విజయనగరం, జూలై 16: విడువమంటే పాముకు కోపం... కరవమంటే కప్పకు కోపం చందంగా రాజకీయ నేతల పరిస్థితి మారింది. పంచాయతీ ఎన్నికల్లో ఒకే పంచాయతీకి ఒకే పార్టీ నుంచి ఆశావహుల సంఖ్య పెరగడంతో ఎవరిని బుజ్జగించాలో అర్థంగాక అయోమయంలో పడ్డారు. ఒకవేళ ఒకరికి మద్దతునిచ్చి వేరొకరిని కాదంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వారు ఎడమొహం.. పెడమొహం పెడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. ఈ దఫా పంచాయతీ ఎన్నికలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. ఒకే పంచాయతీకి కొన్ని చోట్ల ఒకే పార్టీకి చెందిన వారే నలుగురు, ఐదుగురు చొప్పున బరిలో దిగారు. ఇదే విధంగా కాంగ్రెస్, టిడిపి, వైకాపాలో పరిస్థితి నెలకొంది. దీంతో ఎవరిని ఓదార్చాలో తెలియని అయోమయం నెలకొందని వివిధ రాజకీయ పార్టీల నేతలు వాపోతున్నారు. జిల్లాలో మొత్తం 921 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, వాటిలో దాదాపు 150 పంచాయతీల వరకు ప్రధాన పార్టీల అనుచరులు ఉన్నారు. మేజర్ పంచాయతీలతోపాటు కొన్ని కీలకమైన పంచాయతీలకు పోటీపడుతున్నారు. ఇదిలా ఉండగా ఇప్పటి వరకు 61 పంచాయతీలకు ఒకొక్క నామినేషన్ దాఖలు కావడంతో అవి ఏకగ్రీవం కింద ప్రకటించాల్సి ఉంది. ఇదిలా ఉండగా ఈ దఫా కొన్ని పంచాయతీల్లో సర్పంచ్ పదవికి మద్దతునిస్తే, రానున్న ఎంపీటీసీ ఎన్నికల్లో తాము మద్దతునిస్తామని తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన అనుచరులు ఒప్పందాలను కుదుర్చుకుంటున్నారు. దత్తిరాజేరుతోపాటు కొన్ని మండలాల్లో ఈ రకమైన అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు. గంట్యాడ మండలంలో కొత్తవెలగాడలో వైకాపా, కాంగ్రెస్ పొత్తులు కుదుర్చుకున్నట్టు సమాచారం. అలాగే ఎస్.కోట, కొత్తవలస తదితర మండలాల్లో కూడా పొత్తులకు ప్రయత్నాలు సాగుతున్నాయి.పార్వతీపురం డివిజన్‌లోని రామభద్రాపురం, సాలూరు, కొమరాడ మండలాల్లో కూడా పొత్తులకు నేతలు యత్నాలు సాగిస్తున్నారు. ఏది ఏమైనా బుజ్జగింపులు ఏ మేరకు ఫలిస్తాయన్నదీ మరో 24 గంటల్లో తేలనుంది.
