వరంగల్, జూలై 16: బిల్లుల చెల్లింపుల కోసం కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటుండగా వరంగల్ ఎంజిఎం ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.రామకృష్ణను అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఎసిబి అధికారుల కథనం ప్రకారం ఎంజిఎం ఆసుపత్రికి ఆక్సిజన్ సిలండర్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ మనోహర్‌రెడ్డికి 10లక్షల రూపాయల బిల్లులు చెల్లించేందుకు సూపరింటెండెంట్ డాక్టర్ రామకృష్ణ 1.50లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశారు. ఇంత మొత్తం డబ్బు ఇవ్వలేనని కాంట్రాక్టర్ చెప్పినా సూపరిండెంటెండ్ బిల్లుల చెల్లింపుకు ససేమిరా అని మొండికేశారు. దాంతో కాంట్రాక్టర్ ఎసిబి అధికారులను ఆశ్రయించాడు. ఎసిబి అధికారులు ఇచ్చిన డబ్బు తీసుకుని కాంట్రాక్టర్ మంగళవారం ఉదయం హన్మకొండ రెడ్డికాలనీలోని డాక్టర్ రామకృష్ణ ఇంటికి వెళ్లి ఆ డబ్బును అందజేశాడు. కాంట్రాక్టర్ నుంచి రామకృష్ణ డబ్బు తీసుకున్న వెంటనే ఎసిబి అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రామకృష్ణ ఇంటితోపాటు ఎంజిఎంలోని ఆయన కార్యాలయంలో ఎసిబి అధికారులు తనిఖీలు నిర్వహించారు. రామకృష్ణపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఎసిబి డిఎస్పీ సాయిబాబా తెలిపారు. ఈ కేసులో ఫార్మసి విభాగం సూపర్‌వైజర్ స్వామి ఫరారీలో ఉన్నట్లు చెప్పారు. సర్జరీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న రామకృష్ణ 70రోజుల క్రితమే ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు చేపట్టి ఇలా పట్టుబడటం డాక్టర్లలో చర్చనీయాంశంగా మారింది.
కోడ్ మీరితే కఠిన చర్యలు
ఎన్నికల పరిశీలకుడు సత్యనారాయణ
జనగామ, జూలై 16: పోటీలోవున్న అభ్యర్ధులు ఎన్నికల నియామవళిని ఉలంఘిస్తే చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎన్నికల పరిశీలకులు కె.వి సత్యనారాయణ, ఎన్నికల ఖర్చుల నిఘా అధికారి బి.శ్రీనివాస్ అన్నారు. మంగళవారం వారు జనగామలో పర్యటించారు. ఈసందర్భంగా ఎన్నికల తీరు, అభ్యర్ధుల స్క్రూటినీ, చెక్‌పోస్టులు, ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ అభ్యర్ధులు ఎన్నికల నియమావళి కంటే అధికంగా ఖర్చు చేసిన చర్యలు ఉంటాయని అన్నారు. అన్నికల నిబందన ప్రకారం అభ్యర్ధలు ప్రచారం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఆవాంచనీయ సంఘటనలు జరుగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా ఉండాలన్నారు. అధికారుల వెంట ఆర్డీవో వెంకట్‌రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
ఉగ్ర ప్రభగా భద్రకాళి
వరంగల్, జూలై 16: చల్లనితల్లిగా సమస్త భక్తజనావళి పూజలందుకొంటున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరీ నవరాత్రి ఉత్సవాలు ఎనిమిదవ రోజు కార్యక్రమంలో భాగంగా మంగళవారం అమ్మవారిని ‘ఉగ్రప్రభ’ క్రమంలో అలంకరించి పూజారాధనలు జరిపారు. ఉగ్రప్రభ అమ్మవారికి జ్వాలామాలిని అని కూడా పిలుస్తారు. అమ్మవారు ప్రళయకాలమునందలి అగ్నితో సమానమైన శరీరకాంతులతో చిరునవ్వులు కురిపిస్తూ ఆరుముఖాలతో 12చేతులతో ఉంటుంది. కుడివైపు కింది నుండి పైకి అభయముద్ర, అంకుశం, దర్భల, ఖడ్గం, శక్తిని, వింటిని, అదేవిధంగా ఎడమవైపు వరదముద్ర, పాశం, శూలం, ఖేటం, పద్మం, బాణం ధరించి మణులతో, విభూషణాలతో ప్రకాశిస్తుంది. ప్రకృతిని, ప్రాణికోటిని బాధించే శక్తులను తన ఉగ్రప్రభల నుండి ప్రజ్వరిల్లే ప్రళయకాలాగ్ని జ్వాలలతో సంహరిస్తుంది. పాడిపంటలకు కీడు తలపెట్టు అసురీశక్తులను నశింపజేస్తుంది. అతివృష్టి, అనావృష్టులకు కారణమగు అసురీశక్తులతో ఉదాహరణకు అంతరిక్షంలో ఎల్నినో వంటి ప్రతీపశక్తులను నిరోధిస్తుంది. కాళిక భక్తులకు వరాలు, సకల విధాల అభయాన్ని ప్రసాదించి భక్తుల కోరికలను తీరుస్తుందని వేదపండితులు చెబుతారు. మంగళవారం హైదరాబాద్ నుండి ఐజి ఉమాపతి సతీమణి కమల భద్రకాళి దేవాలయంలో ముత్తయిదువులతో అమ్మవారికి లక్ష కుంకుమార్చన జరిపించారు. కాజీపేటకు చెందిన డాక్టర్ వొడితెల సులోచన విశ్వనాథరావు అమ్మవారికి విశేషసేవలను నిర్వహించారు. బ్రహ్మశ్రీ ఎల్లంపట్ల సురేష్, చెప్పెల సదాశివశర్మ హవన కార్యక్రమం నిర్వహించారు.
