శ్రీకాకుళం, జూలై 16: నామినేషన్ ప్రక్రియ పూర్తి కావడంతో ప్రచార పర్వానికి సిద్ధమవుతున్నారు. అభ్యర్థులు గ్రామాల్లో మనీ... మద్యం ఫార్ములాతో ఓటుబ్యాంకు కొట్టేయడానికి శక్తియుక్తులా పోరాడుతున్నారు. రహస్యంగా గ్రామాలకు మద్యంను తరలించి ఓటర్లను కిక్కుతో తమవైపు తిప్పుకోవాలన్న అత్యాశతో పావులు కదుపుతున్నారు. ఎటువంటి అనుమతుల్లేకుండా లక్షలాది రూపాయలు మద్యాన్ని గ్రామాలకు యధేచ్చగా తరలించే పనిలో నేతలంతా బిజీగా ఉన్నారు. ప్రధాన రహదారుల్లో పోలీసు తనిఖీలు ముమ్మరంగా సాగుతున్న దొడ్డిదారిల్లో మద్యాన్ని అనుబంధ గ్రామాలకు సైతం చేరవేస్తున్నారు. మద్యం షాపులకు షీలింగ్ అంటూ సంబంధిత అధికారులు సరుకుల్లో కోత విధించినప్పటికీ ఈ నెల పదవ తేదీ నుంచి నేటివరకు 10 కోట్ల రూపాయలు అమ్మకాలు సాగినట్లు ఐ.ఎం.ఎల్. డిపో గణాంకాలు సుస్పష్టంచేస్తున్నాయి. పదిరోజుల పాటు 3.5 కోట్ల రూపాయలు అమ్మకాలు సాగించడం పంచాయతీ ఎన్నికలకు ఎంత కిక్కు ఎక్కిస్తున్నారన్నది ఇట్టే అర్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆదివారం, సోమవారాల్లో పలు ప్రాంతాల్లో భారీగా మద్యం పోలీసులకు పట్టుబడింది. జిల్లాలో ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసిన పోలీసుశాఖ దొడ్డిదారులపై కూడా నిఘా పెంచింది. దీంతో జిల్లా అంతటా రెండురోజులుగా 1500 మద్యం కేసులు పోలీసులకు చిక్కింది. ఎచ్చెర్ల మండలంలో కుప్పిలి గ్రామానికి తరలిస్తున్న 15 కేసులు మద్యం సుమారు 43,200 రూపాయల విలువ చేసేదిగా పోలీసులు గుర్తించారు. సాక్షాత్తు మండల తెలుగుదేశం నేత వాహనం కూడా ఇందులో పట్టుబడటం గమనార్హం. కొత్తూరు మండలం సోమరాజుపురంలో అక్రమంగా మద్యం సీసాలు పట్టుబడ్డాయి. అలాగే జిల్లాకేంద్రంలోని రాజీవ్ స్వగృహ సమీపంలో రూరల్ మండలం కునుకుపేటకు చెందిన ఓ వ్యక్తి వద్ద 20 వేల రూపాయలు విలువ చేసే మద్యాన్ని టాటా ఎసి వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పాతపట్నంలో ముప్పై కేసుల మద్యం , పోలాకి మండలంలో 16 కేసుల మద్యం పట్టుబడింది. ఈ ఘటనల వెనుక పంచాయతీ ఎన్నికలేనన్నది నగ్న సత్యం.
ఇదిలా ఉండగా ఓటరుకు కరెన్సీ ఎరవేయడానికి అభ్యర్థులు డబ్బుకట్టలను రంగంలో దింపుతున్నారు. ప్రతీ ఓటరుకు
500 నుంచి రెండువేల రూపాయల వరకు చెల్లించి పంచాయతీల్లో పట్టునిరూపించుకోవాలన్న సంకల్పంతో నేతలు ముందుకు సాగుతున్నారు. రియల్ ఎస్టేట్ పంచాయతీల్లో ఒక అడుగు ముందుకు వేసి ఓటర్లకు గృహోపకరణ వస్తువులు అందించాలన్న పనిలో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. గ్రామాల్లో ఉన్న యువతకు క్రికెట్ కిట్లు, మహిళలకు చీరలు, స్టీల్‌బిందెలు పంపిణీ చేసి ఓట్ల ఎరవేస్తున్నారు. ఇందులో భాగంగానే గత రెండు రోజులుగా జిల్లాలో 42 లక్షల రూపాయలు పోలీసులు వివిధ చెక్‌పోస్టుల వద్ద అకౌంటులేని నగదుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి అక్రమంగా తరలిస్తున్న 29 లక్షల రూపాయలు నగదు పోలీసుల తనిఖీల్లో సోమవారం పట్టుబడింది. అలాగే బూర్జ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న రెండున్నర లక్షల రూపాయలు, కంచిలి మండలంలో నాలుగున్నర లక్షల రూపాయలు పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేని ఈ నగదు వెనుక పంచాయతీ స్టంట్ ఉందని అధికారులు చెప్పకనే చెబుతున్నారు. జిల్లాలో మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో మద్యం..మనీయే ప్రధాన భూమిక పోషిస్తుందని అభ్యర్థులు ఆ దిశగా పంపకాల్లో బిజిబిజీగా ఉన్నారు. ఇటువంటి అప్రజాస్వామిక చర్యలపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపించాలని అభ్యుదయ వాదులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.
15 లక్షల మంది ఓటర్లు పాల్గొనే ఇవి పేరుకే పార్టీ రహిత ఎన్నికలు. అడుగడుగునా పార్టీ జెండాల రెపరెపలు రాజకీయపక్షాల స్వీయాధిక్య కాంక్షను చాటడం ఇప్పటికే ఊపందుకుంది. ఏడేళ్లక్రితం జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల ముసుగులో కొన్నిచోట్ల వేలంపాటలు జోరేత్తడం తెలిసిందే. అదే రివాజు ఈసారి కూడా మొదలైంది. ఐదు నుంచి 20 లక్షల రూపాయల వరకే వేలం జరిగే పంచాయతీ కుర్చీలకు ఇప్పుడు అరకోటి వరకూ గుమ్మరించడానికైనా వెనుదీయని పంతాలు ఎన్నో ఉన్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో మనీ! మద్యం!! ప్రభావం లేకుండా అవసరమైన చర్యలన్నీ చేపడతామని చెప్పే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటన ఏ మేరకు అమలవుతుందన్నది గత మూడురోజులుగా నమోదైన మనీ, మద్యం కేసులే సాక్ష్యం!?
కనె్నధార కొండ రీసర్వేపై కలెక్టర్ ఆరా
సీతంపేట,జూలై 16:సీతంపేట ఏజెన్సీలో వివాదస్పదమైన కనె్నధార కొండ వ్యవహారంలో గడచిన కొన్ని రోజులుగా జరుగుతున్న రీసర్వే పై జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ ఆరా తీశారు.మంగళవారం టిడబ్ల్యూ కమిషనర్ పర్యటనలో భాగంగా సీతంపేట విచ్చేసిన కలెక్టర్ స్థానిక పిఎంఆర్‌సి కేంద్రం వద్ద కనె్నధార పోరాటకమిటీ నాయకులతో మాట్లాడారు. కనె్నధార కొండపై జరుగుతున్న రీసర్వే ఎంత వరకు వచ్చింది.. గిరిజన రైతులకు ఇచ్చిన పట్టాలు అవి గుర్తిస్తున్నారా ? లేదా ?అని కనె్నధార కొండ పోరాటకమిటీ నాయకులు సవరతోట మొఖలింగం, పత్తికకుమార్, సంజీవరావులను ప్రశ్నించారు.దీని పై వారు సమాధానమిస్తూ 350సబ్‌డివిజన్‌ల పరిధిలోని 650ఎకరాల వరకు రీసర్వే పూర్తి అయ్యిందని కలెక్టర్‌కు చెప్పారు.అలాగే ఏనుగుల వలన ధ్వంసం అయిన పంటలకు నష్టపరిహారం ఎంత వరకు చెల్లిస్తున్నారని తహశీల్దార్ మంగును ప్రశ్నించారు.ఏనుగుల వలన జరిగిన పంటనష్టాలు అంచనా వేసేందుకు ఇటీవలే హార్టికల్చర్ అధికారులు వచ్చారని, వారు నివేదిక అందిస్తారని తహశీల్దార్ మంగు వివరించారు.పంట నష్టపరిహారానికి సంబంధించి తమకు కూడా నివేదిక పంపాలని కలెక్టర్ ఆదేశించారు.కలెక్టర్‌తో పాటు పీవో కె సునీల్‌రాజ్‌కుమార్ ఉన్నారు.
