Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ఎన్నికల ప్రలోభాలపై నిఘా నేత్రం

$
0
0

ఏలూరు, జూలై 16: ‘పంచాయతీ ఎన్నికల్లో మోడల్ కోడ్ విషయంలో ఎక్కడా రాజీ ఉండదు... అభ్యర్ధుల ప్రచార ఖర్చుల నుంచి అన్నివిధాలా వ్యయాలు, ఇతరత్రా అంశాలపై పూర్తిస్ధాయిలో నిఘా కన్ను వేసి ఉంచాం’22అని జిల్లా కలెక్టరు సిద్ధార్ధ జైన్ స్పష్టం చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ పంచాయితీ పోరుకు జిల్లా యంత్రాంగం అన్నివిధాలా సంసిద్ధమైందని, ఎక్కడైనా లెక్క తేడా వస్తే ఆ అభ్యర్ధులకు ఇబ్బందులు తప్పవని ఆయన హెచ్చరించారు. మద్యం నిల్వల నుంచి మనీ పంపిణిల వరకు అన్నింటిపై నిఘా ఏర్పాటుచేశామన్నారు. త్వరలోనే మద్యం నిల్వలపై తమకు అందిన స్పష్టమైన సమాచారం మేరకు ఎక్సైజ్ విభాగం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే నగదు పంపిణీల విషయంలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని, బ్యాంకు ఖాతాల నుంచి భారీగా నగదు తరలిపోయినా, ఏ ప్రాంతంలోనైనా పెద్దఎత్తున నగదును తరలిస్తున్నా, అభరణాల నుంచి జాకెట్టు ముక్కల వరకు ఎటువంటి గిఫ్ట్‌లు సిద్ధం చేసినా వారిపై కఠినచర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికల నేపధ్యంలో మంగళవారం ఆయన ‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఈసారి జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సరికొత్త నిబంధనలను అమలులోకి తీసుకువచ్చిందని కలెక్టరు చెప్పారు. నిబంధనల మేరకు వ్యయ పరిమితికి మించి ఖర్చు పెట్టిన అభ్యర్ధుల విషయంలో కఠినంగా వ్యవహరించటం జరుగుతుందని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు. దానికనుగుణంగా జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల ప్రచార ఖర్చు విషయంలో నిఘా నేత్రాలు ఏర్పాటుచేశామన్నారు. ప్రతి మండలానికి ప్రత్యేకంగా ఆడిటర్లను నియమించామని, ప్రతి రెండురోజులకు అభ్యర్ధులు తమ ఖర్చుల వివరాలను వారికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. అభ్యర్ధులు చేస్తున్న ప్రచారానికి, వారు చూపుతున్న ఖర్చుకు పోలిక ఉందా అన్న విషయాన్ని క్రోడీకరించుకుని ఆడిటర్లు నివేదికలు తయారుచేస్తారన్నారు. అలాగే ఎన్నికల ప్రక్రియ ముగిసిన 45రోజుల్లోగా అభ్యర్ధులు తమ ఎన్నికల ఖర్చు వివరాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుందన్నారు. ఈవిషయంలో ఎవరైనా అత్యుత్సాహం ప్రదర్శిస్తే భవిష్యత్‌లో వారిపై అనర్హత వేటు పడే అవకాశం ఉంటుందన్నారు. ప్రచారానికి సంబంధించి అభ్యర్ధులపైనే పూర్తి బాధ్యత ఉంటుందని, పార్టీ తరపున ప్రచారానికి ఖర్చు పెట్టినా ఆ మొత్తం కూడా సదరు అభ్యర్ధి ఖాతాలో పడిపోతుందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. ప్రధానంగా మద్యం, డబ్బు పంపిణిపై ప్రత్యేక నిఘా నిరంతరం కొనసాగుతుందని, 21 చెక్‌పోస్టులను జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసినట్లు కలెక్టరు సిద్ధార్ధజైన్ తెలిపారు. మంగళవారం ఎక్సైజ్ అధికారులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించానని, జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం నిల్వలు ఉన్నట్లు తనకు స్పష్టమైన సమాచారం అందిందన్నారు. త్వరలోనే వీటిపై దాడులు నిర్వహిస్తామని, అక్రమంగా మద్యం నిల్వలు గుర్తిస్తే సంబంధితులపై కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ ప్రాంతంలోనైనా మద్యం నిల్వలకు సంబంధించి స్ధానికంగా ఉన్న తహసిల్దార్, ఎస్సైలకు ప్రజలు సమాచారం ఇవ్వవచ్చునన్నారు. మద్యం షాపువారీగా రోజువారీ అమ్మకాల వివరాలు సేకరిస్తున్నానని, దీన్నిబట్టి ఏ ప్రాంతంలో మద్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారో తెలుసుకోవచ్చునని ఆయన అభిప్రాయపడ్డారు. జిల్లాలో బెల్టుషాపులను తొలగించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటివరకు 169 షాపులను మూసివేశామన్నారు. ఇంకా ఎక్కడైనా