Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

ప్రభుత్వం తీరుపై మంత్రి టిజి గరం!

$
0
0

కర్నూలు, ఆగస్టు 18: రాష్ట్ర ప్రభుత్వం పని తీరుపై చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర, కృష్ణా జలాల విషయంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి తీరుతో తాను తీవ్ర మనస్థాపానికి గురయ్యాయని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నుంచి సరైన స్పందన లేకపోవడం బాధ కలిగిందన్నారు. కర్నూలులో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన కంటే ముందే తెలంగాణకు చెందిన మంత్రి సుదర్శన్‌రెడ్డి పక్షపాత ధోరణితో వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తుంగభద్ర జలాలను సద్వినియోగం చేసుకోవడానికి సుంకేసుల జలాశయం నీటి నిల్వ సామర్థ్యం పెంచుకునేందుకు అవసరమైన ప్రతిపాదనలు పంపితే దాన్ని తిరస్కరిస్తూ మెమో జారీ చేశారని, అయితే అదే రోజు పాలమూరు ఎత్తిపోతల పథకానికి పరిపాలనాపరమైన ఆమోదం తెలుపుతూ జీవో జారీ చేశారని తెలిపారు. సుంకేసుల జలాశయం సామర్థ్యం పెంచుకోవడానికి మాత్రమే ఖర్చు ఉంటుందని ఆ తరువాత ఎలాంటి ఖర్చు లేకుండా నీటిని రాయలసీమ వాసులు, ప్రధానంగా కర్నూలు-కడప కాలువ ద్వారా రెండు జిల్లాల్లోని సుమారు మూడు లక్షల ఎకరాలకు సమృద్ధిగా సాగునీరు అందించవచ్చని అన్నారు. ఈ ప్రతిపాదనలపై అభ్యంతరాలు ఉంటే తోటి మంత్రిగా తనతో చర్చించవచ్చని లేదంటే జిల్లాకే చెందిన మరో మంత్రి, ఎమ్మెల్యేలతో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చన్నారు. ఇలాంటిదేమీ చేయకుండా ఏకపక్షంగా తమ ప్రతిపాదనలను తిరస్కరిస్తూ మెమో జారీ చేయడంపై టిజి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏవైనా ప్రతిపాదనలపై మెమో జారీ చేయడమంటే పరోక్షంగా ఆ ప్రతిపాదనలు బుట్టదాఖలు చేయడమేనని అన్నారు.
ఇక కృష్ణాజలాల నుంచి 70 టీఎంసీల నీటిని ఎత్తిపోతల ద్వారా తరలించడమంటే సాధారణ విషయం కాదని అన్నారు. దీనివల్ల రాయలసీమ, కృష్ణా డెల్టాలకు అన్యాయం జరుగుతుందని, అంతేగాకుండా నిర్వహణ ఖర్చులు కూడా భరించలేని విధంగా ఉంటాయన్నారు. అలాంటి ప్రతిపాదనలకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా మంజూరు చేస్తూ జీవో జారీ చేశారని మండిపడ్డారు. ఈ రెండు అంశాలపై తాను మంత్రి సుదర్శన్‌రెడ్డితో మాట్లాడేందుకు ప్రయత్నించినా ఆయన ఉద్ధేశ్య పూర్వకంగా మాట్లాడటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు తనకు తెలియకుండానే నీటి పారుదలశాఖలో ఉన్నతాధికారుల బదిలీ జరిగిపోయిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వివరించినా సరైన సమాధానం రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాయని ఆవేదన చెందారు. ఈ కారణంగానే ముఖ్యమంత్రితో సీమాంధ్ర ప్రాంత మంత్రులు, ఎమ్మెల్యేల సమావేశానికి తాను గైర్హాజరయ్యాయనని వివరించారు. రాష్ట్రం ఏర్పాటు కాక ముందే రాయలసీమపై విషం చిమ్ముతున్న తెలంగాణ నేతలు ఇక రాష్ట్రం ఏర్పాటైతే తమను బతకనివ్వరని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర సమైక్యత కోసం ఎన్జీవోలు చేస్తున్న ఉద్యమం గర్వించతగ్గదని కొనియాడారు. వారి జీవితాలను ఫణంగా పెట్టి సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ద్వారా రాజకీయాలకు అతీతంగా వారు చేస్తున్న ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నానన్నారు. ఇక ముందు వారు తీసుకునే నిర్ణయాలకు తాను కట్టుబడి ఉంటానని తెలిపారు. తుంగభద్ర, కృష్ణా జలాల విషయంలో మంత్రి సుదర్శన్‌రెడ్డి ఇచ్చిన మెమో, జీవోలను ఎన్జీవో నేతలకు ఇచ్చానని వారు చర్చించి దానిపై తీసుకునే నిర్ణయంతో ముందుకు పోతామని స్పష్టం చేశారు. రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని సహించే ప్రశే్న లేదని పోరాటం చేసైనా న్యాయం జరిపిస్తామని వెల్లడించారు.

