నిజామాబాద్, మార్చి 3: జిల్లాలో ఉప ఎన్నిక జరుగుతున్న కామారెడ్డి శాసనసభా నియోజకవర్గంలో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు అధికార పార్టీ అపసోపాలుపడుతోంది. ప్రధాన పార్టీలైన తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగుదేశం పార్టీలతో పోలిస్తే, కాంగ్రెస్ శ్రేణుల్లో ఒకింత నైరాశ్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. పార్టీ తరఫున ఉప సమరంలో తలపడతారని భావించినప్పటికీ, మాజీ మంత్రి మహ్మద్ షబ్బీర్‌అలీ ఎన్నిక బరిలో లేకపోవడం కార్యకర్తల్లో నిరుత్సాహానికి కారణమవుతోంది. డిసిసిబి చైర్మన్ ఎడ్ల రాజిరెడ్డికి అభ్యర్థిత్వం కేటాయించినప్పటికీ, షబ్బీర్ తరహా ఛరిష్మా కలిగిన నేత కాకపోవడంతో క్యాడర్‌లో ఉత్సాహం నీరుగారుతోంది. షబ్బీర్‌అలీ పోటీలో ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని కార్యకర్తలు బాహాటంగానే పేర్కొంటున్నారు. వాస్తవానికి అభ్యర్థుల పేర్లను ఖరారు చేయకమునుపే షబ్బీర్‌అలీ తాను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. అయితే షబ్బీరే పోటీ చేయాలంటూ కార్యకర్తలు సిఎం సమక్షంలో జరిగిన సమావేశంలో తేల్చి చెప్పడమే కాకుండా, ఆందోళనలకు సైతం దిగినా షబ్బీర్‌అలీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో పొరుగున గల ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేసిన షబ్బీర్‌అలీ, ప్రస్తుతం సొంత సెగ్మెంట్ అయిన కామారెడ్డి ఉప ఎన్నికకు దూరంగా ఉండిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ పరిణామం ఎన్నికలకు ముందే పలాయనవాదం ప్రదర్శించారనే సంకేతాలు అందించినట్లయ్యిందని, ఇది పార్టీ అభ్యర్థి విజయావకాశాలపై తీవ్రస్థాయిలోనే ప్రతికూల ప్రభావం చూపుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలోని ఇతర అన్ని ప్రాంతాలతో పోలిస్తే కామారెడ్డి సెగ్మెంట్‌లో తెలంగాణ సెంటిమెంటు ప్రభావం ఒకింత ఎక్కువగా ఉండడం వల్లే షబ్బీర్‌అలీ పోటీకి వెనుకంజ వేసినట్టు స్పష్టమవుతోంది. అప్పటికే 2009 సార్వత్రిక ఎన్నికల్లో షబ్బీర్‌అలీ 47వేల ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూడడం, 2010లో జరిగిన ఉప ఎన్నికల్లో ఎల్లారెడ్డి సెగ్మెంట్ నుండి అదృష్టాన్ని పరీక్షించుకున్నప్పటికీ ఓటమి ఎదురైన దరిమిలా ప్రస్తుతం మరోమారు పోటీకి సాహసించలేకపోయారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ప్రముఖ మైనార్టీ నేతగా చెలామణి అవుతున్న నేపథ్యంలో ముచ్చటగా మూడోసారి కూడా ఓటమి పాలైతే ప్రతిష్ట మసకబారుతుందని, ఫలితంగా రాజకీయ భవితవ్యానికి ఇది ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందన్న ఉద్దేశ్యంతోనే షబ్బీర్‌అలీ ఉప పోరుకు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. గంప రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యమని నిర్ధారణ అయిన సమయంలోనే షబ్బీర్‌అలీ తనకు ఎంతో నమ్మకస్థులైన వారితో సెగ్మెంట్‌లో రెండు దఫాలుగా ప్రైవేట్ సర్వేలు జరిపించినట్టు సమాచారం. ఈ సందర్భంగా ప్రతీకూలత తీవ్రస్థాయిలోనే ఉందని సర్వేల్లో వెల్లడి కావడం వల్లే షబ్బీర్‌అలీ ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని గట్టిగా నిర్ణయించుకుని, ఆ నిర్ణయానికే కట్టుబడి ఉన్నారని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యత్వంతో పాటు, అవకాశం అందివస్తే పిసిసి అధ్యక్ష పదవినైనా