ఖైరతాబాద్, జూలై 25: ప్రత్యేక రాష్ట్రంలో సీమాంధ్ర మిత్రులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని, భారత రాజ్యాంగం ప్రకారమే ఇక్కడ పాలన కొనసాగినప్పుడు ఎవరి స్వేచ్ఛకూ భంగం కలగదని తెలంగాణ ఉద్యోగ సంఘం నేత శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలుగు జనం పరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో పరిషత్ అధ్యక్షుడు కంచర్ల జగన్మోహన్‌రావుతో కలిసి ఆయన మాట్లాడుతూ రాష్ట్రం విడిపోతే ఇక్కడ ఏదో జరుగుతుందని పెట్టుబడిదారులైన కొంతమంది నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రచారాల్లో ఎలాంటి వాస్తవం లేదని, భారతదేశ రాజ్యాంగానికి లోబడే ఇక్కడి ప్రభుత్వం కొనసాగుతూ అన్ని ప్రాంతాల వారి శ్రేయస్సును చూసుకుంటుందని, ఇక్కడి పోలీస్ వ్యవస్థ అంతా యధావిధిగా కొనసాగుతాయని అన్నారు. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్‌లో వందల సంవత్సరాల క్రితమే మహారాష్ట్ర, రాజస్థాన్‌తో పాటు ఇతర రాష్ట్రాల వారు వచ్చి వ్యాపారాలు కొనసాగించుకుంటున్నారని, వారికి లేని ఆందోళన ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన వారికి ఎందుకని ప్రశ్నించారు.. రెండు ప్రాంతాల్లోని ప్రజల శ్రేయస్సును పట్టించుకోని కొంతమంది నాయకులు చేసే అసత్య ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తెలుగుప్రజలు రెండు రాష్ట్రాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉండవచ్చునని, రాష్ట్రం ఏర్పడే ముందు మరోమారు తెలంగాణ ప్రజలపై విషం చిమ్మే విధంగా వ్యవహరించడం సరికాదని చెప్పారు. 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్కరికైనా హాని చేయని తెలంగాణ ప్రజలు, వారి ఆకాంక్షను ఆత్మబలిదానాలతో మాత్ర మే వెల్లడించారన్నారు. ఈ కార్యక్రమంలో కృష్ణారెడ్డి, రంగారెడ్డి, రవీందర్ రావు, జోగారావు పాల్గొన్నారు.
వాహన దొంగల అరెస్ట్
గచ్చిబౌలి, జూలై 25: హోటళ్లు, స్టాళ్ల ముందు పార్కుచేసిన ద్విచక్రవాహనాలను అపహరించే రెండు ముఠాలను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 18 లక్షల విలువజేసే 35 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో క్రైం డిసిపి రంగారెడ్డి వివరాలను వెల్లడించారు. సిద్దిపేటకు చెందిన పిట్ల మల్లేష్ (26) కరీంనగర్‌లో నివాసముంటున్నాడు. మెదక్ జిల్లా గంపల నారాయణ (35)తో కలిసి నగరంలో రద్దీ ప్రదేశాలలో పార్కు చేసిన ద్విచక్ర వాహనాలను అపహరించి మెదక్‌లో నివాసముండే బోగం జంగయ్య ద్వారా విక్రయించే వారు. వీరిద్దరూ సైబరాబాద్, హైదరాబాద్‌తో పాటు మెదక్‌లో 30 స్ప్లెండర్ ప్లస్ బైక్‌లను అపహరించారు. నగరంలోని ఉప్పుగూడలో నివాసముంటే మహ్మద్ ముజాద్ (29), మహ్మద్ సమీర్ (26) కలిసి పార్కు చేసిన పల్సర్లు, ప్యాషన్ ప్రో వాహనాలను అపహరించి చైన్‌స్నాచర్లకు విక్రయించేవారు. వీరి నుంచి ఐదు ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రెండు ముఠాల నుంచి మొత్తం 18 లక్షల విలువచేసే 35 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఆయన చెప్పారు. మల్కాజిగిరి, బాలానగర్ సిసిఎస్ పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. సమావేశంలో క్రైం అడిషనల్ డిసిపి జానకిరావు, ఏసిపి వెంకటేశ్వర్లు, సిఐలు మహ్మద్‌గౌస్, సంజీవ్‌రావు పాల్గొన్నారు.
-- హాస్టల్ సమస్యలను పరిష్కరించాలని --
జెఎన్‌టియు విద్యార్థుల ధర్నా
కెపిహెచ్‌బి కాలనీ, జూలై 25: కూకట్‌పల్లి జెఎన్‌టియుహెచ్‌లోని హాస్టల్‌లో వౌలిక వసతులు కల్పించాలని హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు గురువారం ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జెఎన్‌టియుహెచ్ యజమాన్య నిర్లక్ష్యం మూలంగా ఆవరణలో ఉన్న కినె్నర హస్టల్‌లోగత కొన్ని నెలలుగా సమస్యలు నెలకొని ఉండడంతో పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాస్టల్ గదుల నుండి ప్రిన్సిపాల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి యజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వర్సిటీ విసి వెంటనే స్పందించి సమస్య పరిష్కరించాలని వారు రోడ్డుపై బైఠాయించారు. ఇటీవల నూతనంగా నిర్మించిన బిల్డింగ్ సైతం పగుళ్లు ఏర్పడి పడుతున్న వర్షాలకు నీరుకారుతోందని దీంతో గదులలో వర్షపునీరు నిలిచి ఇబ్బందులు పడుతున్నామన్నారు. హాస్టల్‌లోవైఫై సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా డ్రైనేజీ పైపులైన్ పగిలి కొద్దిరోజులుగా దుర్వాసన వెదజల్లుతోందన్నారు. బాత్‌రూమ్‌లలో బండలు పగిలి విద్యార్థులు నానా యతన పడుతున్నప్పటికీ యజమాన్యం మొండివైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. కినె్నర హాస్టల్‌లో వౌలిక వసతులు కల్పించడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. విద్యార్థులు చేస్తున్న ధర్నాతో దిగివచ్చిన ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వినయ్‌బాబు వారితో మాట్లాడి హాస్టల్ సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. ఈ ధర్నాలో నరేష్‌యాదవ్, సుధాకర్, సిద్ధార్థ, నర్సింహ్మ, చంద్రవౌళి పాల్గొన్నారు.