అప్పుడే తెల్లవారింది!
మా పల్లె మెల్కొంటోంది.
మా వూరి పెద్దలందరూ పంచాయతీ బండ మీదకి చేరుకుంటున్నారు. అంతా కూర్చున్నారో లేదో పేపర్ కుర్రాడు రయ్యిన వచ్చిన పేపర్ విసిరేసి పోయాడు.
మీసాల మాస్టారు ఆ పేపర్ తీసుకుని చదవడం మొదలుపెట్టాడు.
‘‘ఏమిటి మాస్టారూ పేపర్‌లో విశేషాలు?’’ అన్నారు ఎవరో.
మీసాల మాస్టారు అంటే మా వూరి బడి పంతులు. ఆయన రిటైర్ అయిపోయారు.
తనకున్న నాలుగు అక్షరముక్కల పరిజ్ఞానంతో గ్రామంలోని వారికి అన్నీ చెబుతుంటాడు.
ఆయన పేపర్ చదువుతూ చదువుతూ ‘‘అయ్యో! మళ్లీ ఇలా అయిందేమిటి?’’ అన్నాడు.
‘‘ ఏటైనాది మాస్టారూ?’’ అందరికీ టీ ఇస్తూ అన్నాడు టీస్టాల్ సుబయబ్య.
‘‘ ఏం లేదురా మళ్లీ ఢిల్లీలో ఒక అమ్మాయిని మానభంగం చేశారట’’ అన్నాడు మాస్టారు.
‘‘అయ్యా! మన దేశంలో ఇవి మరీ పెచ్చుమీరిపోయాయి. ఉదయానే్న ఆ వార్తలు ఎందుకు. కాస్త ముందుకు చదవండి’’ అన్నాడు రంగయ్య.
‘‘ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కొత్త పథకం ఒకటి ప్రవేశపెడుతున్నారట’’ అన్నాడు మాస్టారు.
‘‘అదేదో పచ్చకార్డు వచ్చిందట. అదెప్పుడు మన ఊరి వాళ్లకి ఇస్తారో రాసారేమో చూడండి మాస్టారు’’ అన్నాడు సుబ్బయ్య.
దానికి మాస్టారు మాట్లాడుతూ ‘‘అదింకా పట్టణాలలో ఇవ్వడమే పూర్తి కాలేదు. ఇక మన పల్లెకు అప్పుడే ఎలా వస్తుంది. టైమ్ పడుతుంది’’ అన్నాడు.
‘‘చాన్నాళ్ల క్రితం ఆధార్ కార్డు కోసం ఫొటోలు తీసుకున్నాం. అదింకా రాలేదేమిటి మాస్టారు?’’ అన్నాడు రంగయ్య.
‘‘ ఆ కార్డు వచ్చేలోగా మన ప్రభుత్వం దిగిపోతే వేరే ప్రభుత్వం వేరే కార్డులు పెడుతుంది. అప్పుడు వస్తాయిలే’’ వేళాకోళంగా అన్నాడు వెంకన్న.
‘‘మరి గ్యాస్ బండ కావాలన్నా ఆధార్‌కార్డు ఉండాలిట గద’’ అన్నాడు సుబ్బయ్య.
‘‘్ఫటో గుర్తింపు కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు... ఇన్ని కార్డులు మనకు అవసరమా?’’ అనుమానంగా ప్రశ్నించాడు వెంకన్న.
‘‘ ఇప్పటి రూల్స్ ప్రకారం ఉండాల్సిందే. గతంలో మనకి రేషన్ కార్డు, ఓటరు కార్డు ఉండేవి. అవే అన్నింటికీ ఉపయోగపడేవి. మరి ఈ మధ్య ప్రపంచం ముందుకు పోతోంది కదా. మన వాళ్లకి ఏం చేయాలో తోచక కనీసం ఈ కార్డుల ద్వారా అయినా ముందుకు పోదాం అని ఇన్ని కార్డులు పెడుతున్నారల్లే ఉంది. అందుకే రోజుకో కార్డు మన నెత్తిన రుద్దుతున్నారు’’ అన్నాడు రామయ్య.