గుణాత్మక విద్య అందించండి
సీతంపేట,జూలై 16:గిరిజన సంక్షేమశాఖ పరిధిలోని ఆశ్రమపాఠశాలలు, వసతిగృహాలు, గురుకులాలు, కెజిబివిలు వంటి పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థుల భవిష్యత్త్ గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల చేతుల్లో ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఎ సోమేష్‌కుమార్ అన్నారు.ఏజెన్సీ పర్యటనలో భాగంగా మంగళవారం సీతంపేట విచ్చేసిన ఆయన స్థానిక గిరిజనసంక్షేమ ఆశ్రమ బాలికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వెస్ట్(క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఎస్‌టి స్టూడెంట్స్)పై ఉపాధ్యాయులకు మూడు రోజుల పాటు ఇచ్చే శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడుతూ క్వెస్ట్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు,విద్యార్థుల కోసం రూపొందించి దీపిక, అభ్యాసిక అనే పుస్తకాల గూర్చి ముందుగా తెలుసుకోవాలన్నారు. దేశంలో ఎక్కడ ఇటువంటి కార్యక్రమం లేదని,గిరిజన విద్యార్థుల విద్యాప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు పునాది,క్వెస్ట్ వంటి కార్యక్రమాలు రూపొందించామన్నారు. వివిధ సబ్జెక్ట్‌లకు చెందిన 250మంది గిరిజన సంక్షేమ ఉపాధ్యాయులతో ఈ దీపిక,అభ్యాశిక అనే పుస్తకాలు తయారు చేశామన్నారు. గిరిజన
సంక్షేమ ఆశ్రమపాఠశాల చదివే విద్యార్థులకు విద్య రాదనే భావన గతంలో ఉండేదని,అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10ఐటిడిఎల్లో 2వేల మంది ఉపాధ్యాయులు ఈ క్వెస్ట్ కార్యక్రమం పై శిక్షణ పొందుతున్నారన్నారు. గిరిజన విద్యార్థులకు పాఠాలు బోదించాలంటే వాళ్ల మనసులకు దగ్గరగా ఉంటే కథలు చెబుతు పాఠ్యాంశాలు బోధించాలన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సౌరభ్‌గౌర్ మాట్లాడుతూ గిరిజన విద్యాభివృద్ధికి తామంతా ప్రోత్సహిస్తామన్నారు.ఉపాధ్యాయులు ఏవిధంగా విద్యార్థులకు బోధించాలో తెలిపే దీపిక,గిరిజన విద్యార్థుల కోసం తయారుచేసిన అభ్యాశిక వంటి పుస్తకాలు వలన ఎంతో లాభం ఉందన్నారు.ఈ కార్యక్రమంలో జిసిసి ఎండి రమేష్‌కుమార్,ఐటిడిఎ పీవో కె సునీల్‌రాజ్‌కుమార్,డిప్యూటి డిఇఓ సుబ్బారావు,ఏఎంఓ ఆదినారాయణ,ఏటిడబ్ల్యుఓలు బల్ల అప్పారావు,వరలక్ష్మి,కమల,రీసోర్స్ పెర్సన్‌లు,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఏకగ్రీవ పంచాయతీల్లో నేడు ఉపసర్పంచ్ ఎన్నిక
శ్రీకాకుళం, జూలై 16: ఏకగ్రీవంగా ఎన్నికైన గ్రామ పంచాయతీల్లో ఉపసర్పంచ్ పదవికి ఈ నెల 17వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి సౌరభ్‌గౌర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్పంచ్‌తోపాటు వార్డుసభ్యులకు పోటీదారులు ఎవరూ లేని పంచాయతీల్లో 17వ తేదీన ఏకగ్రీవంగా ఎన్నిక జరిగినట్లు ప్రకటించిన తక్షణం ఉపసర్పంచ్ ఎన్నిక జరుపవచ్చన్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనలు జారీ చేసిందని పేర్కొన్నారు. 17వ తేదీన కోరమ్ తక్కువగా ఉన్నప్పుడు 18వ తేదీ ఉదయం పదకొండు గంటలకు సంబంధిత రిటర్నింగ్ అధికారి ద్వారా నిర్వహిస్తామన్నారు. 17, 18వ తేదీల్లో ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించినప్పుడు మరలా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకోవాలని స్పష్టంచేశారు. ఏదేని వార్డులకు నామినేషన్లు దాఖలు కానప్పుడు ఉపసర్పంచ్ ఎన్నిక పోలింగ్ పూర్తి అయిన తరువాత మాత్రమే నిర్వహించాలన్నారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో 650 మంది ఓటర్లు ఉండేవిధంగా చర్యలు చేపట్టవచ్చని కమిషన్ సూచనలు జారీ చేసిందన్నారు.
