Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఏజెన్సీలో భారీగా నామినేషన్ల ఉప‘సంహరణ’

$
0
0

విశాఖపట్నం, జూలై 16: పంచాయతీ ఎన్నికల్లోని నామినేషన్ల ఉప సంహరణ ఘట్టం బుధవారం జరగనుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ ఎన్నికల్లో భారీ ఎత్తున నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతం నుంచి నామినేషన్ల ఉపసంహరణ ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. జి మాడుగుల మండలంలో నాలుగు పంచాయితీలకు చెందిన నామినేషన్లను ఇప్పటికే మావోయిస్ట్‌లు అపహరించుకుపోయారు. కొన్ని పంచాయతీలకు కనీసం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. పంచాయతీ ఎన్నికలను బహిష్కరిస్తున్నందున నామినేషన్లను ఉపసంహరించుకోవాలని మావోయిస్ట్‌లు ఇప్పటికే హెచ్చరించారు. కాదని బరిలో కొనసాగితే, ప్రాణ హాని తప్పదని హెచ్చరించారు. దీంతో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన ముంచింగిపుట్, పెదబయలు, జికెవీధి, జి మాడుగుల మండలాల్లో అభ్యర్థులు తమతమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు సిద్ధ పడుతున్నారు. కాంగ్రెస్, టిడిపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. గతంలో బాక్సైట్‌కు వ్యతిరేకంగా ఉద్యమించినందున సిపిఐ, సిపిఎం పార్టీలకు ఈ హెచ్చరికల నుంచి మినహాయింపు ఉంటుందని కొంతమంది భావిస్తున్నా, వారు కూడా తప్పుకోవలసిందేనని అంటున్నారు మరికొంతమంది. దీంతో ఏజెన్సీ నుంచి భారీ సంఖ్యలో నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
చొరబడిన మావోయిస్ట్‌లు
చత్తీస్‌గడ్, ఒడిశా ప్రాంతాల్లో జరిగే విధ్వంసాల్లో ఈ ప్రాంతానికి చెందిన మావోయిస్ట్‌ల పాత్ర ఉంటుంది. విశాఖ ఏజెన్సీలో ఉనికి కోల్పోయారనుకుంటున్న మావోయిస్ట్‌లు ఇప్పుడు చత్తీస్‌గడ్, ఒడిశా ప్రాంత మావోయిస్ట్‌ల సహకారంతో తిరిగి పట్టు సాధించాలని భావిస్తున్నారు. పోలీసులు అప్రమత్తమయ్యేలోగా, చత్తీస్‌గడ్, ఒడిశా ప్రాంతానికి చెందిన మావోయిస్ట్‌లు విశాఖ ఏజెన్సీలో చొరబడ్డారన్న ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. నక్సల్స్ ఎప్పుడు ఏ విధ్వంసానికి పాల్పడతారో, ఎప్పుడు ఎవరిని హతమార్చుతారోనన్న భయంతో ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో నక్సల్స్ ప్రాబల్యం కలిగిన ప్రాంతాల్లో ఎన్నికలు నిర్వహించడం కన్నా, ఆ తరువాత మొత్తం పోలీసు బలగాలను దించి, ఎన్నికలను జరిపితే బాగుటుందని అధికారులు బావిస్తున్నారు.
ఇదిలా ఉండగా మైదాన ప్రాంతాల్లో పరిస్థితి మరొక విధంగా ఉంది. కొన్ని పంచాయతీల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య ఒడంబడిక కుదుర్చుకున్నారు. సర్పంచ్ పదవిని ఒక పార్టీకి ఇస్తే, వార్డు సభ్యుల పదవులను పొత్తుపెట్టుకున్న వారికి ఇవ్వాలన్నది ఒప్పందంలో భాగం. ఇలా ఒప్పందం కుదుర్చుకున్న పార్టీల్లో ఒకరు ఎన్నికల బరి నుంచి తప్పుకోనున్నారు. వందల సంఖ్యలోని పంచాయతీల్లో ఇలాంటి ఒప్పందాలు జరిగాయి. ఈ నేపథ్యంలో కూడా నామినేషన్ల ఉపసంహరణ భారీగానే ఉంటుందని తెలుస్తోంది.

ఏజెన్సీలో ఎక్సైజ్ దాడులు
విశాఖపట్నం, జూలై 16: తొలి విడత ఎన్నికలు జరిగే విశాఖ ఏజెన్సీలో మద్యాన్ని అరికట్టేందుకు ఎక్సైజ్ పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఎక్సైజ్ సిబ్బంది విస్తృతంగా దాడులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 38 మందిపై 89 సారాయి కేసులు నమోదు చేశామని ఎక్సైజ్ అధికారులు తెలియచేశారు. అలాగే 940 లీటర్ల సారాను సీజ్ చేశారు. 10,900 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఏజెన్సీలో బెల్ట్ షాపులను నిర్వహిస్తున్న 71 మందిపై 65 మందిపై కేసులు నమోదు చేశారు. 390 లీటర్ల లిక్కర్‌ను స్వాధీనం చేసుకున్నారు. అలాగే 322 కిలోల గంజాయిని, 130 బాటిల్స్ బీరును స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఐదుగురిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి మద్యం జిల్లాలోకి చొరబడకుండా ఉండేందుకు అరకు దగ్గర గోరాపూర్ వద్ద, ముంచింగిపుట్ వద్ద చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేశారు. అలాగే తగరపువలసద్ద, తాండవ బ్రిడ్జివద్ద, పెందుర్తి సమీపంలోని జంగాలపాలెం వద్ద చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేశామని అధికారులు వెల్లడించారు.

ఆదాయం పెరిగే మార్గమెక్కడ
ఖర్చుల నియంత్రణకు దారేది
* సర్వశక్తులు ఒడ్డుతున్న జివిఎంసి
విశాఖపట్నం, జూన్ 16: తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకున్న మహా విశాఖ నగరపాలక సంస్థ ముందున్నది ఒకేఒక లక్ష్యం. ప్రస్తుతం ఉన్న ఆదాయాన్ని రెండింతలు చేసుకోవాలి. ఇదే సందర్భంలో ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్న దుబారాను అరికట్టాలి. దుబారా ఖర్చుల విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలి. ఆస్తిపన్ను, మంచినీటి పన్నుల ద్వారా ఇప్పటికే లభిస్తున్న ఆదాయాన్ని రెట్టింపు చేయాలి. పన్నులు పెంచి ప్రజల ఆగ్రహాన్ని చవిచూసేకంటే ఉన్న వనరులనే మదింపు చేసుకోవడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడమే జివిఎంసి లక్ష్యం. జివిఎంసి పరిధిలోని 2.2 లక్షల అసెస్‌మెంట్ల ద్వారా సుమారు 100 కోట్ల రూపాయల ఆదాయం లభిస్తోంది. దీనిలో వాణిజ్య సముదాయాల నుంచి లభించే ఆదాయం అధికం. వాణిజ్యేతర భవనాలు కూడా ఇటీవల కాలంలో వాణిజ్య అవసరాల మేరకు రూపాంతమైపోయాయి. అలాగే వాణిజ్య సముదాయాలు సైతం పరిధిని విస్తృతం చేసుకున్నాయి. దీనిపై దృష్టి సారించిన జివిఎంసి తొలుత వాణిజ్య సముదాయాల పునర్ మదింపు ప్రక్రియను చేపట్టింది. దీంతో పెద్ద ఎత్తున అక్రమాలు వెలుగుచూశాయి. దాదాపు 10 కోట్ల రూపాయల మేర అదనపు ఆదాయం సమకూరింది. నగర పరిధిలో దాదాపు 40 వేల వాణిజ్య భవనాలను ఇదే తరహాలో మధింపు చేయాలని నిర్ణయించారు. దీనికోసం మినీ కంప్యూటర్లలో ఆసెస్‌మెంట్ల పూర్తి సమాచారాన్ని ఉంచి, వాస్తవ పరిస్థితులతో దీన్ని క్రోఢీకరిస్తున్నారు. దీంతో భవన యజనానుల బండారం బయటపడుతోంది.
ఇక మంచినీటి పన్ను పెంపు అంశంపై కూడా జివిఎంసి దృష్టి సారిస్తోంది. బల్క్, సెమీ బల్క్ నీటి వినియోగదార్లపై భారాన్ని మోపే విధంగా ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దమయ్యాయి. నీటి పన్ను రూపంలో జివిఎంసికి 50 కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తుండగా, 50 శాతం పెంపు లక్ష్యంగా కన్పిస్తోంది. ఇక నగర పరిధిలో ఖాళీ స్థలాల పన్ను వసూళ్లను జివిఎంసి కఠిన తరం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం ఖాళీ స్థలాల పన్ను రూపంలో కేవలం 5 కోట్ల రూపాయలు మాత్రమే వసూలవుతుండగా, దీన్ని 50 కోట్ల రూపాయలకు పెంచడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జూలై 31లోగా ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇచ్చి విఎల్‌టి చెల్లించాల్సిందిగా భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నోటీసులకు యజమానులు స్పందిచకపోతే స్థలాలను స్వాధీనం చేసుకోవాలని ఆదేశిస్తున్నారు. ఇదే తరహాలో ప్రకటనల ద్వారా వచ్చే పన్ను, ఇతర ఆదాయ మార్గాలను వదలకుండా అదనపు రాబడే పరమావధిగా ముందుకెళ్తున్నారు.
ఇదిలా ఉండగా, కేవలం ఆదాయాన్ని పెంచుకుంటేనే సరిపోదన్న వాస్తవాన్ని ఇప్పటికి గానీ యంత్రాంగం గుర్తించలేదు. ముఖ్యంగా దురాబాఖర్చులను నియంత్రించుకుంటే ఆదాయాన్ని పెంచినంతగా భావించారు. ఔట్‌సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న సిబ్బంది విషయంలో ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారు. పారిశుద్ధ్య విభాగంలో దాదాపు 4800కు పైగా ఉన్న కార్మికులతో పాటు ఇతర విభాగాల్లో పనిచేస్తున్న, మిగిలిన వారి విధుల విషయంలో నివేదికను రూపొందిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకోవడమే కాదు ఖర్చులు నియంత్రించుకుంటేనే జివిఎంసికి ఆర్ధిక పరిపుష్టి చేకూరేది.