‘‘అన్నట్టు మాస్టారూ! నేను మొన్నోసారి పట్టణం వెళ్లాను. అక్కడ ఆడమగా అందరూ మూర్ఛ బిళ్లల్లాంటి కార్డులు మెడలో వేసుకుని తిరుగుతున్నారు. అవేమిటండీ?’’ సంశయంగా అన్నాడు సుబ్బయ్య.
‘‘అవి పట్టణాలలో పని చేసే వారికి ఆయా కంపెనీల యాజమాన్యాలు ఇస్తాయి. వాటిని వారు తప్పనిసరిగా మెడల్లో వేసుకోవాలి’’ అన్నాడు మాస్టారు.
‘‘ ఇదేం కొత్త పద్ధతో ఏమిటో... ఇంకొన్నాళ్లకు మనం బయటికి వెళ్లాలంటే జేబులో డబ్బులకు బదులుగా ఈ రంగుల కార్డులు వేసుకుని వెళ్లాలేమో’’ అన్నాడు వెంకన్న.
‘‘ ఏమోరా ముందు ముందు అలాంటి రోజులు కూడా వస్తాయేమో. పనికి ఒక కార్డు, పథకానికి ఒక కార్డు’’ అంటూ లేచాడు మాస్టారు.
‘‘ ఏమిటో ఈ కార్డుల గోల’’ అంటూ అంతా లేచి బయలేదేరారు.
- చంద్రాన శశికాంత్,
విశాఖపట్నం. సెల్ : 98485 61694
మినీ కథ
పాపం... ప్రసాద్
పెళ్లి అయిన దగ్గర నుండి ప్రసాదే వంట చేస్తున్నాడు.
పాపం ఏం చేస్తాడు. పెళ్లి చూపుల్లో తనకు వంట బ్రహ్మాండంగా వచ్చని అబద్ధం చెప్పేసింది అతని భార్య. అయితే పెళ్లైన మొదటి రాత్రే అది నిజం కాదని తెలిసిపోయింది.
కానీ ఏం చేస్తాడు పాపం ప్రసాద్. ఛస్తాడా? ఇద్దరికీ తనే వంట చేయడం అలవాటు చేసుకున్నాడు. అతని భార్య మాత్రం ఏరోజూ వంట నేర్చుకోవడానికి మాత్రం ప్రయత్నించలేదు.
ఒకరోజు ప్రసాద్‌కి క్యాంప్ డ్యూటీ పడింది. అర్జెంటు పని మీద బాస్ అతన్ని శ్రీకాకుళం వెళ్లమన్నాడు. ఏం చేయాలి? తను వెళ్లిపోతే వంట ఎవరు చేస్తారు?
‘‘ఏం ఫర్వాలేదు లెండి. ఒక్కరోజే కదా. మీరు వెళ్లండి. నేను వండుకుంటాను’’ అంది అతని భార్య మణి.
‘‘ఏమిటి నువ్వు వండుకుంటావా? వద్దు లేవే. హోటల్ నుండి తెప్పించుకో’’ అన్నాడు ప్రసాద్.
‘‘ఎందుకండీ డబ్బు దండగ. ఒక్కరోజు వండుకోలేనా? మీరు వెళ్లండి’’ అంది.
‘‘సరే నీ ఇష్టం’’ అని ఊరికి బయలుదేరాడు ప్రసాద్. వీధిలో ఎప్పుడూ ఒక పిచ్చికుక్క ఉదయం నుండి రాత్రి వరకు అరుస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు ప్రయత్నించినా దాన్ని తరిమి కొట్టలేకపోయారు అక్కడి వారు. ఎప్పటిలాగే అది ప్రసాద్ వెళుతుండగా అరవసాగింది. అతను విసుక్కుంటూ అక్కడి నుండి వెళ్లిపోయాడు.
అతను తిరిగి రాత్రి ఇంటికి వస్తున్నాడు. వీధిలోకి అడుగు పెట్టగానే సహజంగా అరవాల్సిన కుక్క అవరలేదు.
