విజయవాడ, ఆగస్టు 18: నిరవధిక సమ్మెను నీరుగార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని ప్రయోగించడంపై ప్రభుత్వ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట రాష్ట్ర ఖజానా శాఖ పే అండ్ అకౌంట్స్ విభాగానికి ఈ చట్టాన్ని వర్తింపజేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఎస్మా కాదుకదా మరో కొత్త చట్టాన్ని తెచ్చినా భయపడేది లేదంటూ సమ్మెలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు స్పష్టం చేశారు. ఎస్మాకు నిరసనగా సబ్ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎన్‌జిఒ సంఘం పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ మాట్లాడుతూ చట్టాలు, అరెస్టులకు భయపడి ఉద్యమాన్ని ఆపేదిలేదన్నారు. సీమాంధ్రలోని కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు తమతమ పదవులకు రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఇదిలావుండగా సమైక్యాంధ్ర ఉపాధ్యాయ జెఎసి కన్వీనర్ కమలాకరరావు అధ్యక్షతన 13 జిల్లాల జెఎసి కన్వీనర్లు, ఉపాధ్యాయ సంఘాల కీలక సమావేశం విజయవాడలో ఆదివారం జరిగింది. ఈ సమావేశంలో ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీలు బచ్చు పుల్లయ్య, గాదె శ్రీనివాసులునాయుడు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శికి సోమవారంనాడు సమ్మె నోటీసు అందించనున్నట్టు సంఘ ప్రతినిధులు చెప్పారు. ఈ నెల 22 నుండి నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్టు, అప్పటి వరకు రిలే నిరాహారదీక్షలు చేపడతారు. ఉద్యమంలో పాల్గోవడంపై ఎస్‌టియు, యుటిఎఫ్ నేతలు మాత్రం తమతమ సంఘ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, మున్సిపల్ ఉద్యోగులు, ఆర్టీసీ కార్మికులు సాగిస్తున్న నిరవధిక సమ్మె ఆదివారానికి ఆరో రోజుకు చేరింది. దీని వల్ల పౌరసేవలు లభించక, ఇటు రవాణ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ బస్సులు నిలిచిపోవడంతో పల్లెల నుండి నగరానికి కూరగాయలు రావడం లేదు. ఫలితంగా వాటి ధరలు ప్రజలకు అందుబాటులో లేని విధంగా పెరిగిపోయాయి. కాగా, విద్యార్థి జెఎసి కన్వీనర్ దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో విద్యార్థులు ఎగ్జిక్యూటివ్ క్లబ్ సమీపంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన వల్ల విద్యార్థుల భవిష్యత్తు అంధకారంగా మారే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రి పగలు వైద్య సేవలతో బిజీబిజీగా ఉండే ప్రైవేటు వైద్యులు కూడా ప్రత్యక్ష ఆందోళనకు సన్నద్ధమవుతున్నారు. దీనిలో భాగంగా తొలుత ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాలు వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. తొలి రోజు దీక్షలో ఐఎఎ అధ్యక్షుడు, కార్యదర్శి డాక్టర్ రమణమూర్తి, డాక్టర్ శ్రీదేవి, మాజీ అధ్యక్షుడు కొడాలి రామకృష్ణ, డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ బెల్లంకొండ సునీత, డాక్టర్ మల్లిక, డాక్టర్ శ్రావణి, డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు, వెలంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్, వైసీపి నాయకుడు గౌతంరెడ్డి, టిడిపి నాయకులు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వరరావు తదితరులు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు.
నిరవధిక సమ్మెను నీరుగార్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎస్మా చట్టాన్ని
english title:
esma
Date:
Monday, August 19, 2013