ఆర్మూర్, ఆగస్టు 17: రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సీమాంధ్రులు రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని, ఇది మంచి విధానం కాకపోయినా సీమాంధ్రులు దాడులకు పాల్పడుతున్నారని, ఈ సమయంలో తెలంగాణవాసులు సహనం కోల్పోవద్దని పిసిసి మాజీ చీఫ్, ఎమ్మెల్సీ డి.శ్రీనివాస్ కోరారు. శనివారం జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్, మునిపల్లి గ్రామ సర్పంచ్‌లు పదవీ బాధ్యతల ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన ముఖ్యఅతిధిగా విచ్చేసి ప్రసంగించారు. రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభమయ్యే వరకు తెలంగాణవాదులు శాంతంగా ఉండాలని అన్నారు. రాష్ట్ర విభజనపై యుపిఎ చైర్‌పర్సన్, ఎఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ వెనక్కి తగ్గే అవకాశం లేకపోవడంతో సీమాంధ్రులు రెచ్చగొడుతున్నారని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేవలం పది సంవత్సరాల్లో అభివృద్ధిలో దేశంలోనే ప్రథమ స్థానం సాధిస్తుందని అన్నారు. రాష్ట్రంలో సీమాంధ్రుల పెత్తనం వల్ల తెలంగాణ ప్రాంతీయులు ఎంతో నష్టపోయారని, ఈ విషయాలన్నీ కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అధిష్టానానికి వివరించగా విస్మయం వ్యక్తం చేశారని అన్నారు. ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై స్పష్టమైన ప్రకటన వచ్చిందని, దీనిపై సోనియాగాంధీ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలు ఉద్రేకపడవద్దని, సంయమనం పాటించాలని అన్నారు. కాగా, తిరుపతిలో రాజ్యసభ సభ్యుడు వి.హన్మంత్‌రావుపై సీమాంధ్రులు దాడికి దిగడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. మనోహరాబాద్ సర్పంచ్‌గా పి.తిరుపతిరెడ్డి, మునిపల్లి సర్పంచ్‌గా బాయి సాయన్నలు బాధ్యతలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రజాకవి గోరేటి వెంకన్న, మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు ఆకుల లలిత, డిసిసి అధ్యక్షుడు తాహెర్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు అరుణతార, డిసిఎంఎస్ మాజీ చైర్మన్ సాయిరెడ్డి, మాజీ జడ్పీటిసి సురేష్‌బుజ్జీ తదితరులు పాల్గొన్నారు.
స.హ చట్టం బాధితులకు రక్షణ కల్పించండి
పోలీసు, రెవెన్యూ అధికారులతో కమిషనర్ తాంతియాకుమారి
నిజామాబాద్‌టౌన్, ఆగస్టు 17: సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు సేకరించే బాధితులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసుశాఖపై ఉందని స.హ చట్టం కమిషనర్ తాంతియాకుమారి వెల్లడించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్‌లో రెండవ రోజు ఆమె సమీక్షా నిర్వహించారు. పోలీసు, రెవెన్యూ శాఖలకు చెందిన అధికారులతో ఆమె సమీక్షించి జిల్లాలోని స్థితిగతులను తెలుసుకున్నారు. మె మాట్లాడుతూ, సమాచార సేకరణలో భాగంగా పోలీసు స్టేషన్‌లకు వచ్చే వారికి ప్రశాంత వాతావరణం కల్పించాలని సూచించారు. ఈ చట్టంపై ప్రజలలో ఇప్పటికే అవగాహన కల్పించామని, తద్వారా జిల్లా కలెక్టర్ వద్దకు నేరుగా వెళ్లి సమాచారాన్ని