రాజుకున్న పాతకక్షలు
* కాంగ్రెస్ నాయకునిపై వైకాపా వర్గీయుల దాడి
నరసన్నపేట, జూలై 16: పట్టణంలో కలివరపుపేటలో పాతకక్షలు రాజుకున్న నేపధ్యంలో ఒకరిపై దాడి జరిగిన ఘటన శనివారం రాత్రి చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన కోరాడ వేణుగోపాలస్వామి గుప్తపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఆయన వ్యాపారం ముగించుకుని స్వగ్రామానికి తిరిగి వచ్చిన సమయంలో సుమారు 50 మంది చంద్రభూషణగుప్త తన అనుచరులతో తనపై దాడి చేశారంటూ గుప్త విలేఖరులకు తెలిపారు. ఈ దాడిలో వేణుగోపాలస్వామి గుప్త ఎడమకాలు విరిగిపోయింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. అయితే తనపై అక్కసుతోనే గుప్త అనుచరులు దాడి చేశారన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఎన్నికల నియమాలు అతిక్రమిస్తే చర్యలు
*జాయింట్ కలెక్టర్ భాస్కర్
హిరమండలం,జూలై 16: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎన్నికల నియమాలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని జెసి కె భాస్కర్ హెచ్చరించారు. మంగళవారం వంశధార అతిధి గృహంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలో 1094 పంచాయతీలు, 10496 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, మరో నాలుగు పంచాయతీల్లో సమస్యల కారణంగా ఎన్నికలు జరగడంలేదన్నారు. శ్రీకాకుళం డివిజన్‌లో 23న జరిగే ఎన్నికల్లో 5,68,871మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోగా పాలకొండ డివిజన్‌లో 4,83,803మంది ఓటుహక్కు వినియోగించుకుంటారన్నారు. టెక్కలి డివిజన్‌లో 5,32,669మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించి 24,715మంది ఎన్నికల సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. 10,543 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి 4,176 ఎన్నికల బాక్సులు అందజేస్తున్నామని, 142గ్రామాలను అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా 253 గ్రామాలను సమస్యాత్మక గ్రామాలుగా గుర్తించినట్లు తెలిపారు.
ఏనుగుల సమస్యను పరిష్కరించండి
*గిరిజన సంక్షేమశాఖ కమిషనర్‌కు మొర
సీతంపేట,జూలై 16:సీతంపేట ఏజెన్సీలో అలజడి సృష్టిస్తున్న ఏనుగులను ఈ ప్రాంతం నుండి తరలించి తమకు న్యాయం చేయాలని గిరిజన సంఘం నాయకులు పత్తికకుమార్,సవరతోట మొఖలింగం,సంజీవరావులు కోరారు.మంగళవారం సీతంపేట విచ్చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ సోమేష్‌కుమార్‌ను స్థానిక పిఎంఆర్‌సి కేంద్రం వద్ద కలిసి ఏనుగుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని వినతిపత్రం అందజేసారు. ఏనుగుల వలన పంటలు నాశనం అవుతున్నాయని, రాత్రుళ్లు గ్రామం విడిచి బయటకు రావాలంటే భయంతో వణికిపోతున్నామని కమిషనర్‌కు వివరించారు.అలాగే మండలంలో ఎనిమిది పంచాయతీలు నాన్‌షెడ్యూల్డ్ ఏరియాలో ఉన్నాయని వాటిని షెడ్యూల్డ్ ఏరియాలో చేర్చాలని కోరారు. దీని పై పరిశీలిస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు తెలిపారు.
