Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

టిజెఎసి శాంతిర్యాలీ

$
0
0

మహబూబ్‌నగర్, ఆగస్టు 17: ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ కోర్ కమిటీతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకోవడంతో సీమాంధ్ర ప్రాంతాలలో జరుగుతున్న సమైక్యవాద ఉద్యమం తెలంగాణ ప్రజలను కలవరానికి గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రాంతంలోని ప్రజలు శాంతిగా ఉండాలంటూ టిజెఎసి ఆధ్వర్యంలో వారం రోజులుగా శాంతి ర్యాలీని నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా శనివారం జిల్లా వ్యాప్తంగా టిజెఎసి ఆధ్వర్యంలో శాంతిర్యాలీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, కొల్లాపూర్, అచ్చంపేట, వనపర్తి, గద్వాల, అలంపూర్, దేవరకద్ర, నారాయణపేట, మక్తల్, కొడంగల్ నియోజకవర్గ కేంద్రాలతో పాటు జిల్లాలోని పలు మండలాలలో విద్యార్థులు, టిజెఎసి నాయకులు, తెలంగాణవాదులు శాంతిర్యాలీని నిర్వహించారు. గద్వాలలో జరిగిన శాంతిర్యాలీలో టిజెఎసి జిల్లా చైర్మన్ రాజేందర్‌రెడ్డి పాల్గొన్నారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్‌లో జరిగిన తెలంగాణ శాంతిర్యాలీలో వేలాది మంది విద్యార్థులు, వందలాది మంది తెలంగాణవాదులు, టిజెఎసి నాయకులు పాల్గొన్నారు. మెట్టుగడ్డ నుండి ప్రారంభమైన ర్యాలీ మహబూబ్‌నగర్ పట్టణ పురవీధుల గుండా తిరుగుతూ టిఎన్‌జీఓ భవనం దగ్గరకు చేరుకున్నారు. అక్కడి నుండి తిరిగి ప్రారంభమైన ర్యాలీ తెలంగాణచౌరస్తా మీదుగా బోయపల్లిగేటు, క్లాక్‌టవర్ వరకు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం దగ్గర నివాళులర్పించారు. ఈ సందర్భంగా టిజెఎసి నాయకులు రామకృష్ణరావు, బాలకిషన్, చంద్రానాయక్‌లు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని, కాంగ్రెస్ పార్టీ తక్షణమే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో అశాంతిని, అల్లర్లను ప్రజల మధ్య గందరగోళం సృష్టించేందుకు సీమాంధ్ర నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ కుట్రలను తిప్పికొట్టేందుకే టిజెఎసి ఆధ్వర్యంలో శాంతిర్యాలీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సీమాంధ్ర నాయకులు తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రం విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసి ఉండేందుకు సహకరించాలని కోరారు. సీమాంధ్ర ప్రజలు తెలంగాణను వ్యతిరేకించడం లేదని, కేవలం నాయకుల కృత్రిమ ఉద్యమం కారణంగానే సమైక్యవాదమని నినాదాలు వెలుగులోకి తెచ్చారని ఆరోపించారు. కలిసి ఉండాలనే నినాదం సీమాంధ్ర ప్రజల నుండి రాకూడదని, ఇది తెలంగాణ ప్రజల నుండి వచ్చినప్పుడే సరైన వాదన అని అన్నారు. అసలు తెలంగాణ ప్రజలు కలిసి ఉండలేమని తేల్చిచెబుతుంటే బలవంతంగా కలిసి ఉండాలని డిమాండ్ చేయడం అతి వితండవాదానికే అర్థమవుతుందన్నారు. తెలంగాణ ప్రజలు ఆగ్రహాలకు, ఆవేశాలకు గురి కాకూడదనే ఉద్దేశంతోనే శాంతిర్యాలీలు నిర్వహిస్తున్నామని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, సతీష్, వెంకటేష్, శారద, జనార్దన్, కృష్ణ, గౌస్ తదితరులు పాల్గొన్నారు.