లొంగిపోయిన నక్సలైట్‌కు ఆర్థిక సహాయం
వరంగల్, జూలై 16: నక్సల్స్ అడవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలవాలని వరంగల్ రూరల్ ఎస్పీ జి.పాలరాజు పిలుపునిచ్చారు. గతంలో పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయిన న్యూడెమోక్రసీ పుల్లన్న దళ సభ్యుడు ఈక రవి అలియాస్ ఆర్‌కెకు తాత్కాలిక ఆర్థిక సహాయం కింద ఐదువేల రూపాయల చెక్కును రూరల్ జిల్లా ఎస్పీ మంగళవారం అందజేశారు. గత మార్చి నెలలో నర్సంపేట డిఎస్పీ సరిత ఎదుట లొంగిపోయిన కొత్తగూడ మండలం బోటిలింగాల గ్రామానికి చెందిన ఈక రవి న్యూడెమోక్రసీ పార్టీలో సభ్యుడిగా పనిచేస్తూ అనారోగ్య కారణాలతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఆర్థిక సహాయం అందజేసిన సందర్భంగా రూరల్ జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో కలసిపోవాలనుకునే అజ్ఞాత నక్సల్స్ ఇకపై డయల్ 100కు ఫోన్ చేసి లొంగిపోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ డాక్టర్ వై.సాయిశేఖర్, రూరల్ ఎస్‌బి-2 సిఐ విద్యాసాగర్ పాల్గొన్నారు.
ఎన్నికలు సజావుగా జరగాలి
* అధికారులకు కలెక్టర్ కిషన్ ఆదేశం
మహబూబాబాద్, జూలై 16: పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ జి.కిషన్ ఆదేశించారు. మహబూబాబాద్ ఆర్డీఒ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ఆయన డివిజన్‌లోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆర్డీఒ బిక్షానాయక్, డిఎస్పీ ఎ.రమాదేవి, డివిజనల్ పంచాయతీ అధికారి జానిమియా, అన్ని మండలాల ఎడీఒలు,ప్రత్యేక అధికారులతో కలెక్టర్ మాట్లాడారు. ఎన్నికల కమిషన్ సూచించిన మార్గదర్శకాల మేరకు నిబంధనల ఉల్లంఘన జరగకుండా చూడాలని కోరారు. నామినేషన్ల దాఖలు, స్క్రూటినీ ఘట్టం ముగియడంతో అభ్యంతరాలను తీసుకున్న అధికారులు ఏ విధంగా వాటిని క్లియర్ చేసిందీ అడిగి తెలుసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినా కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎప్పటికప్పుడు అన్ని వివరాలను సమగ్రంగా జిల్లా యంత్రాంగానికి, ఎన్నికల అధికారులకు పంపించాలని సూచించారు. అధికారుల సందేహాలను నివృత్తి చేశారు.
పంచాయతీ ఎన్నికలు అందరికీ ప్రతిష్టాత్మకమే!
