నందికొట్కూరు, ఆగస్టు 18 : కృష్ణా జలాల వినియోగంలో రాష్ట్రం ప్రభుత్వం తెలంగాణ ప్రాంతానికి అనుకూలంగా జారీ చేసిన జీవో నం.72ను వ్యతిరేకిస్తూ రాయలసీమ పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర ఆదివారం ముగిసింది. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి హంద్రీ-నీవా ప్రాజెక్టు ఎత్తిపోతల కేంద్రమైన మల్యాల వరకూ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం రావణకాష్టంలా రగులుతున్న సమయంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 8న తెలంగాణలోని పాలమూరు ఎత్తిపోతల పథకానికి 70 టిఎంసిల నీరు సరఫరా చేయడానికి జీవోను విడుదల చేశారన్నారు. ఈ జీఓ అమలైతే రాయలసీమలోని ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రత్యేక తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందకముందే రాయలసీమలోని ప్రజాప్రతినిధులు తెలంగాణకు దోచిపెడుతున్నారని ఆరోపించారు. సీమకు అన్యాయం చేసే జిఓకు వ్యతిరేకంగా ఏ ఒక్క నాయకుడు స్పందించకపోవడం సీమవాసుల దురదృష్టమన్నారు. 1956లో రాజధానిగా ఉన్న కర్నూలును హైదరాబాద్‌కుతరలించి సీమకు తీరని అన్యాయం చేశారని, ఇపుడు రాష్ట్ర విభజనతో అదే రాజధానిని కర్నూలుకు తరలించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకవైపు సమైక్యాంధ్రకు మద్దతు పలుకుతున్నట్లు నటిస్తూ, మరోవైపు తెలంగాణకు 70 టిఎంసిల నీటి వాటా కేటాయించాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చిందో తెలపాలని డిమాండ్ చేశారు. నిజంగా సమైక్యాంధ్రను కోరుకునే వాడైతే హడావుడిగా ఈ జిఓను పాస్ చేసేవాడు కాదన్నారు. యుపిఎ ప్రభుత్వం రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాలనే ధ్యేయంతోనే రాష్ట్ర విభజన చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు హాజీమాబూసాహేబ్, జాకీర్‌బాష, నాగేశ్వరరావు, కొప్పుల సత్యనారాయణ, శ్రీనివాసులు నాయుడు, తదితరులు పాల్గొన్నారు.
రాహుల్ కోసమే విభజన
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాహుల్‌గాంధీని ఎంపిగా గెలిపించుకుని ప్రధానమంత్రిని చేయాలనే లక్ష్యంతోనే సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేశారని రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ వ్యవస్థాపకుడు బైరెడ్డి రాజశేఖరరెడ్డి ఆరోపించారు. పాదయాత్రలో భాగంగా నందికొట్కూరుకులోని పటేల్‌సెంటర్‌లో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఇచ్చి రాహుల్‌ను మెదక్‌లో పోటీ చేయించాలని సోనియా సన్నాహాలు చేస్తున్నారన్నారు. రాయబరేలి, అమేథిలో పోటీచేస్తే ఓడిపోతాడనే భయంతో ఇలా ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకోసం మెదక్‌లో సిట్టింగ్ ఎంపి, టిఅర్‌ఎస్ నాయకురాలు విజయశాంతితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు తమకు సమాచారం ఉందన్నారు. కొడుకు కోసం తెలంగాణ ఇచ్చిన సోనియా, రాయలసీమ రాష్ట్రాన్ని కూడా ప్రకటిస్తే కర్నూలు జిల్లా నంద్యాల నుంచి పదిలక్షల మెజారిటీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. రాయలసీమ నుంచి గతంలో పివి.నరసింహారావు 5లక్షలపైగా మెజారిటీతో గిన్నిస్‌బుక్ రికార్డు సాధించారని గుర్తు చేశారు. చంద్రబాబు, విజయమ్మ తెలంగాణ జపం చేసి తెలంగాణ ప్రకటన వచ్చిన తర్వాత సమైక్యాంధ్ర జపం చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్ర నాయకులకు ఒత్తాసు పలుకుతూ విజయమ్మ, సిఎం కిరణ్‌కుమార్‌రెడ్డిలు రాయలసీమను తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతున్నారన్నారు. 72 జిఓను రద్దు చేయకుంటే సీమ ప్రాజెక్టుల మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సమైక్యాంధ్ర దీక్షలు మాని ప్రత్యేక రాయలసీమ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అర్‌పిఎస్ నాయకులు హాజీ మాబూసాహేబ్, జాకీర్‌బాషా, శ్రీనివాసులునాయుడు, నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
* రాహుల్ కోసమే విభజన * ముగిసిన బైరెడ్డి పాదయాత్ర
english title:
pada yathra
Date:
Monday, August 19, 2013