మచిలీపట్నం , ఆగస్టు 18: దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల దర్యాప్తును వేగవంతం చేసి నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లావ్యాప్తంగా ఉన్న డిఎస్పీలు, సిఐలతో కేసుల పురోగతిపై ఏర్పాటు చేసిన నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన దర్యాప్తు ముగించి ముద్దాయిలను అరెస్టు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలన్నారు. సాంకేతికంగా పరిశోధనలు నిర్వహించడం వల్ల న్యాయస్థానాల్లో కేసులు వీగిపోయే అవకాశాలు ఉన్నందున ఆ దిశగా మరింత చొరవ తీసుకోవాలన్నారు. చోరీ కేసులలో నేరస్థులను గుర్తించే సందర్భాలలో తలెత్తే సమస్యలను సరిహద్దు జిల్లాల పోలీసు అధికారులతో సమన్వయంతో వ్యవహరిస్తే సత్ఫలితాలు వస్తాయన్నారు. ఒకే తరహా నేరాలకు పాల్పడే నేరస్థుల మీద నిరంతరం నిఘా కొనసాగించాలని సిబ్బందికి ఆయన సూచించారు. ఈ నెల 21న జరగనున్న అవనిగడ్డ అసెంబ్లీ ఉప ఎన్నికకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ప్రభాకరరావు ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ డా. షెముషీ బాజ్‌పాయ్, మచిలీపట్నం, గుడివాడ, నందిగామ, నూజివీడు, అవనిగడ్డ డిఎస్పీలు, సిఐలు పాల్గొన్నారు.
నూజివీడులో శాంతిహోమం
నూజివీడు, ఆగస్టు 18: కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు నిరసనగా వివిధ కార్మిక, ఉద్యోగ సంఘాలు ఆదివారం ఆందోళనలు చేశాయి. సమైక్యాంధ్ర కోరుతూ స్థానిక గాయత్రీ మిత్రమండలి ఆధ్వర్యంలో చిన్నగాంధీబొమ్మ సెంటరులో శాంతి హోమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఇరు ప్రాంతాల ప్రజల్లో ఘర్షణ వాతావరణం నెలకొని ఉందని, దీనిని రూపుమాపి శాంతి చేకూర్చాలని కోరుతూ శాంతి హోయం నిర్వహించినట్లు గాయత్రీ మిత్రమండలి ప్రతినిధులు తెలిపారు. నూజివీడు ఎరువులు, పురుగు మందుల వ్యాపారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక చిన్నగాంధీబొమ్మ సెంటరు వద్ద సమైక్యాంధ్ర కోరుతూ ఉచితంగా యూరియా పంపిణీ చేశారు. స్థాక చిన్నగాంధీబొమ్మ సెంటరులో సంయుక్త కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు కొనసాగాయి. ఈ దీక్షా శిబిరాన్ని నూజివీడు పురపాలక సంఘం మాజీ వైస్ ఛైర్మన్ రామిశెట్టి మురళీకృష్ణకుమార్, ప్రతిపక్ష నాయకులు పసుపులేటి జగన్‌మోహనరావు తదితరులు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. స్థానిక ఆర్టీసీ డిపో వద్ద కార్మికులు ధర్నా చేశారు. కార్మికుల సమ్మెతో బస్సులన్నీ డిపోలకే పరిమిమయ్యాయి. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్ళాల్సిన ప్రయాణీకులు ఇబ్బందులు పడుతూ ప్రవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ వెళ్ళాల్సిన ప్రయాణీకులు దోపిడీకి గురవుతున్నారు. ఆందోళనల సందర్భంగా అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఉండే విధంగా సిఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ ఐవి నాగేంద్రకుమార్‌లు చర్యలు తీసుకున్నారు.
నందిగామలో...
