Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

వాగులో పడి ఇద్దరు బాలుర దుర్మరణం

$
0
0

కనగల్, ఆగస్టు 17: గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయం పక్కనే ప్రవహిస్తున్న వాగులో పడి ఇద్దరు బాలురు దుర్మరణం చెందారు. గ్రామానికి చెందిన రావుల పేరయ్య, వెంకటమ్మలకు చెందిన ఇద్దరు కుమారులు రావుల వెంకటేశ్(12), వినయ్(10) శనివారం సాయంత్రం పాఠశాల నుండి తిరిగి ఇంటికి వెలుతు మార్గమధ్యలో వెంకటేశ్వర స్వామి ఆలయం పక్క గుండా ప్రవహించే కోనేరు వాగు నీటిలోకి దిగారు. ముందుగా వినయ్ నీటిలో దిగి మునిగిపోగా తమ్ముడిని కాపాడే క్రమంలో అన్న వెంకటేశ్ కూడా నీటిలో మునిగిపోయాడు. ఆ మార్గంలో వెలుతున్న కొందరు వారిని గమనించి బయటకు తీయగా అప్పటికే వినయ్ మృతి చెందగా, కొద్ధిసేపటికి వెంకటేశ్ కూడా అక్కడే చనిపోయాడు. కుమారులిద్ధరిని కోల్పోయిన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగారు.
విహెచ్‌పై దాడికి సిఎం..బొత్స
బాధ్యత వహించాలి

ఎంపి గుత్తా, ఎమ్మెల్యే కోమటిరెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఆగస్టు 17: సమైక్యవాదులు తిరుపతిలో కాంగ్రెస్ ఎంపి వి.హనుమంతరావుపై దాడి చేయడం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టేదిగా ఉందని, సీమాంధ్రలో జరిగే సమైక్య ఉద్యమాలకు..దాడులకు సమైక్య రాష్ట్ర ఆందోళనకు సంతకాలు చేసిన సిఎం కిరణ్..పిసిసి చీఫ్ బొత్సలే బాధ్యత వహించాలని నల్లగొండ ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి, నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి అన్నారు. శనివారం వారు నల్లగొండలో విలేఖరులతో మాట్లాడుతు విహెచ్‌పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తు ఇలాంటి ఘటనలు ఇరుప్రాంతాల్లో విద్వేషాలు..ఉద్రిక్తతలను రెకేత్తించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమాల సందర్భంలో ఎంపిలు, ఎమ్మెల్యేలను సైతం అరెస్టు చేయించిన సిఎం కిరణ్ సీమాంధ్రలో దాడులకు దిగుతున్న సమైక్యవాదులపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటు వారు నిలదీశారు. వెంటనే విహెచ్‌పై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేసి కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. సీమాంధ్ర మంత్రులు సమైక్యరాష్ట్రం కోసం దొంగ రాజీనామాలు చేసి నాటకాలు వేస్తున్నారని, నిజంగా వారికి సమైక్య ఉద్యమంపై ప్రేమ ఉంటే వెంటనే వారు రాజీనామాలు అందించాలని డిమాండ్ చేశారు. హైద్రాబాద్‌లో జీవించాల్సిన సీమాంధ్ర ఉద్యోగులు, ప్రజలు తెలంగాణ ఉద్యోగుల పట్ల విద్వేషపూరితంగా ప్రవర్తించకుండా సంయమనంతో ఉండాలన్నారు. విద్యుత్ సౌదా, జలమండలి, బీమాభవన్, సచివాలయంలలో తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న ఆందోళనలు గతితప్పకుండా చూడాలన్నారు. సమైక్యవాద ఆందోళనలతో నల్లగొండ జిల్లా వరద బాధితులకు అందించాల్సిన సహాయ చర్యలు ఆగిపోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.