చేపట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. తన రాజకీయ గురువుగా భావించే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాంనబీ ఆజాద్ తోడ్పాటుతో అధిష్ఠానాన్ని ఎలాగైనా ఒప్పించి కీలక పదవిని చేజిక్కించుకోవాలనే ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఉప ఎన్నిక బరిలో దిగితే పరిస్థితులు అనుకూలించక మరోమారు ఓటమిపాలైతే ప్రత్యామ్నాయ పదవిని కట్టబెట్టాలంటూ అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చేందుకు అవకాశం ఉండదని, వరుసగా మూడు పర్యాయాలు ఓడిపోయారనే ముద్రను మోయాల్సి వస్తోందన్న భావనతోనే షబ్బీర్‌అలీ పోటీకి ససేమిరా అంగీకరించలేదని స్పష్టమవుతోంది. వ్యక్తిగతంగా షబ్బీర్‌అలీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయం ప్రస్తుత ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు మాత్రం శరాఘాతంలా మారిందని అధికార పార్టీ నేతలు పేర్కొంటున్నారు. షబ్బీర్ నిర్ణయం పరోక్షంగా టిఆర్‌ఎస్‌తో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం మరింత ఊతమందించిందని అభిప్రాయపడుతున్నారు. కీలక నేత బరిలో లేకపోవడంతో పార్టీ అభ్యర్థిగా మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు నామమాత్రపు ప్రచారానికే పరిమితమవుతున్నారు. అంతేకాకుండా షబ్బీర్‌అలీ బరిలో నిలువని పక్షంలో తమకు అభ్యర్థిత్వం కేటాయించాలంటూ మాచారెడ్డి మాజీ ఎంపిపి లోయపల్లి నర్సింగ్‌రావు, కామారెడ్డి మున్సిపల్ మాజీ చైర్మన్ కైలాస్ శ్రీనివాస్‌లు టిక్కెట్లను ఆశించారు. అధిష్ఠానం వారికి మొండిచేయి చూపి, ఎడ్ల రాజిరెడ్డిని బరిలోకి దించడంతో సదరు నేతలు ఆయన గెలుపు కోసం ఏమేరకు సహకరిస్తారన్నది సందిగ్ధంగానే మారింది. మొత్తం మీద కామారెడ్డిలో ప్రధాన పార్టీల మధ్య ఇప్పటివరకు ఉన్న బలాబలాలను బట్టి చూస్తే సెంటిమెంటును అనుకూలంగా మల్చుకుని టిఆర్‌ఎస్, మాజీ ఎమ్మెల్యే యూసుఫ్‌అలీ చేరికతో తెలుగుదేశం పార్టీలు కదనోత్సాహాన్ని ప్రదర్శిస్తుండగా, అధికార కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఆ స్థాయి ఉత్సాహం మచ్చుకైనా కనిపించడం లేదు.
బరిలో తొమ్మిది మంది అభ్యర్థులు
అందరికీ గుర్తుల కేటాయింపు
కామారెడ్డి, మార్చి 3: కామారెడ్డి శాసనసభ ఉప ఎన్నికల్లో పోటికి మొత్తం 11మంది నామినేషన్‌లు దాఖల్ చేయగా, నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగిసే సరికి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులైన గోపియాదవ్, ఎండి.తాహేర్‌బిన్ అహ్మద్‌లు వారి వారి నామినేషన్‌లు ఉపసంహరించుకున్నట్లు ఎన్నికల అధికారి ఎ.సుధాకర్‌రెడ్డి తెలిపారు. నామినేషన్‌ల ఉపసంహరణ చివరి రోజు శనివారం కావడం, ఇదే రోజు అహ్మద్ నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎన్నికల పోటిలో 9మంది అభ్యర్థులు మిగిలినట్లు తెలిపారు. 9మంది అభ్యర్థులకు గుర్తులు కేటాయించినట్లు వెల్లడించారు. పోటిలో ఉన్న ఎడ్ల రాజిరెడ్డి ఐఎన్‌సికి చెయిగుర్తు, టిడిపి అభ్యర్థి నిట్టువేణుగోపాల్‌కు సైకిల్ గుర్తు, టిఆర్‌ఎస్ అభ్యర్థి గంపగోవర్ధన్‌కు కారుగుర్తు, స్వతంత్ర అభ్యర్థి కైరమ్‌కొండ యాదగిరికి సిజర్స్ గుర్తు, రాములు బోయినికి టెలివిజన్ గుర్తు, కోడిప్యాక మహేందర్‌గౌడ్‌కు కొకనట్ గుర్తు, పడిగే శ్రీ్ధర్‌కు బ్యాట్ గుర్తు, రాజనర్సయ్య తోటకు గ్యాస్ సిలిండర్ గుర్తు, సతీష్‌కు ఆటో రిక్షా గుర్తులు కేటాయించినట్లు ఎన్నికల అధికారి సుధాకర్ ప్రకటించారు.