రాబట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. పోలీసు శాఖకు తక్కువ సంఖ్యలో ఫిర్యాదు రావడంపై ఆమె అసహనాన్ని వ్యక్తం చేశారు. పోలీసులంటే ఇంకా ప్రజల్లో భయం ఉందని, అందువల్లే సమాచార హక్కు చట్టం పోలీసుశాఖలో సరైన విధంగా అమలు కావడంలేదన్నారు. సమాచారాన్ని సేకరించేందుకు వస్తున్న బాధితులపై భౌతికంగా దాడులు జరుగుతున్నాయని, ఇలాంటి దాడులపై వెంటనే స్పందించి 48 గంటల్లో చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. వారికి రక్షణ కల్పించాల్సిన గురుతర బాధ్యత పోలీసుశాఖపై ఉందన్నారు. ఇటీవల గాంధారిలో సమాచారం అడిగిన వ్యక్తిపై దాడి చేశారని, దీనిపై ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు నమోదు చేయలేదని కమిషనర్ పోలీసు అధికారులను ప్రశ్నించారు. దీనిపై వారం రోజుల్లో చర్యలు తీసుకుని తనకు నివేదిక పంపించాలని ఆమె ఆదేశించారు. మండల వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందే విధంగా రెవెన్యూ శాఖ కృషి చేయాలని ఆమె సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో అదనపు జెసి శేషాద్రి, డిఆర్‌ఓ జయరామయ్య, అదనపు ఎస్పీ సుదర్శన్‌రెడ్డి, ఆర్‌డిఓలు వెంకటేశ్వర్లు, మోహన్‌రెడ్డి, శివలింగయ్య, డిఎస్పీలు గౌస్‌మొయినుద్దీన్, సురేందర్‌రెడ్డి, ఆకుల రాంరెడ్డి, అనిల్‌కుమార్, సిఐలు లక్ష్మినారాయణ, సైదులు, వహిదుద్దీన్, శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ, నర్సింగ్‌యాదయ్య పాల్గొన్నారు.
లక్ష్యాలకు అనుగుణంగా
బ్యాంకులు రుణాలు అందించాలి
ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ ఆదేశం
నిజామాబాద్ టౌన్, ఆగస్టు 17: ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు రుణాలను అందించాలని ఇన్‌చార్జి కలెక్టర్ హర్షవర్ధన్ బ్యాంకు అధికారులను ఆదేశించారు.శనివారం స్థానిక జిల్లా పరిషత్ సమావేశం హాల్‌లో బ్యాంకర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, బ్యాంకు అధికారులు లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను నిబంధనలను లోబడి, అర్హులైన వారందరికి రుణాలు అందించి లబ్ధిదారులకు చేయూతను అందించాలన్నారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, రాజీవ్ యువశక్తి శాఖల విషయంలో ఈ ఆర్థిక సంవత్సరం గుర్తించిన లబ్ధిదారులకు వెంటనే రుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రగతి భవన్‌లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో అనేకమంది రుణాలు మంజూరు చేయాలని వినతి పత్రాలు అందిస్తున్నారని అన్నారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బిసిలకు చెందిన ప్రజలు, యువకులు రుణాలు పొందే విధంగా ఈ నెల 22నుండి సెప్టెంబర్ 19వరకు రుణమేళా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. రుణమేళాపై ఆయా మండలాల పరిధిలోని గ్రామాలలో సంబంధిత అధికారులు విస్తత్రంగా ప్రచారం నిర్వహించాలని ఆయన ఆదేశించారు. రుణమేళా ద్వారా అర్హులందరికీ రుణాలు అందిస్తామని వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ వర్గాలు ఆర్థికంగా ఎదిగేలా బ్యాంకర్లు ప్రోత్సహాన్ని అందించాలని ఆయన