వణికిస్తున్న అతిసార
* రెండు రోజుల్లో ఇద్దరు మృత్యువాత
* మంచంపట్టిన జనం...పాతర్‌చేడ్‌లో వందకు మందికి పైగా అస్వస్థత
* కురుస్తున్న వర్షాలు... గ్రామాలలో పారిశుద్ధ్య లోపం
* పైప్‌లైన్ల లీకేజీలు... కలుషితమవుతున్న తాగునీరు

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఆగస్టు 17: జిల్లా ప్రజలను అతిసార భయం వెంటాడుతోంది. ప్రస్తుత సీజన్‌లో ప్రజానికానికి అతిసార భయం వెంటాడుతుండడంతో ప్రాణాలు గాలిలో కలిసిపోతాయని ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు గ్రామాలలో ప్రజలు అస్వస్థతకు గురవుతున్నారు. ముఖ్యంగా నర్వ మండలంలో గత మూడు, నాలుగు రోజుల నుండి అతిసార విజృంభించడంతో ఇద్దరు వ్యక్తులు మృత్యువాత పడ్డారు. శనివారం సైతం మరోవ్యక్తి తుప్పల్లి బుచ్చప్ప (60) చనిపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. పాతర్‌చేడు గ్రామంలో వచ్చిన అతిసారవ్యాధి జనాన్ని ఉక్కిబిక్కిరి చేస్తోంది. ఈ నెల 16వ తేదీన బోయ లక్ష్మమ్మ మృత్యువాత పడగా శనివారం మరో వ్యక్తి మృతి చెందాడు. దాదాపు వంద మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిని వైద్యులు చికిత్సలు అందిస్తున్నప్పటికీ అతిసార అదుపులోకి రాకపోవడంతో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేశారు. ఇటీవల మాగనూర్, ఊట్కూరు మండలాలలో కూడా అతిసార వ్యాధి సోకింది. నల్లమల అడవి ప్రాంతంలో చెంచులు సైతం అతిసార బారిన పడ్డారు. వారికి వైద్య పరీక్షలు అందడం లేదు. ముఖ్యంగా నల్లమల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న ఆదివాసుల చెంచుల గురించి ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెలుబడుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా గ్రామాలన్నీ చిత్తడిచిత్తడిగా మారాయి. గ్రామాలలో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేని కారణంగా అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. పారిశుద్ధ్యలోపం కూడా పలు గ్రామాలలో పక్కాగ కన్పిస్తోంది. నిధుల కొరతతో గ్రామాలలో పారిశుద్ధ్య పనులు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. నూతనంగా సర్పంచ్‌గా ఎన్నికైనప్పటికీ వారు కేవలం కుర్చీలకే పరిమితమైపోయారు. ఇప్పటి వరకు వారికి నిధుల విషయంలో గానీ, అధికారం విషయంలో గానీ ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో కొందరు సర్పంచ్‌లు తమకు చెడ్డపేరు వస్తుందనే భావించి గ్రామాలలో కొత్తోగొప్పో పారిశుద్ధ్య కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రత్యేక అధికారులు మాత్రం గ్రామాల వైపు కనె్నత్తి చూడడం లేదు. జిల్లాలోని వివిధ గ్రామాలలో పారిశుద్ధ్యలోపంతో పాటు తాగునీటి పైపులు కూడా లీకేజీ అయ్యాయి. వర్షం కురుస్తుండడంతో వర్షం నీరు లీకేజీ అయిన పైపుల ద్వారా సరఫరా అవుతుండడంతో ఇటు తాగునీరు, అటు వర్షపు నీరు కలువడంతో నీరంతా కలుషితంగా మారుతున్నాయి. పాతర్‌చేడు గ్రామంలో ఇదే పరిస్థితి ఏర్పడడంతో అతిసార వ్యాధి సోకినట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా చెరువులు, కుంటల్లోకి కొత్త నీరు చేరడంతో పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి బోర్లలో భూగర్భజలాలు పెరగడంతో ఆ నీరు కూడా కలుషితంగా మారుతుంది. ప్రస్తుతం పరిస్థితుల్లో జిల్లా అధికార యంత్రాంగం లీకేజీ అయిన పైపులైన్లను మరమ్మతులు చేస్తే తప్ప అతిసార బారి నుండి ప్రజలు బయటపడే అవకాశం ఉంది. జిల్లా ప్రజానీకానికి అతిసార వ్యాధి వెంటాడుతుండడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లా ప్రజానీకానికి కూడా వైద్య సిబ్బంది పరిశుభ్రత, తాగునీటిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైన ఉంది. జిల్లా వ్యాప్తంగా వైద్య సిబ్బంది ఎక్కడా కూడా గ్రామాల ప్రజలకు తాగునీటివాడకంపై ఎలాంటి అవగాహన సదస్సులు గానీ, పరిసర ప్రాంతాల పరిశుభ్రతపై అవగాహన కల్పించడం లేదనే విమర్శలు వెలువడుతున్నాయి. ఏదీ ఏమైనా అధికారుల నిర్లక్ష్యం..ప్రజలకు అవగాహన లోపం కారణంగానే జిల్లా ప్రజానీకాన్ని అతిసారవ్యాధి వెంటాడుతోందని చెప్పవచ్చు.

