న్యూఢిల్లీ, జూలై 19: వయసు మీద పడుతున్న విషయాన్ని గమనించి బ్యాటింగ్‌లో టెక్నిక్‌ను మార్చుకోవాల్సిన అవసరం ఉందని మాస్టర్ బ్యాట్స్‌మన్ సచిన్ తెండూల్కర్‌కు మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్ హితవు పలికాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ సాధారణంగా బ్యాట్స్‌మెన్ ఒకవైపు తిరిగి బ్యాటింగ్ చేస్తారని అన్నాడు. ఫాస్ట్ బౌలింగ్‌ను ఎదుర్కొనే సమయంలో, వేగంగా దూసుకొచ్చే బంతుల దిశను క్షణాల్లో అర్థం చేసుకున్నప్పుడే ఈ విధంగా ఆడవచ్చని పేర్కొన్నాడు. అయితే, వయసు ప్రభావం కారణంగా సచిన్ క్రీజ్‌లో వేగంగా కదలడం సాధ్యం కాదని అన్నాడు. అందుకే, బౌలర్‌కు పూర్తిగా ఎదురునిలబడి బ్యాటింగ్ చేయడం శ్రేయస్కరమని తెలిపాడు. అప్పుడు బంతిని ఆడేందుకు బ్యాట్స్‌మెన్‌కు ఎక్కువ సమయం లభిస్తుందని అన్నాడు. సచిన్ వంటి గొప్ప ఆటగాడు టెక్నిక్‌ను మార్చుకోవడం చాలా సులభమని అన్నాడు. దక్షిణాఫ్రికా టూర్‌కు టీమిండియా వెళుతున్న నేపథ్యంలో, అక్కడి పిచ్‌లు ఫాస్ట్ బౌలింగ్‌కు అనుకూలిస్తాయనే అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చెప్పాడు. యువ ఓపెన్ శిఖర్ ధావన్ మంచి ఓపెనర్ అని అజర్ కితాబునిచ్చాడు. అయితే, దక్షిణాఫ్రికాలో రాణిస్తేనే అతని సత్తా తెలుస్తుందని అన్నాడు. చాంపియన్స్ ట్రోఫీలో భారత్ రాణించిన తీరు అద్భుతమని పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, చటేశ్వర్ పుజారా వంటి యువ ఆటగాళ్లతో భారత జట్టు పటిష్టంగా ఉందన్నాడు. దక్షిణాఫ్రికాలో వీరంతా మరోసారి అద్భుత విజయాలను నమోదు చేస్తారని ధీమా వ్యక్తం చేశాడు.
సచిన్‌కు అజర్ హితవు
english title:
t
Date:
Saturday, July 20, 2013