బాలుడిపై మైనర్ల
అఘాయిత్యం!
* మద్యం తాగించి వాంఛ తీర్చుకున్న వైనం
బేతంచెర్ల, ఆగస్టు 18 : పదేళ్ల బాలుడికి మద్యం తాగించి తమ వాంఛ తీర్చుకున్న మైనర్ల ఉదంతం ఇది. సంచలనం రేపిన ఈ సంఘటన వారం రోజుల తరువాత ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయంగా అందించిన సమాచారం మేరకు ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె గ్రామానికి చెందిన బాలుడు(10)పై అదే గ్రామానికి చెందిన ఆరుగురు బాలురు అత్యాచారం జరిపారు. వారం రోజుల క్రితం వీరంతా కలిసి బాలుడిని గ్రామ శివారుకి తీసుకువెళ్లి ఫుల్‌గా మద్యం తాగించారు. అనంతరం ఒకరి తరువాత మరొకరి బాలుడితో తమ వాంఛ తీర్చుకున్నారు. ఇంటికి చేరుకున్న బాలుడు జరిగిన విషయాన్ని తల్లిదండ్రుల దృష్టికి తీసుకురాగా వారు పోలీసులను అశ్రయించారు. అయితే కొంతమంది రాజీకి యత్నించడంతో సంఘటన బయటకు పొక్కలేదు. చివరకు శుక్రవారం పోలీసులు కేసు నమోదుచేసి నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను బాలనేరస్థుల కారాగారానికి తరలించినట్లు సమాచారం.

నేటి నుండి శ్రీరాఘవేంద్రస్వామి 342వ సప్త ఆరాధనోత్సవాలు
మంత్రాలయం, ఆగస్టు 18: పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్రస్వామి 342వ సప్త ఆరాధనోత్సవాలు సోమవారం అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయి. మఠం పీఠాధిపతులు శ్రీసుయతీంద్రతీర్థులు, ఉత్తరాధికారి సుభూదేంద్రతీర్థులు ఆధ్వర్యంలో ఉత్సవాలను వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 19 నుండి 25వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా 21న పూర్వారాధన, 22న మధ్యారాధన, 24న ఉత్తరాధన ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మూలరాముల వారు, ప్రహ్లాదరాయుల వారు, శ్రీరాఘవేంద్రస్వామి బృందావనం, పూర్వ పీఠాధిపతి బృందావనాలకు మఠం పీఠాధిపతులు చేతుల మీదుగా విశేష పూజలు నిర్వహిస్తారు. ఉత్తరాధనలో భాగంగా 24వ తేదీ మహా రథోత్సవాన్ని గ్రామ పురవీధుల గుండా వైభవంగా నిర్వహిస్తారు. రథోత్సవాన్ని తిలకించేందుకు వేల సంఖ్యలో భక్తులు తరలివస్తారని భావిస్తున్నారు. ఇందుకోసం ఎకే రాజగోపాలాచార్, ఎఎకే సుయమీంద్రాచార్, ఎవో రొద్దం ప్రభాకర్, ఎఎవో మాధవశెట్టి, మేనేజర్లు వెంకటేశ్వర్లు జోషి, శ్రీపతి, జోనల్ మేనేజర్ కిషాన్‌రావు ఉత్సవాల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సాంస్కృతిక కార్యక్రమాలు
రాఘవేంద్రస్వామి 342వ సప్త ఆరాధనోత్సవాల్లో భాగంగా 7 రోజుల పాటు యేగేంద్ర మండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆంధ్ర, కర్నాటక తదితర ప్రాంతాలకు చెందిన సంగీత కళాకారులతో దాసవాని, భరత నాట్యం, కూచిపూడి, కథాకళి నృత్యాలు, సంగీత కార్యక్రమాలు ఉంటాయి. ఉత్సవాల్లో భాగంగా ప్రముఖులకు పీఠాధిపతుల చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేసి స్వామివారి శేష వస్త్రాలు అందజేసి ఆశీర్వదిస్తారు. ఉత్సవాల సందర్భంగా మంత్రాలయంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా సిసి కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు.