వర్షాలతో అపార నష్టం
తెగిన చెరువులు.. కుంటలు * ధ్వంసమైన రోడ్లు * 30 వేల హెక్టార్లలో పంట నష్టం
* సూర్యాపేటలో లోతట్టు ప్రాంతాలు జలమయం * మూసీడ్యాం గేట్లు తెరవాలని ఆదేశం
ఆంధ్రభూమి బ్యూరో
నల్లగొండ, ఆగస్టు 17: జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేసి పంటలను, రోడ్లను, చెరువులు, కుంటలను దెబ్బతీశాయి. వరద బీభత్సంతో తెగిన చెరువులు, కుంటలు..పొంగిన వాగుల వరదలు పొలాలను ముంచెత్తగా 23 మండలాల్లో 30 వేల హెక్టార్లకు పైగా పంట నష్టం జరిగింది. 605 ఇండ్లు దెబ్బతిన్నాయి. శనివారం సైతం జిల్లాలో ఈ వర్షాకాలంలో అత్యధికంగా 65మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు మండలాల్లో రికార్డు స్థాయిలో కురిసిన వర్షాలతో అనేక చెరువులు, కుంటలు తెగిపోవడంతో గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. సూర్యాపేటలో ఏకంగా 225.8మిల్లిమీటర్ల వర్షపాతం నమోదవ్వగా పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లు జలదిగ్భందానికి గురయ్యాయి. గరిడేపల్లి, నేరడుచర్ల, కేతెపల్లి, దామరచర్ల, సూర్యాపేట, నకిరేకల్, అర్వపల్లి, తుంగతుర్తి, మిర్యాలగూడ, వేముపల్లి మండలాల్లో వర్షాలు..వరదలతో అధిక నష్టం చోటుచేసుకుంది. మిర్యాలగూడ మండలం యాదగిరిపల్లిలో పరకాల నవీన్(19) చెరువు అలుగు వద్ద చేపల వేటకు వెళ్లి వరద ఉద్ధృతిలో కొట్టుకుపోయాడు. జిల్లా కలెక్టర్ ఎన్. ముక్తేశ్వర్‌రావు, ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, ఇరిగేషన్ ఇఇ హమీద్‌ఖాన్‌లు కేతెపల్లి, నకిరేకల్ మండలాల్లో ముంపు ప్రాంతాలను పర్యటించి మూసీ ప్రాజెక్టు గేట్లు తెరవాలని ఆదేశించారు. పంట నష్టాన్ని పరిశీలించారు. సూర్యాపేటలో జెసి హరిజవహర్‌లాల్, మిర్యాలగూడలో ఎంపి గుత్తా, ఎమ్మెల్యే జూలకంటి, ఏజెసి నీలకంఠం, తిప్పర్తిలో గుత్తా, కోమటిరెడ్డి వరదలతో దెబ్బతిన్న గ్రామాల్లో పర్యటించి బాధితుల సమస్యలు తెలుసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 23 మండలాల్లో 47 గ్రామాలు వర్షాలు..వరదలతో బాగాదెబ్బతిన్నట్లుగా కలెక్టర్ తెలిపారు. 150 హెక్టార్లలో ఇసుక మేటలు వేశాయని, 605 ఇండ్లు దెబ్బతిన్నాయని, 100 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి , పునరావాస శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. 35 పంచాయతీరాజ్ కుంటలు, 10ఇరిగేషన్ శాఖ చెరువులకు గండ్లు పడినట్లుగా తెలిపారు. దెబ్బతిన్న రోడ్లు, చెరువులు, కుంటల మరమ్మతులకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. మూసీ డ్యాం నీటి మట్టం 645 అడుగులకు 641.5 అడుగులు ఉన్నందున ఇన్‌ఫ్లో పెరిగితే డ్యాం గేట్లు తెరవాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.