‘ఉత్తమ సేవలు అందించండి’
విజయనగరం, జూలై 16: జిల్లాలో ఉత్తమ సేవలు అందించి జిల్లాకు మంచి పేరు తేవాలని జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే అన్నారు. ఇటీవల ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందజేసిన అవార్డును మంగళవారం కలెక్టర్ తన క్యాంప్ కార్యాలయంలో డిఎంహెచ్‌ఒ డాక్టర్ స్వరాజ్యలక్ష్మికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2012-13లో మొత్తం 21 అంశాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచినందుకు జిల్లా ఉత్తమ జిల్లాగా ఎంపికైందన్నారు. రానున్న కాలంలో ఇదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. ముఖ్యంగా మార్పు కార్యక్రమంలో భాగంగా గర్బిణీల నమోదు 96.3 శాతం సాధించినందుకు, అదే విధంగా గర్బిణీ స్ర్తిల టి.టి.టీకామందు 96.3 శాతం సాధించడంలో ఉత్తమంగా నిలిచింది. గర్బిణీలలో రక్తహీనత అరికట్టడానికి గర్బిణీలందరికీ ఐఎఫ్‌ఎ మాత్రలు వినియోగించునట్టు చేయడంలో శతశాతం సాధించగా, ఇంటి వద్ద కాన్పులను గణనీయంగా తగ్గించడంలోను, ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలోను జిల్లా ముందంజలో ఉంది. ఆసుపత్రి ప్రసవాలు 95.2 శాతం, సంవత్సరంలోపు చిన్నారులకు శతశాతం వ్యాధి నిరోధక టీకాలు చేయడంలోను, కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు 92.3 శాతం, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషను నిధుల వినియోగంలో 83 శాతం సాధించడంలో ప్రధమంగా నిలిచిందన్నారు. అంటువ్యాధులు, సీజనల్ వ్యాధులు పూర్తిగా అదుపులో ఉంచడంలో ప్రజలకు విస్తృత ప్రచారం కల్పించి వారిని చైతన్యవంతులను చేయడంలోను, జాతీయ ఆరోగ్య కార్యక్రమాల నివేదికలను, ముందస్తు ప్రణాళికలు సకాలంలో రాష్ట్ర స్థాయి అధికారులకు పంపడంలో ఈ అవార్డు సాధించగలిగామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి స్వరాజ్యలక్ష్మి చెప్పారు. వీటితోపాటు ఇతర శాఖలైన రెవెన్యూ, పంచాయతీ రాజ్, గ్రామీణ నీటిసరఫరా విభాగం, స్ర్తి శిశు సంక్షేమ శాఖల విభాగాల మధ్య మంచి సమన్వయం ఏర్పాటు చేసి జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను విజయవంతంగా అమలుపరచినందుకుగాను ఈ అవార్డు జిల్లాకు లభించిందని ఆమె తెలిపారు.
2819.2 కిలోమీటర్లకు చేరిన షర్మిల పాదయాత్ర
విజయనగరం, జూలై 16: రాష్ట్రంలో తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన మీ కోసం..వస్తున్నా పాదయాత్ర రికార్డును వైకాపా నేత షర్మిలా అధిగమించి రికార్డు బ్రేక్ చేశారు. మంగళవారం ఆమె జిల్లాలోని గజపతినగరం నియోజకవర్గంలో దత్తిరాజేరులో పర్యటించారు. ఈ రోజు నాటికి మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర 2819.2 కిలోమీటర్లకు చేరింది. దీంతో ఆమె చంద్రబాబునాయుడు చేపట్టిన పాదయాత్ర రికార్డును అధిగమించినట్టు వైకాపా వర్గాలు పేర్కొన్నాయి. కాగా, జిల్లాలో ఆమె ఈ నెల 8 నుంచి ఇప్పటి వరకు ఎస్.కోట, గజపతినగరం, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి నియోజకవర్గాల్లో పర్యటించారు. బుధవారం నుంచి ఆమె బొబ్బిలి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆమె బహిరంగ సభల్లో మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యార్థులకు ఉపకార వేతనాలు పెంపుదల చేయడంతోపాటు వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు పింఛన్లు పెంపుదల చేస్తామని భరోసా ఇస్తొన్నారు. టిడిపి, కాంగ్రెస్ కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నారని, వైఎస్ సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే రానున్న ఎన్నికల్లో వైకాపాను గెలిపించాలని ఆమె తన ప్రసంగాల్లో కోరుతున్నారు.
‘సురక్షిత ప్రయాణమే ఆర్టీసీ లక్ష్యం’
విజయనగరం , జూలై 16: సురక్షత ప్రయాణమే ఆర్టీసీ లక్ష్యమని, దీనికోసం అందరూ సమష్టిగా కృషి చేయాలని ప్రాంతీయ రవాణాశాఖాధికారి అబ్దుల్వ్రూఫ్ కోరారు. ప్రమాద రహిత వారోత్సవాలను మంగళవారం ఇక్కడ డిపోలో ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రమాదం ఎవరి పొరపాటు వల్ల జరిగినా కూడా ప్రమాదం ప్రమాదమేనన్నారు. ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోవడమేకాకుండా, జరిగిన దురదృష్టకర సంఘటనలో వారి కుటుంబాలకు కలిగే లోటు తీర్చలేనిదన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వల్లే ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ లక్ష్మణరావు, డిపోమేనేజర్ కె.పద్మావతి తదితరులు పాల్గొన్నారు.