నీటిలో నీలకంఠుడు!
పాతపట్నం, జూలై 16: మహేంద్ర తనయకు ఆవలివైపున స్వయంభూగా వెలసిన నీలకంఠుడు ఏడాదిలో ఆరునెలలు నీటిలోనే భక్తులకు దర్శనమిస్తాడు. గజపతిరాజుల కాలంనాటి నుండి ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ నీలకంఠేశ్వర ఆలయం ఈ ప్రాంతంలో ప్రఖ్యాతిగాంచింది. ఏటా జూలైలో స్వామి పూర్తిస్థాయిలో నీటిలోనే భక్తులకు దర్శనభాగ్యం కలిగిస్తుంటాడు. నీటిలో ఉన్న స్వామి మూలవిరాట్‌ను దర్శించుకుని భక్తులు తన్మయం చెందుతున్నారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి దర్శిస్తుంటారు. క్రీ.శ 16వ శతాబ్ధంలో పర్లాఖిమిడి గజపతిరాజులు స్వామివారి ఆలయాన్ని నిర్మించారు. విగ్రహమంతా భూమిలోనే ఉంటుందని పూర్వీకుల విశ్వాసం. స్వామిని అభిషేకించేందుకు గంగమ్మ తల్లి ఆరునెలల పాటు ఇక్కడే కొలువై ఉంటుందని భక్తుల నమ్మకం. పర్లాఖిమిడి గజపతిరాజులకు స్వప్నంలో స్వామి కనిపించి మహేంద్ర ఒడ్డున వెలిశాను, అక్కడ ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించినట్లు ప్రచారం ఉంది.
రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని దుర్మరణం
* మరొ యువతి పరిస్థితి విషమం
హిరమండలం, జూలై 16: మండలంలోని పెద్దసంకిలి గ్రామ పంచాయతీ పరిధిలోని బర్రిపేట గ్రామ సమీపంలో ఎబి రహదారిపై మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్ విద్యార్థిని దుర్మరణం చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే కొత్తూరులోని రెల్లివీధికి చెందిన ముదిల రాజు, కోల క్రిష్ణవేణి(16), కోల ప్రియాంక అనే ముగ్గురు ద్విచక్రవాహనంపై హిరమండలం మండలం తులగాం గ్రామానికి వస్తున్నారు. హిరమండలం నుండి కొత్తూరు వైపు వెళుతున్న టిప్పర్‌ను తప్పించబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న నీటిగుంటలో పడిపోయారు. ఈ సమయంలో జారిపడిన కోల క్రిష్ణవేణి టిప్పర్ ముందుభాగంలోని చక్రాల కింద పడి దుర్మరణం చెందింది. తీవ్రంగా గాయపడిన ప్రియాంకను హిరమండలం పిహెచ్‌సికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండడంతో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అలాగే స్వల్ప గాయాలైన రాజుకు స్థానికంగా చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై హిరమండలం ఎస్ ఐ ఎం.శ్రీను కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం
*టిడిపి నేత రామ్మోహన్‌నాయుడు
పొందూరు, జూలై 16: కాంగ్రెస్ పాలనతో విసిగి పోయిన ప్రజలు స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెబుతారని శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి కింజరాపు రామ్మోహన్‌నాయుడు అన్నారు. మంగళవారం ఆయన లోలుగు పంచాయతీ సర్పంచ్‌గా బరిలో ఉన్న అభ్యర్థి లోలుగు నారాయణమ్మకు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో మూడు విడతలుగా జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ వారు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు మనీ..మద్యంలను విపరీంతగా వినియోగించుకోవడంతో పాటు హింసాత్మక చర్యలకు పాల్పడి ఓటర్లను భయభ్రాంతులను చేసే అవకాశం జిల్లాలో ఎక్కువగా కనబడుతోందన్నారు. స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు అవసరమైన పూర్తి భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ ,ఎస్పీలతో పాటు ఎన్నికల కమిషన్ కూడా కోరామన్నారు. ఈ ఎన్నికల్లో దేశం, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కైనట్లు వస్తున్న ఆరోపణలు అర్ధరహితమని, కొన్ని దుష్టశక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగు యువత నాయకులు లోలుగు శ్రీరాములనాయుడు తదితరులు పాల్గొన్నారు.
శ్రీరాముడిగా జగన్నాథుడు
శ్రీకాకుళం, జూలై 16: పట్టణంలో వివిధ వైష్ణాలయాల్లో జగన్నాథుని రథోత్సవ పూజలు జరుగుతున్నాయి. ఇలిసిపురంలో గుడించా మందిరంలో రఘువీర్‌దాస్ బావాజీ నిర్వహణలో జరుగుతున్న రథయాత్రలో బుధవారం జగన్నాథుని శ్రీరామ అవతారంలో అలంకరించి భక్తుల దర్శనార్ధం ఉంచారు. కార్యక్రమంలో బాలకృష్ణ పాణిగ్రహి ఒడిశాకు చెందిన పురోహితులు, భక్తులు పాల్గొన్నారు. అలాగే గుజరాతిపేట ఇంద్రద్యుమ్నంలో నిర్వహిస్తున్న జగన్నాథ ఉత్సవంలో స్వామి సత్యనారాయణ స్వామి రూపంలో అలంకరించి పూజలు జరిపారు.
‘ప్రభుత్వ పథకాలకు వర్సిటీ అనుసంధానంతో అభివృద్ధి’
ఎచ్చెర్ల, జూలై 16: ప్రభుత్వ శాఖలతో అంబేద్కర్ యూనివర్సిటీ విభాగాలను అనుసంధానం చేయడం వల్ల జిల్లాలో శరవేగంగా అభివృద్ధి ఫలాలు అర్హులకు అందించగలుగుతామని రాష్ట్ర ముఖ్య ప్రణాళిక గణాంక శాఖ డైరెక్టర్ డి.దక్షిణామూర్తి స్పష్టంచేశారు. మంగళవారం వైస్ ఛాన్సలర్ హెచ్.లజపతిరాయ్‌ను కలిసి 20 సూత్రాలకు విశ్వవిద్యాలయం విభాగాల అనుసంధానంపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఏ విశ్వవిద్యాలయం ఇటువంటి ప్రక్రియ ఆరంభించలేదని కొనియాడారు. సమాజమే సిలబస్‌గా అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. క్షేత్రస్థాయిలో అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించడంతోపాటు పౌరులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి ఈ ప్రక్రియ మరింత దోహదపడుతుందన్నారు. అనుసంధానంపై పలువిషయాలను వీసీ ఆయనకు వివరించారు. ఈయనతోపాటు సిడిసి డీన్ జి.తులసీరావు తదితరులున్నారు.
రూ.500 కోట్ల ఉపాధి పనులు లక్ష్యం
* జిల్లా ఫైనాన్స్ మేనేజర్ రాజారావు
నరసన్నపేట, జూలై 16: జిల్లాలో ఉపాధి పనులు వేగవంతం చేస్తున్నామని ఆ శాఖ జిల్లా ఫైనాన్స్ మేనేజర్ వి.రాజారావు తెలిపారు. మంగళవారం మండల పరిషత్ కార్యాలయానికి విచ్చేసిన సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 500 కోట్లరూపాయల లక్ష్యంగా ఉపాధి పనులు చేపడుతున్నామని చెప్పారు. ఇప్పటికే 56,449 పనులను గుర్తించగా సుమారు 23,129 పనులు పూర్తయ్యాయని స్పష్టంచేశారు. అలాగే పచ్చతోరణానికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎ.పి.ఒ జె.సత్యమూర్తి, సాంకేతిక సహాయకులు నాయుడు, నాగమణి, నర్సయ్య, నాగమణి, అప్పలరాజు పాల్గొన్నారు.