ఆపార నష్టం...ఆవేదనలో రైతాంగం
నేరడుచర్ల మండలంలో వర్షాలు..వరదలతో 3500 ఎకరాల వరి పంట, 560 ఎకరాల పత్తి, 150 ఎకరాల మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. జొన్నలదినె్న చెరువుకు, చిల్లెపల్లి మేజర్‌కు గండ్లు పడి వరద నీరు పంట పొలాలను ముంచెత్తాయి. గరిడేపల్లి మండలంలో పరెడ్డిగూడెం, అబ్బిరెడ్డిగూడెం, గరిడేపల్లి చెరువులు పొంగడంతో దాదాపు 2వేల ఎకరాల పొలాల్లో ఇసుక మేటలు పరుచుకుని పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పొనుగోడు చెరువుకు బుంగ పడింది. కోదాడ-మిర్యాలగూడ రోడ్డుపై వరద ప్రవాహంతో రెండో రోజు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. ఆత్మకూర్(ఎస్)లో దుబ్బగూడెం గ్రామం చుట్టు వరద నీరు చేరగా, పలు చెరువులు, కుంటలు పొంగడం..గండ్లకు గురికావడతో 200 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. నకిరేకల్ మండలంలో పెద్దచెరువు, గోరింకల చెరువు అలుగు పోసి తాటికల్-నల్లగొండ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. నకిరేకల్ తహశీల్ధార్ కార్యాలయంలోకి, పౌరసరఫరాల గోదాంల్లోకి నీరు చేరగా కలెక్టర్ సందర్శించి రికార్డుల పరిశీలన, ఇన్యూరెన్స్ కైయిమ్‌కు చర్యలు సూచించారు. కేతెపల్లి మండలంలో మూసీతో పాటు వాగులు పొంగి రహదారుల మీదుగా వరద సాగడంతో రాకపోకలు ఆగిపోయాయి. వాగు వరదలో కొట్టుకుపోయిన మహిళ మృతదేహం శనివారం లభ్యమైంది. కేతేపల్లి పోలీస్ స్టేషన్ జలదిగ్భంధానికి గురికావడంలో స్టేషన్ ఖాళీ చేశారు. మిర్యాలగూడ మండలంలో 800 ఎకరాల వరి, మరో 100 ఎకరాల్లో ఇతర పంటలు, వేములపల్లి మండలంలో 2500 ఎకరాల వరి, 2500 ఎకరాల పత్తి పంటలు దెబ్బతిన్నాయి. హుజూర్‌నగర్‌లో 250, మఠంపల్లిలో 315, నిడమనూర్‌లో 400ఎకరాలు, త్రిపురారంలో 148ఎకరాల్లో వరి పంటలు దెబ్బతిన్నాయి. తుంగతుర్తి మండలంలో వరద బీభత్సంతో ఈ మండలానికి ఇతర మండలాలకు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. చెరువులు, కుంటలు, వాగులు పొంగి వరి, పెసర పంటలు వందల ఎకరాల్లో దెబ్బతిన్నాయి. అర్వపల్లి మండలంలో శ్రీరాంసాగర్ కాలువలకు గండ్లు పడి అర్వపల్లి జలదిగ్భంధానికి గురైంది. వర్ధమానుకోట, మాచిరెడ్డిపల్లి, కొత్తగూడెం, తిమ్మాపురం చెరువులకు గండ్లు పడ్డాయి. చిలుకూరులో 100 ఎకరాల పంటలు దెబ్బతినగా, బేతవోలు, జెర్రిపోతుల గూడెం, రామునిగూడెంల మధ్య రాకపోకలు స్తంభించాయి. తిప్పర్తి మండలంలో మామిడాల, దాచారం, తిప్పర్తి గ్రామాల్లో వరద బీభత్సంతో వందల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రోడ్లు ధ్వంసమయ్యాయి.