బెల్టుషాపులుంటే వారి వివరాలను తెలియజేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. నల్లబెల్లం తయారీపై కూడా నిఘా ఉంచాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డబ్బు పంపిణికి సంబంధించి ఆయన మాట్లాడుతూ ఎవరైనా 50వేల రూపాయల వరకు తమతో తీసుకువెళితే అభ్యంతరం ఉండదని, అంతకుమించి సొమ్ము తీసుకువెళ్తున్న సమయంలో మాత్రం స్పష్టమైన పత్రాలు ఉండితీరాల్సిందేనని, అలాకానిపక్షంలో సదరు మొత్తాన్ని ఎన్నికల సొమ్ముగా పరిగణిస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 27 జాయింట్ చెక్‌పోస్టులు ఏర్పాటుచేశామని, డబ్బు భారీగా తరలిస్తూ ఆధారాలు లేకుండా ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటామని చెప్పారు. బ్యాంకు ఖాతాల నుంచి ఎక్కైడైనా భారీగా నగదును తీసుకుంటుంటే అటువంటి సందర్భాలపై నిఘాను ఏర్పాటుచేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి కేబుల్ టివి, ఎస్‌ఎంఎస్‌ల ద్వారా చేసే ప్రచార ఖర్చులతోపాటు పత్రికల్లో వచ్చే ప్రకటనల విషయంలో కూడా అభ్యర్ధులు బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఎక్కడైనా ఎన్నికల సందర్భంగా ప్రజలకు బహుమానాలు, నజరానాలు అందిస్తున్నట్లు తెలిస్తే తనకు సమాచారం అందిస్తే చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. అలాగే పోలింగ్ రోజున ఓటర్లను భయపెట్టడం, ప్రలోభాలకు గురిచేయటం వంటివి చేస్తే సదరు వ్యక్తులపై కఠినచర్యలు తీసుకుంటామన్నారు. ఇక జిల్లాలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ మొత్తం వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షించటం జరుగుతుందని, దీనికోసం ప్రత్యేకంగా ఇంజనీరింగ్ విద్యార్ధులను వినియోగిస్తున్నామని, అంతేకాకుండా 300 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామన్నారు. ఓటర్లు తమ ఓటుహక్కును స్వేచ్చగా, ప్రశాంతంగా వినియోగించుకునే వాతావరణం కల్పిస్తున్నామని, ఎక్కడైనా వీటికి భంగం వాటిల్లితే తక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి తనతోపాటు జిల్లా ఎస్పీ ఎం రమేష్, డిపిఓ నాగరాజువర్మ, సిఇఓ నాగార్జునసాగర్, ఆర్డీవోలు సమన్వయంతో ముందుకు సాగుతున్నట్లు సిద్ధార్ధజైన్ తెలిపారు.

ఆకివీడులో 13.5 లక్షల నగదు స్వాధీనం
ంచేపల రైతుల సొమ్ము అని సందేహం
ఆకివీడు, జూలై 16: కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల సరిహద్దు ప్రాంతాలలో ఉప్పుటేరు బ్రిడ్జి వద్ద పోలీసులు ఏర్పాటుచేసిన చెక్ పోస్టు వద్ద మంగళవారం మధ్యాహ్నం ఒక వ్యక్తి నుండి రూ.13.5లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసులు చెక్ పోస్టును ఏర్పాటుచేసి, విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో మచిలీపట్నం ప్రాంతం నుండి ఓ కారులో చెరుకువాడ తీసుకువెళుతున్న నడింపల్లి అప్పలరాజు నుండి రూ.13.5లక్షల నగదును ఆకివీడు ఎస్‌ఐ యార్లగడ్డ రవికుమార్ స్వాధీనం చేసుకున్నారు. చెరుకువాడ గ్రామానికి చెందిన అప్పలరాజు తాను చేపల రైతుల నుండి ఈ సొమ్మును తీసుకువస్తున్నట్లు పోలీసులకు వివరించారు. అయితే దీనికి సంబంధించి బిల్లులు లేకపోవడంతో ఈ నగదును స్వాధీనం చేసుకున్నారు. వివరాలను తహసీల్దార్‌కు వివరించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎపి పోలీసు బెస్ట్
ఏలూరులో సబ్సిడరీ పోలీసు క్యాంటిన్ ప్రారంభించిన డిజిపి - జిల్లా ఎస్పీకి ప్రశంసలు