భక్తులకు విస్తృత ఏర్పాట్లు
* ఎఎకే సుయమీంద్రాచార్
శ్రీరాఘవేంద్రస్వామి 342వ సప్త ఆరాధన ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినట్లు ఎఎకే సుయమీంద్రాచార్ తెలిపారు. మఠం వసతి గృహాలకు రంగులు వేశామన్నారు. విద్యుత్ దీపాలంకరణ చేసినట్లు ఆయన తెలిపారు. భక్తుల కోసం పెద్ద మొత్తంలో పరిమళ ప్రసాదాన్ని సిద్ధం చేశామన్నారు. తాగునీటి వసతి ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. దూర ప్రాంతాల నుంచి తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

దేశాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి
కాంగ్రెస్ కుట్ర
* పత్తికొండ ఎమ్మెల్యే కెయి ప్రభాకర్
కల్లూరు, అగస్టు 18 : దేశావ్యాప్తంగా 2014లో జరిగే ఎన్నికల్లో ఘోర పరాజయం తప్పదని ముందుగానే గ్రహించిన కాంగ్రెస్ అధిష్ఠానం దేశాన్ని ఛిన్నాభిన్నం చేయడానికి కుట్రలు పన్నుతోందని పత్తికొండ ఎమ్మెల్యే కెయి ప్రభాకర్ ఆరోపించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లతో కలిసి ఆదివారం నగరంలోని జాతిపిత మహత్మా గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం పార్టీ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరహార దీక్ష శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కెయి మాట్లాడుతూ కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను విడదీసే ప్రయత్నం చేస్తున్న సోనియాకు, అందుకు కారణమవుతున్న కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో భాగంగా సీమాంధ్రలో జరిగే నష్టానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఉద్యమం ఉద్ధృతమైనా కేంద్రం స్పందించకపోవడం చుస్తూంటే ఓట్లు వేసి పదవులు కట్టబెట్టిన ప్రజలపై ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతుందన్నారు. ఇప్పటికైనా సీమాంధ్ర కేంద్ర, రాష్ట్రం మంత్రులు పదవులకు రాజీనామా చేసి ప్రజా ఉద్యమాలకు మద్దతు పలకాలన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే ప్రజలు అభివృద్ధి చెందుతారన్నారు. అదే విభజన జరిగితే ముఖ్యంగా సీమ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడిపోవడం తథ్యమన్నారు. టిడిపి నాయకులు మురళీధర్ గౌడ్, చక్రపాణి యాదవ్, తిమ్మప్ప, పద్మనాభ ఆచారి, నరేంద్ర, సంతోష్, ప్రసాద్, మాబాషా దీక్షలో కూర్చొన్నారు. ఈ కార్యక్రమంలో జేమ్స్, హనుమంతారాయ చౌదరి, అల్లాబకాష్, పర్వేజ్, తిరుపాల్ పాల్గొన్నారు.