సూచించారు. పశుక్రాంతి పథకం అమలుకు సంబంధించి అక్టోబర్ వరకు మాత్రమే గడువు ఉందని, సెప్టెంబర్ చివరికల్లా లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. గత సంవత్సరానికి సంబంధించిన 25మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన యూనిట్ల సబ్సిడీ బ్యాంకులు అందించిన యూనిట్లను గ్రౌండ్ చేయడంలో జాప్యం జరుగుతుందన్నారు. వాటిని వెంటనే గ్రౌండ్ చేసే విధంగా బ్యాంకర్లు చొరవ తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రైతులకు ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు 472 కోట్ల రుణాలను అందించి కేవలం 40 శాతం మాత్రమే లక్ష్యాన్ని చేరుకున్నారని, మిగిలిన 60 శాతం పూర్తి చేసి రైతులను ఆదుకోవాలన్నారు. గత ఏడాది రైతులకు అందించిన పంట రుణాలకు సంబంధించిన వడ్డీ వసూలు చేయవద్దని, అసలు మాత్రమే వసూలు చేయాలని ఆదేశించారు. రైతులు తము తీసుకున్న పంట రుణాలను వడ్డీలేకుండా సకాలంలో చెల్లించి పంట రుణాలను తీసుకోవాలని సూచించారు. కౌలు రైతులకు బ్యాంకర్లు రుణాలు ఇవ్వడంలేదని, ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కౌలురైతులకు రుణాలు తప్పని సరిగా అందించాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల విషయంలో లబ్ధిచేకూర్చే లబ్ధిదారుల ఖాతాలోకి డబ్బులు జమ చేస్తామని, దీనిని దృష్టిలో పెట్టుకుని లబ్ధిదారులు బ్యాంకులో ఖాతా తెరిచేటప్పుడు తప్పకుండా ఆధార్ నంబర్‌ను అందజేయాల్సి ఉంటుందన్నారు. గ్యాస్ కనెక్షన్‌కు ప్రతి ఒక్కరు సంబంధిత గ్యాస్ ఏజెన్సీలో బ్యాంకు ఖాతాతో పాటుగా ఆధార్‌ను అందించాలని ఆయన సూచించారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకర్లు తమవంతు సహాయ సహకారాలు అందించాలని కోరారు. మహిళా సంఘాలకు విరివిగా రుణాలు అందించి వారు ఆర్థిక స్వాలంబన సాధించేలా బ్యాంకర్లు కృషి చేయాలన్నారు. పాల ప్రగతి కేంద్రాలకు ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీలకు 6 లక్షలు, మిగిలిన వారికి 5 లక్షలు అందిస్తున్నామని, ఇందులో 1.25 లక్షలు సబ్సిడీ కింద అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులందరికీ జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలను తెరిపించాలని, ఇందుకు విద్యార్థులు తప్పని సరిగా ఆధార్ నంబర్‌ను అందజేయాలని, బ్యాంకర్లు సైతం విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా డిపాజిట్ లేకుండా ఖాతాలను ఓపెన్ చేయాలన్నారు. జిల్లాలోని రెండు వేల జనాభా కలిగిన ప్రాంతాల్లో బ్యాంకులను ఏర్పాటు చేయాలని, ఈ నిబంధనలను పాటించకపోవడంతో ఆయా ప్రాంతాలలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. ప్రధానంగా జుక్కల్ మండలంలో బ్యాంకులు తక్కువగా ఉన్నాయని, అక్కడ అవసరమైన మేరకు బ్యాంకులను ఏర్పాటు చేసి ప్రజలకు బ్యాంకు సేవలను అందుబాటులోకి తీసుకరావాలని ఇన్‌చార్జి కలెక్టర్ బ్యాంకర్లకు సూచించారు. సమావేశంలో ఐకెపి పిడి వెంకటేశం, ఆర్‌బిఐ ఎల్‌డిఓ పుల్లారెడ్డి, ఎల్‌డిఎం రామకృష్ణారావు, నాబార్డు ఎజిఎం రమేశ్‌చంద్ర, జెడి కాలేబ్, డిఎస్‌ఓ కొండల్‌రావుతో పాటు బ్యాంకు అధికారులు పాల్గొన్నారు.