ఏలూరు, జూలై 16: దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీసులు పనితీరులో అత్యుత్తమమైన వారని, ఈవిషయంలో ఎవరూ వారికి పోటీ రాలేరని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు వి దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. అదేవిధంగా పోలీసు యంత్రాంగం కూడా సిబ్బంది సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. ఏ రాష్ట్రంలో చూసినా ఎపి పోలీసు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇబ్బందులు కన్పించవని, అందువల్లే సంక్షేమానికి పెద్దపీట వేయటం ద్వారా వారిలో నిబద్ధతను మరింతగా పెంచుతున్నామని దినేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈసందర్భంగా పశ్చిమ పోలీసుపై అభినందనలు వ్యక్తం చేస్తూ జిల్లా ఎస్పీ ఎం రమేష్ తీసుకుంటున్న చర్యలను ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు. ఏలూరులోని పోలీసుక్వార్టర్స్‌లో నూతనంగా ఏర్పాటుచేసిన సబ్సిడరీ పోలీసు క్యాంటిన్‌ను మంగళవారం సాయంత్రం దినేష్‌రెడ్డి, ఆయన సతీమణి కమల దినేష్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో దినేష్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా అతిపెద్ద పోలీసు క్యాంటిన్‌ను అతితక్కువ సమయంలో నిర్మించినందుకు జిల్లా ఎస్పీ రమేష్‌ను అభినందించారు. సమర్ధతకు నిదర్శనం పశ్చిమ పోలీసు యంత్రాంగం అంటూ ప్రశంసించారు. రాష్ట్ర పోలీసులు పడే కష్టాలు మరే రాష్ట్రంలోనూ కన్పించవని, ఇదే సమయంలో మన రాష్ట్ర పోలీసులకు ఉన్న ఇమేజ్ ఏ పోలీసులకు లేదన్నారు. సబ్సిడరీ పోలీసు క్యాంటిన్‌లో పోలీసు సిబ్బంది, రిటైర్డు పోలీసు సిబ్బందికి 25 శాతం సబ్సిడీపై నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తామన్నారు. త్వరలోనే వ్యాట్ మినహాయింపు కూడా లభిస్తుందని, అప్పుడు మరో పదిశాతం అదనంగా రాయితీ లభిస్తుందన్నారు. రాష్ట్రంలో పోలీసుల సంక్షేమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి అపన్నహస్తం అందిస్తున్నారని, పోలీసు క్వార్టర్స్ మరమ్మతులకు విరివిరిగా నిధులు మంజూరు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రతి పోలీసు యూనిట్ ఆఫీసుకు ఒక డాక్టరు చొప్పున నియమించటం జరుగుతోందన్నారు. దీనివల్ల పోలీసు కుటుంబాలకు అత్యవసరంగా వైద్యసేవలు అందించడానికి వీలుకలుగుతుందన్నారు. పోలీసుల సంక్షేమానికి చర్యలు తీసుకుంటే పోలీసులు ఇష్టపడి కష్టపడి పనిచేస్తారని, అప్పుడు సమాజానికి ఎన్నో మేళ్లు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని లక్షా 46వేల మంది పోలీసు సిబ్బంది సంక్షేమానికి గతంలో లేనివిధంగా ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని, దీనివల్ల పోలీసుల పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడిందన్నారు. మెడికల్ రీఎంబర్స్‌మెంట్ అమలుచేయటం, పోలీసుల సంక్షేమానికి సంవత్సరానికి కోటి రూపాయల గ్రాంటు, క్వార్టర్ల మరమ్మత్తులకు ప్రతి యేటా 20కోట్ల రూపాయల ఖర్చు, పోలీసులకు కార్పోరేట్ వైద్యం అందించటం, పోలీసు కుటుంబాలకు ఉచితంగా వైద్యసౌకర్యం, విదేశాలకు వెళ్లి చదువుకునే పిల్లలకు పలు రాయితీలు అందిస్తున్నట్లు డిజిపి దినేష్‌రెడ్డి చెప్పారు. జిల్లా ఎస్పీ ఎం రమేష్ మాట్లాడుతూ ఇప్పటివరకు కేంద్ర పారా పోలీసులకు మాత్రమే పరిమితమైన సబ్సిడరీ పోలీసు క్యాంటిన్ సౌకర్యాన్ని రాష్ట్ర పోలీసులకు కూడా అందుబాటులోకి తీసుకువచ్చిన ఘనత డిజిపి దినేష్‌రెడ్డికే దక్కుతుందన్నారు. 40నుంచి 50శాతం సబ్సిడీపై పోలీసు కుటుంబాలకు ఈ క్యాంటిన్‌లో అన్నిరకాల వస్తువులను సరఫరా చేస్తామన్నారు. కేంద్ర పోలీసు క్యాంటిన్‌కు అనుసంధానంగా ఇది పనిచేస్తుందని, సుమారు 400 నుంచి 500 మంది ఉత్పత్తిదారులతో సరుకులు సరఫరా చేయడానికి అంగీకారం కుదిరిందని చెప్పారు. విశాఖలోని సిఐఎస్‌ఎఫ్ నుంచి అవసరమైన సరుకులను కొనుగోలుచేసి పోలీసు కుటుంబాలకు పంపిణి చేస్తామన్నారు. రిటైర్డు పోలీసు సిబ్బంది, ఉద్యోగం చేస్తూ వీరమరణం పొందిన వారి కుటుంబాలకు కూడా ఈ క్యాంటిన్‌లో సరుకులు కొనుగోలుకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. జిల్లాలోని దాదాపు రెండువేల మంది సిబ్బందికిగాను ప్రస్తుతానికి వెయ్యిమంది వరకు ఈ క్యాంటిన్‌లో సభ్యత్వం పొందారన్నారు. 