నందిగామ : సమైక్యాంధ్ర ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు గానూ సమైక్యాంధ్ర పరిరక్షణ వేదికను వివిధ ఉద్యోగ సంఘాల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉద్యమ కార్యాచరణపై ప్రణాళిక తయారు చేశారు. స్థానిక ఎన్‌జిఒ హోమ్‌లో ఆదివారం సాయంత్రం సమైక్యాంధ్ర ఉద్యమ జెఎసి నేతలు, ఎన్‌జిఒ నేతలు సమావేశమయ్యారు. ఎన్‌జిఒ అధ్యక్షుడు ఎం శ్యాంబాబు అధ్యక్షుడుగా, ఎంవై దాసు (పిఆర్) కో చైర్మన్‌గా, జి వెంకటరత్నం (ఎన్‌జిఒ కార్యదర్శి) కన్వీనర్‌గా, కోకన్వీనర్‌లుగా షేక్ దాదా సాహెబ్ (రెవెన్యూ), ఎం మాధవరావు (ఎన్‌జిఒ సహాధ్యక్షుడు), టి శ్రీనివాసరావు (ఎన్‌జిఒ కోశాధికారి), సలహాదారుగా కొత్త శ్రీనివాసరావు (రాష్ట్ర పంచాయతీ కార్యదర్శుల సంఘం సహాధ్యక్షుడు)లతో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కమిటీని ఏర్పాటు చేశారు. ఉద్యమ కార్యచరణలో భాగంగా 19వ తేదీ సోమవారం ఉదయం 10గంటలకు ఉద్యోగ, విద్యార్థి, కార్మిక, న్యాయవాదులు, వ్యాపార సంస్థలు, అన్ని సంఘాలతో ‘మహా నిరసన ర్యాలీ’ నిర్వహించాలని, 20వ తేదీ మంగళవారం రహదారుల నిర్బంధం, నందిగామ బంద్, రాస్తారోకోలు (ఇచ్చాపురం నుండి తడ వరకూ), 21వ తేదీ బుధవారం ఉదయం 10.30గంటలకు భారీ మానవహారం, సాయంత్రం 6.30గంటలకు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు, విద్యాసంస్థల అధినేతలు, సంఘాల నాయకులు పాల్గొన్నారు.
- సమైక్యాంధ్రే కావాలంటూ -
ముస్లింల భారీ ప్రదర్శన
మచిలీపట్నం, ఆగస్టు 18: సమైక్యాంధ్ర ఉద్యమం జిల్లాలో సెగలు కక్కుతోంది. రాష్ట్ర విభజన నిర్ణయం పట్ల జిల్లావాసులు రగిలిపోతున్నారు. గత నెల 30న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించే ప్రకటన చేయగానే ఒక్కసారిగా ప్రజలు స్వచ్ఛందంగా ఆందోళన బాట పట్టారు. అమీతుమీ తేల్చుకునేందుకు రాజకీయాలకు అతీతంగా జిల్లావ్యాప్తంగా ఒకే తాటిపైకి వచ్చారు. జెఎసి ఆధ్వర్యంలో అన్ని సంఘాలు ఉద్యమానికి కాలుదువ్వుతున్నాయి. ఆదివారం కూడా జిల్లావ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు హోరెత్తాయి. జిల్లా కేంద్రం మచిలీపట్నంలో వేలాది మంది ముస్లింలు సమైక్యాంధ్ర కోరుతూ భారీ ప్రదర్శన నిర్వహించి నమాజు చేసి రిలే దీక్షలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, వైఎస్‌ఆర్‌సీపి, తెలుగుదేశం పార్టీల నాయకులు బూరగడ్డ వేదవ్యాస్, పేర్ని వెంకట్రామయ్య(నాని), కొల్లు రవీంద్ర పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ఏమాత్రం అంగీకరించేది లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించారు. దీనికోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనన్నారు. విభజన అంశాన్ని ప్రభుత్వం పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని పట్టణాలు, మండలాల్లో భారీ ప్రదర్శనలు, రాస్తారోకోలు నిర్వహించారు. రిలే దీక్షలు కొనసాగుతున్నాయి.
రాష్ట్ర విభజన అభివృద్ధికి గొడ్డలిపెట్టు
చల్లపల్లి, ఆగస్టు 18: రాష్ట్ర విభజన అభివృద్ధికి గొడ్డలిపెట్టని పలువురు వక్తలు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా సమైక్యాంధ్ర జెఎసి కన్వీనర్ నాగళ్ళ భీమారావు ఆధ్వర్యంలో ఆదివారం ఇండియన్ మెడికల్ అసోసియేషన్, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్, ల్యాబ్ టెక్నీషియన్స్, ఆర్‌ఎంపి వైద్యుల అసోసియేషన్‌లు గ్రామంలో పెద్దఎత్తున ప్రదర్శన నిర్వహించి ప్రధాన సెంటరులో మానవహారంగా ఏర్పడ్డారు. ఈసందర్భంగా జనవిజ్ఞాన వేదిక జిల్లా గౌరవాధ్యక్షులు డా. డిఆర్‌కె ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో ఉత్పన్నమయ్యే సమస్యలను, సవాళ్ళను వివరించారు. రాష్ట్ర సమైక్యతను కాపాడుకునేందుకు ప్రతిఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జెఎసి ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన సెంటరులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలో పలువురు వైద్యులు, డ్రగ్గిస్ట్‌లు పాల్గొన్నారు.