ఆర్టీసీతోనే సురక్షిత ప్రయాణం
శ్రీకాకుళం, జూలై 16: సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీ బస్సులే మేలని జిల్లా అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్.సెంథిల్ కుమార్ అన్నారు. మంగళవారం స్థానిక ఆర్టీసీ రెండో డిపో ఆవరణలో నిర్వహించిన ప్రమాద రహిత వారోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్టీసీ డ్రైవర్లకు ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించి, వారి మానసిక ఆందోళన నుండి బయటపడే మార్గాల ద్వారా మరింత మెరుగైన సేవలందించే వీలుందన్నారు. ప్రస్తుతం నెక్ రీజియన్‌లో అతి తక్కువ ప్రమాదాలు నమోదైనందున ప్రమాద నివారణలో బెస్ట్‌గానే ఉందన్నారు. సంస్థ నష్టాలకు కారణాలుగా పేర్కొంటున్న ప్రైవేట్ వాహనాలను నివారించడంలో ఆర్టీసీ సిబ్బందికి పోలీస్ సేవలు అందుబాటులో ఉంటాయని భరోసానిచ్చారు. రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ ఎస్.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు ఇస్తున్న ప్రోత్సాహక బహుమతి సరిపోదని, వారిని పదోన్నతి వంటివాటితో సత్కరించాల్సి ఉందన్నారు. కార్యక్రమానికి ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పన్న అధ్యక్షత వహించగా, డిప్యూటీ ట్రాఫిక్ మేనేజర్ జి.సత్యన్నారాయణ, స్టేషన్ మేనేజర్ బి.యల్.పి.రావు, యూనియన్ నాయకులు యంవి రాజు, కుమార్, కె.శంకరరావు, కె.నానాజీ పాల్గొన్నారు.
థర్మల్ స్థూపానికి పాలాభిషేకం
సోంపేట, జూలై 16: ప్లాంట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు చేస్తున్న ఉద్యమాలను పట్టించుకోకుండా రాజకీయ దురద్దేశ్యంతో సోంపేట పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు అమరస్థూపానికి నివాళులర్పించడాన్ని నిరసిస్తూ సోంపేట పర్యావరణ పరిరక్షణ సంఘం, తీరప్రాంత మత్స్యకార ఐక్యవేదికల ఆధ్వర్యంలో మంగళవారం థర్మల్ స్థూపానికి పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా సంఘాల నాయకులు డాక్టర్ కృష్ణమూర్తి, తమ్మినేని రామారావు, బీన ఢిల్లీ, ఎం.రాజారావు, మెట్ట గోపాల్ తదితరులు మాట్లాడుతూ సోంపేట పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు స్థానిక ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించుకోవాలనే దురద్దేశ్యంతో అమరుల స్థూపానికి నివాళులర్పించారని విమర్శించారు. ఇప్పటికైనా దిగజారుడురాజకీయాలు మాని ఉద్యమానికి మద్దతు పలకాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎం.్ధర్మారావు, కె.నారాయణ, వెంకన్న, చంద్రమోహన్ పాల్గొన్నారు.
ఎన్నికల ప్రచారంలో వివాదం
ఎచ్చెర్ల, జూలై 16: సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న కొత్తకోట పూర్ణచంద్రరావుతోపాటు మరికొంతమంది ఉపాధిహామీ పనుల వద్ద మంగళవారం ఎన్నికల ప్రచారం చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న మరో అభ్యర్థి పైడి లక్ష్మునాయుడు అనుచరులు అక్కడకు చేరుకుని ఉపాధి హామీ పనుల వద్ద ఎన్నికల ప్రచారం చేయడం ఏంటని ప్రశ్నించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరరం లక్ష్మునాయుడుతోపాటు మాజీ వైస్ ఎంపిపి కోటిపాత్రుని విశ్వనాధం, పైడి ధనుంజయ్, రామస్వామి, పిఎసిఎస్ ఉపాధ్యక్షులు పైడి వైకుంఠరావులు కోడ్‌ను ఉల్లంఘించారంటూ ఎంపిడిఒకు ఫిర్యాదు చేశారు.
బొడ్డేపల్లి శైలజ, ఎస్సై పి.వి.ఎస్.ఉదయ్‌కుమార్‌లకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై ఎంపిడిఒను వివరణ కోరగా ఉపాధి పనుల వద్ద ప్రచారం చేయడం కోడ్ ఉల్లంఘన కాదని స్పష్టంచేశారు.