500 రూపాయలు మెంబర్‌షిప్ చెల్లించి సభ్యత్వం పొందాల్సి ఉంటుందన్నారు. మొదటినెలలోనే సుమారు 30లక్షల రూపాయల టర్నోవర్ సాధించేదిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలో పోలీసుశాఖ తీసుకున్న చర్యల కారణంగా గతంలో పాస్‌పోర్టు పొందాలంటే 62 రోజులు పట్టేదని, అయితే ప్రస్తుతం కేవలం మూడురోజుల్లోనే ఈ ప్రక్రియ పూర్తవుతోందని, ఇది దేశంలోనే రికార్డు అని ఎస్పీ రమేష్ పేర్కొన్నారు. అనంతరం డిజిపి దినేష్‌రెడ్డి 31మంది పోలీసు సిబ్బందికి 31లక్షల రూపాయల రుణాలను అందజేశారు. అదేవిధంగా సబ్సిడరీ పోలీసు క్యాంటిన్ బ్రోచర్‌ను కూడా దినేష్‌రెడ్డి ఆవిష్కరించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నాగరాజు, సుధాకరరావులు డిజిపి దంపతులను సత్కరించారు. అలాగే జిల్లా పోలీసుశాఖ తరపున డిజిపి దంపతులను భారీ గజమాలతో సన్మానించారు. కార్యక్రమంలో కోస్తా జిల్లాల ఐజి సిహెచ్ ద్వారకాతిరుమలరావు, ఏలూరు రేంజ్ డిఐజి విక్రమ్‌సింగ్‌మాన్, డిఐజి సతీమణి నందిని, జిల్లా ఎస్పీ ఎం రమేష్, ఆయన సతీమణి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ బివి కృష్ణారెడ్డి, పలువురు డిఎస్పీలు, సిఐలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎస్సీ అభ్యర్థులకు కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయనందుకు
నల్లజర్ల తహసీల్దార్‌పై వేటు
-ఆర్‌ఐ, దూబచర్ల విఆర్వోపైనా చర్యలు
నల్లజర్ల, జూలై 16: పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయదలచిన భార్యాభర్తలకు కుల ధ్రువీకరణ పత్రం మంజూరులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన నల్లజర్ల తహసీల్దార్‌పై వేటు పడింది. ఆయనతో పాటే రెవెన్యూ ఇన్‌స్పెక్టర్, దూబచర్ల విఆర్వోలను ఎన్నికల విధుల నుండి తప్పిస్తూ కలెక్టర్ సిద్ధార్ధ జైన్ ఆదేశాలు జారీచేశారు. వివరాలిలావున్నాయి.. నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామానికి చెందిన మానూరి వెంకన్న పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థినిగాను, అతని భార్య దుర్గ 1వ వార్డు అభ్యర్థిగాను పోటీ చేసేందుకు నామినేషన్లు దాఖలు చేశారు. వీరు కుల ధ్రువీకరణ పత్రంకోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడంతో వారి నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. దీనిపై బాధితులు ఆర్డీవో కోర్టులో అప్పీలు చేసుకున్నారు. ఏలూరు ఆర్డీవో కె నాగేశ్వరరావు విచారణలో తహసీల్దార్ సుబ్బారావు, ఆర్‌ఐ పోతురాజు, విఆర్వో సుబ్బారావు కుల ధ్రువీకరణ పత్రం మంజూరు చేయకపోవడం తప్పుగా పరిగణించి కలెక్టర్‌కు నివేదించారు. దీనితో ఎన్నికలయ్యే వరకు వారు ముగ్గురూ కలెక్టరేట్‌లో విధులు నిర్వహించాలని కలెక్టర్ సిద్ధార్థ జైన్ ఆదేశించారు. డిప్యూటీ తహసీల్దార్ ఆర్ వెంకట్రావుకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.

మీడియాలో ప్రకటనలూ ఎన్నికల వ్యయమే:కలెక్టర్
ఏలూరు, జూలై 16 : జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి వివిధ పత్రికల్లో, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చే ప్రకటనలను ఆయా అభ్యర్ధుల ఎన్నికల వ్యయంలో పరిగణిస్తామని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ తెలిపారు. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలలో అభ్యర్థుల తరపున వారి శ్రేయోభిలాషులు, బంధువులు ఎవరైనా ఎటువంటి ప్రచార ప్రకటన ఇచ్చినా, పెయిడ్ ఆర్టికల్స్ వచ్చినా వాటిని కూడా ఆయా అభ్యర్థుల ఎన్నికల వ్యయం కింద భావించి లెక్కిస్తామని ఆయన చెప్పారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 10 వేల లోపు జనాభా కలిగిన గ్రామ పంచాయితీలో వార్డు మెంబరు పదవికి పోటీ చేసే వారు ఆరు వేల రూపాయలలోపు, పది వేలకు పైబడిన గ్రామ పంచాయతీలో వార్డుమెంబరుగా పోటీ చేసే అభ్యర్థి పది వేల రూపాయల వరకూ, అదే విధంగా 10 వేల జనాభా కలిగిన గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తే 40 వేల రూపాయలు, 10 వేల జనాభా దాటిన గ్రామ పంచాయతీలలో 80 వేల రూపాయలలోపు ఎన్నికల వ్యయం చేయవలసి వుంటుందని కలెక్టర్ చెప్పారు.

