ఆదిలాబాద్, ఆగస్టు 17: ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం జరుగుతున్నా భూకబ్జాదారులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోక పోవడంపై కలెక్టర్ బాబు ఆగ్రహంవ్యక్తం చేశారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో రాజీవ్ స్వగృహ, రెవెన్యూ భూములు తదితర అంశాలపై ల్యాండ్ సర్వే, రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. మధ్య తరగతి ప్రజల కోసం నిర్మించతలపెట్టిన రాజీవ్ స్వగృహ గృహాల నిర్మాణం ఇంత వరకు ముందుకు సాగక పోవడంపై కలెక్టర్ అసంతృప్తివ్యక్తం చేశారు. ఈ గృహాల కోసం ఆశతో డిపాజిట్లు చెల్లించిన వారికి వెంటనే డబ్బులు వాపసు చేయాలని, రాజీవ్ స్వగృహపై నిర్లక్ష్యమే ఇందుకు కారణం అని ఆ సంస్థ మేనేజర్ సుధీర్‌రెడ్డిపై కలెక్టర్ మండి పడ్డారు. బాధ్యతతో పని చేయక పోతే తప్పుకోవాలని హితవు పలికారు. ఆదిలాబాద్ సమీపంలో రాజీవ్ స్వగృహ కోసం కేటాయించిన 115 ఎకరాల భూమిలో 45 ఎకరాలు కబ్జాకు గురి కావడం దారుణం అని, రెవెన్యూ ల్యాండ్ సర్వే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని అసంతృప్తివ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములంటే ఆశామాషీగా వ్యవహరిస్తున్నారని, ఇకనైనా బాధ్యతతో దృష్టిసారించాలని సూచించారు. కబ్జాకు గురైన భూమిని తమ ఆధీనంలోకి తీసుకోవాలని, ఆక్రమణదారులపై కేసులు నమోదు చేయాలని, రెవెన్యూ పోలీసు అధికారులను ఆదేశించారు. రాజీవ్ స్వగృహ భూముల చుట్టూ పెన్సింగ్ ఏర్పాటుచేయాలని సూచించారు. ఇదిలా వుంటే ఆదిలాబాద్‌కు సమీపంలోని మావల చెరువు వద్ద విలువైన సర్కారు భూములను ఆక్రమించి కొందరు బాహాటంగా నిర్మాణాలు చేపడుతున్నా ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించారు. ఈ భూములపై సమగ్ర విచారణ జరిపించి భవన నిర్మాణాలు చేపడుతున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. సర్కారు భూములను కబ్జా చేసే ఎంతటి వారైనా ఉపేక్షించరాదని, రెవెన్యూ చట్టపరంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మావల చెరువు ఆక్రమణలపై తాను గతంలోనే ఆదేశించినా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రెవెన్యూ, ల్యాండ్ సర్వే అధికారులు వెంటనే ప్రభుత్వ భూములను గుర్తించి వాటిలో ఎంత భూమి ప్రభుత్వం ఆధీనంలో వుంది, ఎంత కబ్జాకు గురైందో వెంటనే తనకు నివేదికలు అందించాలని, దురాక్రమణకు గురైన ప్రభుత్వ భూములను 15 రోజులలోగా స్వాధీనం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెసి సుజాత శర్మ, డిఆర్‌ఓ ఎస్‌ఎస్ రాజ్, ఆర్డీఓ సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్ తహశీల్దార్ సిడాం దత్తు, రాజీవ్ స్వగృహ మేనేజర్ సుధీర్‌రెడ్డి, ల్యాండ్ సర్వే ఎడి ఇనేష్, రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు.
