చార్మినార్, జూలై 25: ఆష్ఢా మాసంలో తెలంగాణ ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే బోనాల ఉత్సవాలు నేటి నుంచి పాతబస్తీలో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే పాతబస్తీలోని పలు చారిత్రక దేవాలయాలు అమ్మవారి బోనాల జాతరకు ముస్తాబవుతున్నాయి. నగరంలో ప్రతిష్టాత్మకమైన పాతబస్తీలోని లాల్‌దర్వాజ శ్రీ మహాంకాళీ అమ్మవారి దేవాలయంలో, శ్రీ అక్కన్నమాదన్న దేవాలయంలో నేటి నుంచి బోనాల ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు గురువారం రెండు దేవాలయాల్లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో అక్కన్నమాదన్న దేవాలయ కమిటీ ప్రతినిధులు జి. నిరంజన్, రాజారత్నం, దత్తాత్రేయ, సతీష్ మాట్లాడుతూ అక్కన్న మాదన్న దేవాయంలో శుక్రవారం ఉదయం అమ్మవారి అభిషేకం, కలశస్థాపన కార్యక్రమాలతో ఉత్సవాలను ప్రారంభం కానున్నట్లు తెలిపారు. అనంతరం పదిన్నరకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి డా. జె. గీతారెడ్డి చేతుల మీదుగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మాధిరిగానే ఈ సారి కూడా సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఆనవాయితీగా నిర్వహించనున్నట్లు తెలిపారు. లాల్‌దర్వాజ శ్రీ మహాంకాళీ అమ్మవారి దేవాలయ ప్రతినిధులు మహేష్‌గౌడ్, సదా ముదిరాజ్‌లు మాట్లాడుతూ శుక్రవారం ఉదయం అమ్మవారికి అభిషేకం అనంతరం పదకొండు గంటలకు నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ చేతుల మీదుగా ఆలయ గోపుర పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ఏర్పాట్లు త్వరగా చేయండి
బోనాల ఉత్సవాలకు గడువు ముంచుకొస్తున్నా, నేటికీ ఏర్పాట్లు పూర్తి కాలేదని, ఉత్సవాల ప్రారంభానికి ముందే పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని పాతబస్తీలోని వివిధ దేవాలయాల కమిటీ ప్రతినిధులు జి. నిరంజన్, రాజారత్నంలు కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనాకు వినతిపత్రం సమర్పించారు. అలాగే జూపార్కు నుంచి అంబారీని కూడా సకాలంలో తెప్పించే విధంగా కృషి చేయాలని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులను కోరారు.
అంబర్‌పేట బోనాలకు భారీ ఏర్పాట్లు
అంబర్‌పేట: అంబర్‌పేటలో బోనాల పండుగను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేసేందుకు అంబర్‌పేట దేవస్థాన సేవా సమితి గురువారం మున్సిపల్ అధికారులు, ఎమ్మెల్యే, స్థానిక కార్పొరేటర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. దేవస్థాన సేవా సమితి అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్‌గౌడ్, చైర్మన్ కె దుర్గాప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, కార్పొరేటర్ పి జ్ఞానేశ్వర్‌గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబర్‌పేట మహాంకాళి ఆలయ వేదికగా నిర్వహించే బోనాల పండుగను ప్రతియేటా జరిగే విధంగా ఈ సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు దేవస్థాన సేవాసమితి నిర్వహించనుందని వారు తెలిపారు. బోనాల సందర్భంగా మహంకాళి ఆలయం వద్ద పారిశుద్ధ్యం, నీటి సౌకర్యం వంటి సదుపాయాలు కల్పించనున్నట్టు దేవస్థాన సేవాసమితి తెలిపింది. రోడ్ల మరమ్మతు, వీధిలైట్ల ఏర్పాటు, పారిశుద్ధ్యంను మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. బోనాలకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొంటున్నందున చైన్ స్నాచింగ్ జరిగే అవకాశాలు లేకపోలేదని, పోలీసులు పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేయాలని వారు పోలీసు ఉన్నతాధికారులను కోరుతూ సమావేశంలో తీర్మానించారు. అమ్మవారి ఘటం ఊరేగింపు కొనసాగుతుందని, ఆగస్టు, 4,5 తేదీల్లో నిర్వహించే బోనాలకు ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని సమావేశం తీర్మానించింది.