నేటి నుంచి ఇళ్ల నుంచి చెత్త సేకరణ ప్రారంభం
విశాఖపట్నం, జూలై 16: జివిఎంసి పరిధి జోన్ 4లో ఇళ్ల నుంచి చెత్త సేకరణ కార్యక్రమానికి నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. జోన్ పరిధిలోని 31 నుంచి 49 వార్డుల పరిధిలో ఈకార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ వి శేషాద్రి బుధవారం ప్రారంభించనున్నారు. ఘన వ్యర్థాల నిర్వాహణకు అనువుగా ఇళ్ల నుంచి తడి,పొడి చెత్తలను వేర్వేరుగా సేకరిస్తారు. సేకరించిన చెత్తను డంపింగ్ యార్డులకు తరలిస్తారు. తొలి దశలో వారం రోజుల పాటు చెత్త సేకరణపై స్థానికులకు అవగాహన కల్పించి ఈనెల 24 నుంచి పూర్తి స్థాయిలో చెత్త సేకరణ ప్రారంభించనున్నట్టు కమిషనర్ ఎంవి సత్యనారాయణ తెలిపారు. జోన్ పరిధిలోని 19 వార్డుల్లో 285 పుష్‌కార్డు రూట్‌లను గుర్తించామని, మొత్తం 855 మంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తారని తెలిపారు. జోన్ పరిధిలో ఇప్పటికే 2,192 డస్ట్‌బిన్‌లను, 548 టబ్బులను పంపిణీకి సిద్ధంగా ఉంచామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు టోపీలు, విజిల్స్ పంపిణీకి సిద్దంగా ఉంచినట్టు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు జోన్ పరిధిలో 49 మంది నోడల్ అధికారులను నియమించామన్నారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి తడిపొడి చెత్తను సేకరించి వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలిస్తారని తెలిపారు.

కులం, బంధుత్వాలు సమస్యలు పరిష్కరించలేవు
* గిరిజన మంత్రి బాలరాజు
పాడేరు, జూలై 16: స్ధానిక సంస్ధల ఎన్నికలలో కులం, బంధుత్వాల పేరు చెప్పి ఓట్లను దండుకునే నాయకుల వల్ల గ్రామాల్లో సమస్యలు తీరవని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పసుపులేటి బాలరాజు అన్నారు. మండలంలోని వంట్లమామిడి పంచాయతీ కొత్తపొలం, మోదాపల్లి పంచాయతీ కేంద్రాలలో మంగళవారం ఆయన పర్యటించి పంచాయతీ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులతో మాట్లాడుతూ అధికారం కోసం గ్రామాలలో పర్యటనలు సాగిస్తున్న పలు పార్టీల నాయకులు తమ బంధుత్వాలు, కులాలను ఆయుధాలుగా మలుచుకుని ఓట్లను దండుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇటువంటి కుటిల రాజకీయ ఎత్తుగడలకు గిరిజనులు దూరంగా ఉండాలని ఆయన సూచించారు. మన్యంలో ప్రగతికి దోహదపడే అభ్యర్ధులకే ప్రాధాన్యత ఇవ్వాలని, కులాలకు, బంధుత్వాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రగతిని సాధించే అవకాశం లేదని ఆయన సూచించారు. కొంత మంది స్వార్ధపర రాజకీయ నాయకులు ఆదిపత్యం చెలాయించేందుకు గిరిజనుల మధ్య కులాల చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. దశాబ్ధాల కాలంగా అభివృద్ధికి దూరంగా జీవనం సాగిస్తున్న గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందచేస్తూ ప్రజలలో సుస్ధిర స్ధానాన్ని సంపాదించుకుంటున్న కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు కొందరు జిత్తులమారి వేషాలతో ఇటువంటి ప్రచారాలను సాగించడం అత్యంత హేయమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవనం సాగిస్తున్న గిరిజనుల మధ్య ఇటువంటి కులాల కుమ్ములాటలను ప్రోత్సహిస్తున్న కపట నాయకులకు సరైన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారం కోసం వివిధ పార్టీల నాయకులు సాగిస్తున్న కులాల వైషమ్యాలు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న గిరిజనులలో రాగద్వేషాలు రగిలి ప్రశాంత మన్యంలో అశాంతికి బీజం పడే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తపొలం గ్రామ గిరిజనులు జీవితకాల వాంఛ అయిన బి.టి.రోడ్డు నిర్మాణంలో తలెత్తిన అటవీ సమస్యలను పరిష్కరించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజనులు మాట్లాడుతూ గత 70 సంవత్సరాలుగా తమ తాత ముత్తాతల నుండి తమ ప్రాంత వాసులకు కాలిబాట తప్ప వేరే గత్యంతరం లేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత తమ ప్రాంతానికి రహదారి సౌకర్యంతో పలు సౌకర్యాల కల్పనకు కృషి చేయడం తమ అదృష్టంగా పేర్కొన్నారు. గ్రామంలోని మంచినీరు, కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అదనపు ఉపాధ్యాయుని నియామకంతో పాటు వంట్ల మామిడి గ్రామానికి రహదారి నిర్మాణం వంటి పలు సమస్యలను గిరిజనులు మంత్రి దృష్టికి తీసుకు రావడంతో వాటిని తప్పక పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మోదాపల్లి పంచాయతీ కేంద్రంలో గిరిజనులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాడేరు పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ గ్రామం దశాబ్ధాల కాలంగా సౌకర్యాల లేమితో కొట్టుమిట్టాడడానికి ఇంతవరకు ఎన్నుకున్న నాయకుల అసమర్థతే కారణమని ఆయన అన్నారు. ఇంతవరకు అధికారం చలాయించిన నాయకులు మీ ప్రాంతానికి చేసిన అభివృద్ధి ఏమిటని ఆయన ప్రశ్నించారు. గిరిజనుల అభివృద్ధికి పీట వేసి ప్రగతికి నిధులు కేటాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న అభ్యర్ధులను పంచాయతీ ఎన్నికలలో గెలిపించాలని ఆయన కోరారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించిన కొందరు నాయకులు అధికార దాహంతో పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేయడం శోచనీయమని అన్నారు. గిరిజనులకు సేవచేయడంతో పాటు వారి యోగక్షేమాలను నిరంతరం తెలుసుకుంటూ వారి అవసరాలను తీర్చే నాయకుడే నిజమైన నాయకుడని అన్నారు. కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపడుతున్నప్పటికీ గిరిజన ప్రాంతంలో ఇప్పటికీ పలు గ్రామాలు సమస్యలతో సతమతవౌతుండడం తనను ఎంతగానో బాధిస్తుందని ఆయన అవేదన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతంలో సమస్యల పరిష్కారానికి తాను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, తద్వారా గిరిజన గ్రామాలు అభివృద్ధితో పాటు వారి జీవితాల్లో ఆనందం వెల్లివిరిసేందుకు అలుపెరగని పోరాటం చేస్తానని మంత్రి బాలరాజు హామీ ఇచ్చారు.