ఎడతెరిపి లేని వర్షం
ఏలూరు, జూలై 16 : అల్పపీడనం ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా మంగళవారం భారీగా వర్షాలు కురిసాయి. జిల్లా కేంద్రమైన ఏలూరులో ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. పల్లపు ప్రాంతాలన్నీ జలమయం కావడంతో సాధారణ జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ఏలూరు నగరంలోనూ పరిస్థితి అదే విధంగా కొనసాగుతోంది. రెండురోజుల క్రితమే అల్పపీడనం కారణంగా ఏకధారగా వర్షాలు జిల్లాను కుదిపేశాయి. దాని నుంచి పూర్తిగా తేరుకోకుండానే సోమవారం రాత్రి నుంచి మళ్లీ వర్షాలు కురవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వచ్చింది. మరో వైపు రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
భీమవరంలో...
భీమవరం: తెల్లవారుజాము నుండి కురుస్తున్న వర్షం కారణంగా పట్టణవాసులు పలు ఇబ్బందులకు గురయ్యారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షం కారణంగా స్కూళ్ళకు, కళాశాలలకు వెళ్ళే విద్యార్థులు అవస్థల పాలయ్యారు. అలాగే చిరువ్యాపారులు బేరాలు లేక అల్లాడారు. హౌసింగ్ బోర్డు కాలనీ, గునుపూడి, చినరంగనిపాలెం, డిఎన్నార్ కళాశాల రోడ్డు, బంట్రోతువారి వీధి, శ్రీనివాసా థియేటర్, నర్సయ్య అగ్రహారం వర్షం కారణంగా నీటమునిగాయి.
నీట మునిగిన కూరగాయల తోటలు
ఆచంట: తుపాను ప్రభావంతో మండలంలో విస్తారంగా వర్షాలుపడ్డాయి. సాధారణ జనజీవనం అస్తవ్యస్తమైంది. వివిధ గ్రామాలలో పారిశుద్ధ్యం క్షీణించింది. మురుగు కాలువలు పూడుకుపోవటంతో వర్షపునీరు రహదారులపై పొంగి పొర్లుతోంది. ఈ సంవత్సరం దాళ్వా సీజన్‌కు ఆకుమడి దశ నుండే నష్టాలు ప్రారంభమయ్యాయి. గత నాలుగు రోజులుగా ఈ ప్రాంతంలో ఆకుమళ్లు ముమ్మరంగా వేశారు. భారీ వర్షంతో ఆకుమళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని రైతులు వాపోతున్నారు. కాగా మరోపక్క వశిష్ఠ గోదావరిలో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సమీపంలోని గ్రామస్థులు బెంబేలెత్తుతున్నారు. కరుగోరుమిల్లి ఇసుక ర్యాంప్ సమీపంలో గట్టు కుంగిపోయింది. కరుగోరుమిల్లి, అయోధ్యలంక, భీమలాపురం గ్రామాల పరిధిలోని లంక భూముల్లో అధిక శాతం సాగుచేస్తున్న కూరగాయల పంటలు నీట మునిగాయి. పెదమల్లం, అయోధ్యలంక గ్రామాల్లో మంచి దిగుబడిని ఇస్తున్న బెండ, బీర, వంగ వంటి కూరగాయ పంటలు నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. పశువులకు సైతం గడ్డి కొరత ఏర్పడుతోందని రైతులు వాపోతున్నారు. కాగా మండలంలోని పంచాయతీ ఎన్నికల బరిలో నిలబడిన అభ్యర్థులకు వర్షం కారణంగా వారి ప్రచారానికి ఆటంకమేర్పడింది.