అంతటా నిశ్శబ్దంగా ఉంది. ఏమిటి సంగతి అనుకున్నాడు ప్రసాద్.
ఇంటికి చేరుకుని తలుపు కొట్టాడు.
భార్య వచ్చింది. ‘‘రండి’’ అంది.
అతను లోపలికి వెళ్లాడు. ‘‘ఏమిటి భోజనం చేసావా?’’ అన్నాడు.
‘‘లేదండి’’ అంది.
‘‘ఏం? వంట చేసుకోలేదా?’’
‘‘చేసుకున్నాను’’
‘‘మరి’’
‘‘మరేమో ఎంతో కష్టపడి వంట చేసుకున్నాను లెండి. కాని నా వంట నేనే తినలేకపోయాను’’
‘‘మరేం చేశావు?’’
‘‘వండిందంతా
వీధిలో కుక్కకు వేశానండి.
అది తిని ఆ కుక్క చచ్చిపోయిందండి’’
మెల్లగా చెప్పుకొచ్చింది ప్రసాద్ భార్య.
‘‘ఆ...’’ అంటూ కూలబడ్డాడు ప్రసాద్.
- కొండవలస కృష్ణమూర్తి పట్నాయక్, కాలేజీరోడ్డు, రాయగడ, ఒడిశా-765001. సెల్ : 9937785187.
గ్రంథ సమీక్ష
‘వర్మ’ వ్యక్తిత్వ ఆవిష్కరణ ప్రయత్నమే
వోడ్కా విత్ వర్మ
వర్మ కుమార్తె తన తండ్రిని రామూనాన్న అని పిలుస్తుందని ఈ పుస్తకం వల్ల మనకు తెలుస్తుంది. నటుడు సునీల్‌కు వర్మని రామూ అని ఏకవచనంలో సంబోధిస్తే చాలా కోపం వస్తుందట. కొంత మంది దర్శకులు వర్మను అనుకరిస్తూ ఉంటారని, అతనిలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారని ఈ పుస్తకంలో రాశారు. మంచి పుస్తకం రాయాలంటే అందుకు చాలా గొప్ప ఇన్‌స్పిరేషన్ కావాలి. పుస్తకాలు చదవడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో అవి రాయాలంటే అందుకు స్ఫూర్తినిచ్చే సంఘటన లేదా వ్యక్తి చాలా ప్రత్యేకమై ఉండి తీరాలి. ఆ లక్షాణాలన్నీ ఉన్న వ్యక్తి గురించి పుస్తకం రాయాలని నిర్ణయించుకోవడంతోనే రచయిత ‘సిరాశ్రీ’ సక్సెస్ అయ్యాడు.
కొందరి గురించి కొంతే తెలిసినా అంతా తెలిసినట్లు ఉంటుంది. ఇంకొందరి గురించి ఎంత తెలిసినా ఏమీ తెలియనట్లు ఉంటుంది. రాము అలియాస్ వర్మ అలియాస్ ఆర్‌జివి ఈ కోవకు చెందిన వ్యక్తి. పేరుకు తగ్గట్లే ఈ పుస్తకాన్ని పెగ్గుల కింద విభజించారు.
మంచి విషయాలను ముందే చెప్పాలి కాబట్టి పుస్తకం లేఅవుట్ బావుంది. ముఖచిత్రం శీర్షికకు తగ్గట్లుగా ఉంది. రచనా శైలి, పద విన్యాసం అన్నీ బాగున్నాయి. పుస్తకానికి మంచి పేపరు కూడా వాడారు.
పుస్తకంలో ముందు మాటని ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ రాశారు. వర్మని ముసలాడిగా, మరో వ్యక్తిపై ఆధారపడే వాడిగా చూడలేనని, అందుకని అతను త్వరగా చచ్చిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.