బిచాణా ఎత్తేసిన మరో సంస్థ
* రూ.ఐదు కోట్లతో పరారైన సంస్థ నిర్వాహకుడు
* చీటీలు, ఫైనాన్స్, అధిక వడ్డీ పేరుతో టోకరా
విశాఖపట్నం, జూలై 16: మ్యాజిక్, రాగ, సిమ్స్, శ్రీచక్రగోల్డ్, తదితర సంస్థల జాబితాలో మరో ఫైనాన్స్ సంస్థ చేరించి. సుమారు రూ.ఐదు కోట్లకు పైగా ఖాతాదారులకు కుచ్చుటోపి పెట్టి ఈ సంస్థ నిర్వాహకుడు కుటుంబంతో కలిసి పరారయ్యాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ స్థానిక పోలీసులను ఆశ్రయించారు. నగరంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఈ సంఘటన వివరాలివి.
స్థానిక వన్‌టౌన్ ఏరియాలోని కంచరవీధిలో దార్ల బ్రహ్మాజి, కుటుంబంతో గత ముప్పై ఏళ్లుగా నివాసముంటున్నాడు. సమీపంలోని చిన్న చిన్న దుకాణాలకు రోజు వారి ఫైనాన్స్ ఇవ్వడంతో పాటు ఇంటి దగ్గర చీటీలు వేయడం ప్రారంభించాడు. ఫైనాన్స్ వ్యాపారం బాగ సాగుతుండడంతో శ్రీవెంకటేశ్వర కనక గ్రూప్ చిట్స్ అండ్ ఫైనాన్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశాడు. చీటీల సొమ్మును సక్రమంగా ఇవ్వడం ప్రారంభించడంతో ఖాతాదారులు బ్రహ్మాజిని నమ్మారు. ఈ తరుణంలో తమ సంస్థలో నగదు డిపాజిట్ చేస్తే పది శాతం వడ్డీ ఇస్తామని ప్రచారం చేయడంతో అనేకమంది ఇందులో ఖాతాదారులుగా చేరారు. దీంతో సుమారు రూ.5కోట్లకు పైగ డిపాజిట్లను బ్రహ్మాజి సేకరించినట్టు పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న బంగారం వ్యాపారస్తులు ఇతని వద్ద పెద్ద మొత్తంలో నగదును డిపాజిట్ చేశారు. కొద్ది రోజులుగా ఖాతాదారులకు వడ్డీని సరిగా బ్రహ్మాజి చెల్లించకపోవడంతో రెండు రోజుల క్రితం కొంతమంది ఖాతాదారులు అతని ఇంటికి వెళ్లి నిలదీశారు. కొద్ది రోజుల్లో అందరీ ఖాతాలను క్లీయర్ చేస్తానని చెప్పిన బ్రహ్మాజీ సోమవారం రాత్రి కుటుంబంతో సహా పలాయనం చిత్తగించడంతో లబోదిబోమంటూ బాధితులు మంగళవారం ఉదయం స్థానిక పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. బ్రహ్మాజి వద్ద డిపాజిట్ చేసిన వారిలో బంగారం వ్యాపారులతో పాటు, పేద, మధ్య తరగతి వారున్నారు. పది శాతం వడ్డీ వస్తుందని, రెండు, మూడు రూపాయలకు ఇతరుల వద్ద ఐదు లక్షలు, పది లక్షల రూపాయల మేరకు అప్పు చేసి బ్రహ్మాజి వద్ద డిపాజిట్ చేసిన వారు ఇప్పుడు బోరు మంటున్నారు. బాధితులంతా టౌన్‌హాలు వద్ద సమావేశమై అనంతరం ర్యాలీగా పోలీసు స్టేషన్‌కు తరలి వెళ్లారు. నిందితుడు బ్రహ్మాజిని పట్టుకోవడం కోసం ఓ ప్రత్యేక పోలీసు బృందాన్ని పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దించారు. సిఐ ఇలియాస్ ఆహ్మద్ నేతృత్వంలో ఒకటో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించడి
* జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి

విశాఖపట్నం , జూలై 16: పంచాయతీ ఎన్నికలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంతంగా నిర్వహించే విధంగా సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వి.శేషాద్రి మండల అధికారులకు ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మలివిడత గ్రామ పంచాయతీ ఎనిన్కలు పాడేరు డివిజన్‌నందు ఈ నెల 23వ తేదీన జరుగనున్న సందర్భంగా పోలింగ్ కేంద్రాల పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మండలాధికార్ల బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఏమైనా అసంఘటిత చర్యలు జరిగితే వెంటనే తెలియజేయాలని అన్నారు. ఏ రోజు కారోజు నివేదికలను పంపించాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా పాటిస్తూ తహశ్లీదర్, ఎంపిడిఓ, పోలీసుల బృందం ప్రతిరోజూ పర్యవేక్షించాలన్నారు. నియమావళిని అతిక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలన్నారు. బహిరంగ సభలు, ర్యాలీలు జరిగినప్పుడు వీడియో తీసి రోజువారీ రిపోర్టును పంపాలన్నారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక, పోలింగ్ కేంద్రాలలో వీడియోఅగపీ ఏర్పాట్లు గురించి తెలుసుకున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన రూట్‌మ్యాప్‌లను సిద్ధంగా ఉంచుకోవాలని అన్నారు. ప్రతి ఒక్క ఓటరు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు సరిపడా ఉన్నవీ లేనిది చూసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో వెంటనే తీసుకుని వెళ్ళాలని అన్నారు. పోలింగ్ సిబ్బందికి పూర్తిస్థాయిలో శిక్షణ ఇప్పించాలని అన్నారు. మారుమూల గ్రామాలలో వాహనాలు వెళ్లేందుకు రహదారి సౌకర్యం ఉన్నదీ లేనిది ముందుగానే గుర్తించి తగిన ఏర్పాట్లను చేసుకోవాలని అన్నారు. 