నిజామాబాద్ టౌన్, మార్చి 3: జిల్లా కేంద్రంలో అధికారులు నిర్వహించిన బిసి ఓటర్ల జాబితాలో తప్పులు దొర్లాయని, వాటిని వెంటనే సరిదిద్దాలని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు డిమాండ్ చేశారు. బిసి ఓటర్ల జాబితా సవరణ, సందేహాలపై శనివారం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో టిడిపి, ఎంఐఎం, తెరాస, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. బిసి ఓటర్ల జాబితాను ఇష్టారీతిన రూపొందించారని, జాబితాలో పూర్తిగా తప్పులు ఉన్నాయని అధికారుల పనితీరును ఆక్షేపించారు. ఒక్కో ఓటరుకు మూడుచోట్ల ఓటు హక్కు కల్పిస్తూ జాబితారు తయారు చేశారని లోటుపాట్లను అధికారుల దృష్టికి తెచ్చారు.
అదేవిధంగా దంపతుల ఓట్లలో ఒక్కరికి ఒక డివిజన్‌లో ఓటు హక్కు ఉంటే, మరొకరికి పక్క డివిజన్ జాబితాలో పేరు నమోదు చేశారని పేర్కొన్నారు. ఇంటింటికి వెళ్లి సర్వే నిర్వహిస్తే ఇలాంటి సమస్యలు ఉండవని, తక్షణమే జాబితాను సవరణ చేసి తప్పులను సరిదిద్దాలని సూచించారు. దీనిపై నగర పాలక సంస్థ కమిషనర్ రామకృష్ణారావు స్పందిస్తూ, ఓటర్ల జాబితా సవరణ తమ పరిధిలోనిది కాదని, రెవెన్యూ అధికారులు సరి చేయాల్సి ఉంటుందన్నారు. మీ దృష్టికి వచ్చిన పేర్లను లిఖితపూర్వకంగా తనకు అందజేస్తే ఆర్డీవో, తహశీల్దార్లకు పంపి సరి చేయిస్తానని సమాధానం ఇచ్చారు. కార్పొరేషన్ పరిధిలోని పది డివిజన్లలో బిసి ఓటర్ల జాబితాలో చాలావరకు తప్పులు ఉన్నాయని పార్టీల ప్రతినిధులు అధికారులకు వివరించారు. ఈ సమావేశంలో టిడిపి అర్బన్ నాయకులు అర్సె భూమయ్య, తెరాస నాయకుడు నారాయణగుప్తా, ఎంఐఎం నాయకుడు జాకీరుద్దీన్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అర్బన్ ఇంచార్జ్ ధాత్రిక రతన్, నగర పాలక సంస్థ ప్రణాళికా విభాగం అధికారి శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టును పూర్తి చేయిస్తాం: మాజీ స్పీకర్
కమ్మర్‌పల్లి, మార్చి 3: కమ్మర్‌పల్లి, మోర్తాడ్ మండలాలకు ప్రయోజనం చేకూర్చే గట్టు పొడిచిన వాగు ప్రాజెక్టు అసంపూర్తి పనులకు నిధులు మంజూరు చేయించి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని మాజీ స్పీకర్ కెఆర్.సురేష్‌రెడ్డి అన్నారు. శనివారం కమ్మర్‌పల్లి మండలంలోని గట్టుపొడిచిన వాగు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సురేష్‌రెడ్డి మాట్లాడుతూ, గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టుకు సంబంధించి మిగిలిపోయిన పనులను రెండు భాగాలుగా విభజించడం జరిగిందన్నారు. మొదటి దశ పనులకు 85లక్షల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేయగా, పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రెండో విడత పనులకు కోటీ 80లక్షల రూపాయలను మంజూరు చేసి రెండు పర్యాయాలు టెండర్లు పిలిచినప్పటికీ గుత్తేదార్లు ఎవరూ ముందుకు రాకపోవడం ఆ పనులను కొత్త ఎస్టిమేషన్లతో రూపొందించడం జరుగుతుందన్నారు. మొత్తం మూడున్నర కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిధులను మంజూరు చేయించి పనులను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. ఈ పనులతో భీమ్‌గల్ మండలంలోని మెండోరా, కమ్మర్‌పల్లి మండలంలోని హాసాకొత్తూర్, కమ్మర్‌పల్లి, మోర్తాడ్ మండలంలోని ఒడ్యాట్ గ్రామాలకు సాగునీరందుతుందని తెలిపారు. గట్టుపొడిచిన వాగు నిర్మాణం వల్ల పర్యాటక కేంద్రంతో పాటు ఈ ప్రాంత గిరిజనులకు పశు సంపదను పెంపొందించేందుకు ఇది ఎంతో దోహదపడుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా వన్యప్రాణులకు సైతం నీటి వసతి సమకూరిందన్నారు. గత మూడేళ్లుగా ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని, దీనిపై ప్రత్యేక దృష్టిసారించి పనులు పూర్తయ్యేలా చొరవ చూపుతానని సురేష్‌రెడ్డి అన్నారు.
9కోట్లు మంజూరు చేయిస్తా
భీమ్‌గల్ మండలంలోని వేముగంటి ప్రాజెక్టుకు అటవీ శాఖ క్లియరెన్స్ లభించిందని, దాదాపు 9కోట్ల రూపాయలతో కూడిన ప్రతిపాదనలకు పరిపాలనాపరమైన ఆమోదం లభించాల్సి ఉందని సురేష్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రితో చర్చించి నిధుల మంజూరయ్యేలా కృషి చేస్తానని, ఏడాదిలోగా ఈ పనులు పూర్తి చేయిస్తామని చెప్పారు. వేముగంటి ప్రాజెక్టు నిధుల మంజూరీకై పార్లమెంటు సభ్యుడు మధుయాష్కీ, జిల్లాకు చెందిన మంత్రి సుదర్శన్‌రెడ్డి, బాల్కొండ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్‌ల సహకారంతో సిఎంను ఒప్పించి నిధులు తెస్తామన్నారు. చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల పథకం నత్తనడకన సాగడం పట్ల ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుని రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కాంట్రాక్టర్‌కు జరిమానా విధించిందన్నారు. కొన్ని లీకేజీలు మినహా దాదాపుగా పనులు పూర్తయ్యాయని, సాంకేతిక లోపాలను సరిదిద్ది ఆయకట్టు రైతాంగానికి లబ్ధి చేకూరుస్తామన్నారు. కమ్మర్‌పల్లిలో రైల్వేగేట్ మంజూరీ కోసం గతంలో దక్షిణ మధ్య రైల్వే జిఎం హామీ ఇచ్చారని, ఆయన పదవీ విరమణ చేయడంతో ఈ విషయాన్ని కొత్త జిఎం దృష్టికి మరోమారు తీసుకెళ్లి మంజూరుకు కృషి చేస్తానని చెప్పారు. విలేఖరుల సమావేశంలో గట్టుపొడిచిన వాగు ప్రాజెక్టు ఎ.ఇ దేవేందర్, డిసిసిబి ఇంచార్జ్ చైర్మన్ పి.రాజశేఖర్, మాజీ జడ్పీటిసి గంగాధర్, కాంగ్రెస్ నాయకులు ఏలేటి గంగాధర్, జి.నర్సారెడ్డి, ఎర్ర ఆశన్న, బుచ్చన్న పాల్గొన్నారు.