జొహానె్నస్‌బర్గ్, జూలై 24: మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో హన్సీ క్రానే పేరును ఢిల్లీ పోలీసులు చార్జిషీటులో చేర్చడంపై అతని తండ్రి ఇవీ క్రానే ఆగ్రహం వ్యక్తం చేశాడు. 13 ఏళ్ల క్రితం నాటి కేసులో ఇప్పుడు చార్జిషీటు దాఖలు చేయడం ఏమిటని అతను విలేఖరులతో మాట్లాడుతూ ప్రశ్నించాడు. 2002 జరిగిన విమాన ప్రమాదంలో హన్సీ మృతి చెందాడని, ఇప్పుడు అతని పేరును చార్జిషీటులోవ చేరుస్తారా అంటూ నిప్పులు చెరిగాడు. ఈ చర్య హాస్యా స్పదంగా ఉందని విమర్శించాడు. హన్సీపై విమర్శలు వచ్చినంత స్థాయిలో అతను నేరాలు ఏవీ చేయలేదని పేర్కొన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ ఒకరిద్దరితో సాధ్యం కాదని, మిగతా వారిని ఎందుకు వదిలేస్తున్నారని నిలదీశాడు. బుకీలను ముందుగా చట్టం ముందుకు తీసుకురావాలని సూచించాడు. ఇలావుంటే, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు వెల్లువెత్తిన తర్వాత ఈ వ్యవహారంపై దక్షిణాఫ్రికా నియమించిన కింగ్స్ కమిషన్ ముందు హన్సీ వాంగ్మూలమిచ్చాడు. భారత్‌లో ఒక మ్యాచ్‌ని ఫిక్స్ చేయడానికి తాను బుకీల నుంచి డబ్బు స్వీకరించినట్టు అంగీకరించాడు. పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సలీం మాలిక్, భారత మాజీ కెప్టెన్ మహమ్మద్ అజరుద్దీన్‌తోపాటు మరి కొంత మంది క్రికెటర్ల పేర్లను కూడా అతను అప్పట్లో ప్రస్తావించాడు. దక్షిణాఫ్రికాకే చెందిన నికీ బోయే, హెర్చెల్ గిబ్స్, హెన్రీ విలియమ్స్ కూడా మ్యాచ్ ఫిక్సింగ్‌కు సహకరించారని పేర్కొన్నాడు. కింగ్ కమిషన్ ముందు హన్సీ నేరాన్ని అంగీకరించిన వెంటనే దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు అతనిపై జీవితకాల నిషేధాన్ని విధించింది. అదే విధంగా గిబ్స్, విలియమ్స్‌లను కొంతకాలం సస్పెండ్ చేసింది. ఆతర్వాత గిబ్స్ మళ్లీ దక్షిణాఫ్రికా జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. బోయే, విలియమ్స్ కెరీర్ అర్థాంతరంగానే ఆగిపోయింది.
ఆ నిర్ణయం సబబే
జ్వాలా కనీస ధర తగ్గింపుపై గోపీచంద్
దుర్గాపూర్, జూలై 24: ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్) వేలంలో డబుల్స్ స్పెషలిస్టు క్రీడాకారిణి జ్వాలా గుత్తా కనీస ధరను తగ్గించడం సరైన నిర్ణయమేనని భారత జాతీయ కోచ్, ఆల్ ఇంగ్లాండ్ మాజీ చాంపియన్ పుల్లెల గోపీచంద్ స్పష్టం చేశాడు. ఐబిఎల్ వేలం ప్రారంభానికి ముందు నిర్వాహకులు జ్వాలా, ఆమె డబుల్స్ భాగస్వామి అశ్వినీ పొన్నప్ప బేస్ ప్రైస్‌ను 50,000 డాలర్లుగా నిర్ధారించారు. అయితే, వేలం ఆరంభానికి ముందు ఈ మొత్తాన్ని 25,000 డాలర్లకు తగ్గించారు. ఈ పరిణామం తమను అవమాన పరచడమేనని జ్వాలా, అశ్వినీ ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, ఈ నిర్ణయంలో పొరపాటు లేదని బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ గోపీచంద్ అన్నాడు. క్రీడాకారుల్లో ఎవరికీ ఆర్థికంగా నష్టం వాటిల్ల కూడదన్న ఉద్దేశంతోనే ఐబిఎల్ కమిటీ జ్వాలా, అశ్వినీ బేస్ ప్రైస్‌ను తగ్గించిందని వివరించాడు. వాస్తవానికి ఐబిఎల్ వేలంలో ప్లేయర్లకు భారీ ధర పలుకుతుందని తాము ఊహించలేదని అన్నాడు. ఇది మన దేశంలో బాడ్మింటన్‌కు ఆదరణ పెరుగుతున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నదని పేర్కొన్నాడు. రాబోయే తరాల క్రీడాకారులకు ఐబిఎల్ ఒక గొప్ప వేదిక అవుతుందని అన్నాడు.
వైదొలిగే ప్రసక్తి లేదు..
ఐబిఎల్ వేలంలో బేస్ ప్రైస్‌ను తగ్గించడం తనను అవమానపరచడమేనని పునరుద్ఘాటించిన జ్వాలా ఈ కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. బుధవారం ఆమె హైదరాబాద్‌లో తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ, డబ్బు కోసం తాను వెంపర్లాడడం లేదని చెప్పింది. అయితే, కనీస ధరను మొదట 50,000 డాలర్లుగా పేర్కొని, ఆతర్వాత 25,000 డాలర్లకు తగ్గించడం తనను అవమానించడమేనని తెలిపింది. కనీస ధరను ఎందుకు తగ్గించారన్న ప్రశ్నపై స్పందిస్తూ, ఇది తనను అడగాల్సిన ప్రశ్న కాదని వ్యాఖ్యానించింది. నిర్వాహకులను అడిగితే బాగుంటుందని పేర్కొంది. ఐబిఎల్‌లో అవమానం జరిగిందన్న తన అభిప్రాయంలో మార్పులేదని తెలిపింది. కానీ, ఈ కారణంగా ఐబిఎల్‌కుగానీ, బాడ్మింటన్‌కుగానీ దూరం కానని తేల్చిచెప్పింది. తనకు ఆటపై ఎంతో మక్కువ ఉందని, కాబట్టి సాధ్యమైనంత వరకూ ఎక్కువ టోర్నీల్లో ఆడి, భారత్‌కు పతకాలను సాధించిపెట్టడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపింది.