మార్కాపురం, ఫిబ్రవరి 29: కరవు పరిస్థితుల్లో కూలీలకు పనులు కల్పించాలనే ధ్యేయంతో ప్రభుత్వం అమలు చేస్తున్న మహాత్మగాంధీ ఉపాధి హామీ పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నత్తనడకన సాగుతుంది. ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో కూలీలకు పనులు కల్పించేలా ఎంపిడిఓలు, ఉపాధి హామీ పథకం అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతి సమీక్షా సమావేశంలో ఆదేశించినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ప్రస్తుతం ప్రతి మండలంలో 5 నుంచి 10 పంచాయతీల్లో 20 నుంచి 30మంది కూలీలు మాత్రమే పనులు నిర్వహిస్తున్నట్లు అధికారులు చెప్పడం విశేషం. ప్రస్తుతం ఉపాధిహామీ పనులు చేసినప్పటికీ వారు ఊహించినంత కూలీ రాకపోవడంతోపాటు ఆశించిన మేర పనులు కల్పించకపోవడంతో అనేక గ్రామాల నుంచి వందల సంఖ్యలో కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్ళారు. అనేక గ్రామాల్లో వృద్దులు, పిల్లలు తప్ప పెద్దలు కనిపించే పరిస్థితి లేకుండా పోయింది. ఇదిలా ఉంటే అనేక గ్రామాల్లో కూలీలు ఉపాధిహామీ పనుల్లో సరైన కూలీ రావడం లేదనే అభిప్రాయంతో వ్యవసాయ పనుల వైపు దృష్టి సారించారు. దీనితో అధికారులు గ్రామాలకు వెళ్ళినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ప్రస్తుతం పుల్లలచెరువు, త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పెద్దదోర్నాల, పెద్దారవీడు మండలాల నుంచి అధిక సంఖ్యలో కూలీలు కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఖమ్మం తదితర ప్రాంతాలకు చెరుకు కొట్టేందుకు, వరిపంట కోసేందుకు వలసలు వెళ్ళారు. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుతం మిర్చిపంట అధికంగా ఉండటంతో రోజుకు 150 నుంచి 200 రూపాయల కూలీ లభిస్తుండటంతో ఉపాధిహామీ పనులకు వెళ్ళేవారి సంఖ్య గణనీయంగా తగ్గింది. అధికారులు మాత్రం ఉపాధిహామీ పనులు యదావిధిగా కొనసాగుతున్నాయని, నిత్యం ప్రతి మండలంలో 4వేల నుంచి 5వేల మంది కూలీలు పాల్గొంటున్నారని ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నారు. పథకం ప్రారంభమైన సమయంలో ఎలాంటి కొలతలు లేకుండా రోజుకు 100 నుంచి 150 రూపాయల వరకు కూలి చెల్లించడంతో ఇతర పనులను వదిలేసి ఉపాధి హామీ పనులకు వెళ్ళిన కూలీలు ప్రస్తుతం చేసిన పనులను కొలతలు వేసి వచ్చిన డబ్బును కూలీలకు పంచుతుండటంతో నామమాత్రంగా కూలి రావడంతో ఉపాధి హామీ పనులపై కూలీలు నిరాశక్తత వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అనేక కుటుంబాలు 200రోజులు పనులు చేయడంతో వారికి పనులు కల్పించేందుకు అధికారులు అంగీకరించకపోవడం కూడా పనులు జరగకపోవడానికి కారణమని కూలీలు అంటున్నారు. నిబంధనలను సడలించి కూలీలకు సక్రమంగా కూలి పడేవిధంగా అధికారులు చర్యలు చేపట్టాలని, అలాగే 200రోజులు ముగిసిన వారికి కూడా పనులు కల్పించాలని కూలీలు కోరుతున్నారు.
గ్రామాల్లో తప్పని వలసలు
english title:
officials carelessness
Date:
Thursday, March 1, 2012