ఒంగోలు , ఫిబ్రవరి 29: రైతుల సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వానికి పతనం తప్పదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి హెచ్చరించారు. బుధవారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతోందని ధ్వజమెత్తారు. అన్నదాతకు అండగా నిలవాల్సిన పాలకులు వారిని కష్టాల్లోకి నెట్టి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. ఒకవైపు తమది రైతు ప్రభుత్వమని, వైఎస్ ఆశయాలు, హామీలు నెరవేరుస్తామని ప్రకటనలు చేస్తూ మరోవైపు అన్నదాతను అథఃపాతాళానికి తొక్కేయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. జగన్‌కు లభిస్తున్న ప్రజాదరణను నిలువరించలేక వైఎస్ అభిమానులపై కక్ష సాధిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల ప్రాధాన్యత తెలిసి వాటి నిర్మాణానికి నిధులు నిలిపివేయటం ఇందులో భాగమేనన్నారు. 2004 నుండి 2009 వరకు ఉన్న అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రస్తుతం లేవన్నారు. ఎరువులు, విత్తనాల ధరలు ఆకాశాన్ని అంటాయన్నారు. నిత్యం పెరుగుతున్న ఆయిల్ ధరలు, కూలిరేట్లు, సాగు ఖర్చు విపరీతంగా పెరిగిందన్నారు. కాని మద్దతు, గిట్టుబాటు ధరలు మాత్రం పెరగడం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన పాలకులు పంటకు సాగునీరు కూడా లేకుండా చేస్తున్నారన్నారు. ఈ ఏడాది ఎకరా పత్తి పండించేందుకు 40 వేలు ఖర్చయిందని, దిగుబడి 6 నుండి 7 క్వింటాళ్ళు మాత్రమే వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 7 వేల రూపాయలు ఇవ్వాల్సిన అవసరం ఉందని, ప్రస్తుతం క్వింటాకు 3200 మాత్రమే ఇస్తున్నారని, మద్దతు ధరకంటే 300 తక్కువన్నారు. ఈ ఏడాది మిర్చి పంట ఎకరాకు 1.20 లక్షలు ఖర్చయిందని, క్వింటాకు 12 వేల రూపాయలు ఇస్తే తప్ప రైతులు గట్టేక్కే పరిస్థితి లేదన్నారు. పొగాకు రైతులను వ్యాపారులు నిలువు దోపిడి చేస్తున్నారన్నారు. కిలోకు 130 రూపాయలు, సగటు ధర 110 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలని పొగాకుబోర్డు, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. క్వింటా ధాన్యం ఉత్పత్తికి 1200 రూపాయలకు పైగా ఖర్చవుతుందని, ప్రభుత్వం మాత్రం 1100 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటోందని, తక్షణమే 1300 రూపాయలు ఇవ్వాలన్నారు. రైతుకు గిట్టుబాటు ధర వచ్చేవరకు ఉత్పత్తులను ఎఎంసి గిడ్డంగులలో దాచుకునే అవకాశం కల్పించడంతోపాటు 75 శాతం రుణాలు అందించాలన్నారు. ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు సాగునీరు ఇవ్వాలని, లేకపోతే జిల్లాలో ఉన్న లక్షల హెక్టార్లలో వివిధ పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందన్నారు. రబీ సీజన్ ముందు రైతుల నుండి బలవంతంగా లాక్కొన్న విత్తన శనగలకు సంబంధించిన బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. చంద్రబాబుతో కుమ్మక్కైన కిరణ్ ప్రభుత్వం ఆయన తరహాలోనే రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవడం ఇకనైనా మానుకోవాలని, లేదంటే చరిత్రహీనులుగా మిగిలి పోవడం ఖాయమన్నారు. ఈ సమావేశంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.
===
‘ఫైర్ స్టేషన్ పనితీరు భేష్’
చీరాల, ఫిబ్రవరి 29: చీరాల అగ్నిమాపక కేంద్రం పనితీరు బాగుందని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి ఆర్ జ్ఞానసుందరం ప్రశంసించారు. స్థానిక అగ్నిమాపక కేంద్రాన్ని బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఫైర్ స్టేషన్ పనితీరు సక్రమంగా ఉండేలా పనిచేస్తున్న అధికారి వి శ్రీనివాసరెడ్డిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా డిఎఫ్‌వో మాట్లాడుతూ నూతనంగా 9 మంది సిబ్బందిని, ఐదుగురు హోంగార్డులను నియమించటంతో సిబ్బంది కొరత తీరిందన్నారు. మరో వాహనం, నూతన భవన నిర్మాణానికి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపగా వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. చీరాల ఫైర్ స్టేషన్‌లో మరింత మెరుగైన సౌకర్యాలు కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. అనంతరం రికార్డులను ఆయన పరిశీలించారు. సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌వో వి శ్రీనివాసరెడ్డి, వి కోటేశ్వరరావు, వాసు, విలియం, మోజస్, పి వెంకటేశ్వర్లు, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
========
జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓగా నారాయణరెడ్డి
ఒంగోలు , ఫిబ్రవరి 29: జిల్లాపరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారిగా జివి నారాయణరెడ్డి బుధవారం అదనపు బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన కొత్తపట్నం ఎంపిడిఓగా పనిచేస్తూ జిల్లా పరిషత్‌లో అదనపు బాధ్యతలు చేపట్టారు. ఎపిపిఎస్‌సి ద్వారా 1999లో డైరెక్టర్‌గా ఎంపిడిఓగా ఎంపికై జిల్లాలోని కొనకనమిట్ల ఎంపిడిఓగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆ తరువాత చీమకుర్తిలో మూడు సంవత్సరాలు, ప్రస్తుతం కొత్తపట్నంలో మూడున్నర సంవత్సరాల నుండి పని చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రాత్రి జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓగా నారాయణరెడ్డి అదనపు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే ఆరుసార్లు ఉత్తమ ఎంపిడిఓగా అవార్డులు తీసుకున్నారు. అదేవిధంగా చినగంజాం ఎంపిడిఓ జి భాస్కర్ జిల్లా పరిషత్‌లో అకౌంటెంట్ అఫీసర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఎపిపిఎస్‌సి ద్వారా 2007లో డైరెక్ట్‌గా ఎంపిడిఓగా ఎంపికై జిల్లాలోని కొనకనమిట్లలో బాధ్యతలు చేపట్టారు. అక్కడి నుండి ప్రస్తుతం చినగంజాం ఎంపిడిఓగా పనిచేస్తున్న భాస్కర్‌కు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా పరిషత్‌లో ఎఓగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన కూడా బుధవారం బాధ్యతలు చేపట్టారు. అదనపు బాధ్యతలు చేపట్టిన ఎంపిడిఓలు జివి నారయణరెడ్డి, జి భాస్కర్‌లను ఎంపిడిఓల సంఘం అసోసియేషన్ నాయకులు కలిసి అభినందనలు తెలిపారు.