్లు ఒంగోలువైపునకు పరుగులు తీస్తున్నట్లు సమాచారం. ఒంగోలు రాజధాని ప్రస్తావనను కొంతమంది రాజకీయనేతలు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ప్రధానంగా జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. భౌగోళికపరంగా చూసినా రైల్వేలైన్లు, సముద్ర తీర ప్రాంతం, జాతీయ రహదారి ఉన్నాయి. కాగా రాజధానికి ఏర్పాటుకు కావాల్సిన ప్రభుత్వ భూములు కోస్తాతీరంలోను, కందుకూరు, మార్కాపురం డివిజన్‌ల్లో ఎక్కువుగానే ఉన్నాయి. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించేందుకు అనువుగా ఈభూములు ఉండే అవకాశాలున్నాయి. నీటిపరంగా చూసినప్పటికీ వెలుగొండప్రాజెక్టు, గుండ్లకమ్మ రిజర్వాయరు, రామతీర్ధం రిజర్వాయర్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. దీంతో రాజధాని నిర్మాణం జరిగితే నీటి అవసరాలు తీరతాయని భావిస్తున్నారు. ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు కూడా కోస్తాతీర ప్రాంతంలో ప్రభుత్వ భూములున్నాయి. కొత్తపట్నం మండలం బీరంగుంట వద్ద ఎయిర్‌పోర్టును నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడా జరిగాయి. కాని ఆప్రతిపాదనలు కాగితాలకే పరిమితం అయ్యాయి. చీమకుర్తిలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గెలాక్సీ గ్రానైట్ నిక్షేపాలు కూడా ఉన్నాయి. దీంతో అంతర్జాతీయపరంగా కూడా వ్యాపార లావాదేవీలు కొనసాగుతున్నాయి. గతంలో గుంటూరు జిల్లా నిజాంపట్నంనుండి కొత్తపట్నం వరకు వేల ఎకరాల్లో వాన్‌పిక్‌ను విస్తారించాలని భూములను కూడా కొనుగోలు జరిగింది. కాని వాన్‌పిక్ అధినేత నిమ్మగడ్డప్రసాద్ జైల్లో ఉండటంతో ఆ ప్రాజెక్టు వచ్చే అవకాశాలు కనుచూపుమేరలో కనిపించటం లేదు. కోస్తాతీర ప్రాంతంలో పోర్టులను నిర్మించి జలరవాణాను కూడా మెరుగుపరిచే అవకాశాలున్నాయి. వాన్‌పిక్ వస్తుందన్న ఆలోచనలతో కొంతమంది రిటైర్డు ఐఎఎస్, ఐపిఎస్ అధికారులతోపాటు, కొంతమంది రాజకీయనేతలు కూడా చీరాల, వేటపాలెం, చినగంజాం తదితరప్రాంతాల్లో కోట్లరూపాయలు వెచ్చించి భూములను కొనుగోలు చేశారు. కాని వాన్‌పిక్‌రాకపోవటంతో వారంతా ఆర్ధికంగా పతనమయ్యారు. ప్రస్తుతం ఒంగోలు రాజధాని అంశం తెరపైకి రావటంతో వారందరూ ఊపిరీపీల్చుకుంటున్నట్లు సమాచారం. మొత్తంమీద ఒంగోలులో రాజధాని ఏర్పాటు వ్యవహరం జిల్లాలో చర్చనీయాంశమైంది.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు
సూక్ష్మ పరిశీలకులు సహకరించాలి
కలెక్టర్ విజయ్‌కుమార్ ఆదేశం
ఒంగోలు, జూలై 16: గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహించేందుకు సూక్ష్మ పరిశీలకులు సహకరించాలని జిల్లాకలెక్టర్ జిఎస్‌ఆర్‌కెఆర్ విజయకుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో పంచాయతీ ఎన్నికల ప్రక్రియపై సూక్ష్మ పరిశీలకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా జిల్లాకలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో సమస్యాత్మక గ్రామాలు, తీవ్ర సమస్యాత్మక గ్రామాలు, అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న ప్రాంతాల్లో పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు తెలిపారు. సూక్ష్మ పరిశీలకులు పోలింగ్ ప్రక్రియపై పూర్తి అవగాహన కల్పించుకుని ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ఎన్నికల కమిషన్ నిర్ధేశించిన పద్ధతిలో అన్నీ సక్రమంగా నిర్వహించేందుకు కృషి చేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం నుండి కౌంటింగ్ పూర్తయి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు జరిగే అన్ని సంఘటనలను సూక్ష్మ పరిశీలకులు తమ డైరీలో నమోదు చేయాలన్నారు. ఎన్నికల్లో ఓటర్ పోలింగ్ స్టేషన్‌కు వచ్చి స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఓటింగ్ రహస్యంగా జరగాలని, ఎవరు ఎవరికి ఓటు వేస్తున్నది ఓటువేసే వ్యక్తికి తప్ప మరెవరికి తెలియకూడదన్నారు. బహిరంగ ఓటింగ్ జరిగితే పోలింగ్ రద్దు చేసి రీ పోలింగ్‌కు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. ఓటరు గుర్తింపుకార్డు తీసుకుని పోలింగ్ స్టేషన్‌కు రావాలని, లేనిపక్షంలో ప్రత్యామ్నాయంగా ఎన్నికల కమిషన్ ఆమోదించిన 21 ఇతర రకాల కార్డుల్లో ఏదోఒకటి చూపించి ఓటు వేయాలన్నారు. నిజమైన ఓటరు అయినప్పటికీ 22 రకాల కార్డుల్లో ఏదోఒకటి చూపించినట్లైతే ఓటు వేసేందుకు అనుమతించకూడదన్నారు. పోలింగ్ సందర్భంగా అభ్యర్థులు, వారి ఏజెంట్ల నుండి ఫిర్యాదులు వచ్చినపుడు అవి సరిదిద్దటానికి అవకాశం ఉంటే సరిదిద్దాలన్నారు. లేనిపక్షంలో సూక్ష్మ పరిశీలకులు వారితో అనవసరమైన వాగ్వావాదానికి దిగకుండా తాము గమనించిన విషయాలు డైరీలో నమోదు చేయాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చేవారు క్యూలో వచ్చేలా ఏర్పాటుచేయాలన్నారు. గుంపుగా వచ్చేందుకు అనుమతించకూడదని, ఎలాంటి ఆందోళనలు, ఒత్తిళ్లకు తావులేకుండా ధైర్యంగా, పారదర్శకంగా పని చేయాలని సూచించారు.

జిల్లాలో విస్తారంగా వర్షాలు
ఒంగోలు, జూలై 16: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం అర్ధరాత్రి నుండి మంగళవారం ఉదయం వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. దీంతో రైతులు ఖరీఫ్ పంటను సాగు చేసేందుకు సమాయత్తవౌతున్నారు. జిల్లావ్యాప్తంగా సరాసరిన 6.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో అత్యధికంగా తాళ్ళూరు మండలంలో 30.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం వివరాలు మిల్లీమీటర్లలో ఈవిధంగా ఉన్నాయి. పుల్లలచెరువు మండలంలో 27.6 మిల్లీమీటర్లు, మార్టూరు మండలంలో 25.8, యద్దనపూడి మండలంలో 23.6, కారంచేడు మండలంలో 22.2, పర్చూరు మండలంలో 21.2, జె పంగులూరు మండలంలో 19.2, చినగంజాం మండలంలో 18.4, చీరాల మండలంలో 17.4, బల్లికురవ మండలంలో 16.4, సంతమాగులూరు మండలంలో 15.2, కొరిశపాడు మండలంలో 13.2, కంభం మండలంలో 12.8 మిమీ వర్షపాతం నమోదైంది. వేటపాలెం మండలంలో 11.2, నాగులుప్పలపాడు మండలంలో 10.4, హనుమంతునిపాడు మండలంలో 10.2, అర్ధవీడు 9.4, బేస్తవారిపేట మండలంలో 8.4, ఇంకొల్లు మండలంలో 7.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మద్దిపాడు మండలంలో 6.2, అద్దంకి మండలంలో 5.4, దర్శి మండలంలో నాలుగు, టంగుటూరు మండలంలో 3.2, జరుగుమల్లి మండలంలో 3.2, కందుకూరు మండలంలో 3.2, శింగరాయకొండ మండలంలో మూడు, కొత్తపట్నం మండలంలో మూడు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మర్రిపూడి మండలంలో 2.4, కొమరోలు మండలంలో 2.4, సంతనూతలపాడు మండలంలో 2.2, కనిగిరి మండలంలో 1.6, పొదిలి మండలంలో 1.2, గిద్దలూరు మండలంలో 0.80 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంమీద అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లావ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులతోపాటు అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పంచాయతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల
english title: 
final list

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>