వర్ష బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది
* మాజీ మంత్రి, కోమటిరెడ్డి, ఎంపి గుత్తా
తిప్పర్తి, ఆగస్టు 17: రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం త్వరలో ఆదుకుంటుందని మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపి గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. శనివారం మండలంలో వర్షబీభత్సంతో నష్టపోయిన గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో భారీ వర్షాలు కురువడంతో చాలా మేరకు ఆస్తినష్టం వాటిల్లిందని దీని నివారించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇళ్లు కూలిపోయిన వారికి తగిన పారితోషికంతో ఇంటి నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తామన్నారు. అదేవిధంగా దెబ్బతిన్న రోడ్లను మరమతులు చేపడతామన్నారు. తిప్పర్తి, సిలార్‌మియాగూడెం, మాడ్గులపల్లి, దాచారం గ్రామంలో నీటి బీభత్సంతో చెదిరిపోయిన రోడ్లను పరీశీలించారు. ఈ కార్యక్రమంలో డిసిసి డైరెక్టర్ పాశం సంపత్‌రెడ్డి, రాంరెడ్డి, జాకటి మోషా, జానకి రాములు, జూపూడి రమేష్, సైదులు, రాఘవేందర్‌రెడ్డి, అనురాధ పాల్గొన్నారు.
సహాయక చర్యలు వేగవంతం చేయాలి
డివిజన్‌స్థాయ అధికారుల సమీక్షా సమావేశంలో మాట్లాడుతున్న జెసి హరిజవహర్‌లాల్ నాలాను పరిశీలిస్తున్న జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్
సూర్యాపేట, ఆగస్టు 17: బంగాళఖాతంలో ఏర్పాడిన అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా భారీవర్షాలు కురుస్తున్నందున అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఆదేశించారు. శనివారం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో వరద సహాయక చర్యలపై డివిజన్‌స్థాయి రెవెన్యూ, ప్రత్యేక అధికారులు, మున్సిపల్, నీటిపారుదల శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూర్యాపేలో మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వరదల ప్రభావం తీవ్రమైందని మండిపడ్డారు. అధికారులు భవిష్యత్ అవసరాలను గుర్తించకుండా అక్రమ నిర్మాణాలను అడ్డుకోకపోవడం మూలంగానే భారీవరదలతో నష్టం వాటిల్లిందన్నారు. పలు మండలాల్లో భారీవర్షాల కారణంగా అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోవడంతో పాటు పలు గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నందున సహాయక చర్యలను వేగవంతం చేయాలన్నారు. వరదనీటిని మళ్లీంచే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సహాయ చర్యలను వేగవంతం చేసేందుకు అవసరమైన సంఖ్యలో కూలీలను తీసుకెళ్లాలని, అదేవిధంగా అవసరమైన వాహనాలను అద్దెకు తీసుకొని జాప్యం చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. వరదల కారణంగా పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారడంతో పాటు దోమలు వ్యాప్తిచెంది అంటురోగాలు ప్రబలే ప్రమాదం నెలకొని ఉంటుందని, అందువల్ల అధికారులు గ్రామాల్లో బ్లీచింగ్ ఫౌడర్ చల్లించి, దోమల నివారణకు ఫాగింగ్ చేపట్టాలని సూచించారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి అంటురోగాలు ప్రబలకుండా తగిన వైద్య సహాయం అందించాలన్నారు. సూర్యాపేటలో నిలిచిపోయిన నాలా పనులను తక్షణమే పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అక్రమణలకు గురైన నాలా స్థలాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాల్లో పంటనష్టం వివరాలను సమగ్రంగా సేకరించి జిల్లా అధికారులకు నివేదించాలన్నారు. నీటి పారుదలశాఖ అధికారులు గండ్లుపడిన చెర్వులు, కుంటలను పూడ్చేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అదేవిధంగా గండ్లుపడే అవకాశం ఉన్న చెర్వులను గుర్తించి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డిఎస్‌వో నాగేశ్వరరావు, ఆర్డీవో వి.నాగన్న, మున్సిపల్ కమీషనర్ నాగేశ్వర్‌లతో పాటు వివిధ మండలాల ప్రత్యేకాధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
కంట్రోల్‌రూం ఏర్పాటు
డివిజన్‌లో భారీవర్షాల కారణంగా తీవ్రమైన నష్టం వాటిల్లుతున్నందున ప్రజలకు సహాయం అందించడం కోసం స్థానిక ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌రూంను ఏర్పాటుచేస్తున్నట్లు జెసీ హరిజవహర్‌లాల్ తెలిపారు. ప్రజలు ఎవ్వరైన తమకు కావాల్సిన సహాయంపై కంట్రోల్‌రూంను సంప్రదించాలని కోరారు.