అక్టోబర్ నాటికి పునరావాస కేంద్రాల పనులు పూర్తి

* జిల్లా స్థాయి సమీక్షలో మంత్రి డికె అరుణ

గద్వాల, ఆగస్టు 17: జూరాల, నెట్టెంపాడు ప్రాజెక్టుల ముంపుగ్రామాల స్థానంలో చేపట్టిన పునరావాస, పునఃనిర్మాణ కేంద్రాల పనులను అక్టోబర్ నాటికి పూర్తిచేసి తీరాలని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి డికె అరుణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం గద్వాలలోని ఆర్డీఓ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. జూరాల, ఆర్డీఎస్, నెట్టెంపాడు ప్రాజెక్టు కింద చేపట్టిన పునరావాస కేంద్రాల పురోగతిపై నీటిపారుదల, రెవెన్యూ, సంబంధిత అధికారులతో సమీక్షించారు. పాత పునరావాస కేంద్రాలను సంబంధించి పనులన్నింటిని తక్షణం పూర్తిచేయాలని, పెండింగ్‌లో పనులు ఉంచితే సహించేది లేదన్నారు. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు కింద చేపట్టిన పునరావాస కేంద్రాలై గార్లపాడు, ఉప్పేరు, రేవులపల్లి, నాగర్‌దొడ్డి, అంకెన్‌పల్లి, గార్లపల్లి పునరావాస కేంద్రాలకు సంబంధించిన భూ సేకరణ పనులలో గార్లపాడు మినహా తక్కిన పునరావాస కేంద్రాల భూసేకరణ పనులు పెండింగ్‌లో ఉన్నాయని, అంకెన్‌పల్లి, గార్లపల్లిలలో సామాజిక, ఆర్థిక గణన సర్వే చేయాలని ఇంజనీరింగ్ అధికారులు మంత్రికి వివరించారు. ఇందుకు స్పందించిన మంత్రి పునరావాస కేంద్రాల్లో ప్రాథమిక సౌకర్యాలైన తాగునీరు, విద్యుత్, రోడ్లు, దేవాలయ నిర్మాణాలను తక్షణమే పూర్తిచేయాలని, ఏవైనా సమస్యలుంటే తమదృష్టికి తీసుకరావాలని సూచించారు. ఉప్పేరులో విద్యుత్ సమస్య ఉందని, దానిని పరిష్కరించాల్సిందిగా ట్రాన్స్‌కో అధికారులను ఆదేశించారు. అదేవిధంగా అన్ని పునరావాస కేంద్రాల్లో విద్యుత్ సరఫరా చేయాలని, అందుకు అవసరమైన అంచనాలను రూపొందించి తక్షణమే సమర్పించాలని ఆదేశించారు. గార్లపాడులో తాగునీటి సమస్య ఉండడంతో ఉప్పేరు నుంచి గార్లపాడుకు పైపులైన్ విస్తరణ పనులు చేపట్టాలని గ్రామీణ నీటిపారుదలశాఖ అధికారులకు ఆదేశించారు. రెండు నెలల్లో పాతపునరావాస కేంద్రాలకు సంబంధించిన భూసేకరణ తదితర పనులన్నింటిని పూర్తిచేయాలని, ఇండ్ల స్థలాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించాలని ఆదేశించారు. ఉప్పేరు స్మశాన వాటిక స్థలాన్ని గుర్తించాలన్నారు. చిన్నోనిపల్లిలో