విసి భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు
డిచ్‌పల్లి రూరల్, ఆగస్టు 17: మండల కేంద్రంలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో పిజి మొదటి, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాల విడుదలలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ విద్యార్థులు శనివారం తరగతులను బహిష్కరించి, విసి భవనాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ, పిజి మొదటి, ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పరీక్షలు రాసి ఆరు మాసాలు గడిచిన అధికారులు ఇప్పటి వరకు ఫలితాలు వెల్లడించలేదని ఆరోపించారు. హాస్టల్‌లో ఉండే విద్యార్థుల నుండి మెస్‌బిల్లును పూర్తిగా కట్టించుకున్న అధికారులు, ఒరిజినల్ మెమోలు అందించడంలో గత ఆరుమాసాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీంతో తాము విలువైన సమయాన్ని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర వర్సిటీల్లో మెస్‌చార్జీలు 5 వేల వరకు ఉంటే, ఇక్కడ మాత్రం 10 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని, పేద కుటుంబాలకు చెందిన తాము ఈ రుసుము చెల్లించేందుకు నానా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని వాపోయారు. ఫలితాలు వెల్లడించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వైస్‌ఛాన్స్‌లర్‌తో పాటు రిజిస్ట్రార్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డును తలపిస్తున్న జిల్లా ఆసుపత్రి
వైద్యాధికారులపై మండిపడిన స.హ చట్టం కమిషనర్
నిజామాబాద్ టౌన్, ఆగస్టు 17: ఇది జిల్లా ఆసుపత్రా లేక డంపింగ్ యార్డా అంటూ సమాచార హక్కు చట్టం కమిషనర్ తాంతియాకుమారి వైద్యాధికారులపై మండిపడ్డారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆమె ఆసుపత్రికి చేరుకున్న సమయంలో వైద్యులు ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలోని వార్డులను పరిశీలించగా రోగులు తమ సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. రోగుల వేదనను గమనించిన అనంతరం వార్డులన్నింటిని పరిశీలించారు. వార్డులలో అపరిశుభ్రత చోటుచేసుకోవడం, దుర్వాసన వెదజల్లడంతో అసహనాన్ని ప్రదర్శించారు. ఆసుపత్రి ఆర్‌ఎంఓ కోసం ఆరా తీయగా సెలవులో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. వెంటనే ఆసుపత్రి సూపరింటెండెంట్ భీంసింగ్‌ను పిలిపించి మందలించారు. డ్యూటీ డాక్టర్‌లు ఎక్కడ ఉన్నారని, రోగులు అవస్తలు పడుతుంటే పటించుకోరా అంటూ తీవ్రస్థాయిలో వారిపై విరుచుకుపడ్డారు. ఆసుపత్రిలో కొత్తగా ఏర్పాటు చేసిన మార్చురీ నుండి శవాల దుర్వాసన రావడంపై వైద్యాధికారులకు అక్షింతలు వేశారు. అసలు మీరు ఏం చేస్తున్నారని, ఆసుపత్రిలోని రోగుల బాగోగులు మీకు పట్టావా అని మందలించారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయాలు వెచ్చించి ఆసుపత్రిలను ఆధునీకరిస్తుంటే, వైద్యులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరై రోగులకు అత్యాధునీక వైద్యం అందుతుందనుకుంటే మీరు మాత్రం పాత పద్దతినే అవలంభిస్తున్నారని, మీపై చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఆసుపత్రిలోని నిర్లక్ష్యాన్ని ఉన్నతాధికారులకు వివరించి చర్యలకు సిఫారసు చేస్తానని అన్నారు. రోగుల వార్డులు చెత్త వేసే డంపింగ్ యార్డులుగా మారాయని, చెత్తను తొలగించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, కనీసం రోగులకు సరైన వైద్యం అందించేందుకు వైద్యులు సమయపాలనా పాటించడం లేదని అసంతృప్తిని వెళ్లగక్కారు. సమాచార హక్కు చట్టం చూస్తు ఊరుకోదని, మీపై చట్టం ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆసుపత్రికి ఎంతో నమ్మకంతో వచ్చే రోగులకు ప్రభుత్వం వైద్యులు సేవలు అందించడంలో విఫలమయ్యారని, ఇంతటి దారుణ పరిస్థితి నెలకొంటే కలెక్టర్ అసలు ఏంచేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఇకనుంచి విరివిగా కలెక్టర్ ఆసుపత్రిని తనిఖీలు చేసి ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరిస్తు నివేదికలను అందచేయాలని ఆమె సూచించారు.