వర్మ కుమార్తె తన తండ్రిని రామూనాన్న అని పిలుస్తుందని ఈ పుస్తకం వల్ల మనకు తెలుస్తుంది. నటుడు సునీల్‌కు వర్మని రామూ అని ఏకవచనంలో సంబోధిస్తే చాలా కోపం వస్తుందట. కొంత మంది దర్శకులు వర్మను అనుకరిస్తూ ఉంటారని, అతనిలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారని ఈ పుస్తకంలో రాశారు.
ప్రతి పేజీ చివరలో వర్మ రాసిన నీతివాక్యాలు ఇందులో కనిపిస్తాయి. ఒక పత్రికలో పాఠకుల ప్రశ్నలకు వర్మ ఇచ్చిన తిక్క సమాధానాలు కూడా ఇందులో చేర్చారు. నటుడు తనికెళ్ల భరణి వర్మ గురించి చెప్పిన మాటలు బాగున్నాయి. ఈ పుస్తకానికి వోడ్కా విత్ వర్మ అని పేరు వల్ల అంతా అతన్ని తాగుబోతు అనుకుంటారు. అయితే అతను తాగుబోతు కాదు. అనాథలా ముంబైలో తిరుగుతున్న ఓడ్కాని చేరదీశాడంతే. ఎమెస్కో ప్రచురించిన ఈ పుస్తకం వెల 125 రూపాయలు. అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో ఇది దొరుకుతుంది.
- సురేంద్ర, కొత్తగాజువాక,
విశాఖపట్నం. 9490792553.
ఆనాటి కథలు.. ఆణిముత్యాలు - 20
సొంతముద్రతో అచ్చమైన తెలుగుకథ.. ‘పొద్దుచాలని మనిషి’!
కథ చెప్పే పద్ధతిలో తనదైన సొంతముద్రతో - నిఖార్సయిన తెలుగునేల మీద నడిచే పాత్రలతో, అనన్య సామాన్యంగా కథలు రాసిన మనీషి రాజారాంగారు. ఆయన ఎంత సౌమ్యుడో ఆయన కథలూ అంత సౌమ్యంగా వుంటాయి. ‘అయ్యా’, ‘సామీ’, ‘దేవరా’ వంటి సంబోధనలతో ఆయన ఆత్మీయంగా పలకరిస్తారు. ‘అదిగాదప్పా’ అంటూ భుజం మీద చేయి వుంచి చెబుతున్నట్లు కథని మిత్రసమ్మతం చేస్తారు. చిత్తూరు జిల్లా రమణయ్యగారి పల్లెలో 1930లో జన్మించిన రాజారాంగారు రాసిన మూడు వందలకు పైచిలుకు కథల్లో తొంభై అయిదు శాతం మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి మనుషుల జీవన చిత్రణే చేశారాయన. వేతన జీవుల్ని, సన్నకారు రైతాంగాన్ని, శ్రమజీవుల్నీ ఎంతగా ప్రేమించారో, అంతకంతగా ఆయన మొత్తం స్ర్తిజాతినీ ఆరాధించారు. ఆయన కథల నిండా - వారి పట్ల ఆయన గౌరవాభిమానాలూ, వారి స్వాభిమానం పట్ల, వారి స్వావలంబన పట్లా - ఆయన ఆకాంక్ష - కనపడతాయి. రాజారాంగారు ‘్ధమేశ్వరీస్తవం’ వంటి పేరడీ పద్యాలూ రాశారు. నాటికలూ, గేయాలూ రాశారు. బాల సాహిత్యమూ వెలువరించారు. తొలిరోజుల్లో ‘నాగేంద్ర’, ‘దత్తాత్రేయ’ వంటి కలం పేర్లతో ఆనాటి చిత్రగుప్తలో కొన్ని చిన్న కథలు రాశారు. కాని, అవి ఇప్పుడు అలభ్యం.