ఇళ్ల నిర్మాణాలకు ఇదివరలో ఇచ్చిన స్థలానికి సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఆలూరులో కేటాయించిన భూమిని చదును చేసి ఇండ్ల స్థలాల లబ్దిదారులకు కేటాయించాలని, గుడ్డెందొడ్డిలో గతంలో తీయించిన వీడియోగ్రఫి ఆధారంగా నిజమైన లబ్దిదారులకు ఆర్‌అండ్ ఆర్ సౌకర్యం కల్పించాలని సూచించారు. పునరావాస కేంద్రాల పనుల వేగవంతానికిగాను జాయింట్ కలెక్టర్, స్పెషల్ కలెక్టర్, గద్వాల ఆర్డీఓ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఈ నెల 23న ఆర్‌అండ్ ఆర్ కమిషనర్‌తో సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్‌కు సూచించారు. అలాగే ఆర్డీఎస్‌కు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు కర్ణాటక నీటిపారుదల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమావేశానికి లేఖ రాయాలని మంత్రి ఆదేశించారు. జూరాల, ఆర్డీఎస్ ప్రాజెక్టుల కింద జిల్లాకు కేటాయించిన నీటి కేటాయింపులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ఇంజనీరింగ్ అధికారులు చర్యలు చేపట్టాలని మంత్రి కోరారు. కల్వకుర్తి, భీమా, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు పనులు వేగవంతం చేయాలని సంబంధిత ప్రాజెక్టుల సూపరింటెండెంట్ ఇంజనీర్లను ఆదేశించారు. పాతపునరావాస కేంద్రాలకు సంబంధించిన రూ.8.6కోట్ల నిధులు అవసరముందని జిల్లా ప్రాజెక్టుల ఛీఫ్ ఇంజనీర్ ప్రకాశ్, ప్రత్యేక కలెక్టర్ వెంకటేశ్వర్లు మంత్రికి వివరించారు. జిల్లా కలెక్టర్ గిరిజాశంకర్ మాట్లాడుతూ పునరావాస కేంద్రాలలో ముందుగా అత్యంత ప్రాధాన్యత కలిగిన పనులను పూర్తి చేయాలని ముఖ్యంగా విద్యుత్, తాగునీరు, పాఠశాలల నిర్మాణం, అంగన్‌వాడి, గ్రామపంచాయతీ భవనాల నిర్మాణాలు పూర్తి చేయాలని ఇందుకు గాను సంబంధితశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి పనులు వేగవంతమయ్యేలా ఇతర శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఎల్.శర్మన్, పిజెపి భీమా, ఎంజికెం ఎల్ ప్రాజెక్టు ఎస్‌ఇలు ఖగేంధర్, రమణమైర్తి, రామకృష్ణ, గద్వాల ఆర్డీఓ నారాయణరెడ్డి, హౌసింగ్ పిడి బలరాం, ఆర్‌విఎం పిఓ పద్మహర్ష, సాంఘీక సంక్షేమశాఖ డిడి జయప్రకాష్, మార్కెట్‌యార్డు చైర్మన్ గడ్డం కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