అవనిగడ్డలో...
అవనిగడ్డ : సమైక్య రాష్ట్ర ఉద్యమం దివిసీమ ప్రాంతంలో మరింత ఊపందుకుంది. ఉద్యోగ జెఎసి ఆధ్వర్యంలో పిఆర్‌టియు ఉపాధ్యాయులు నిర్వహించిన రిలే దీక్షలో ఆదివారం 30 మంది పాల్గొన్నారు. బివిఎస్ పెరుమాళ్ళు, కె అశోక్, పి వేణు, కె దీవేంద్రరావు దీక్షలో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌సీపి నాయకులు సింహాద్రి రమేష్, సర్పంచ్ పృధ్వీరాజు, తోట శ్యాంకిషోర్ నాయడు సంఘీభావం తెలిపారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన రిలే దీక్షలు 7వ రోజుకు చేరుకోగా వెల్డింగ్ కార్మికులు 13 మంది పాల్గొన్నారు. అరవ ప్రభాకరరావు, ఎం సాంబశివరావు, ఎన్ వీర రాఘవయ్య, సుబ్బారావు, జమాల్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్‌ఆర్ సీపి నాయకులు యాసం చిట్టిబాబు శిబిరాన్ని ప్రారంభించారు. దాసి దేవదర్శనం, గాజుల మురళీ, గోపీచంద్ తదితరులు ప్రసంగించారు. అలాగే మండలంలోని ముస్లిం సోదరులు దాదాపు 50 మంది తాలూక కార్యాలయం ఎదుట ఒకరోజు రిలే దీక్షలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మత పెద్ద మీయాద్ అహమ్మద్ ముస్లింలతో సమైక్య రాష్ట్రం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహింపజేశారు.
టిడిపి నాయకుల వంటావార్పు
కలిదిండి : సమైక్యాంధ్రకు మద్దతుగా కలిదిండి నాలుగు రోడ్ల కూడలి వద్ద ఆదివారం తెలుగుదేశం పార్టీ నాయకులు వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జాతీయ రహదారిపై కైకలూరు ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ, డా. సిఎల్ వెంకట్రావ్, ఈడ్పుగంటి వెంకట్రామయ్య, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వల్లభనేని శ్రీనివాసచౌదరి తదితర నాయకులు రోడ్డుపై భోజనాలు చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే జయమంగళ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రులను హైదరాబాద్ వదిలి వెళ్ళాలంటూ, ముందు సోనియా గాంధి దేశం వదిలి ఇటలీ వెళ్ళిపోవాలన్నారు. సోనియా ఇటలీ నుంచి వచ్చిన పదేళ్ల వరకు మనదేశ సభ్యత్వం తీసుకోలేదన్నారు. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్న కెసిఆర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ఎడారిగా మారుతుందన్నారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలన్నారు. తొలుత రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లాల్‌జాన్ బాషా చిత్రపటానికి తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఈడ్పుగంటి వెంకట్రామయ్య, రాష్ట్ర వైద్య విభాగం అధ్యక్షులు డా. సిఎల్ వెంకట్రావు, మండల అధ్యక్షులు వల్లభనేని శ్రీనివాస్ చౌదరి, సత్యనారాయణ, కె గోపీ, అల్లం శ్రీనివాసరావు, మేకా భోగేశ్వరరావు, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చిట్టూరి రవీంద్ర, కైకలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షులు అగ్నిహోత్రం ఆత్రేయబాబు, అబ్రహం లింకన్, ఇతర సమైక్యవాదులు పాల్గొన్నారు.