ఉపాధ్యాయులుగా ఉద్యోగించిన రాజారాంగారికి ఆ వృత్తి పట్ల ఎనలేని ఆరాధన, అభిమానం. అసలు రాజారాం గారి పేరు కథకుడుగా గుబాళింపచేసిన కథ - ఆనాటి ‘తాను వెలిగించిన దీపాలు’. దానిలో ఉపాధ్యాయుడే ప్రధాన పాత్ర. ఉపాధ్యాయునిదొక మహోన్నతమైన ఉద్యమం అని వారి భావన. విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించి భావికి బంగారుబాటలు వేయగలిగేది ఉపాధ్యాయుడే అనే విశ్వాసంతో రాసిన కథ అది. ఆ పేరుకల కథాసంపుటికి వారికి అప్పట్లో ఆం.ప్ర. సాహిత్య అకాడెమీ అవార్డు లభించింది. ఆ తర్వాత వారి కథలకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డూ లభించింది. చెడు ఓడితీరుతుంది. మంచితనం గెలుస్తుంది. మంచిమనిషి అమాయకత్వం మీద, సాత్వికత మీద, జీవిక మీద, మనుగడ మీద - దౌష్ట్యం దాడి చేస్తే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి - వంటి భావాలూ, ఆదర్శాలూ - వారి కథల్లో అంతర్లీనంగా, సామాజిక వాస్తవికతతో కనిపిస్తూ వుంటాయి. ఎనె్నన్నో మంచి కథలు రాసిన మధురాంతకంగారి ఒక ప్రత్యేకమైన, విశిష్టమైన కథ - ‘పొద్దుచాలని మనిషి’ - ఈ వారం ఆణిముత్యం!
రాజశేఖరంకి హైస్కూల్లో సహాధ్యాయి విశ్వపతి. చాలా ఏళ్ళ తర్వాత విశ్వపతి పాడుతున్న పాటని రేడియోలో విని, అతని గొంతు గుర్తుపట్టి, మిత్రుణ్ణి కలుసుకోవాలనుకున్నాడు రాజశేఖరం. ఆ అవకాశం వాళ్ళ వూళ్లోనే తటస్థించింది. హైస్కూల్ వార్షికోత్సవం. విశ్వపతి వచ్చాడు. రాజశేఖరం వెళ్ళేసరికి గ్రీన్ రూంలో రంగుపూసుకున్న అరచేతులతో బాలకృష్ణుని లేత బుగ్గల్ని మర్దించి పారేస్తున్నాడు! కబుర్లు సాగినై. ఆ పని కాగానే - ‘పది నిమిషాల్లో భోజనం చేసి వస్తాను’ అని సైకిలెక్కి వెళ్ళిపోయాడు. పదిహేను నిమిషాల్లో తిరిగివచ్చాడు. మళ్ళీ మాట కలిపాడు రాజశేఖరం. విశ్వపతి ప్రోగ్రాం కాగానే బయలుదేరాడు. ఈ రాత్రికి వుండమంటే, లేదు ఏ లారీ ఎక్కయినా వెళ్తాను అని ముందుకు సాగాడు. చేతిలో తాంబూలం, బుజానికొక సంచి, తలకో మఫ్లరు! వెళ్తూవెళ్తూ ‘ఉండి మాట్లాడుకోవలసిందే కానీ, మాటలు చేతలకడ్డు తగలకూడదనుకుంటాను’ అని, పని వుందని వెళ్ళిపోయాడు. ఇతన్ని టవున్‌లో తన యింటికి రమ్మని మరీమరీ చెప్పి వెళ్ళాడు. రాజశేఖరం తాను రాయాలనుకుంటున్న నవల గురించి చెబితే విని సలహా కూడా యిచ్చాడు.
