
కరాచీ, జూలై 19: పాకిస్తాన్ జాతీయ జట్టులో మళ్లీ స్థానం సంపాదించడమే తన లక్ష్యమని వికెట్‌కీపర్ కమ్రాన్ అక్మల్ స్పష్టం చేశాడు. ప్రస్తుతం తన తమ్ముడు ఉమర్ అక్మల్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పచెప్పడాన్ని అతను వ్యతిరేకించాడు. ఉమర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ అనీ, కీపర్‌గానూ అతనినే కొనసాగిస్తే ఆతర్వాత ఎదురయ్యే పరిణామాలకు క్రికెట్ పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నాడు. స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌ను కీపర్‌గా మార్చే ప్రయత్నం తగదని చెప్పాడు. 31 ఏళ్ల వయసు ఉన్న తనలో మరికొంతకాలం అంతర్జాతీయ క్రికెట్ ఆడే శక్తిసామర్థ్యాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ఓపెనర్‌గా బ్యాటింగ్‌కు దిగడానికి సిద్ధమని ప్రకటించాడు. రంజాన్ టి-20 టోర్నమెంట్‌లో తాను జాతీయ బ్యాంక్ తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తున్నానని చెప్పాడు. సెలక్టర్లు తనకు ఆ బాధ్యతను అప్పచెప్తే సంతోషంగా స్వీకరిస్తానని అన్నాడు. వికెట్‌కీపర్లు బ్యాట్స్‌మెన్‌గానూ రాణించిన ఉదంతాలు ఎన్నో ఉన్నాయని, కానీ, ఒక స్పెషలిస్టు బ్యాట్స్‌మన్‌కు కీపింగ్ బాధ్యతలు అప్పచెప్తే, ఈ అదనపు భారంతో అతను రాణించిన సంఘటనలు లేవని చెప్పాడు.