గోల్కొండకోటపై అమ్మవారికి ఐదవ పూజలు
నార్సింగి: చారిత్రాత్మకమైన గోల్కొండ కోట శ్రీ జగదాంబిక మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. గురువారం ఐదువ బోనాలను భక్తులు అమ్మవారికి అంగరంగావైభవంగా నిర్వహించారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. కోటపై ఉన్న శ్రీ జగదాంబిక మహంకాళీ అమ్మవారికి ఆలయ కమిటీ సభ్యులు ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలు ఉత్సవాలు కావడంతో గోల్కొండ కోట భక్తులతో కిటకిటలాడింది.
కాగా ఆలయ కమిటీ వారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించుకుని వారివారి మొక్కులను చెల్లించుకున్నారు. ఈ బోనాలు ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఆధార్ నెంబర్‌ను పొందుపర్చాలి
చాంద్రాయణగుట్ట, జూలై 25: ఉపకార వేతనాలు (రెన్యువల్, ప్రెస్) పొందే ప్రతి ఎస్‌సి, ఎస్టీ, ఇబిసి మైనార్టీ, వికలాంగ విద్యార్థులు తప్పనిసరిగా ఆధార్ యుఐడి నెంబరును ఈ-పాస్ వెబ్‌సైట్‌లో పొందుపర్చాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ముఖేష్‌కుమార్ మీనా తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ మరియు వికలాంగుల సంక్షేమ శాఖల అధికారులతో కలెక్టరు సమావేశమై ఆధార్ ఆధారిత ఉపకార వేతనాల అంశంపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ హైదరాబాద్ జిల్లాలో వివిధ జూనియర్, డిగ్రీ మరియు వృత్తి విద్యాకళాశాలలో చదువుతున్న విద్యార్థులందరు ఉపకార వేతనాలు పొందేందుకు ఆధార్ యు.ఐ.డి. తప్పకుండా కలిగి ఉండాలన్నారు. 2013-14 విద్యా సంవత్సరంలో ఉపకార వేతనాలను కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థులతోపాటు రెన్యువల్ కోసం కూడా ఆధార్ యు.ఐ.డి. పొందుపరచాలన్నారు. ఈ-పాస్‌లో అప్‌లోడ్ చేసేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలపై మూడు విడతలలో అవగాహన సదస్సు ఏర్పాటుచేసి విద్యార్థుల్లో చైతన్యం కల్పించనున్నట్లు కలెక్టరు తెలిపారు. మొదటి విడతగా జూలై 27న 361 కాలేజీల్లో, రెండవ విడత ఆగస్టు 3న మరో 361 కాలేజీల్లో అవగాహన సదస్సులు ఏర్పాటుచేస్తామన్నారు. ఈ రెండు విడతల్లో అప్‌లోడ్ చేసుకోని విద్యార్థుల కోసం ఆగస్టు 8న మరొకమారు 722 కళాశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించి అప్‌లోడ్ చేస్తామన్నారు. హైదరాబాద్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ జూనియర్, డిగ్రీ, వృత్తి విద్యా కళాశాలలకు చెందిన సుమారు 1,32,524 విద్యార్థులు ఈ-పాస్‌లో యుఐడిని తప్పనిసరిగా పొందుపరిచేలా సంక్షేమ శాఖ అధికారులు కలెక్టరు ఆదేశించారు. 96443 విద్యార్థులకు యుఐడి ఉన్నాయని మరో 11238 మంది విద్యార్థులకు ఈఐడి ఉందని ఆయన తెలిపారు. వివిధ కళాశాలల్లో చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, వికలాంగుల విద్యార్థులు తమ యుఐడి నంబరును స్కాన్‌చేసి ఈ-పాస్‌లో పొందుపరిచేలా సంక్షేమ శాఖాధికారులతోపాటు కళాశాల యాజమాన్యాలు కృషిచేయాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టరు ప్లెక్సీ, పాంప్లేట్ విడుదల చేసారు. ఈ ప్లెక్సీలను విద్యార్థులకు అవగాహన కల్పించే నిమిత్తం కళాశాలలో ప్రదర్శించాలని డిడి సోషల్ వెల్ఫేర్ విజయ్ పాల్‌ను కలెక్టరు ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిడి సోషల్ వెల్ఫేర్ విజయ్ పాల్, జిల్లా బిసి సంక్షేమ శాఖాధికారి భార్గవి, ఈడి మైనార్టీ కార్పొరేషన్ అక్రం అలీ తదితరులు పాల్గొన్నారు.