కన్నుల పండువగా బాలాజీ జెండా జాతర
అంగరంగ వైభవంగా శోభాయాత్ర
గోవిందనామస్మరణతో మార్మోగిన ఆర్మూర్
ఆర్మూర్, ఆగస్టు 17: పట్టణంలోని జెండాగల్లీలో గల శ్రీ లక్ష్మీవేంకటేశ్వర స్వామి మందిరంలో బాలాజీ జెండా జాతరను శనివారం పట్టణ ప్రజలు అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని వీధులు పండుగ వాతావరణాన్ని తలపించాయి. పట్టణ ప్రజలు స్వామివారి దర్శనం కోసం బారులుతీరారు. గోవిందనామ స్మరణతో మందిర పరిసరాలు మారుమ్రోగాయి. సుమారు రెండు శతాబ్దాలుగా శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం జెండా ఉత్సవాలు ఇక్కడ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వేడుకల్లో భాగంగా నవరాత్రులు వెంకటేశ్వరస్వామి, పద్మావతి, లక్ష్మీదేవతామూర్తులకు, జెండా పతాకానికి పూజలు నిర్వహించి ప్రజలు తమ కుటుంబాలను చల్లగా చూడాలని వేడుకున్నారు. కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. నవరాత్రుల్లో త్రీరాత్రౌ పంచదశ, విష్ణుయాగం, కుంకుమార్చన, వేంకటేశ్వరుని కళ్యాణం నిర్వహించారు. శనివారం ఆర్మూర్ సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో జెండాకు ప్రత్యేక పూజలు చేశారు. సర్వసమాజ్ అధ్యక్షుడు ఆకుల జాగిర్ధార్ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పడాల్ సతీష్, కార్యదర్శి బోచ్‌కర్ వందన లక్ష్మీనారాయణ, సభ్యులు యామాద్రి లింగన్న, రాజేందర్, రవీందర్, కర్తన్ ఘనేశ్యాం, శికారి శ్రీనివాస్, గుండు గంగాధర్, పోహార్ శైలేష్, క్షత్రియ సమాజ్ అధ్యక్షుడు గంగామోహన్ చకృ, ఉపాధ్యక్షుడు పండిత్ మురళీధర్, కార్యదర్శి పడాల్ గణేష్, సభ్యులు మామిడి లక్ష్మీనారాయణ, రాంజానే, వైద్య ప్రకాష్, విజయ్‌ప్రతాప్, ఆలయ కమిటీ అధ్యక్షుడు రవి, కార్యదర్శి రేగుల్ల గంగాప్రసాద్ తదితరులు జెండా బాలాజీ మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పట్టణ వీధుల గుండా వేలాది మంది ప్రజలు తరలిరాగా డప్పువాయిద్యాలతో జెండాను ఊరేగించారు. వీధులు జనసందోహంతో కిక్కిరిసిపోయాయి. ఆర్మూర్ సర్వసమాజ్ సభ్యులు పట్టణ శివారులో బాలాజీ జెండాను అంకాపూర్ గ్రామాభివృద్ధి కమిటీకి అప్పగించారు. జాతర సందర్భంగా జెండా బాలాజీ మందిరం సమీపంలో మిఠాయిల దుకాణాలు, ఆట వస్తువుల దుకాణాలు పెద్ద ఎత్తున వెలిశాయి. పెద్దలకు జనరల్ స్టోర్స్ వెలియడంతో మహిళలు ముచ్చటపడి పలు వస్తువులను కొనుగోలు చేశారు. పిల్లలు ఆట వస్తువులను కొనుగోలు చేశారు.
బల్దియా అక్రమాలపై విచారణ షురూ...
నిజామాబాద్ టౌన్, ఆగస్టు 17: నగర పాలక సంస్థలో జరిగిన అక్రమాలపై రాష్ట్ర పబ్లిక్ హెల్త్ ఎస్‌ఇ రాజేంద్రప్రసాద్ శనివారం విచారణ జరిపారు. ఉదయం కార్యాలయానికి చేరుకుని రికార్డులను పరిశీలించారు. అడ్డదారుల్లో కాంట్రాక్ట్‌లు అప్పగించారని, బోగసు బిల్లులతో లక్షల రూపాయలు జేబుల్లో నింపుకున్నారన్న ఫిర్యాదులపై ఈ విచారణ జరిపినట్లు సమాచారం. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లన్నీ ధ్వంసం కావడంతో రోడ్లపై దుమ్ము విపరీతంగా పేరుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే స్థానికులు కొందరు రోడ్లను శుభ్రం చేయడం లేదని, కోటి రూపాయలతో కొనుగోల్ చేసిన స్లీపింగ్ మెషీన్‌ను ఉపయోగించకుండా నెలసరి బిల్లు కాజేస్తున్నారని పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా ఆర్టీసీలో ఉద్యోగం చేస్తున్న ఇద్దరు అధికారులు బినామీ పేర్లపై కోటి రూపాయల కాంట్రాక్ట్‌కు దక్కించుకుని మురికి కాల్వలలో పూడిక తీయకుండా బిల్లును కాజేస్తున్నట్లు ఫిర్యాదు అందాయి.