* నక్సల్ చర్యలపై ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
* ఫ్యాక్షన్ పోరుపై అధికారుల్లో కలవరం
* పల్లెల్లో పాగా కోసం పార్టీల పట్టుదల
వరంగల్, జూలై 16: పంచాయతీ ఎన్నికల నిర్వహణ వరంగల్ జిల్లాలో అధికారులకు కత్తిమీద సాములా మారింది. చాపకింద నీరులా విస్తరిస్తున్న నక్సల్ కార్యకలాపాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తంకాగా.. గ్రామాల్లో పార్టీల ఆధిపత్యపోరు ఎలాంటి ఇబ్బందులు తెస్తుందోనని ఎన్నికల్లో తలమునకలైన అధికారులు కలవరపడుతున్నారు. ఇంకోవైపు సాధారణ ఎన్నికలకు ముందు పంచాయతీ ఎన్నికల పర్వంను పార్టీలు ప్రతిష్టగా భావిస్తున్నాయి. తెలంగాణకు కేంద్రమైన వరంగల్‌లో ఈ పర్యాయం పంచాయతీ పోరులో ఉద్యమ ప్రభావం కూడా తీవ్రంగానే ఉండొచ్చని భావిస్తున్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల ఘట్టంలో ఎన్నికల కమిషన్ నిర్వహణ తేదీలు ప్రకటించినపుడు అందరిలోను పెద్దచలనం కనిపించలేదు. ఇక ఎన్నికల నిర్వహణ సమయం దగ్గరపడుతున్న కొద్దీ గ్రామాల్లో సందడి తీవ్రమైంది. మూడువిడుతలుగా ఎన్నికలు జరగనున్నాయి. జిల్లాలో తొలివిడత ఈనెల 23న, రెండోదశ 27న, తుదివిడత పోలింగ్ 31న జరగనుంది. మొదటివిడత ఎన్నికలకు మరోవారం రోజులే గడువు ఉండడంతో అధికార యంత్రాంగం తీరికలేకుండా ఉంది. ఎన్నికల నిర్వహణలో ప్రధానంగా పోలీసుయంత్రాంగం రెప్పవాల్చని నిఘాతో అలర్టు అయింది. జిల్లాలో నక్సలైట్ల ప్రాబల్యం ఎక్కువగానే ఉంది. ఏజెన్సీ ప్రాంతాలైన ములుగు, మంగపేట, తాడ్వాయి, ఏటూరునాగారం తదితర ప్రాంతాలతో పాటు ఇటు నర్సంపేట, భూపాలపల్లిలోను అన్నల కదలికలు ఎక్కువే. అయితే ఒకప్పటి పరిస్థితికి ఇప్పుడు భిన్నమైన పరిస్థితి ఉందని పోలీసువర్గాలు వాదిస్తున్నాయి. లొంగుబాట్లు, ఎన్‌కౌంటర్ ఘటనలతో అన్నలు బలహీనమయ్యారని అంటున్నా..పంచాయతీ ఎన్నికలను కేంద్రంగా చేసుకొని ఏవైనా సంఘటనలకు పాల్పడే అవకాశం లేకపోలేదని ఇంటిలిజెన్స్ వర్గాలు అనుమానిస్తూ హెచ్చరికలు జారీచేశాయి. ఈ కారణంగా పల్లెలు, ఏజెన్సీ ఏరియాను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఇటు పోలీసులతోపాటు అటు గ్రామాల్లో ఎన్నికల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న ఆయాపార్టీల నేతలతోపాటు మాజీల్లోను కలవరం కనిపిస్తోంది. ఏ క్షణాన ఏ సంఘటన జరుగుతుందోననే భయం అందరిలోను లీలగా మెదులుతూనే ఉంది. ఈ క్రమంలో భారీ బలగాలను రంగంలోకి దించుతున్నారు. అనుమానితులపై నిఘా ముమ్మరం చేశారు. ఇటు నక్సల్ సమస్యకు తోడుగా గ్రామాల్లో అల్లర్లు సృష్టించే వారిపైనా పోలీసు స్టేషన్లవారీగా దృష్టి సారించి బైండోవర్లు చేస్తున్నారు. మరోవైపు ఎన్నికల సందర్భంగా రాజకీయ గొడవలు తీవ్రంగా జరిగే సమస్యాత్మక గ్రామాలను కూడ అధికారులు ముందుగానే గుర్తించారు. భూపాలపల్లి, పరకాల, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, నర్సంపేట, ములుగు వంటి అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. పరకాల నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ సిపి నాయకుడు కొండామురళి ఆధిపత్యానికి చెక్ పెట్టేవిధంగా అన్నిపార్టీలు ఏకమవుతున్నాయనే వార్తల నేపథ్యంలో ఏవైనా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయా? అని పోలీసులు దృష్టి సారించారు. సాధారణ ఎన్నికలకు కూడా సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల్లో గెలుపు దక్కించుకోవాలంటే ముందుగా గ్రామాల్లో పట్టు సాధించాలి. పార్టీ రహిత ఎన్నికలైనా తాము మద్దతుపలికి మెజార్టీ సర్పంచు, వార్డు స్థానాలను గెలుచుకోవడం ద్వారా ఆధిపత్యాన్ని నిలుపుకొనేందుకు మరోవైపు అన్ని పార్టీలు కసరత్తు చేస్తూ తదనుగుణంగా వ్యూహాలను అమలుచేస్తున్నాయి. ఇంకోవైపుతెలంగాణ అంశం అన్నిపార్టీలోను గుబులు రేపుతోంది. ఈ విషయంలో తమ అధినాయకత్వం నాన్పుడువైఖరి ఎన్నికల్లో ఏ నష్టాన్ని కలిగిస్తుందోనని కాంగ్రెస్ నాయకుల్లో కలవరం కనిపిస్తుండగా, తెలంగాణపై తమ వైఖరి ముప్పుతెచ్చేనా అని టిడిపి, వైకాప నేతలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పంచాయతీ పోరు పర్వం అందరికీ ప్రతిష్టగామారుతోంది.