కొలంబో, జూలై 19: ఇటీవల కాలంలో వరుస పరాజయాలతో అల్లాడుతున్న దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు వనే్డ ఇంటర్నేషనల్స్‌లో తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో పడ్డాయి. శనివారం నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల వనే్డ సిరీస్‌లో బలాబలాలు తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నాయి. ఎనిమిది దేశాలు పాల్గొన్న చాంపియన్స్ ట్రోఫీలో ఈ రెండు జట్లూ సెమీస్ నుంచి నిష్క్రమించిన విషయం తెలిసిందే. సంక్లిష్టమైన పరిస్థితుల్లో రాణించలేకపోవడం, ప్రత్యేకించి సెమీస్, ఫైనల్స్ ఒత్తిడిని భరించలేక దారుణంగా విఫలం కావడం దక్షిణాఫ్రికాకు ఆనవాయితీగా మారింది. ఈ ముద్ర నుంచి బయట పడేందుకు లంకతో జరిగే సిరీస్‌ను ఉపయోగించుకోవాలని ఈ జట్టు భావిస్తున్నది. ఎబి డివిలియర్స్ నాయకత్వంలోని దక్షిణాఫ్రికా జట్టులో హషీం ఆమ్లా, అల్విరో పెటెర్సన్, ఫఫ్ డు ప్లెసిస్, జెపి డుమినీ వంటి మేటి బ్యాట్స్‌మెన్ ఉన్నారు. మోర్న్ మోర్కెల్, లొన్వాబొ సొత్సోబ్ బౌలింగ్ విభాగాన్ని శాసించనున్నారు. అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా ఒత్తిడిని అధిగమిస్తే లంకను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకునే అవకాశాలు లేకపోలేదు. అయితే, లంకను తక్కువ అంచనా వేయడం కష్టాలను కొని తెచ్చుకోవడమేనని పలు సందర్భాల్లో స్పష్టమైంది. స్వదేశంలో లంకను ఓడించడం అనుకున్నంత సులభం కాదు. కొత్తగా కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన దినేష్ చండీమల్ ఎంత వరకు తన బాధ్యతలను సమర్థంగా పోషిస్తాడో చూడాలి. తిలకరత్నే దిల్షాన్, కుమార సంగక్కర, మహేల జయవర్ధనే ఆటగాళ్లతో లంక బౌలింగ్ పటిష్టంగా ఉంది. లసిత్ మలింగ, అజంతా మెండిస్, షామిందా ఎరాంగ, రంగన హెరాత్ తదితరులు దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయడానికి సర్వశక్తులు ఒడ్డడం ఖాయం. మొత్తం మీద సమవుజ్జీలుగా కనిపిస్తున్న ఈ రెండు జట్ల మధ్య జరిగే సంకుల సమరం క్రికెట్ అభిమానులను అలరించనుంది.
వనే్డ ట్రోఫీతో శ్రీలంక, దక్షిణాఫ్రికా కెప్టెన్లు చండీమల్, డివిలియర్స్