ఒకరోజు రాజశేఖరం విశ్వపతి ఇంటికి వెళ్ళాడు. నడవలో పెద్ద పూలరాసి! సన్నజాజులు, కనకాంబరాలు, కాగడాలు, కదిరిమల్లెలు, గులాబీలు! విశ్వపతి తల్లి ముసలావిడ వాటిని ఏరుతోంది. గుర్తుపట్టింది. కబుర్లు సాగినై. ఆమె చెప్పింది. విశ్వపతికి ముగ్గురు పిల్లలు. కొడుకులే. గంట పదవుతుండగా - రిక్షా దిగాడు విశ్వపతి. అతనితో పాటు రెండు రీముల తెల్లకాగితాలు. వాటితో ఒక క్యాలికో రోల్, ఒక అట్టల కట్ట, దారపు బంతీ - వగైరా వచ్చినై. విశ్వపతి భార్య శకుంతల. ఆమెకు మిత్రుణ్ణి గురించి సమస్తమూ క్షణంలో చెప్పి ‘ఇక్కడే వుంటాడు’ అన్నాడు. విశ్వపతి మాట్లాడుతున్నాడు. అతని చేతులు మాత్రం కాగితాలు, క్యాలికో అట్టలు - వీటి మీద యుద్ధం చేస్తున్నాయి. మైదాపిండిని స్టౌ మీద ఉడికించాడు. ఎలిమెంటరీ స్కూలు పిల్లల బలగమూ వచ్చేసింది. బైండింగ్ కార్ఖానా! పని సాగిపోతోంది. మధ్యలో మిత్రుణ్ణి భోజనం చేసేయమన్నాడు. తాను మూడింటిలోపు ఆ పుస్తకాల్ని స్కూల్లో ఇవ్వాలట! ఈయన భోజనం చేసి, విశ్రమించి లేచేసరికీ- హాల్లో పూలబుట్టలూ మాలలై వెళ్ళిపోయాయి! టౌన్‌హాల్లో మీటింగ్. విశ్వపతి హాజరు! రాజశేఖరమూ వెళ్ళాడు. విశ్వపతి పాట- ప్రార్థన జరుగుతోంది. ఇసకవేస్తే రాలనంత జనం. మంత్రిగారి సమక్షంలో కార్యక్రమం. ఆ రాత్రి చాలా పొద్దుపోయిన తర్వాత ఇంట్లో కనిపించాడు విశ్వపతి. ఎవరో టీచర్ గారింట పెళ్ళికి బస్ కుదిర్చిరావడానికి వెళ్లొచ్చాడట! విశ్వపతిని పరీక్ష చేస్తున్నట్టు - మంత్రిగారి ఉపన్యాసం ఏమిటో చెప్పమంటే - విశ్వపతి దాన్ని తు.చ.తప్పకుండా అప్పగించాడు. రాజశేఖరం అప్రతిభుడైనాడు. రాత్రికి తన నవల గురించి చెప్పాలని ప్రయత్నిస్తే విశ్వపతి గాఢ నిద్రలోకి దిగాడు! మేలుకున్నంతసేపూ పని, పనికాగానే పడుకోవడం, పడుకోగానే నిద్ర - మూడూ పెద్ద వరాలే అనిపించింది. తెలతెలవారుతుండగా - బస్‌స్టాండ్‌కి దారితీశాడు. ‘నాకొక రెండు గంటల పని వుంది’ అన్నాడు. ఆ పని దినపత్రిక ఏజెన్సీ! రాజశేఖరం దినపత్రిక చూస్తూ కూర్చుంటే, విశ్వపతి ఊరిని చుట్టివచ్చాడు. టిఫిన్ చేద్దామంటే ఇంటి దగ్గర వందమందికి ఉపాహారం సిద్ధమవుతోంది రమ్మని తీసుకువెళ్ళాడు! ఎన్‌సిసి కుర్రాళ్ళకి - వారానికి మూడురోజులు టిఫిన్ సప్లై కాంట్రాక్టు! ఆ మధ్యాహ్నం - అనేక పనులు, పిల్లలకి జాతీయ గీతాలు నేర్పటంతో సహా. చివరికి రాజశేఖరం తన నవలని విశ్వపతి చేతుల్లో పెట్టి వెళ్లిపోయాడు. ఒక్కచూపులో చదివి చెబుతాను అన్నాడు.