1 నుండి ‘నగదు బదిలీ’ అమలు
* డీలర్లు తీరు మార్చుకోవాలి : కలెక్టర్ బాబు
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఆగస్టు 17: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకం జిల్లాలో సెప్టెంబర్ 1వ తేదీ నుండి అమలు చేయబడుతుందని జిల్లా కలెక్టర్ ఎ బాబు అన్నారు. గ్యాస్ కనెక్షన్లు గల ప్రతి లబ్దిదారుడు ఆగస్టు 31లోగా బ్యాంకు ఖాతాలు తీసి, ఆధార్ నెంబర్ బ్యాంకు ఖాతాకి అనుసంధానం చేసిన వారికి మాత్రమే ప్రభుత్వం సిలెండరుపై అందిస్తున్న రాయితీ వారి బ్యాంకు ఖాతాలలో డబ్బు జమ చేయబడ్తాయని, బ్యాంకు ఖాతా, ఆధార్ నెంబర్ లేని వారికి రాయితీ చెల్లింపులు చేయబడవని, ఈ విషయం ప్రతీ ఒక్కరు గ్రహించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఇవివధ ఏజెన్సీల డీలర్లు, బ్యాంకు అధికారులు, జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన నగదు బదిలీ పథకం అమలుపై జిల్లా కలెక్టర్ సమీక్షించంరు. జిల్లా మొత్తంలో 3 లక్షల 55 వేల 468 మంది వినియోగదారులకు గాను ఒక లక్షా 88 వేల 526 మందికి మాత్రమే ఏజెన్సీల డీలర్లు ఆధార్ నెంబర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేసి వివరాలు బ్యాంకులకు పంపారని అన్నారు. ఇంకా మిగిలి వున్న వారి వివరాలు ఏజెన్సీల డీలర్లు రాత్రి పగలు కష్టపడి ఫీడింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. లేని యెడల సెప్టెంబర్ 1 నుండి రాయితీలు లబ్దిదారులకు చెల్లింపులు జరగవని, ఆ తరువాత ఎదురయ్యే ఇబ్బందులు గ్యాస్ డీలర్లు ఎదుర్కొవాల్సి వుంటుందని పేర్కొన్నారు. కొందరు డీలర్లు చాలా వెనుకబడి వున్నారని, ఆధార్ నెంబర్లు పంపడంలో ఆలస్యం చేస్తున్నారని, తమ పనితీరు మార్చుకోవాలని కలెక్టర్ బాబు హెచ్చరించారు. పనిలో వెనుకబడి వున్నందున వినియోగదారులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తుందని, వెంటనే డీలర్లు ఆధార్ నెంబర్లను సకాలంలో వినియోగదారులకు అవగాహన కల్పిస్తూ వారి వద్ద నెంబర్లు తీసుకొనేలా ప్రత్యేకంగా కృషి చేయాలని, వారికి అన్ని రకాలుగా అవగాహన కల్పించాలని కలెక్టర్ బాబు అన్నారు. ఏవైనా సమస్యలుంటే వినియోగదారులు తమకు తెలపాలని కోరారు. ఆధార్ నెంబర్లు లేని వారిని గుర్తించి వెంటనే వారి వివరాలు నమోదు చేయించాలని తహశీల్దార్లను, ఎంపిడిఓలను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జెసి సుజాత శర్మ, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఉదయరంజన్ శర్మ, డిఎస్‌ఓ వసంత్‌రావు దేశ్‌పాండే, ఏజెన్సీల డీలర్లు తదితరులు పాల్గొన్నారు.
పొంగుతున్న వాగులు
నిలిచిపోయిన రాకపోకలు
బెజ్జూర్, ఆగస్టు 17: మండలంలో కుశ్నపల్లి, కుకుడ వాగులు పొంగుతున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మండలంలోని 12గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండల కేంద్రానికి రావాలంటే కుశ్నపల్లివాగును తప్పనిసరిగా దాటాల్సిందే. ఇటీవల ఎన్నికల సందర్బంగా మండలంలోని సుశ్మీర్, గబ్బాయి గ్రామాలకు చెందిన ఇద్దరు గిరిజనుల ప్రాణాలు కుశ్నపల్లివాగులో కలిసిపోవడంతో వాగును దాటేందుకు ప్రజలు జంకుతున్నారు. వాగుపై వంతెన లేకపోవడంతో ఈ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర వస్తువుల కోసం బెజ్జూర్ మండల కేంద్రానికి వాగు ప్రవాహం వల్ల రాలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాగుపై వంతెన నిర్మాణాలు చేపట్టాలని అధికారులకు ఎన్నోమార్లు అర్జీలు ఇచ్చినా బుట్టదాఖాలు అవుతున్నాయే తప్ప వంతెన నిర్మాణాలపై అధికారులు, ప్రజాప్రతినిధులు శ్రద్ద చూపడం లేదని మండల వాసులంటున్నారు.