17వ తేదీ సాయంత్రానికల్లా అన్యర్థుల ఉపసంహరణ వివరాలను తెలియజేస్తూ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాల లిస్టును పంపించాలని అన్నారు. 18వ తేదీ ఉదయానికల్లా బ్యాలెట్ పేపర్లు ఎంత కావాలన్నది తెలియజేయాలని అన్నారు. 23వ తేదీ లోపల బిఎల్‌ఓలు ఇంటింటికి తిరిగి ఓటర్లందరికీ స్వయంగా స్లిప్‌లను పంపిణీ చేయాలని అన్నారు. 21 రకాల గుర్తింపు కార్డుల ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చని వారికి తెలియజేయాలని అన్నారు. ఓటరు జాబితాలో ఎవరైనా మరణించినా, వలసవెళ్ళినా, వివాహం చేసుకుని వేరే ప్రాంతానికి వెళ్ళినా వారి జాబితాను తయారు చేసి పంపాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, డిఆర్‌ఓ వెంకటేశ్వరరావు, జడ్పీసిఇఓ డివి.రెడ్డి, డిపిఓ కె.సుధాకర్, ఆర్డీఓలు రంగయ్య, గణపతిరావు, సుబ్బరాజు, వసంతరాముడు అన్ని మండలాల తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ఐదుగురు నకిలీ మావోల అరెస్ట్
చింతపల్లి, జూలై 16: మావోయిస్టులమని చెప్పుకుంటూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న ఒక మహిళతోసహా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు చింతపల్లి డిఎస్పీ ఇ.జి. అశోక్‌కుమార్ తెలిపారు. మంగళవారం ఆ యన స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ మువ్వల సీత, పాంగి అప్పారా వు, వడ్డాది శ్రీను, పాంగి నరేష్, వం తల పాండు అనే ఐదుగురు మావోయిస్టులమంటూ మండలంలో అలజడి సృష్టిస్తున్నారన్నారు. మండలంలో లంబసింగి, లోతుగెడ్డ జంక్షన్ గ్రామాల్లో మావోయిస్టులమంటూ సుమారు 25 వేల నగదు, ఒక సెల్‌ఫోన్ బెదిరించి తీసుకున్నట్లు తెలిపారు. తమకు అంది న ఫిర్యాదు మేరకు నిఘా పెట్టి నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిలో పాం గి నరేష్ పరారయ్యాడని తెలిపారు. నిందితుల నుండి 303 రైఫిల్, నాలుగు తూటాలు, వాడిన తూటా, హీరోహోండా మోటార్ బైక్ స్వాధీనం పర్చుకున్నట్లు డిఎస్పీ తెలిపారు.

మావోల యాక్షన్ టీమ్ సమాచారంతో పోలీసులు అప్రమత్తం
సీలేరు, జూలై 16: మావోయిస్టుల యాక్షన్ టీమ్ సీలేరులో సంచరిస్తున్నట్లు సమాచారం పోలీసులకు అందడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఈనేపధ్యంలోనే పోలీసులు సి.ఆర్.పి. ఎఫ్.బలగాలతో మంగళవారం ఉదయం నుంచి సాయం త్రం వరకు సీలేరు పరిసర ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకుని తనిఖీలు ముమ్మరం చేపట్టారు. సీలేరులో ఫ్రధాన కూడళ్ళ వద్ద సి.ఆర్.పి.ఎఫ్. బలగాలను మోహరించి విస్తృతంగా వాహన తనిఖీలు , రికార్డులు పరిశీలించారు. అనుమానితులను ప్రశ్నించి వదిలిపెడుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తుండడంతో రాజకీయ నాయకుల భద్రత పట్ల పోలీసులు అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల నుండి ఎటువంటి ముప్పువాటిల్లకుండా ముందుస్తుగా తనిఖీలు చేపడుతున్నారు. ఇటీవల కొయ్యూరు మండలంలో మావోయిస్టులు ఫ్లీనరీ నిర్వహిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో మావోయిస్టులను చుట్టముట్టి ఎదురుకాల్పులు జరపడంతో మహిళా మావోయిస్టు మృతి చెందిన విషయం తెలిసింది. సీలేరు మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడం, సీలేరు పోలీస్ స్టేషన్ మావోయిస్టుల హిట్‌లిస్టులో ఉండడంతో పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు మరింత అప్రమత్తం చేశారు. ఈనేపధ్యంలో ఎస్సై శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహిస్తూనే మావోయిస్టుల కదలికలపై నిఘా ఉంచారు.
