న్యూఢిల్లీ, జూలై 24: దేశీయ ఐటి దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్‌లో ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్‌ఐసి వాటా పెరిగింది. తాజాగా దాదాపు 1,200 కోట్ల రూపాయల విలువైన షేర్లను కొనుగోలు చేసి వాటాను ఎల్‌ఐసి 6.72 శాతం పెంచుకుంది.
పెరిగిన ఒబిసి ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు
న్యూఢిల్లీ, జూలై 24: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (ఒబిసి) బుధవారం ఫిక్స్‌డ్ డిపాజిట్ల వడ్డీరేట్లను 0.75 శాతం వరకు పెంచింది. ఎంపిక చేసిన కాలపరిమితి గల డిపాజిట్లపై పెరిగిన ఈ వడ్డీరేట్లు గురువారం నుంచి అమల్లోకి వస్తాయని ఓ ప్రకటనలో తెలిపింది. తీవ్రమైన ద్రవ్యకొరతను అధిగమించడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
ప్యాసింజర్ కోచ్‌ల తయారీకి రైల్వేతో సెయిల్ చర్చలు
న్యూఢిల్లీ, జూలై 24: ఉక్కు ఉత్పాదక దిగ్గజం సెయిల్, భారత రైల్వే శాఖతో ప్యాసింజర్ రైళ్ల కోచ్‌లను తయారుచేసే ఒప్పందంపై చర్చలు జరుపుతోంది. సెయిల్, ఇండియన్ రైల్వే సంయుక్తంగా 1,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ ప్యాసింజర్ కోచ్‌ల తయారీ పరిశ్రమను నెలకొల్పాలని భావిస్తున్నాయి. ఈ మేరకు సెయిల్ చైర్మన్ సిఎస్ వర్మ పిటిఐకి తెలిపారు. చక్రాలు, ఇరుసు, పట్టాలను రైల్వేకు సరఫరా చేస్తున్న సెయిల్.. ప్యాసింజర్ కోచ్‌లను మాత్రం అందించలేకపోతోంది. అందుకే ఆ లోటును కూడా తీర్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే ఏడాది ముగింపుకల్లా గూడ్స్ వ్యాగన్ల తయారీనీ సెయిల్ చేపట్టనుంది.