నెలరోజుల తర్వాత - నాటక పోటీలు. ఇరవై సమాజాలు. కోలాహలం. ఉత్తరం రాశాడు విశ్వపతి. దక్షిణాది యాత్రకి బస్ ఏర్పాటు వగైరా! కొన్నాళ్ళ తర్వాత రాజశేఖరం టౌన్‌కి వెళ్ళాడు. విశ్వపతికి పెద్ద జబ్బు చేసింది. ఇంకా హాస్పిటల్‌లో వున్నాడు. అక్కడికి వెళ్ళాడు రాజశేఖరం. విశ్వపతి ఇతని నవలని దీక్షగా చదివేస్తున్నాడు. నవల గురించి చాలా చెప్పాడు విశ్వపతి. చాలా సూచనలూ చేశాడు. ఆ సాయంత్రమే డిశ్చార్జ్ అయ్యాడు విశ్వపతి. మరునాటి ఉదయం రాజశేఖరం తిరుగు ప్రయాణమయ్యాడు. విశ్వపతి సైకిలెక్కాడు! ‘జడత్వం మృత్యులక్షణం. చైతన్యం జీవలక్షణం. నిర్వ్యాపారత్వం మృత్యులక్షణం. నిరంతర కార్యాచరణ జీవలక్షణం. పొద్దుపోకపోవడం మృత్యులక్షణం. పొద్దు చాలకపోవడం జీవలక్షణం! విశ్వపతి ‘పొద్దుచాలని మనిషి!’ - అంటూ కథ ముగిసింది. కానీ అది మనల్ని వెంటాడుతూనే వుంటుంది! అదీ రాజారాం గారి కథాబలం!
- విహారి,
సెల్: 9848025600
బాలల్లో సాహితీ చైతన్యం అవసరం
శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుబ్గలో భారతీ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో గరిమెళ్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా గౌతం పాఠశాలలో పిల్లలకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ప్రముఖ వైద్యుడు కె. కేశవరావు ముఖ్య అతిథిగా హాజరై పిల్లల్లో రచనలపై ఆసక్తి పెంపొందించాలని అన్నారు. వ్యాస రచన, చిత్రలేఖనం, కవితల పోటీలు నిర్వహిస్తున్న భారతీ సాహితీ సాంస్కృతిక సేవా సంస్థను అభినందించాలన్నారు. తన వంతుగా అబ్దుల్ కలాం, మహాత్మాగాంధీ రచనలను కానుకగా ఇస్తానన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుడు బమ్మిడి సుబ్బారావు గరిమెళ్ల జీవిత చరిత్రను, స్వాతంత్య్ర పోరాటంలో గరిమెళ్ల పాత్రను వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యదర్శి శివాజీ పట్నాయక్, పి. రాములు, మహ్మద్ రఫీ, నందనరావు, రాజేంద్రనాయుడు తదితరులు పాల్గొన్నారు.
- ఈవేమన, 7893451307.
విజేతకు బహుమతి అందజేస్తున్న దృశ్యం
మనోగీతికలు
పూల నివాళి
నే పూమాలను
ధనికుల ద్వారబంధాల
వ్రేలాడాలని లేదు
నాయకుల మెడల్లో
మెరవాలని లేదు
శోభన గదులలో
మగ్గిపోవాలని లేదు
గండు తుమ్మెదలకు
ముద్దులివ్వాలని లేదు
స్వామి మెడలోను
అలంకారమవ్వాలని లేదు
మరి...
మాతృభూమికై
అశువులు బాసిన
అమరవీరుల సమాధుల
పూలమాలనై
నివాళులు అర్పిద్దామని ఉంది
- విద్వాన్ ఆండ్రకవిమూర్తి,
అనకాపల్లి, సెల్ : 9246666585
కథలు, కవితలు, సాహితీ వ్యాసాలు, పుస్తక పరిచయాలు, కార్టూన్లు, అరుదైన పాత ఫొటోలను (పూర్తి వివరాలతో) ఎడిటర్, మెరుపు, ఆంధ్రభూమి దినపత్రిక, సెక్టర్-9, ఎం.వి.పి.కాలనీ, విశాఖపట్నం-17. అనే చిరునామాకు పంపండి.