జంగారెడ్డిగూడెంలో భారీ చోరీ
అపార్ట్‌మెంటులో 60 కాసుల బంగారు ఆభరణాలతో పరారైన ఆగంతకుడు
జంగారెడ్డిగూడెం, జూలై 16: స్థానిక అశ్వారావుపేట రోడ్డులోని జి.టి.పి టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మంగళవారం తెల్లవారుజామున భారీ చోరీ జరిగింది. అపార్ట్‌మెంట్ సెకండ్ ఫ్లోర్‌లో 201వ నెంబర్ ఫ్లాట్‌లో కొల్లి సత్యశ్రీకి చెందిన సుమారు 12 లక్షల రూపాయల విలువైన 60 కాసుల బంగారు ఆభరణాలు ఒక ఘరానా నేరగాడు చోరీచేశాడు. ఎస్సై బి.ఎన్.నాయక్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏలూరు నుండి వచ్చిన క్లూస్ టీమ్ నేర స్థలంలో నేరగాడి వేలిముద్రలు సేకరించారు. ఇటీవల పట్టణంలో అనేక చోట్ల నేరాలకు పాల్పడిన వ్యక్తే ఇక్కడ కూడా నేరం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు అట్లూరి సురేష్ సోదరి అయిన కొల్లి సత్యశ్రీ ఒక్కరే ఈ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఫ్లాట్‌కు తాళం వేసి హైదరాబాద్ కుమార్తె వద్దకు వెళ్ళారు. తిరుగు ప్రయాణంలో సోమవారం రాత్రి హైదరాబాద్‌లో బస్సు ఎక్కి మంగళవారం తెల్లవారు జామున జంగారెడ్డిగూడెంలో అపార్ట్‌మెంట్ వద్ద బస్సు దిగారు. సెకండ్ ఫ్లోర్‌లోని తన ఫ్లాట్‌కు వెళ్ళేసరికి తలుపులు తీసి ఉండటంతో అనుమానం వచ్చి లోనికి తొంగి చూసారు. పడకగదిలో ఒక వ్యక్తి ఛార్జింగ్ లైట్‌లో బీరువా వెదకడం గమనించి తలుపు వేసి పక్క ఫ్లాట్‌లో నివసిస్తున్నవారిని లేపడానికి సత్యశ్రీ ప్రయత్నించారు. వారు ఎంతకూ లేవక పోయేసరికి థర్డ్ ఫ్లోర్‌లో నివాసం ఉండేవారిని పిలిచేందుకు వెళ్ళారు. అప్పటికే ఫ్లాట్ యజమాని వచ్చిన వైనం గమనించిన నేరగాడు బలంగా తలుపులు తోసుకుని బయట పడిపోయాడు. వేగంగా మెట్లు దిగి వెళ్ళిపోతున్న నేరగాడిని గమనించి అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ దుర్గరావు పట్టుకునేందుకు ప్రయత్నించాడు. అతని చేయి అందిపుచ్చుకునే సరికి విదిలించుకుని పరారయినట్టు దుర్గారావు చెప్పాడు. నేరగాడు ముఖానికి ముసుగు వేసుకుని ఉన్నాడని, బలంగా ఉన్నాడని, అతని వెంటపడినా ఫలితం కనిపించలేదని చెప్పారు. ఇంటిలో ఎవరూ లేని సమయం కనిపెట్టి, ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ నేరానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఫ్లాట్ ప్రధాన ద్వారం తలుపుల మడత బందులు తొలగించి లోనికి ప్రవేశించిన నేరగాడు సత్యశ్రీ లోపలదాచి పెట్టిన రోకలి బండతో మోది బోల్డులు, స్క్రూమేకులతో సహా మిగిలిన తలుపులు, బీరువా తెరిచాడు. కాగా, సత్యశ్రీ ఇంటిలో 30 కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్టు ఎస్సై చెప్పారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలింపు చేపట్టామని, త్వరలో పట్టుకుంటామని చెప్పారు.

గృహాల్లో మద్యం నిల్వలపై మెరుపు దాడులు
ఎక్సైజ్ అధికార్లకు కలెక్టర్ సిద్ధార్ధ జైన్ ఆదేశం
ఏలూరు, జూలై 16 : జిల్లాలో పలు ప్రాంతాల్లోని ఇళ్లల్లో మద్యం అక్రమ నిల్వలు ఉన్నట్లు సమాచారం అందిందని త్వరలోనే మెరుపుదాడులు నిర్వహించి అక్రమ నిల్వలను బయట పెట్టాలని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్‌జైన్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో మంగళవారం ఎక్సైజ్ అధికారులతో మద్యం నిల్వల వివరాలను ఆయన సమీక్షించారు. పంచాయతీ ఎన్నికల్లో మద్యం, మనీ ప్రభావాన్ని నిరోధించడానికి జిల్లాలో మెరుపుదాడులు నిర్వహిస్తామని ముఖ్యంగా మద్యాన్ని అక్రమంగా ఇళ్లల్లో దాచి ఉంచారనే సమాచారాన్ని తెలుసుకున్నామని చెప్పారు. జిల్లాలో మూడు ప్రాంతాల్లోని ఇళ్లల్లో అక్రమ మద్యం నిల్వలు ఉన్నట్లు పక్కా సమాచారం ఉందని దాని ప్రకారం ఆయా ఇళ్లపై దాడులు నిర్వహించి అక్రమ మద్యం నిల్వలను స్వాధీనం చేసుకోవాలని చట్ట ప్రకారం ఆయా ఇళ్ల యజమానులపై కూడా కేసులు పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో అక్రమ సారా తయారీని పూర్తిగా నిరోధించాలని గత 15 రోజులుగా 1503 లీటర్ల అక్రమ సారాను అధికారులు స్వాధీనం చేసుకున్నారని అయితే మారుమూల ప్రాంతాల్లో కూడా దాడులు ముమ్మరం చేసి అక్రమ సారాయి తయారీదారులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. జిల్లాలో జూలై 3వ తేదీ నుండి ఇంత వరకూ 82360 లీటర్ల బెల్లం ఊటను స్వాధీనపర్చుకున్నామన్నారు. రోజూ వారీ మద్యం విక్రయాలపై నివేదిక అందజేయాలని ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో ఎన్నికల్లో పోటీ చేసే సర్పంచ్, వార్డుమెంబరు అభ్యర్ధులు ఎన్నికల కమిషన్ సూచించిన మేరకు ఖర్చు చేయాలని ఓటర్లను ఆకర్షించడానికి నగదు, మద్యం పంపిణీకి పాల్పడితే అనర్హత వేటు తప్పదని కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో గ్రామస్థాయిలో కూడా మోడల్ కోడ్ బృందాలు క్షుణ్ణంగా నిఘా నిర్వహిస్తున్నాయని ఈ స్థితిలో అభ్యర్థులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించవద్దని ఆయన హితవు పలికారు. గతేడాది జూలై మాసంలో జిల్లాలో ఐఎంఎల్ 1,44,771 కేసులు, 45990 కేసుల బీరు సరఫరా జరగ్గా ప్రస్తుత జూలై మాసంలో ఇప్పటి వరకూ ఐ ఎం ఎల్ 1,25,260 కేసులు, 38125 కేసులు బీరు సరఫరా అయ్యిందని చెప్పారు.