పారిశుద్ధ్య పర్యవేక్షణకై ప్రత్యేక కమిటీ
కొత్త సర్పంచ్‌లకు శిక్షణా తరగతులు
జడ్పీ సిఇవో వెంకట్రావు
నల్లగొండ టౌన్, ఆగస్టు 17: జిల్లాలో వర్షాల నేపధ్యంలో గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం పరిస్థితులను పరిశీలించి పరిరక్షణ చర్యలు చేపట్టేందుకు కలెక్టర్ ఆదేశాలతో వివిధ శాఖలకు చెందిన ఆరుగురు జిల్లా అధికారులతో ప్రత్యేక కమిటీ వేయడం జరిగిందని జడ్పీ సిఇవో వెంకట్రావు తెలిపారు. శనివారం జిల్లా పరిషత్‌లో వివిధ శాఖల జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో పారిశుధ్ధ్యం ప్రభుత్వ పథకాల విస్తృత ప్రచారం, కొత్త సర్పంచ్‌లకు శిక్షణ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతు పారిశుద్ధ్య పరిరక్షణ జిల్లా ప్రత్యేక కమిటీలో జడ్పీ సిఇవోతోపాటు డిఆర్‌డిఏ పిడి, డిఎంహెచ్‌వో, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ, ఆర్‌విఎం పివో, డిపివోలు సభ్యులుగా ఉంటారని తెలిపారు. కొత్త సర్పంచ్‌లకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా ముందుగా ఎంపిక చేసిన అధికారులు, అనధికారులు, సర్పంచ్‌లు 15మందికి హైద్రాబాద్ మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో అక్కడే శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. అనంతరం సెప్టెంబర్ మొదటి వారంలో జిల్లాలోని కొత్త సర్పంచ్‌లకు పంచాయతీ పాలనపై శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. బంగారుతల్లి, పచ్చతోరణం, రాజీవ్ యువకిరణాలతో పాటు స్ర్తి, శిశు సంరక్షణ పథకాల సక్రమ అమలుపై విస్తృత ప్రచారంకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో డిఆర్‌డిఏ పిడి రాజేశ్వర్‌రెడ్డి, డ్వామా పిడి కోటేశ్వర్‌రావు, హౌజింగ్ పిడి శరత్‌బాబు, ఆర్‌విఎం పివో బాబుభూక్యా, డిపివో కృష్ణమూర్తి, సివిల్ సఫ్లయ్ ఎఎస్‌వో వెంకటేశ్వర్లు, ఉద్యాన వన శాఖ ఏడి బాబు, ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఇ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరు ఆధార్ కార్డు పొందాలి
నల్లగొండ టౌన్, ఆగస్టు 17: జిల్లాలోని ప్రతి ఒక్కరు ఆధార్‌కార్డు పొందాలని అందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరిజవహర్‌లాల్ అన్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ఆధార్‌నమోదు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జిల్లాలో 32లక్షల జనాభాకు 26లక్షలమంది జనాభా ఆథార్ నమోదు పూర్తయిందని మిగతా 6లక్షల మంది ఆధార్‌కార్డులు పొందేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. యుఐడి వారి సహకారంతో 200 కిట్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో ఎక్కువ మొత్తంలో ఆధార్‌నమోదు కాని చోట ఆధార్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. అదేవిధంగా నల్లగొండలో 4, నల్లగొండ మండలంలో 2 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆథార్‌కార్డు పొందనట్లయితే మునుముందు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తించవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సివిల్‌సప్లయ్ ఎ ఎస్‌వో వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

గుర్రంపోడు మండలం పాల్వాయి గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయం
english title: 
v

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>