ముంబయి, జూలై 24: అమెరికా ఉపాధ్యక్షుడు జో బిడెన్ భారత్‌ను ఎదుగుతున్న శక్తిగా అభివర్ణించారు. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించిన ఆయన భారత-అమెరికా దేశాల మధ్య విస్తృత వాణిజ్యానికి ఉన్న అడ్డంకులను తొలగించేందుకు, పన్నుల విధానాల్లో వ్యత్యాసాలను రూపుమాపేందుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలని కోరారు. ఈ చర్యలు ఇరు దేశాల వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 500 బిలియన్ డాలర్లకు తీసుకుపోగలవని అభిప్రాయపడ్డారు. నాలుగు రోజుల పర్యటన నిమిత్తం కుటుంబ సమేతంగా భారత్‌లో పర్యటిస్తున్న బిడెన్ బుధవారం ఇక్కడ బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ వద్ద ‘అమెరికా-్భరత్ భాగస్వామ్యం’పై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల భారత్ చేపట్టిన పలు ఆర్థిక సంస్కరణలను స్వాగతించారు. ముఖ్యంగా టెలికాం, రక్షణ, బీమా రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకున్న నిబంధనలను సరళతరం చేయడాన్ని అభినందించారు. కాగా, గడిచిన మూడు దశాబ్దాల్లో భారత పర్యటనకు విచ్చేసిన తొలి అమెరికా ఉపాధ్యక్షుడిగా రికార్డు సృష్టించిన బిడెన్ ఇరు దేశాల ఆర్థిక సంబంధాల బలోపేతానికి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన మాట్లాడుతూ భారత్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం గత 13 ఏళ్లలో ఐదింతలు పెరిగి 100 బిలియన్ డాలర్లకు చేరిందన్నారు. ఈ క్రమంలోనే ఇరు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం మరింత పెరగడానికి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో ఒకప్పుడు 20 బిలియన్ డాలర్లుగా ఉన్న దేశీయ ఎగుమతులు 2012-13లో 300 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయన్నారు. దక్షిణాసియాలో భారత్ పాత్ర అభినందనీయమని వాఖ్యానించారు. మరోవైపు ముంబ యలో వ్యాపారవేత్తలతో జరిపిన రౌండ్ టేబుల్ సమావేశంలో బిడెన్ పాల్గొన్నారు.
వ్యాపారవేత్తల సమావేశంలో రతన్ టాటాతో బిడెన్