అభ్యర్థుల బ్యాంకు ఖాతాలపై నిఘా
జిల్లాలో పంచాయితీ ఎన్నికల పోటీలో ఉన్న అభ్యర్థుల బ్యాంకు ఖాతా లావాదేవీలపై కూడా ప్రత్యేక నిఘా ఉంచామని, ఎక్కువ మొత్తాలలో డబ్బు డ్రా చేసి ఆ సొమ్మును ఎలా ఖర్చు చేస్తున్నారో కూడా నిఘాను పెంచామని కలెక్టర్ చెప్పారు. అభ్యర్థుల తరఫున ఎవరైనా 10 రూపాయలు లోపు మాత్రమే ఖర్చు చేయాలని అంతకుమించి సొమ్ము ఖర్చు చేస్తే ఆ ఖర్చును అభ్యర్ధి ఎన్నికల ఖర్చుగా పరిగణనలోనికి తీసుకుంటామని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 21 జాయింట్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసామని డబ్బు ఎక్కువ మొత్తంలో తీసుకువెళుతున్న సందర్భంలో రెండు చోట్ల సీజ్ చేయడం జరిగిందని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 50 వేల రూపాయలకు మించి సొమ్ము తీసుకువెళ్లేవారు సంబంధిత ఆధారాలతో ఉండాలని వ్యాపార లావాదేవీలు సాగించుకునే వారెవరూ ఇబ్బంది పడకుండా ఉండాలంటే రికార్డు తప్పనిసరి అని కలెక్టర్ చెప్పారు.
ఎస్‌ఎంఎస్‌లపై ప్రత్యేక నిఘా
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొంత మంది అభ్యర్ధులు వారి శ్రేయోభిలాషులు ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి ఎస్‌ఎంఎస్‌ల ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్న అంశంపై కూడా దృష్టి కేంద్రీకరించామని అటువంటి అభ్యర్ధనలను పరిగణనలోనికి తీసుకుని ఎన్నికల వ్యయ పరిధిలోనికి తీసుకురావడం జరుగుతుందని చెప్పారు. ఇప్పటికే ఈ విషయంపై ఆయా సెల్ ఏజెన్సీల నుండి సమాచారం రాబట్టేందుకు వారికి లేఖలు రాయడం జరిగిందన్నారు. సమావేశంలో ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ రాజేశ్వరరావు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కె మధుసూదనరావు, దాసరి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

పనుల నాణ్యతలో రాజీపడవద్దు
పిఆర్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికార్లతో కలెక్టర్
ఏలూరు, జూలై 16 : ప్రజోపయోగకర పనులు సకాలంలో పూర్తి చేయడంతోపాటు నాణ్యత విషయంలో ఎటువంటి రాజీ పడవద్దని జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ్ జైన్ పంచాయితీరాజ్, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో 2012-13 సంవత్సరంలో ఇంజనీరింగ్ శాఖలు చేపట్టిన పనుల ప్రగతిని మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ అభివృద్ధి పనుల ప్రగతిలో పురోగతి ఉండాలని, అదే సమయంలో నాణ్యతా ప్రమాణాలు ఖచ్చితంగా పాటించాలన్నారు. పనుల నాణ్యతలో సంబంధిత ఇంజనీరింగ్ అధికారులే బాధ్యత వహించాల్సి వుంటుందన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే పనులు వేగవంతం చేసి నిర్ధేశించిన సమయానికి పూర్తి చేయాలన్నారు. అదే సమయంలో పూర్తి అయిన పనులకు త్వరితగతిన చెల్లింపులు జరిగేలా జిల్లా పరిషత్తు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. తాను కొన్ని పనులను ఆకస్మిక తనిఖీలు చేసి పరిశీలిస్తానని సంబంధిత ఎస్టిమేట్లు, ప్లాన్‌లు, నాణ్యతా ప్రమాణాలు ఆ సమయంలో తనిఖీ చేస్తామన్నారు. చేపట్టిన పనుల్లో జాప్యానికి కారణాలుంటే వాటిని సంబంధిత డి ఇ, ఇ ఇ, ఎస్ ఇల దృష్టికి తీసుకెళ్లి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. త్వరలో మండల ప్రజాపరిషత్ అభివృద్ధి పనులు కూడా పరిశీలిస్తానన్నారు. 2012-13లో 9.82 కోట్ల రూపాయలతో చేపట్టిన 293 పనుల్లో ఇప్పటి వరకూ 7.98 కోట్ల రూపాయల విలువైన 239 పనులు పూర్తి చేయడం జరిగిందన్నారు. 1.23 కోట్ల రూపాయలతో ప్రగతిలో ఉన్న 39 పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