అడవుల్లో పోలీసులు..
గ్రామాల్లో మావోయిస్టులు
సమావేశాలు పెట్టి హెచ్చరికలు
గూడెంకొత్తవీధి, జూలై 16: ప్రస్తుతం విశాఖ మన్యంలో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. ఒక ఎన్నికలు బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునిస్తుంటే, మరోపక్క మావోలను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అడవుల్లో సంచరించే మావోయిస్టులు గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేసి ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తుంటే, పోలీసులు వారికోసం అడవుల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నారు. గత పదిరోజులుగా మన్యం అడవుల్లో నెలకొంటున్న సంఘటనలు. గత సోమవారం జంపర్లోవ గ్రామంలో ప్రజలతో సమావేశమైన మావోయిస్టులు గాలికొండ పంచాయతీకి నామినేషన్ దాఖలు చేసిన గెమ్మిలి సింహాద్రిని హెచ్చరించారు. నామినేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని లేనిచో తీవ్ర పరిణామాలు ఉంటాయని స్వయంగా మావోయిస్టు నేతలు రవి, ఆజాద్,శరత్ హెచ్చరించారు. గత నాలుగు రోజులుగా నేలజర్త, జెర్రెల, కన్నవరం, అన్నవరం గ్రామాల్లో మావోయిస్టులు సమావేశాలు ఏర్పాటుచేసి ఎన్నికలు బహిష్కరించాలని, నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఉపసంహరించుకోవాలని హుకుం జారీ చేస్తున్నారు. వంచుల, జెర్రెల, మొండిగెడ్డ పంచాయతీల్లో ఎవరూ నామినేషన్లు వేయకుండా మావోయిస్టులు అడ్డుకున్నారు.
వందలాది మంది మిలీషియా సానుభూతిపరులతో కలిసి చీకటి పడకముందే దాడులకు పాల్పడి సంచలనం సృష్టిస్తున్నారు. ఇదిలాగుంటే పైచర్యలను అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు ప్రయత్నించడం సహజం. పోలీసులు మావోయిస్టుల కోసం అడవుల్లో వేట సాగిస్తున్నారు. పథకం ప్రకారం గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేస్తున్న మావోయిస్టుల ఎత్తుగడలను పూర్తిగా పసిగట్టలేని గ్రేహౌండ్స్ బలగాలు అడవుల్లో వాతావరణం అనుకూలించక పోయినా విస్తృత గాలింపు చర్యలు చేపడుతున్నారు. దీనిని అదునుగా చూసుకున్న మావోయిస్టులు స్వేచ్చగా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారు. కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో గాయపడి తప్పించుకున్న మావోయిస్టుల కోసం పదుల సంఖ్యలో గ్రేహౌండ్స్, స్పెషల్ పార్టీ పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఒకే ప్రాంతంలో ఈ బలగాలు సంచరిస్తుండడంతో ఒకరికొకరు సమాచారం లోపం వలన ఏ సంఘటన జరగకుండా అడవుల్లో వైర్‌లెస్ సెట్లను పోలీసులు ఏర్పాటు చేసుకుంటున్నారు. గాలింపు చర్యలకు ఆటంకం కలుగకుండా పోలీసులు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. అయితే మావోయిస్టులు స్వేచ్ఛగా గ్రామాల్లో సమావేశాలు ఏర్పాటుచేసుకుని సాధ్యమైనంత వరకు ప్రజలు ఎన్నికల్లో పాల్గొనకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కాగా, మావోల యాక్షన్ టీమ్‌లు సంచరిస్తుండడంతో పోలీసులు అప్రమత్తమై తనిఖీలు ముమ్మరం చేశారు. మావోయిస్టుల కోసం అడవుల బాట పడుతుంటే, ఎన్నికలు బహిష్కరించాలని గ్రామాల్లో మావోయిస్టులు సమావేశాలు పెట్టి హెచ్చరికలు జారీ చేస్తుండడం విశేషం.