‘రాజకీయాల్లో యువత ప్రముఖ పాత్ర వహించాలి’
విజయనగరం , జూలై 16: రాజకీయాల్లో యువత ప్రముఖ పాత్ర వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి అన్నారు. పట్టణంలో 15వ వార్డుకు సంబంధించి యువజన కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ. విభాగాలకు కమిటీలను ఏర్పాటు చేశారు. యువజన కాంగ్రెస్ వార్డు అధ్యక్షుడిగా కిలారి ప్రసాద్, ఎన్‌ఎస్‌యుఐ విభాగం అధ్యక్షుడిగా మంత్రిప్రగడ విద్యాస్వరూప్‌ను నియమించారు. మంగళవారం కోలగట్ల నివాసంలో అధ్యక్ష, కార్యదర్శి, ఇతర సభ్యులకు పార్టీ కండువాలు వేసి అభినందించారు. ఈ సందర్భంగా కోలగట్ల మాట్లాడుతూ రాజకీయాల్లో యువత కీలకపాత్ర పోషించాలన్నారు. ఇచ్చిన బాధ్యతలు నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చయాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమాలు ప్రజలకు చేరువయ్యేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మేకా కాశీవిశే్వశ్వరుడు, విజయనగరం పార్లమెంట్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్.బంగారునాయుడు, అసెంబ్లీ నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బోడసింగి ఈశ్వరరావు, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు ఎంఎల్‌ఎన్‌రాజు తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి శిక్షణ
జామి, జూలై 16 : ఇక్కడి ఎండిఒ కార్యాలయ సమావేశ భవనంలో పోలింగ్ నిర్వహణపై సిబ్బందికి మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లో ఆర్‌ఒలు, పిఒలు, పిపిలు నిర్వహించాల్సిన విధులు గురించి జెడ్‌పి సిఇఒ మోహనరావు వివరించారు. గతంలో పోలింగ్‌కు వెళ్లిన సిబ్బంది అనుభవాలను, ఎన్నికల సమయంలో ఎదురైన ఇబ్బందులను శిక్షణా తరగతుల్లో తెలియజేయాలని సిబ్బందిని కోరారు. పాటించాల్సిన పద్దతులను వివరించారు. సమయ స్పూర్తితో వ్యవహరించి సమర్ధవంతంగా ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. ఎన్నికలకు ఏజెంట్లుగా వచ్చిన వారి గుర్తింపు కార్డులను పరిశీలించి సెల్ ఫోన్‌లు వాడకుండా చూడాలని తెలిపారు. సమస్యలు ఎదురైనపుడు స్థానిక ఎంపిడిఓకుగాని, తహశీల్దార్‌కు గాని, ఎస్సైకి గాని వెంటనే తెలిపరచాలని ఎంపిడిఓ ఎన్‌ఆర్‌కె సూర్యం తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమాల్లో ఈఓపిఆర్‌డి సిబ్బంది పాల్గొన్నారు.