వైకాపా, టిడిపిల కుట్రలు సాగవు
* యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
మహబూబ్‌నగర్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకోవాలని ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా.. కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ, యూపిఎ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనుకడుగు వేసేది లేదని, బాబు, విజయలమ్మ చేస్తున్న డ్రామాలకు కాంగ్రెస్ పార్టీ భయపడదని యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వంశీచంద్‌రెడ్డి మాట్లాడుతూ ఒక రాష్ట్రం ఏర్పాటు విషయంలో ఇంత పెద్ద మొత్తంలో సంప్రదింపులు జరపలేదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలోనే కేంద్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్ అధిష్ఠానం కీలకమైన నిర్ణయం తీసుకున్నదని, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం అన్ని పార్టీల అభిప్రాయంతో పాటు ఇరుప్రాంతాల ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు, మేధావులు, రాజకీయ పార్టీల నిర్ణయం..అభిప్రాయాలతోనే తెలంగాణపై స్పష్టమైన వైఖరి తీసుకుందన్నారు. రాష్ట్రంలో జరిగిన సంప్రదింపుల తర్వాత ఏకాభిప్రాయం వచ్చాకే సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంపై నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని కొన్నిపార్టీలు ఊసరవెల్లి రాజకీయాలు చేస్తూ వ్యతిరేకించడం దుర్మార్గమన్నారు. ముఖ్యంగా టిడిపి అసలు రంగు బయటపడిందని, అదే విధంగా వైకాపా విధానం కూడా బట్టబయలు అయ్యిందన్నారు. సీమాంధ్రలో లబ్ధిపొందేందుకు వైకాపా, టిడిపిలు చేస్తున్న నాటకాలకు త్వరలోనే చెక్ పడనున్నాయని అన్నారు. చంద్రబాబునాయుడు రాజకీయ లబ్ధికోసం ఊసరవెల్లి రాజకీయాలు చేస్తూ రాష్ట్ర ప్రజానీకాన్ని గందరగోళానికి గురి చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా నాయకులు విజయమ్మ సైతం ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. సిడబ్ల్యుసి నిర్ణయంలో స్పష్టమైన నిర్ణయాలు తీసుకున్నారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే సీమాంధ్ర ప్రజలకు ఏలాంటి నష్టం జరగదని, ఒక వేళ ఏమైన అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకోవడానికి కూడా అవకాశం కల్పించాలని తెలిపారు. ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా 2014 మార్చిలోపు రెండు రాష్ట్రాలు ఏర్పాటు కావడం ఖాయమని, వీటిని ఎవరు కూడా అడ్డుకోలేరన్నారు. సీమాంధ్రలో కాంగ్రెస్ నాయకులు కూడా కృత్రిమ ఉద్యమాన్ని చేయడం సబబు కాదని సిడబ్ల్యుసి నిర్ణయం తీసుకున్నాక కూడా ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించడమంటే పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. తాను యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇరుప్రాంతాల యువజన కాంగ్రెస్ కార్యకర్తలకు, కాంగ్రెస్ నాయకులకు, పార్టీ అనుబంధ సంఘాల నేతలకు కోరుతున్నానని, సోనియాగాంధీ తీసుకున్న నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాల్సిందేనని, ఒక వేళ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల్లో అపోహాలు సృష్టిస్తే ఇలాంటి నాయకులకు భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురుకాక తప్పదని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో లింగంనాయక్, బెనహర్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

పాలకుల వైఖరి వల్లే సీమాంధ్రలో ఉద్యమాలు
గద్వాలలో జెఎసి శాంతిర్యాలీ

గద్వాలటౌన్, ఆగస్టు 17: పాలకుల నిర్లక్ష్య వైఖరి వల్ల సీమాంధ్రలో ఉద్యమాలు జరుగుతున్నాయని..సీమాంధ్రులు మనసు మార్చుకొని తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని నాగర్‌కర్నూలు ఎంపి మంద జగన్నాథం, జెఎసి జిల్లా అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి, గద్వాల మాజీ ఎమ్మెల్యే గట్టు భీముడు, డివిజన్ జెఎసి అధ్యక్షుడు వీరభద్రప్పలు అన్నారు. జెఎసి ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో వివిధ శాఖల ఉద్యోగులు, పార్టీల నాయకులు, కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. టిఎన్‌జీఓ భవన్ నుండి బయల్దేరి కొత్త బస్టాండు, పోలీసుస్టేషన్, రాజీవ్‌మార్గ్, రథశాల, పాతబస్టాండు, కూరగాయల మార్కెట్, గాంధీచౌక్, కళాశాల రోడ్డు మీదుగా జై తెలంగాణ జైజై తెలంగాణ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం వైఎస్సార్‌చౌరస్తా దగ్గర ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ సాధించిన ఘనత ఉద్యమకారులకే వరిస్తుందన్నారు.

* హాజరైన వేలాది మంది విద్యార్థులు, తెలంగాణవాదులు * అమరవీరుల స్థూపం దగ్గర నివాళులు
english title: 
tjac

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>