విభజించే హక్కు ఎవ్వరికీ లేదు
పెడన : తెలుగుజాతిని విభజించే హక్కు ఎవ్వరికీ లేదని ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ బందరు డివిజన్ కమిటీ స్పష్టం చేసింది. సమైక్యాంధ్రకు మద్దతుగా జెఎసి ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో భాగంగా ఆదివారం ప్రైవేటు స్కూల్స్ అధినేతలు దీక్షలో పాల్గొన్నారు. వైఎస్‌ఆర్‌సీపి నియోజకవర్గ సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ ఉదయం ఈ దీక్షలను ప్రారంభించారు. ప్రైవేట్ స్కూల్స్ అధినేతలు గౌరీ ప్రసాద్, కె దిలీప్ కుమార్, ముక్కు శ్రీనివాసరావు, కె నాగమోహనరావు, కాగిత శంకర సాంబశివరావు, సిహెచ్ పార్వతితో పాటు మరో 25 మంది దీక్షలో పాల్గొన్నారు. అసోసియేషన్ రాష్ట్ర నాయకులు వి సుందరామ్, వి నాగప్రవీణ్ తదితరులు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు సంఘీభావం తెలిపారు.
తోట్లవల్లూరులో...
తోట్లవల్లూరు : సమైక్యాంధ్రను విభజిస్తూ కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయం ఘోర తప్పిదమని, దీన్ని తామంతా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మొవ్వా మోహన్‌రావు అన్నారు. సమైక్యాంధ్ర కోసం తోట్లవల్లూరులో ఉద్యోగ, ఉపాధ్యాయ జెఎసి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం నాలుగోరోజుకు చేరాయి. ఈ దీక్షలకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించి దీక్షలో కూర్చున్నారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మోర్ల రామచంద్రరావు, గరికపర్రు సర్పంచ్ నడకుదురు రాజేంద్ర, పాములలంక మాజీ సర్పంచ్ శీలం వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ నాయకులు బాబ్‌జాని, మాతంగి కోటేశ్వరరావు, ఆరేపల్లి శ్రీనివాసరావు, కోలుకొండ సుబ్బారావు, మండల విఆర్‌ఓల సంఘం అధ్యక్షుడు గోపాలకృష్ణ, గరికపర్రు విఆర్‌ఓ నాగేశ్వరరావు, భద్రిరాజుపాలెం విఆర్‌ఓ మురళీకృష్ణ, దేవరపల్లి విఆర్‌ఓ బాలకోటయ్య, తదితరులు కూర్చున్నారు. దీక్షా శిబిరంలో మోహన్‌రావు మాట్లాడారు. మండల ఉపాధ్యాయ, ఉద్యోగ జెఎసి కన్వీనర్ జి వేణుగోపాలరావు, టి వాసు, పిఎస్ కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న దీక్షలు
బంటుమిల్లి : సమైక్యాంధ్రకు మద్దతుగా బంటుమిల్లి గ్రామ పంచాయతీ ఆఫీసు వద్ద జరుగుతున్న రిలే దీక్షల్లో భాగంగా ఆదివారం చినతుమ్మిడి గ్రామస్థులు వెలివల చినబాబు ఆధ్వర్యంలో దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షా శిబిరాన్ని పెడన నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపి సమన్వయకర్త ఉప్పాల రాంప్రసాద్ సందర్శించి సంఘీభావం తెలిపారు. సాయంత్రం మాజీ డెప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ సంఘీభావం ప్రకటిస్తూ రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నారు. కెసిఆర్ ఒక చీడపురుగు అని ధ్వజమెత్తారు. సమైక్యంగా ఉండబట్టే తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధి చెందాయని గుర్తించుకోవాలన్నారు.
రాష్ట్రం విడిపోతే రైతులు అనేక ఇబ్బందులు పడతారన్నారు. విభజనపై యుపిఎ పునరాలోచించాలని కోరారు. సమైక్యాంధ్ర ఉద్యమం ప్రజల నుండి పుట్టిందని వేదవ్యాస్ స్పష్టం చేశారు. కాగా, సమైక్యాంధ్రకు మద్దతుగా బంటుమిల్లి మండలం ముల్లపర్రు గ్రామానికి చెందిన చిన్నారులు ఆదివారం బంటుమిల్లి రోడ్డులో ఆందోళన చేశారు. వారి ఆందోళనకు ముల్లపరు గ్రామస్థులు తోడయ్యారు.