మొక్కలు పెంచడం సామాజిక బాధ్యత:డిజిపి
ఏలూరు, జూలై 16 : మొక్కలు పెంచడం ప్రతీ ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని రాష్ట్ర డిజిపి దినేష్‌రెడ్డి అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం ప్రాంగణంలో మంగళవారం సాయంత్రం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాస్‌పోర్టు విధానాన్ని కంప్యూటర్ ద్వారా సులభతరం చేయడంతో పశ్చిమగోదావరి జిల్లాలోనే లక్షా 68 వేల తెల్లకాగితాలను ఆదా చేయగలిగారని, ఇదే విధానాన్ని రాష్ట్రంలో అమలు చేసి, కోట్లాది కాగితాల వాడకాన్ని నిషేధిస్తామన్నారు. పాస్‌పోర్టు జారీలో దేశంలోనే పశ్చిమగోదావరి అగ్రస్థానంలో ఉందని జిల్లా ఎస్‌పి ఎం రమేష్‌ను ఆయన అభినందించారు. జిల్లా కలెక్టర్ సిద్ధార్ధ జైన్ డిజిపిని కలుసుకుని ముచ్చటించారు. డిజిపితో కలిసి మొక్కలు నాటారు.

దుద్దుకూరులో భారీ కొండచిలువ హతం
దేవరపల్లి, జూలై 16: దేవరపల్లి మండలం దుద్దుకూరులో మాజీ సర్పంచ్ కాకర్ల శ్రీనివాసరావుకు చెందిన చెరకు తోటలో 15 అడుగుల పొడవు గల పింజరగున్న పాము కూలీలకు కనబడడంతో ఆ పామును హతమార్చారు. మంగళవారం చెరకుతోటలో జడ వేసేందుకు వెళ్లిన కూలీలకు మధ్యాహ్నం ఈ పాము కనబడడంతో కూలీలు, చుట్టుపక్కల ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ పాముకు రెండు సంవత్సరాల వయస్సు వుంటుందని రైతులు పేర్కొన్నారు.

కుంగిన చెరువు గట్టు
గండి పడితే ఖరీఫ్ కష్టమే - మరమ్మతులకు నడుంబిగించిన రైతులు
పోలవరం, జూలై 16: పోలవరం మండలంలోని అతి పెద్దదైన కొత్తూరి చెరువుగట్టు కుంగిపోవడంతో ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. పోలవరం మండలంలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు, ఏజన్సీలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లడంతో కొత్తూరి చెరువు పూర్తిగా నిండి ప్రమాదస్థాయికి చేరింది. ముఖ్యంగా చెరువు వద్ద ఒకటో నెంబరు తూము వద్ద గట్టు ఒక్కసారిగా కుంగిపోయింది. ఈ గట్టుకు గండి పడితే ఈ ఏడాది ఖరీఫ్ సాగు కష్టమని రైతులు ఆందోళన చెందుతున్నారు. సుమారు రెండువేల ఎకరాలకు సాగునీరందించే ఈ చెరువుపై రైతులు ఆధారపడ్డారు. గట్టులో వున్న కాంక్రీటు తూము ముక్కలైందని, ఈ కారణంగా గట్టు కుంగిపోయిందని రైతులు అనిశెట్టి రాథాకృష్ణ, కాండ్రు ప్రభాకరరావు, అల్లిమిల్లి నారాయణ, వెంకట్రావు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలవరం తహసీల్దార్ ఐ నాగేశ్వరరావు చెరువు గట్టును పరిశీలించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అయితే మంగళవారం ఇరిగేషన్ అధికారులెవరూ రాకపోవడంతో ఆయకట్టు రైతులంతా స్వచ్ఛందంగా మూడు ట్రాక్టర్లలో గ్రావెల్ తీసుకెళ్లి గట్టును పటిష్ఠ పరిచే కార్యక్రమం ప్రారంభించారు. అయితే ఉదయం నుండి కురుస్తున్న వర్షం కారణంగా కొత్తూరు చెరువుకు వెళ్లే మార్గం సరిగా లేకపోవడంతో ఒక ట్రాక్టర్ తిరగబడింది. ఈ సంఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.

‘ఆంధ్రభూమి ప్రతినిధి’తో కలెక్టర్ సిద్ధార్ధ జైన్ *డబ్బు, మద్యంపై ప్రత్యేక దృష్టి *జిల్లాలో 21 చెక్ పోస్టులు *లెక్క తేడా వస్తే అభ్యర్థులకు ఇబ్బందే *కోడ్ అమలులో రాజీ ఉండదు
english title: 
collector

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>