లండన్, జూలై 24: దేశీయ ఐటి రంగ దిగ్గజ సంస్థల్లో ఒకటైన విప్రో వ్యవస్థాపకులు, ఆ సంస్థ చైర్మన్ అజీమ్ ప్రేమ్‌జీకి ప్రస్తుత సంవత్సరం 2013కుగానూ ప్రతిష్ఠాత్మక ‘ఆసియన్ బిజినెస్ లీడర్స్ అవార్డ్’ దక్కింది. ఆకర్షణీయమైన వ్యాపార లక్షణాలతోపాటు ఆయనలోని సమాజ సేవ, మానవతా దృక్పథం ఈ అవార్డును తెచ్చిపెట్టాయి. ‘ఈ ఏడాది అవార్డుకు అజీమ్ ప్రేమ్‌జీ ఎంపికయ్యారు. ఆకట్టుకునే వ్యాపార లక్షణాలు కలిగిన ఆయన సమాజాభివృద్ధికి చేస్తున్న విశేష కృషి ఇతరులకు ఆదర్శనీయం’. అని అవార్డు ప్రకటించిన ఆసియా హౌజ్ పేర్కొంది. లండన్‌కు చెందిన ఈ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఈ మేరకు బుధవారం ఇక్కడ ఓ ప్రకటన విడుదల చేసింది. వ్యాపారం, సంస్కృతి, విధానాల ద్వారా బ్రిటన్, ఆసియా దేశాలను దగ్గర చేయడమే లక్ష్యంగా ఆసియా హౌజ్ పనిచేస్తోంది. కాగా, ఈ అవార్డును అక్టోబర్ 14న లండన్‌లో జరిగే వేడుకల్లో ప్రదానం చేయనున్నారు. ఇదిలావుంటే ఇంతకుముందు ఈ అవార్డు టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటాతోపాటు హెచ్‌ఎస్‌బిసి హోల్డిం గ్స్ గ్రూప్ మాజీ చైర్మన్, బ్రిటన్ వాణిజ్య, పెట్టుబడుల శాఖ సహాయ మంత్రి లార్డ్ స్టిఫెన్ గ్రీన్‌కు లభించింది. 68 ఏళ్ల ప్రేమ్‌జీ అత్యుత్తమ వ్యాపారవేత్తగానేగాక, ఓ దాతగానూ సుపరిచితులు. బిల్‌గేట్స్, వారన్ బఫెట్ తరహాలో ప్రేమ్‌జీ సైతం తన సంపదలో మెజారిటీ భాగం సమాజానికి అంకితం చేస్తున్నారు.
జరిమానాలపై టెలికాం
ఆపరేటర్లకు ఊరట?
80 శాతం తగ్గించనున్న
టెలికాం శాఖ
న్యూఢిల్లీ, జూలై 24: టెలికాం ఆపరేటర్లకు గొప్ప ఊరట లభించనుంది. వినియోగదారులకు సంబంధించి అసంపూర్ణ పరిశీలన, వివరాల కేసుల్లో టెలికాం ఆపరేటర్లపై టెలికాం శాఖ విధించిన జరిమానాలు 80 శాతం తగ్గనున్నాయి మరి. ఇప్పటిదాకా 2.7 కోట్ల వినియోగదారుల ధ్రువ పత్రాలను టెలికాం ఎన్‌ఫోర్స్‌మెంట్, రీసోర్స్ అండ్ మానిటరింగ్ విభాగాలు పరిశీలించగా, 3,000 కోట్ల రూపాయల జరిమానా విధించడం జరిగింది.
అయితే టిడిశాట్ తీర్పు తర్వాత ఈ జరిమానా రీ-కాలిక్యులేట్ అవుతుండగా, అది దాదాపు 500 కోట్ల రూపాయలుగా ఉండనుంది. ఈ నేపథ్యంలో కేంద్ర టెలికాం శాఖ అధికారి ఒకరు తెలిపారు. దీంతో వివిధ కేసులలో టెలికాం ఆపరేటర్లపై టెలికాం శాఖ విధించిన 3,000 కోట్ల రూపాయల జరిమానాలో 2,500 కోట్ల రూపాయల జరిమానా భారాన్ని టెలికాం సంస్థలు తప్పించుకోనున్నాయ.