మహిళలను వేధిస్తే రౌడీషీటు
* చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
* ఎస్పీ రఘురామిరెడ్డి
కర్నూలు, అగస్టు 18 : జిల్లాలో మహిళలు, విద్యార్థుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, వేధింపులకు పాల్పడడం, మానభంగాల కేసుల్లో ముద్దాయిలపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జీవిత కాలం రౌడిషీట్లు ప్రారంభించాలని ఎస్పీ కె. రఘురామిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆదోని తాలుకా, కోవెలకుంట్ల, బనగానపల్లె సర్కిల్‌ల సిఐ, ఎస్సైలతో స్థానిక ఎస్పీ క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. అలాగే జిల్లా పోలీసు కార్యాలయంలో మంత్రాలయం, శిరివెళ్ల, బేతంచెర్ల సర్కిల్‌లతో ఆదనపు ఎస్పీ వెంకటరత్నం, శ్రీశైలం, నంద్యాల తాలుకా సర్కిల్‌ల సిఐ, ఎస్సైలతో ఓఎస్‌డి రవిశంకర్ రెడ్డి డిపివోలోని తన ఛాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులపై లైంగిక దాడులు, వేధింపుల వంటి సంఘటనలు తీవ్రంగా పరిగణించాలన్నారు. మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు జీవిత కాలం రౌడిషీట్లు కొనసాగించే విధంగా చర్యలు ఉండాలన్నారు. కౌతాళంలో కన్నతండ్రి కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసు విచారణ సందర్భంగా ఎస్పీ తీవ్రంగా స్పందించారు. జిల్లాలో మహిళలపై వేధింపులను తీవ్రంగా పరిగణించాలన్నారు. పోలీసులు తీసుకున్న చర్యలు మహిళలపై నేరాలు పాల్పడే వారికి జీవితాంతం గుర్తుండి పోయేలా ఉండాలన్నారు. అలాగే జిల్లాలో మాదకద్రవ్యాల ఆక్రమ రవాణా, వ్యాపార లావాదేవీలు నిర్వహించే వారిపై నిఘా తీవ్రతరం చేయాలన్నారు. నార్కోటిక్, డ్రగ్స్‌సైకో ట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్టు ప్రకారం కేసు నమోదు చేసినప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కేసులు కోర్టులో విచారణకు వచ్చినప్పుడు ముద్దాయిలకు శిక్ష పడాలంటే విచారణ, కేసుల్లో ఆధారాల సేకరణకే ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఈ విషయాన్ని గుర్తించి విచారణలో లభ్యమయ్యే అంశం డాక్యుమెంటరీ ఆధారాలు సేకరించి కేసు ఫైల్‌లో పొందుపరచాలన్నారు. ఈ ప్రక్రియను అన్ని కేసుల్లో అవలంభించాలన్నారు. ఆదోని తాలుకా సర్కిల్ పరిధిలోని కేసుల విచారణలో సిబ్బంది చెప్పే సమాధానాల పట్ల ఎస్పీ ఆసహనం వ్యక్తం చేశారు. సిడిల నిర్వహణ, కేసుల్లో సాక్షాధారాలు కూడా సరిగా సేకరించడంలేదని పేర్కొన్నారు. తాను అడిగిన ప్రశ్నలనే కోర్టులో జడ్జి అడిగితే ఏం సమాధానం చెబుతారో అదే చెప్పాలని, అలాకాకుండా కథలు చెప్పడం మానుకుని కేసులపై అవగాహన పెంచుకోవాలని సిబ్బందికి చురకలు అంటించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కేసుల్లో చార్జీషీటు వెంటనే దాఖాలు చేయాలని ఆదేశించారు. వెంటనే కేసులు నమోదు చేసి 3,4 నెలలు గడిచినా పురోగతి లేక నిందితులు మెయిల్ పొందుతున్నారని ఈ విధానానికి స్వస్తి చెప్పాలని ఓఎస్‌డి రవిశంకర్‌రెడ్డి ఆదేశించారు. ఏదైనా సంఘటన జరిగితే అ కేసుల్లో ముద్దాయిలను ఆరెస్టు చేయడం పోలీసుల ప్రథమ కర్తవ్యమన్నారు. అదనపు ఎస్పీ వెంకటరత్నం మాట్లాడుతూ ఎక్కడైన రోగులకు డాక్టర్లు అపరేషన్లు చేసిన సమయంలో అనుకోకుండా అపరేషన్ చేయించుకున్న వ్యక్తి మృతి చెందితే సంబంధిత డాక్టర్‌పై కేసు నమోదు చేసే సమయంలో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వారి దృష్టికి విషయం తీసుకుపోవాలన్నారు. ఆపరేషన్ చేసిన డాక్టర్ విద్యా అర్హతలు, అపరేషన్ చేసేందుకు అర్హతలు ఉన్నాయా అని ధ్రువీకరించుకున్న తర్వాత కేసు నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఆయా సర్కిల్ సిఐ, ఎస్సైలు పాల్గొన్నారు.

‘అయోధ్య ప్రదక్షిణ’ను
విజయవంతం చేయండి
కర్నూలు ఓల్డ్‌సిటీ, ఆగస్టు 18 : అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం కోసం అక్టోబర్ 7న జరిగే అయోద్య ప్రదక్షిణ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు వేలాదిగా పాల్గొని విజయవంతం చేయాలని విహెచ్‌పి జిల్లా అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని విహెచ్‌పి జిల్లా కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాబోయే శ్రీ కృష్ణాష్ఠమి రోజున విశ్వహిందూ పరిషత్ అవిర్భావించి 50 సంవత్సరాల్లోకి అడుగుపెడుతున్న సందర్భంగా వాడవాడలా ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే దసర సెలవుల్లో భజరంగ్‌దళ్ ఆధ్వర్యంలో 5 రోజుల పాటు మంత్రాలయంలో శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు భజరంగ్‌దళ్ విభాగ్ ప్రముఖ్ వేద ప్రకాశ్ తెలిపారు. శ్రావణ మాసంలో నగరంలో ప్రతి శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు విహెచ్‌పి జిల్లా ఉపాధ్యక్షులు కిష్టన్న తెలిపారు. జిల్లా న్యాయ సలహా ప్రముఖ్‌గా కృష్ణ, జిల్లా హనుమాన్ చాలీసా ప్రముఖ్‌గా టి.శ్రీరాములు, నగర భజరంగ్‌దళ్ సహ ప్రముఖ్‌గా చిరంజీవి, ఎమ్మిగనూరు భరజంగ్‌దళ్ ప్రముఖ్‌గా నరసింహను నియమించినట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రతాప్‌రెడ్డి, సందడి మహేశ్వర్, నరసింహులుపాల్గొన్నారు.

* తెలంగాణకో న్యాయం.. సీమకో న్యాయమా..? * తీవ్ర మనస్థాపానికి గురయ్యా * ఇక ఎన్జీవోలతో కలిసి సమైక్య ఉద్యమం
english title: 
tg

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>