గడువులోగా పనులు పూర్తి చేయాల్సిందే
కాంట్రాక్టర్లకు వుడా విసి ఆదేశం
విశాఖపట్నం, జూలై 16: విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా) చేపడుతున్న పలు ప్రాజెక్టుల పనులు నిర్ధేశిత సకాలంలో పూర్తి చేయాలని వైస్ చైర్మన్ ఎన్ యువరాజ్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. పనులు పూర్తి చేయడంలో అధికారులకు, కాంట్రాక్టర్లకు సమస్యలుంటే తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం అప్పగించిన పనులను పూర్తి చేయని వారిపై చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. వుడా ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతున్న పలు ప్రాజెక్టులను మంగళవారం ఆయన స్వయంగా పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల విషయంలో చోటుచేసుకుంటున్న జాప్యం కారణంగా అంచనావ్యయం విపరీతంగా పెరిగిపోతోందని, దీనివల్ల అదనపు భారం తప్పట్లేదని అభిప్రాయపడ్డారు. పనుల విషయంలో సాచివేత ధోరణి పనికిరాదన్నారు. బిల్లుల చెల్లింపులు, ఇతర విషయాల్లో అధికారుల నుంచి ఎదురయ్యే ఇబ్బందులు తన దృష్టికి తీసుకురావాలని కాంట్రాక్టర్లకు సూచించారు. దీనిపై స్పందించిన కాంట్రాక్టర్లు డిజైన్లు తమకు సకాలంలో అందని కారణంగానే జాప్యం చోటుచేసుకుంటోందిన కాంట్రాక్టర్లు విసి దృష్టికి తీసుకువచ్చారు. అలాగే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఎస్‌ఎస్‌ఆర్ రేట్లను మార్చట్లేదని చెప్పగా బోర్డు సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. అలాగే పైపులైను, విద్యుత్ లైన్లుమార్పిడి వంటి అంశాల్లో స్థానికులకు నష్టపరిహారం అందకపోవడంతో ఇబ్బందులు తప్పట్లేదన్నారు. అనంతరం ఆయన హరిత ప్రాజెక్టును సందర్శించారు. హరిత ప్రాజెక్టు పనులను చేపట్టేందుకు ఎన్నికల కమిషన్ అనుమతిచ్చిందని ఇంజనీరింగ్ ప్రొక్యూర్‌మెంట్ కాంట్రాక్టు కింద పనులు విభజించి ఒకే సారి ప్రారంభించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే మూడు పనులకు టెండర్లు ఖరారుకాగా, మరో ఏడు పనులకు రెండో విడత టెండర్లను ఖరారు చేసినట్టు తెలిపారు. ఈప్రాజెక్టు విషయంలో వుడా కొంతమేర చెడ్డపేరును మూటగట్టుకుందని, దీన్ని తొలగించాలని అధికారులను, కాంట్రాక్టర్లను ఆదేశించారు.

ఇయు చీకటి ఒప్పందంతో కార్మికులకు అన్యాయం
* ఎన్‌ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు
విశాఖపట్నం, జూలై 16: ఆర్టీసీ యాజమాన్యంతో చేసుకున్న చీకటి ఒప్పందంతో కార్మికులను ఎంప్లారుూస్ యూనియన్ (ఇయు), తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయు)లు మోసం చేసాయని నేషనల్ మజ్దూర్ యూనియన్ (ఎన్‌ఎంయు) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు ఆరోపించారు. మద్దిలపాలెం కాంప్లెక్స్ ఆవరణలో మంగళవారం నిర్వహించిన కార్మికుల బహిరంగసభలో ఆయన ముఖ్యప్రసంగం చేశారు. యాజమాన్యంతో ఒప్పందం రాయించుకుని అర్ధరాత్రి వరకు చర్చలు జరిపినా ఎటువంటి ఫలితం లేకపోయిందన్నారు. రాష్ట్ర రవాణాశాఖామంత్రి బొత్స సత్యనారాయణ సమ్మె జరగదనే ధీమాను వ్యక్తంచేస్తూనే ఉన్నారంటే ఎంప్లారుూస్ యూనియన్ పరిస్థితి అర్ధమవుతూనే ఉందన్నారు. రాష్టవ్య్రాప్తంగా 1.3లక్షల మంది ఆర్టీసీ కార్మికులు అజేయమైన శక్తని అందించినా ఎంప్లారుూస్ యూనియన్ దీనిని సద్వినియోగం చేసుకోలేకపోయిందన్నారు. కార్మికుల ఇంక్రిమెంట్‌లు పెరగలేదని, భత్యంతర భృతి రాలేదని, బేసిక్ పెరగలేదన్నారు. ఒక్క రూపాయి ప్రయోజకరం లేకుండా ఎంప్లారుూస్ యూనియన్ ఒప్పందం చేసిందన్నారు. గత ఏడాది జూన్‌లో ఆర్టీసీ యాజమాన్యానికి ఇచ్చిన సమ్మె నోటీసులో ఎన్‌ఎంయు 36 డిమాండ్లను పెట్టగా, ఇందులో 32 డిమాండ్లు పరిష్కారమయ్యాయన్నారు. ఆర్టీసీలో ఇటీవల జరగాల్సిన సమ్మెను విచ్ఛిన్నం చేసి మోసపూరిత ఎగ్రిమెంటులో కార్మికులకు తీవ్ర ద్రోహం ఇయు, టిఎంయులు చీకటి ఒప్పందం చేసి కార్మికులకు అన్యాయం చేశాయన్నారు. గతంలో చేసిన ఎగ్రిమెంట్లనే అంకెల గారిడీతో కార్మికులను మభ్యపెట్టెరీతిలో యాజమాన్యంతో కుమ్మక్కై కార్మికులు జీవితాలను నట్టేట ముంచాయన్నారు. ఎంఎన్‌యు గతంలో చేసిన ఎగ్రిమెంట్లను అమలు చేయడం చేతకాక, యాజమాన్యంతో కార్మికులు రెగ్యులైజేషన్‌కు అగ్రిమెంట్ చేసామని చెప్పుకుంటే మరోపక్క రాష్టవ్య్రాప్తంగా సమ్మె విరమించిన తరువాత దాదాపు రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను స్లాకు సీజను పేరి డిసెంగేజ్ చేసారన్నారు. భారతదేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా ఆర్టీసీలో 25 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులను పర్మినెంట్ చేయించిన ఘనత ఎన్‌ఎంయుదేనన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి గత ఏడాది జూలైన ఎన్‌ఎంయు ఇచ్చిన సమ్మె నోటీసుపై అపుడు ఇయు, టిఎంయు తీవ్రంగా వ్యతిరేకించడమే కాకుండా సమ్మెను విచ్చిన్నం చేసాతమని పత్రికల ద్వారా బహిరంగ ప్రకటనలు చేసినప్పటికీ ఎన్‌ఎంయు 32 డిమాండ్లతో ఆర్టీసీలో మిగిలిపోయిన కాంట్రాక్ట్ డ్రైవర్లు, కండక్టర్లను అందర్ని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేసి యాజమాన్యంతో గత ఏడాది జూలైన రాతపూర్వకంగా మిగలి ఉన్న వారందర్ని రెగ్యులర్ చేయడానికి తమ యూనియన్ అంగీకరింపజేసిందన్నారు. దానికనుగుణంగా గత ఏడాది జూలై 31న ప్రభుత్వ అనుమతికి ఎండి లేఖ రాయడం జరిగిందని అంగీకారానికి జరిగిన జాప్యానికి నిరసిస్తూ గత ఏడాది నవంబర్ 15న వేలాదిమంది ఎన్‌ఎంయు కార్మికులతో ఛలో సెక్రటేరియట్ నిర్వహించి ఒక్క చెమట బిందువు కూడా చిందకుం ముఖ్యమంత్రిలో సమావేశమై కాంట్రాక్ట్ కార్మికులందర్ని గత నెలలోపు దశలవారీగా రెగ్యులర్ చేయడమే కాకుండా అప్పటి వరకు ఉన్న కారుణ్య నియామకాలను జరిపి అందరికీ ఉద్యోగకాలు ఇస్తామని హామీ తీసుకోవడం జరిగిందన్నారు. వాటిని అమలు చేయడంలో ఇయు, టిఎంయు తీవ్ర వైఫల్యం చెందామన్నారు. అనంతరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వై.శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ ఏడాది జనవరిన 188 డిమాండ్లతో యాజమాన్యానికి ఇయు, టిఎంయు వినతులను ఇచ్చి వాటి గురించి నేటికి కూడా కనీసం చర్చించకపోగా, జనవరిలో సంక్రాంతి కానుకగా అందర్ని రెగ్యులర్ చేస్తామని మేనిపెస్టోలో పొందుపరిచి చేతకాక తదుపరి ఎసిఎల్‌కు వేస్తామని సంతకాల సేకరణ చేసి కార్మికులను మభ్యపెట్టాయన్నారు. ఫ్రభుత్వ ఉద్యోగులతో సమాన జీతాలని కార్మికులను మార్పు పేరుతో వంచించి మొన్న సమ్మెను విరమింపజేటపుడు కనీసం పెరిగిన ధరలకనుగుణంగా జీతాలు పెంచమని అడగకుండా పే కమిటీని వేగవంతం చేయాలని కోరడం ఆ విధంగా ఎగ్రిమెంటు చేసి కార్మికులకు అన్యాయం ఇయు, టిఎంయు చేసాయన్నారు. ఈ నెల 5న సమ్మె చేస్తామని ఆ రెండు యూనియన్లు రెండు డిమాండ్లతోనే యాజమాన్యానికి నోటీసు ఇస్తే దానికి మద్ధతుగా మెజారిటీ యూనియన్‌గా ఎన్‌ఎంయు సమ్మె చేయడానికి పూర్తి మద్ధతు పలికితే పెట్టిన రెండింటిపై స్పష్టమైన హామీ ఇవ్వకపోతే సమ్మె తప్పదని చేసిన వాటి హెచ్చరికలు గాలిలో కలిసిపోయాయన్నారు. ఈ సభలో రాష్ట్ర కార్యదర్శులు కె.నందగోపాల్, విజి విలియమ్స్, రీజనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ సిహెచ్‌వి రావు, అర్బన్ కార్యదర్శి ఏకె శివాజీ, రూరల్ డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు పిఎన్ రావు, ఎంవిఆర్ మూర్తి, జోనల్ కార్యదర్శి పివివి మోహన్, అన్ని డిపోల అధ్యక్ష, కార్యదర్శులు, గ్యారేజి సిబ్బంది, మహిళా కండక్టర్లు, భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ప్రయాణికుల భద్రతలో డ్రైవర్ పాత్ర కీలకం
* విశాఖ జిల్లా రూరల్ ఎస్పీ దుగ్గల్
విశాఖపట్నం, జూలై 16: ప్రయాణికుల భద్రతలో డ్రైవర్ పాత్ర అత్యంత కీలకమైందని విక్రమిజిత్ దుగ్గల్ అన్నారు. ఏపీఆర్టీసీ విశాఖ రీజియన్ ఆధ్వర్యంలో ప్రమాద రహిత వారోత్సవాలు-2013లు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన సభనుద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో మిగలిన జిల్లాల కంటే ప్రమాదాల స్థాయిలో విశాఖ రీజియన్ చాలా తక్కువుగా ఉందన్నారు. విశాఖ ఏజేన్సీలో గిరిజనులకు అందుబాటులో ఉండేందుకు ఆర్టీసీ మరింత కృషి చేయాలన్నారు. మిగిలిన అన్నిచోట్ల ప్రమాదాల శాతం పెరుగుతుండటం, విశాఖలో మాత్రం తగ్గుతున్న పరిణామాలపట్ల ఆయన సంస్థ సిబ్బందిని అభినందించారు. విజయనగరం జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్, సికింద్రాబాద్‌ల్లో మాదిరి విశాఖ జిల్లాలో కూడా త్వరలో అత్యంత సాంకేతిక పరిజ్ఞానం కలిగే సదుపాయాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు.

పంచాయతీ ఎన్నికల్లోని నామినేషన్ల ఉప సంహరణ
english title: 
w

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>