కీసర, జూలై 25: గత వారం రోజులుగా కీసర దాయరలో వ్యవసాయ పొలాలకు విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా తయారైందని ఆగ్రహించిన రైతులు విద్యుత్ సబ్‌స్టేషన్ ముందు ధర్నాకు దిగారు. రోడ్డుపై రాళ్లు ఉంచి వాహనాల రాకపోకలకు అడ్డుతగిలారు. విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందించడం లేదంటూ వాపోయారు. ట్రాన్స్‌కో ఏఇ కిషోర్‌కు ఎప్పుడు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తోందని చెప్పారు. లైన్‌మెన్ స్పందన కూడా లేకపోవడంతో చివరికి విద్యుత్ కార్యాలయంలోకి వచ్చి అధికారులు లేకపోవడంతో రోడ్‌పై బైఠాయించి ధర్నాకు దిగారు. ధర్నా విషయం తెలుసుకున్న పోలీసులు సరాసరి విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు వచ్చి ధర్నా చేస్తున్న రైతులపై లాఠీచార్జి చేశారు. ఎన్నికల నియమావళి ప్రకారం 144 సెక్షన్ అమలులో ఉందని, ధర్నా విరమించకపోతే కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ ప్రేమ్‌కుమార్ హెచ్చరించడంతో రైతులు ధర్నా విరమించారు. లాఠీచార్జిలో రైతులు మధుసూదన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి గాయపడ్డారు. శాంతియుతంగా ధర్నా చేస్తున్న వారిపై పోలీసులు లాఠీ చార్జి చేయడం పట్ల పలువురు మండిపడ్డారు.
కెమికల్ సెజ్‌ల ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలి
ఘట్‌కేసర్, జూలై 25: ఘట్‌కేసర్ మండల పరిధిలో ఏర్పాటు చేయతలపెట్టిన కెమికల్ సెజ్‌లను వెంటనే విరమించుకోవాలని భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహ్మరెడ్డి, ముచుకుందా ఫౌండేషన్ ప్రధానకార్యదర్శి పిట్టల శ్రీశైలం డిమాండ్ చేశారు. ఘట్‌కేసర్‌లో గురువారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఘట్‌కేసర్ మండల పరిధి ఏదులాబాద్, మాదారం, అంకుషాపూర్ గ్రామాలలోని 630 ఎకరాలలో నగరంలోని నిషేధిత కెమికల్ కంపనీలను తరలించేందుకు ఏపిఐఐసి కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. ఇప్పటికే మూసీనది కాలుష్యం బారిన పడి ఈ ప్రాంత వాసులు ఇబ్బందులు పడుతున్నారని, ఇదికాదని కాలుష్య కారక పరిశ్రమల్ని ఏదులాబాద్, అంకుషాపూర్, మాదారం గ్రామాలలో ఏర్పాటు చేసి 630 ఎకరాల్లో కెమికల్ హబ్ చేసే కుట్రల్ని ఈ ప్రాంత వాసులుగా భగ్నం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు కోరారు. కాలుష్య పూరిత పరిశ్రమల్ని ఏర్పాటు చేస్తే గాలి, నీరు చివరికి ఆహారం కలుషితం అయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. చెరువులు, కుంటలలో కెమికల్ నీరు చేరి భూగర్భ జలాలు కలుషితం అవుతాయని తెలిపారు. కావున ప్రజా సంఘాల ప్రతినిధులు ఏదులాబాద్, అంకుషాపూర్, మాదారం గ్రామాలలో ఆదివారం పర్యటించనున్నందున ఘట్‌కేసర్, బీబీనగర్, పోచంపల్లి మండలాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తమ అభిప్రాయాలు కమిటీతో పంచుకోవాలని ఆయన కోరారు. ఈ పర్యటనలో పర్యావరణ వేత్త కెప్టెన్ జలగం రామారావు, జాతీయ ప్రజా ఉద్యమాల వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ సరస్వతి కావుల, చేతన సొసైటీ డైరక్టర్ డాక్టర్ దొంతి నర్సింహ్మారెడ్డి, సేవ్ అవర్ అర్బన్ లేక్స్ ప్రతినిధులు చక్రవర్తి తదితరులు పాల్గొంటారని తెలిపారు.
వృద్ధుల బాగోగులను చూడాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిదీ
ఇబ్రహీంపట్నం, జూలై 25: వృద్ధ తల్లిదండ్రుల హక్కుల పరిరక్షణ కోసం అనేక చట్టాలు అమలులో ఉన్నాయని మానవ హక్కుల కమిషన్ సభ్యుడు కాకుమాను పెదపేరిరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రం వినోభనగర్‌లో మాతాపితరుల సేవా సదనంలో బండారు చినరంగారెడ్డి స్మారక భవనాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ వృద్ధాప్యంలో తల్లిదండ్రుల మంచిచెడులు చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. నేడు అనేకమంది పెళ్లిచేసుకుని తల్లిదండ్రులనుండి దూరంగా ఉంటూ వారి బాగోగులు చూసుకోవడంలో అలక్ష్యం వహిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వృద్ధాప్యంలో తోడు ఉండాల్సిన పిల్లలు వారి మంచిచెడ్డలు పట్టించుకోకపోవడంతో వృద్ధాశ్రమాలలో చేరడం భారతీయ సంస్కృతికి గొడ్డలిపెట్టులాంటిదని ఆవేదన వ్యక్తం చేశారు.
తల్లిదండ్రుల బాగోగులు చూడని పిల్లలపై చర్యలు తీసుకోవడం కోసం అనేక చట్టాలు అమలులో ఉన్నాయని అన్నారు. తమను బాగా చూసుకోవడం లేదని ఆర్డీఓకు ఫిర్యాదు చేస్తే, వారి బాగోగుల కోసం నెలకు సరిపడా ఖర్చులు పిల్లలనుండి ఇప్పించే అధికారం ఆర్డీఓకు ఉందని, ఆర్డీఓ ఇచ్చిన ఆదేశాలను కోర్టుల్లో సవాల్ చేసుకునే అవకాశం కూడా లేకుండా చట్టం చేసినట్టు చెప్పారు.
తల్లిదండ్రుల ఆస్తులు స్వాధీనం చేసుకుని అనుభవిస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తే ఆ ఆస్తిని తిరిగి తల్లిదండ్రులు స్వాధీనం చేసుకునే చట్టాలు అమలులో ఉన్నాయని వివరించారు. వృద్ధ తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు చేసినా తమ కమిషన్ స్పందించి, తగు చర్యలు తీసుకుంటుందని వివరించారు.
వృద్ధాశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ స్థలం కేటాయించి, వృద్ధుల కోసం అనురాగ నిలయాలు నిర్మించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రముఖ సంఘసంస్కర్తలు, రాజీవ్ రత్న అవార్డు గ్రహిత పివి చలపతిరావు, కృష్ణమూర్తి తదితరులను ఘనంగా సన్మానించారు.