కోల్‌కతా, జూలై 24: ద్రవ్య చలామణిని అదుపు చేయవద్దని ప్రభుత్వరంగ బ్యాంకిం గ్ దిగ్గజం ఎస్‌బిఐ చైర్మన్ ప్రతీప్ చౌధురి రిజర్వ్ బ్యాంకును కోరారు. బుధవారం ఇక్కడ ఫిక్కి నిర్వహించిన బ్యాంకింగ్ కన్‌క్లేవ్ ప్రారంభోత్సవ క్రమంలో పాల్గొన్న ఆయన ద్రవ్యోల్బణం చేజారిపోతుందనిపిస్తే వడ్డీరేట్లను పెంచండి తప్ప ద్రవ్య చలామణిని అదుపు చేయవద్దని ఆర్‌బిఐని కోరారు. ద్రవ్యోల్బణం పెరుగుదల, రూపాయి విలువ క్షీణత నేపథ్యంలో ఆర్‌బిఐ ద్రవ్యివిధానంలో తీసుకుంటున్న మార్పులు బ్యాంకింగ్ విధానంలో కొన్ని విపత్కర పరిణామాలకు దారి తీస్తున్నాయనే ఆందోళనను ఆయన ఈ సందర్భంగా వ్యక్తంచేశారు.
ప్రతీప్ చౌధురికి గ్రీన్ సర్టిఫికెట్ అందిస్తున్న ఫిక్కి బెంగాల్ విభాగం చైర్మన్ గౌరవ్ స్వరూప్
ఫ్రెంచ్ సంస్థ కొనుగోలును పూర్తిచేసిన టిసిఎస్
న్యూఢిల్లీ, జూలై 24: ఫ్రాన్స్‌కు చెందిన ఆల్టి ఎస్‌ఎ కొనుగోలును పూర్తి చేసినట్లు ఐటి దిగ్గజం, టాటా గ్రూప్‌లోని టిసిఎస్ బుధవారం తెలిపింది. రూ.533 కోట్ల తో జరిగిన ఈ లావాదేవీలతో యూరప్‌లోని ఐటి మార్కెట్‌లో టిసిఎస్ ఇక కీలక పాత్ర పోషించనుంది. కాగా, దేశీయ ఐటి రంగంలో తనదైన పాత్ర పోషిస్తూ వృద్ధిపథంలో దూసుకెళ్తున్న టిసిఎస్ ప్రపంచవ్యాప్తంగానూ ఐటి రంగం లో తన దూకుడును ప్రదర్శించాల నుకుంటోంది. ఈ క్రమంలోనే విదేశీ సంస్థలను సొంతం చేసుకుంటోంది.
సహారాకు కోర్టు ధిక్కార నోటీసులు
* రెండు సంస్థలకు జారీ చేసిన సుప్రీం
* 30న సమాధానం చెప్పాలని ఆదేశం
న్యూఢిల్లీ, జూలై 24: సహారా గ్రూప్‌లోని రెండు సంస్థలకు కోర్టు ధిక్కార నోటీసులను బుధవారం సుప్రీం కోర్టు జారీ చేసింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ద్వారా మదుపర్లకు 19,000 కోట్ల రూపాయలను తిరిగి చెల్లించాలంటూ గతంలో చేసిన ఆదేశాన్ని సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్‌తోపాటు సహారా హౌజింగ్ ఇనె్వస్ట్‌మెంట్ కార్పొరేషన్‌లు పాటించకపోవడాన్ని అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. అయితే సహారాకు చెందిన రెండు సంస్థలు పెట్టుకున్న పిటిషన్‌పై స్పందిస్తూ ఈ కేసును ఈ నెల 30కి వాయిదా వేసిన జస్టిస్ కెఎస్ రాధాక్రిష్ణన్, జస్టిస్ జెఎస్ ఖేహర్‌లతో కూడిన సుప్రీం ధర్మాసనం.. వచ్చే మంగళవారం దీనికి తప్పనిసరిగా సమాధానం చెప్పాలని స్పష్టం చేసింది. ఈ కేసులో మరోసారి వాయిదా అంటూ ఉండదని, సమాధానం చెప్పేందుకు మరికొంత సమయం ఇచ్చే ప్రసక్తి లేదని ఈ సందర్భంగా సహారా గ్రూప్‌నకు సుప్రీం తేల్చి చెప్పింది. కాగా, నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి కోట్లాది రూపాయలను డిపాజిట్ల రూపంలో సేకరించారనే కేసులో గతంలో సుప్రీం ఇచ్చిన ఆదేశాలను రెండు సంస్థలు పాటించలేదని సెబీ ఆరోపిస్తూ వేసిన పిటిషన్‌పై తాజా కోర్టు ధిక్కార నోటీసులు జారీ అయ్యాయి. 3 కోట్లకుపైగా ఉన్న మదుపర్లకు 15 శాతం వడ్డీతో 24,000 కోట్ల రూపాయలను చెల్లించాలని సహారాను గత డిసెంబర్ 5న సుప్రీం ఆదేశించింది. ఇందుకు తొమ్మిది వారాల గడువునివ్వగా, వెంటనే 5,120 కోట్ల రూపాయలను చెల్లించాలని, మిగతా సొమ్మును రెండు దఫాలుగా సెబీకి చెల్లించాలని సూచించింది. తొలి విడతగా 10,000 కోట్ల రూపాయలను జనవరి మొదటి వారంలో, రెండో విడతగా మిగతా సొమ్మును ఫిబ్రవరి మొదటి వారంలో చెల్లించాలంది. అయితే ఈ సూచనలను సహారా గ్రూప్‌లోని రెండు సంస్థలు ఆచరణలో పెట్టకపోవడంతో కోర్టు ధిక్కా ర నోటీసులు జారీ అయ్యాయి.