క్షయ నియంత్రణ చర్యలకు గుర్తింపుగా డాక్టర్ ప్రసాద్‌కు అవార్డు
విజయనగరం , జూలై 16: జిల్లాలో క్షయవ్యాధి నివారణ పట్ల ప్రజల్లో చైతన్యం, వైద్యుల్లో అవగాహన కల్పించినందుకు ఆర్‌ఎన్‌టిసిపి ఉత్తమ జిల్లా కో-ఆర్డినేటర్‌గా ఐఎంఎ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ వి.ఎస్.ప్రసాద్ రాష్టస్థ్రాయి అవార్డును అందుకున్నారు. ఈనెల 13, 14 తేదీల్లో జరిగిన రాష్ట్ర ఐఎంఎ సదస్సులో జాతీయ అధ్యక్షుడు డాక్టర్ విజయకుమార్, రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ విజయచంద్రరెడ్డి చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. జిల్లాలో క్షయవ్యాధి నివారణకు డాక్టర్ ప్రసాద్ విశేషంగా కృషి చేశారు. ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ, వైద్యుల్లో అవగాహన కల్పించారు. ఈ నేపధ్యంలో ఐఎంఎ-ఆర్‌ఎన్‌టిసిపి జిల్లా కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ప్రసాద్‌కు రాష్టస్ధ్రాయి అవార్డు రావడం పట్ల ఐఎంఎ విజయనగరం బ్రాంచ్ మంగళవారం ఐఎంఎ హాలులో అభినందించింది. ఈ సందర్భంగా జిల్లా క్షయనివారణ అధికారి డాక్టర్ పి.రామారావుమాట్లాడుతూ జిల్లాలో క్షయవ్యాధి నివారణకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో డాట్ విధానం ద్వారా మందులను పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లా క్షయవ్యాధి గ్రస్తులకు మెరుగైన వైద్యసేవలు అందించడంతోపాటు పౌష్టికాహారం అందించేందుకు ఒక ప్రణాళిక తయారు చేయాలని జిల్లాకల్టెర్ ఆదేశించారన్నారు. ఐఎంఎ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ క్షయవ్యాధి సమాజానికి ఆర్ధికభారంగా మారిందన్నారు. దీని నివారణ కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఎ నాయకులు డాక్టర్ కూరెళ్ల శ్రీనివాస్, డాక్టర్ మురళీమోహన్, డాక్టర్ మల్లేశ్వరరావు, డాక్టర్ సత్యశ్రీనివాస్, డాక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల సిబ్బందికి శిక్షణ
డెంకాడ, జూలై 16 : పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనే ఎన్నికల సిబ్బందికి మంగళవారం ఎంపిడిఓ నిర్మలాదేవి శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఎంపిడిఓ కార్యాలయంలో ఎన్నికల ఆర్‌ఓలు, ఎఆర్‌ఓలకు,పిపిలకు శిక్షణ నిర్వహించారు. ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఎవరని అనుమతించాలి అనే విషయమై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. అనే విషయమై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ కృష్ణారావు, ఎన్నికల పరిశీలకులు శేషగిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
‘విధి నిర్వహణలో అప్రమత్తంగా ఉండాలి’
చీపురుపల్లి, జూలై 16 : విధి నిర్వహణలో ఎన్నికల సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మంగళవారం అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలవో మంగళవారం జరిగిన పిఓ, ఎపిఓలు శిక్షణా తరగతుల్లో ఆమె మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల నిబంధనలు అమలు జరిగేలా చూడాలన్నారు. పోలింగ్ సమయంలో తమకు అప్పగించిన విధులను సిబ్బంది నిర్వహించాలన్నారు. తహశీల్దార్ టి.రామకృష్ణ, ఎంపిడిఓ కె.రాజ్‌కుమార్, ప్రత్యేక అధికారి పి.బాంధవరావు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న కాంట్రాక్ట్ అధ్యాపకుల నిరసన
విజయనగరం , జూలై 16: సమస్యల పరిష్కారం కోసం ఒప్పంద అధ్యాపకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 23 రోజులకు చేరుకుంది. ప్రభుత్వం మొద్దు నిద్రను వీడాలంటూ దీక్షా శిబిరంలో పడుకుని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా ఒప్పంద అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు రౌతు గోపి మాట్లాడుతూ తమ స్థానాల్లో విశ్రాంత అధ్యాపక, ఉపాధ్యాయులను నియమించడాన్ని తీవ్రంగా ఖండించారు. పొట్టకూటి కోసం పోరాటాలు చేస్తుంటే వీరిని నియమించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. విశ్రాంత ఉపాధ్యాయ, అధ్యాపకులు తమ పోరాటానికి మద్దతు పలకాలని విజ్ఞప్తి చేశారు. కోశాధికారి పి.లలితేంద్రరావు, అధ్యాపకులు ఎ.రవికాంత్, డి.సూర్యనారాయణ, ఎం.ఎన్.ఎల్ నారాయణమ్మ, పాల్గొన్నారు.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డిఎస్పీ