అవగాహన లోపంతోనే
ఆధార్ నమోదులో జాప్యం
ఆంధ్రభూమి బ్యూరో
ఆదిలాబాద్, ఆగస్టు 17: ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసే నగదు బదిలీ పథకం, ఆధార్ నమోదు ప్రక్రియపై అవగాహన లోపం కారణంగానే జిల్లాలో ఆధార్ నమోదు కార్యక్రమం నత్తనడకన సాగుతోందని, ఇందుకు జిల్లా అధికారులే బాధ్యత వహించాలని జిల్లా కలెక్టర్ బాబు స్పష్టం చేశారు. ఆదిలాబాద్ ఆర్డీఓ కార్యాలయం నుండి కలెక్టర్ జిల్లాలోని 52 మండలాల అధికారులతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించి సీజనల్ వ్యాధులు, ఇందిరమ్మ పచ్చతోరణం, వ్యక్తిగత మరుగుదొడ్లు, ఉపాధి హామీ, నగదు బదిలీ, వరద విపత్తుల గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆధార్ నమోదు విషయంలో అధికారులు, బ్యాంకర్లు ఏ మాత్రం జాప్యం చేయకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు. వరదల వల్ల గ్రామాల్లో పంట నష్టంపై సర్వే నిర్వహించి ఆ వివరాలను ఎక్సల్ పట్టిక రూపంలో గ్రామసభలు నిర్వహించి నష్టపరిహారం వివరాలను గ్రామ పంచాయతీ కార్యాలయాల గోడలపై ప్రజలకు తెలిసే విధంగా అతికించాలని అధికారులను ఆదేశించారు. గ్రామాలలో పారిశుధ్యం, మెడికల్ క్యాంపులు నిర్వహించి గ్రామీణ ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలని అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మాత్రం సహించమన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10 వేల చొప్పున పారిశుధ్య పనులు, క్లోరినేషన్ మాత్రలు వాడడానికి నిధులు విడుదల చేశామని, అధికారులు ఈ నిధులు వినియోగించనందుకు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలలో మంచినీటి ట్యాంకులను వారానికి ఒకసారి శుభ్రపర్చాలని, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లకు నష్టపరిహారం కొరకు ఫ్రతి మండలానికి నిధులు విడుదల చేసామని, బాధితులకు వెంటనే నష్టపరిహారం కొరకు ప్రతి మండలానికి నిధులు విడుదల చేశామని బాధితులకు వెంటనే నష్టపరిహారం వారి బ్యాంక్ ఖాతాలకు జమ చేయాలని తహశీల్దార్లను, ప్రత్యేక అధికారులను కలెక్టర్ ఆదేశించారు. బాధితులకు బియ్యం, కిరోసిన్ పంపిణీ వివరాలపై తహశీల్దార్లతో అడిగి తెలుసుకొని పంపిణీలో ఎలాంటి జాప్యం చేసినా సహించేది లేదని అన్నారు. వర్షాల వల్ల చెడిపోయిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు వెంటనే చేసి ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించాలని, అందుకు కావాల్సిన పరిపాలన ఉత్తర్వులకు వెంటనే అనుమతులు ఇస్తానిన ఆర్ అండ్ బి, పంచాయతీ రాజ్ ఇంజనీర్లను ఆదేశించారు. గ్రామంలో మరుగుదొడ్ల పనులు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు డబ్బులు సకాలంలో చెల్లించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఏవైనా అవకతవకలు జరిగితే మాత్రం సహించమని శాఖపరంగా చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాలలో జనని సురక్ష పథకం ద్వారా బాలింతలకు అందిస్తున్న రూ.వెయ్యి ప్రసవం అయిన నాలుగు రోజులలో వారికి చెల్లింపులు చేసేలా చర్యలు గైకొనాలన్నారు. ప్రతీ ఒక్కరికి ఆధార్ నమోదు చేసుకొనేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆధార్ నమోదు కోసం గ్రామాల్లో ప్రచారం చేస్తూ అవగాహన కల్పించాలని ఇందుకు మండల తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు ప్రత్యేకంగా కృషి చేయాలని అన్నారు. దీపం పథకం ద్వారా సర్వే నిర్వహించి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలని గత సర్వే ద్వారా 40 శాతం బోగస్ వున్నట్లు తేలిందని, ఎంపిడిఓలు బాధ్యతతో సర్వేలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో డిఆర్‌ఓ ఎస్‌ఎస్ రాజ్, పలు శాఖల అధికారులు ఇంద్రసేన్, హనసారెడ్డి, వహీ అహ్మద్, అశోక్, షాహిద్ మసూద్, పోచయ్య, విజయ్‌కుమార్, ఆనంద్‌రెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
వైఎస్‌ఆర్‌సిపికి మూకుమ్మడి రాజీనామాలు
కౌటాల, ఆగస్టు 17: మండలంలో వైఎస్‌ఆర్‌సిపి పూర్తిగా ఖాళీ అయింది. ఇటీవల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప వైకాపా ప్రత్యేక తెలంగాణవాదానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్రకు మద్దతుగా నిర్ణయం వెలువరించిన నేపధ్యంలో పార్టీకి గుడ్‌బై చెప్పిన నేపధ్యంలో శనివారం మండలంలోని పార్టీ బాధ్యులు, ముఖ్య నాయకులు, సర్పంచ్‌లు ఇతర ద్వితీయ శ్రేణి నాయకత్వం మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. మండల కేంద్రంలోని కార్యాలయంలో గురుడుపేట సహకార సంఘం చైర్మన్ డుబ్బుల నానయ్య, మండల కన్వీనర్ బ్రహ్మయ్య, ముఖ్య నాయకులు బసర్‌కార్ విశ్వనాథ్, కుమురం మాంతయ్య, గట్టయ్యలు విలేఖరులతో మాట్లాడారు. వై ఎస్ ఆర్ ఆశయ సాధనే ధ్యేయంగా వైకాపాలో కోనప్ప ఆధ్వర్యంలో చేరామని, ఇటీవల పార్టీ విధానాలు తెలంగాణకు వ్యతిరేకంగా మారడంతో పాటు విధానపరంగా నిర్ణయం తీసుకోవడంలో నిర్లక్ష్యం ఉండటం వల్ల తాము కోనప్పకు మద్దతుగా ఆయన బాటలో నడిచేందుకు రాజీనామాలు చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ రాజీనామా లేఖలను పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మకు పంపనున్నట్లు తెలిపారు. కాగా భవిష్యత్తులో కోనప్పతోనే తామంతా కొనసాగుతామని, ఆయన తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటామని పునరుద్ఘాటించారు. వీరితో పాటు ఇటీవల కోనప్ప మద్దతుతో గెలిచిన 11మంది గ్రామ సర్పంచ్‌లు కూడా రాజీనామాలు చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మండలంలో వైకాపా పూర్తిగా తుడిచిపెట్టుకపోగా, పార్టీ పేరు లేకుండా పోయింది. రానున్న రోజుల్లో వైకాపాకు రాజీనామా చేసిన నాయకులు కోనప్ప తీసుకునే నిర్ణయంతో ఎటువైపు వెళతారో వేచి చూడాల్సిందే.
ఆశ్రమ పాఠశాలలో పిఓ తనిఖీ
జన్నారం, ఆగస్టు 17: ఆశ్రమ పాఠశాలల్లోని విద్యార్థులు వర్షాకాలం అయినందున అంటువ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాలని, విద్యార్థుల విద్య పట్ల ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులు దృష్టిసారిస్తూ వారు చదువుల్లో రాణించే విధంగా చూడాలని ఐటిడిఎ పిఓ జనార్థన్ నివాస్ అన్నారు. శనివారం మండలంలోని కవ్వాల, జన్నారంలోని ఆశ్రమ పాఠశాలలను పిఓ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. అనంతరం రికార్డులను, విద్యార్థుల హాజరుపట్టికలు, ఉపాధ్యాయుల విధుల రిజిస్టర్లను పరిశీలించారు.
విద్యార్థులు ఆరోగ్యాల పట్ల
జాగ్రత్తలు పాటించాలి : పిఓ
అనంతరం పిఓ మాట్లాడుతూ విద్యార్థుల విద్యతో పాటు వారి ఆరోగ్యాల పట్ల అధికారులు, ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు పాటించి వైద్యులచే పరీక్షలు నిర్వహించాలని అన్నారు. విద్యార్థులు కూడా ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను సక్రమంగా నేర్చుకోవాలని, చెడు రుగ్మతలకు పాల్పడకుండా విద్యార్థులు చదువుల్లో ముందుండాలని నివాస్ పిలుపునిచ్చారు. ఆయన వెంట తహశీల్దార్ సత్యనారాయణ, ఎంపిడిఓ బి శేషాద్రి, ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలు రాజవౌళి, ఉపాధ్యాయులు గంగాధర్ పాల్గొన్నారు.
వికలాంగులకు ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ అమలు చేయాలి : కలెక్టర్
ఆదిలాబాద్ (రూరల్), ఆగస్టు 17: వికలాంగులకు ప్రభుత్వ అభివృద్ది సంక్షేమ పథకాల అమలు, ఉద్యోగాల్లో 3 శాతం రిజర్వేషన్ తప్పని సరిగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ బాబు అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో సంక్షేమ పథకాలలో వికలాంగుల ప్రయోజనాలు, కేటాయింపు తీరుపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికలాంగుల అభివృద్ది కొరకు ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందని, ఆ సంక్షేమ కార్యక్రమాలు వారికి సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై వుందని, ప్రతి శాఖ ద్వారా చేపట్టే అభివృద్ది, సంక్షేమ పథకాలు, ఉపాధి, ఉద్యోగ నియాకాలలో 3 శాతంను వికలాంగులకే కేటాయించి సకాలంలో వారికి లబ్దిచేకూర్చాలని అన్నారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఎ పిడి వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్సీ కార్పోరేషన్ ఇడి యాదయ్య, బిసి కార్పోరేషన్ ఇడి అనసూయ, డిఎంహెచ్‌ఓ డాక్టర్ స్వామి, బ్యాంక్ అధికారులు, పలు శాఖళ అధికారులు, వికలాంగులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబాన్ని ఆదుకుంటాం
ఉట్నూరు, ఆగస్టు 17: అగ్ని బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. శనివారం ఎక్స్‌రోడ్‌లోని ప్రకాశ్‌కు చెందిన కిరాణా దుకాణం దగ్ధం కాగా, లక్ష రూపాయలు నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న ఎంపీ ప్రమాద స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హరినాయక్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.-
దొంగలా.. వ్యాపారులా..?
*బాసర వ్యాపారి కుటుంబం హత్యపై పోలీసుల ఆరా
నిర్మల్‌టౌన్, ఆగస్టు 17: బాసరలో శుక్రవారం అర్దరాత్రి దాటిన తరువాత జరిగిన అమానుష సంఘటనలో అసువులు బాసిన వ్యాపారి అశోక్ కుటుంబం హత్యపై పోలీసులు అన్ని కోణాల్లోను దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన అశోక్ నల్గొండ జిల్లా సూర్యాపేట్‌కు చెందిన సువర్ణను 25 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి కుటుంబ కలహాల నేపథ్యంలో ఇంటినుంచి సుదూర ప్రాంతమైన బాసరకు వలస వచ్చారు. అమ్మవారి సన్నిధిలో చిరువ్యాపారం చేసుకుంటూ పొట్టపోసుకుంటున్న అశోక్ బాసర సమీపంలో కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. అక్కడే అప్పులు చేసి ఓ లాడ్జిని సైతం నిర్మించారు. ఇదే సమయంలో పెద్ద కూతురు అనారోగ్యంపాలై మరణించడంతో మరిన్ని అప్పులయ్యాయి. దీంతో లాడ్జిని విక్రయించి అప్పులు తీర్చిన తరువాత మిగిలిన దాంతో ఆలయ సన్నిధిలో వ్యాపారాన్ని ప్రారంభించారు. కొడుకు మణికంఠ చేతికి రావడంతో తండ్రికొడుకులు ఇద్దరు కలిసి వ్యాపారాన్ని విస్తరించడంతో గత పదేళ్లుగా ఆర్థికంగా ఎంతో బలపడ్డారు. అయితే చేస్తున్న వ్యాపార కేంద్రం ఆలయానికి ముఖద్వారానికి ఎదురుగా ఉండటం వల్ల ప్రతీరోజు వ్యాపారం పెద్ద ఎత్తున జరిగేది. దీంతో ఇతర వ్యాపారులు ఈ దుకాణాన్ని కైవసం చేసుకోవాలన్న దురాలోచనతో ఈయనను అడ్డు తొలగించడానికి ఎమైన కుట్ర జరిగిందా అన్న కోణంలో పోలీసులు ఆరాతీస్తున్నారు. అలాగే మహారాష్టక్రు సంబందించిన దొంగల ముఠా ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చునేమోనన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే అశోక్, సువర్ణల కుటుంబ సభ్యులెవరైనా వీరి ఆస్థిపై కనే్నసి హతమార్చి ఉండవచ్చేమోనన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
దైవదర్శనానికి వెళతారనుకుంటే..
దారుణ హత్యకు గురైన అశోక్ కుటుంబీకులతో కలిసి శనివారం సాయంత్రం తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లేందుకు ప్రణాళిక సిద్దం చేసుకున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లో చదువుతున్న చిన్న కుమారుడు శరత్‌చంద్రను బాసరకు పిలిపించుకున్నారు. కుటుంబమంతా సంతోషంగా తిరుపతి ప్రయాణానికి సిద్దమవుతున్న క్రమంలోనే మృత్యువాత పడడం అందరిని కలిచివేస్తోంది. ఈ సంఘటనలో తీవ్రగాయాలపాలై అపస్మారక స్థితిలో ఉన్న శరత్‌చంద్రను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. ఆయన కోలుకుంటే సంఘటన వివరాలు తెలిసే అవకాశం ఉంది.