జామి, జూలై 16 : మండలంలో ఉన్న పోలింగ్ కేంద్రాలను డిఎస్పీ కృష్ణ ప్రసన్న మంగళవారం పరిశీలించారు. జెడివలస, జామి, అలమండ, గ్రామాల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. మంచినీరు వంటి వౌళిక సదుపాయాలపై పాఠశాల సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. జెడివలస పోలింగ్ కేంద్రం వద్ద విశాల ప్రదేశం లేదని పోలీసు సిబ్బంది నియామకంపై శృంగవరపుకోట సిఐ రఘవీర్‌విష్ణుతో చర్చించారు. పోలింగ్ కేంద్రాల్లోకి ఓటర్లు, ఎజెంట్లు, సెల్‌ఫోన్‌లను తీసుకువెళ్లకుండా చూడాలని సూచించారు. కార్యక్రమంలో జామి ఎస్సై లూదర్‌బాబు, హెచ్‌సి రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
త్యాగాలకు సిద్ధం: సమైక్యాంధ్ర జెఎసి
విజయనగరం , జూలై 16: ఎందరో మహానీయులైన త్యాగఫలంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి త్యాగాలకైనా సిద్ధమేనని సమైకాంధ్ర జెఎసి జిల్లా కన్వీనర్ మామిడి అప్పలనాయుడు అన్నారు. తెలంగాణ వేర్పాటువాదులకు వ్యతిరేకంగా సమైక్యాంధ్ర కోరుతూ మంగళవారం ఇక్కడ ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రక్తనిధి కేంద్రంలో సమైక్యాంధ్ర జెఎసి ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు మాట్లాడుతూ దేశంలో తొలి భాషాప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమేనన్నారు. ఆంధ్రప్రదేశ్ భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పాటు జరిగిన తర్వాతే తెలుగువారికి దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ఒక గుర్తింపు, గౌరవం లభించిందన్నారు. కొంతమంది తెలంగాణవేర్పాటువాదులు తెలంగాణ ఉద్యమం పేరుతో అశాంతిని నెలకొల్పుతూ, అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను తెలంగాణ ఉద్యమం పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తూ ప్రజాస్వామానికి ఖూనీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సమైక్యాంధ్ర జెఎసి సభ్యులు అబ్దుల్వ్రూఫ్, మద్దిల సొంబాబు తదితరులు పాల్గొన్నారు.
‘మద్యం నిరోధానికి కట్టుదిట్టమైన చర్యలు’
పార్వతీపురం, జూలై 16: పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్రమసారా, మద్యం అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని పార్వతీపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్ వి రమణ తెలిపారు. మంగళవారం ఆయన తన కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ ఈ మధ్య నిర్వహించిన ఎక్సైజ్ దాడుల్లో 74కేసులు నమోదు చేసి 49మందిని అరెస్ట్ చేశామన్నారు. ఇందుకు సంబంధించి 20,800 లీటర్ల నాటుసారా తయారికీ పనికివచ్చే బెల్లం ఊటను ధ్వంసం చేశామన్నారు. ఎం ఆర్ పి కంటే అధిక ధరలకు విక్రయించిన రెండు మద్యం షాపులకు లక్షరూపాయల వంతున జరిమానా విధించామన్నారు. ఎన్నికల దృష్ట్యా 25బెల్టుషాపులపై కేసులు నమెదు చేసి 339 నిబ్బులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో 21వ తేదీ సాయంత్రం 5గంటల నుండి 23తేదీ వరకు మద్యం షాపులు మూసివేయిస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల్లో మద్యం అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో దాడులు
ఒడిశానుండి అక్రమంగా నాటుసారా, మద్యం దిగుమతి కాకుండా గట్టి నిఘా పెట్టామని సూపరింటెండెంట్ ఎన్‌వి రమణ తెలిపారు. ఒడిశాలోని జయకోట , బాత్రుపల్లి తదితర ప్రాంతాల్లో దాడులు నిర్వహించి పులిసిన బెల్లం ఊటలు ధ్వంసం చేసినట్టు తెలిపారు. చినమేరంగిలోనిర్వహించిన దాడుల్లో పదివేల లీటర్ల బెల్లం ఊటలు ధ్వంసం చేశామన్నారు. ఇంకా పలుగిరిజన గ్రామ సరిహద్దుల్లో దాడులు పెద్ద ఎత్తున నిర్వహిస్తామన్నారు. ఎన్నికల సందర్భంగా పార్వతీపురం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రాహుల్‌దేవ్ శర్మ ఆధ్వర్యంలో ఎక్సైజ్, పోలీసుశాఖలు సంయుక్తంగా దాడులు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు.