విజయవాడ , ఆగస్టు 18: మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు రచించిన, వెలగపూడి గోపాలకృష్ణప్రసాద్ ముద్రించిన సమైక్యతతోనే తెలుగుజాతి ప్రగతి పుస్తకాన్ని ఆదివారం సాయంత్రం గాంధీనగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా వచ్చిన రాజకీయ విశ్లేషకుడు సి.నరసింహారావు పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్రాన్ని విభజించడం తెలుగువారిని రెండుగా విభజించినట్లేనని తెలుగుజాతి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రకు తలవంచడం, అంగీకరించటంకంటే అవమానం ఇంకొకటి లేదని అన్నారు. యుపి, మొదలైన చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వం బలాన్ని పూర్తిగా కోల్పోయిందని ఆ బలాన్ని పుంజుకోడానికే ఈ రాష్ట్రాన్ని విభజిస్తున్నారని అన్నారు. వ్యవసాయ రంగం కూడా తెలంగాణలో ఒకప్పుడు స్వర్ణయుగంగా భాసిల్లిందని అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సభలో రచయిత, మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రచురణకర్త వెలగపూడి గోపాలకృష్ణప్రసాద్, ఎ.విద్యాసాగర్, కొలనుకొండ శివాజీ, సిహెచ్ బాబూరావు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు.
‘టిడిపి ఆందోళనలు మోసపూరితం’
విజయవాడ, ఆగస్టు 18: సమైక్యాంధ్ర పేరిట తెలుగుదేశం పార్టీ నాయకులు సాగిస్తున్న నిరసనలు, దీక్షలు పూర్తిగా మోసపూరితమైనవని, సీమాంధ్ర ప్రజల కళ్ళనీళ్లు తుడవటానికేనంటూ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు నిప్పులు చెరిగారు. రాష్ట్ర విభజన ప్రక్రియకు ఆద్యుడు చంద్రబాబు, 2008లోనే కేంద్రానికి లేఖ ఇచ్చాడని అన్నారు. సత్యనారాయణపురం శివాజీ కేఫ్ సెంటర్‌లో కాంగ్రెస్ 47వ డివిజన్ అధ్యక్షుడు తల్లా ప్రగడ రాజా ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సామూహిక నిరాహార దీక్షలను విష్ణు ప్రారంభించి ప్రసంగించారు. ఆందోళనలతో సీమాంధ్ర భగ్గుమంటున్నా చంద్రబాబు ఏమాత్రం సిగ్గు లేకుండా పత్రికా సంపాదకుల సమావేశంలో కూడా తాను వెనకడుగు వేయటం లేదని, రాష్ట్ర విభజన నిర్ణయానికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేసిన విషయాన్ని స్థానిక దేశం నేతలు గుర్తెరగాలన్నారు. ఏ మాత్రం ధైర్యం, సమైక్యాంధ్రపై అభిమానం, గౌరవం ఉన్నా ముందుగా తమ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద దీక్షలు, నిరసనలు చేయాలన్నారు. బాబు వైఖరిలో మార్పు కోరుకోకుండా ఇక్కడ నిరసనలు చేస్తే ప్రయోజనం ఏమిటని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ధైర్యంగా తమ పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని వ్యితిరేకిస్తున్నాం, మార్పు కోసం శతవిధాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ అర్జా పాండురంగారావు, సూపర్‌బజార్ చైర్మన్ బోగాది మురళి, మాజీ డిప్యూటీ మేయర్ సామంతపూడి నరసరాజు తదితరులు పాల్గొన్నారు.
నాళం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ
తెలుగుదేశం పార్టీ 47వ డివిజన్ అధ్యక్షుడు నాళం సుధాకర్ నేతృత్వంలో కార్యకర్తలు సత్యనారాయణపురంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు.
ధరలు పెరుగుతుంటే పాలకులేం చేస్తున్నారు
విజయవాడ, ఆగస్టు 18: ఓ వైపు ధరలు పెరిగి నిత్యావసర వస్తువులు, కూరగాయలు సామాన్యులు కొనలేని స్థితికి చేరుకున్నాయని అయినా పాలకులు పట్టించుకోవడం లేదని సిపిఎం నగర కార్యదర్శి సిహెచ్ బాబూరావు విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కోరుతూ సిపిఎం విజయవాడ నగర కమిటీ ఆధ్వర్యాన ఆదివారం ఉదయం స్వరాజ్యమైదాన్ రైతుబజార్ ముందు ధర్నా జరిగింది. కాటాలో ఒక్క పక్క డబ్బుకట్టలు, మరోవైపు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు పెట్టి వినూత్న తరహా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాబూరావు మాట్లాడుతూ సరుకుల ధరలు గతంలో ఎన్నడూలేని విధంగా పెరిగాయని విమర్శించారు. ఉల్లిపాయలు కిలో రూ. 80, పచ్చిమిర్చి రూ. 100 నుండి రూ. 120కి చేరాయని తెలిపారు. విభజన పేరుతో ప్రజాప్రతినిధులు చేస్తున్న ఆందోళనలు సాకుగా చూపి ధరలు ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శివర్గ సభ్యులు డి విష్ణువర్థన్, యువి రామరాజు, నగర కమిటీ సభ్యులు బి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
నగరంలో కుంభవృష్టి
విజయవాడ, ఆగస్టు 18: నగరంలో ఆదివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కుంభవృష్టి కురిసింది. మధ్యమధ్యలో పిడుగుల ధ్వనులు కొందరిని భయభ్రాంతుల్ని చేశాయి. దాదాపు గంటకుపైగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. రోడ్లపై వెళ్తున్న వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రధాన రహదారులు సైతం జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మురుగు కాల్వల్లోని మురుగు, వర్షపు నీరు కలసి రహదారులపై ప్రవహించింది. మొగల్రాజపురం, పాతబస్తీలోని కొన్ని ప్రాంతాల్లో రెండు మూడు అడుగుల మేర వర్షపు నీరు నిలిచిపోయింది.
దీక్షలను అడ్డుకోవడం అప్రజాస్వామికం
విజయవాడ, ఆగస్టు 18: సమైక్యాంథ్ర కోసం ఆమరణ నిరాహారదీక్షలకు అనుమతులు నిరాకరించడం, సమ్మె చేస్తున్న ఉద్యోగులపై ‘ఎస్మా’ ప్రయోగించడం అప్రజాస్వామ్యమని మాజీ శాసన సభ్యులు, సమైక్యాంధ్ర నాయకులు అడుసుమిల్లి జయప్రకాష్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆమరణ నిరాహారదీక్షకు అనుమతి ఇవ్వనంత మాత్రాన ఉద్యమం ఇక్కడితో ఆగదని అది మరింత ఉద్ధృతవౌతుందని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో ప్రభుత్వం తన ఉనికిని కోల్పోయిందని ఇప్పుడంతా సోనియా కను సన్నలలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తుందని అడుసుమల్లి విమర్శించారు. ఈ ఉద్యమం ప్రజల నుంచి వచ్చిందని దీనిని ఆపడం ఎవ్వరివల్ల కాదన్నారు. ఏదిఏమైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి గర్హనీయమన్నారు.
లాఠీచార్జికి నిరసనగా ర్యాలీ
గుడివాడ, ఆగస్టు 18: తిరుపతిలోని అలిపిరి వద్ద విద్యార్థులు, యువకులపై లాఠీచార్జిని నిరసిస్తూ సమైక్యాంధ్ర విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు చేశారు. నెహ్రూచౌక్ సెంటర్‌లో రాస్తారోకోకు దిగారు. ఈసందర్భంగా జరిగిన సభలో విద్యార్థి జెఎసి కన్వీనర్ కొయలాపు రాము మాట్లాడుతూ తెలంగాణ స్వార్థ రాజకీయ నేతల కుసంస్కారం మరోసారి బయటపడిందన్నారు.
సీమాంధ్రలో ఉవ్వెత్తున ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో తిరుమల స్వామివారి దర్శనానికి వి హనుమంతరావు రావడంతో పాటు రాజకీయ ప్రసంగాలు చేసి ఉద్యమాన్ని కించపరుస్తూ రెచ్చగొట్టారని విమర్శించారు. కడుపుమండిన ఆందోళనకారులు నిరసన వ్యక్తం చేశారని, పోలీసులు వారిపై లాఠిఛార్జి చేయడం అన్యాయమన్నారు. నాయకులు కంచర్ల మధు, కె హరీష్, గంటా కుమారస్వామి, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, జెఎసి కన్వీనర్ యార్లగడ్డ వెంకటేశ్వరప్రసాద్, నాయకులు దింట్యాల రాంబాబు, పుప్పాల ఆంజనేయులు, వాడరేవు గణేష్, బూరగడ్డ శ్రీకాంత్ పాల్గొన్నారు.
సమైక్యాంధ్ర కోసం బోనాలు
జగ్గయ్యపేట, ఆగస్టు 18: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం మహిళలు పెద్దఎత్తున బోనాల సంబరాలు నిర్వహించారు. పార్టీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను సతీమణి విమలాభాను ఆధ్వర్యంలో మహిళలు, పిల్లలు సంప్రదాయబద్ధంగా బోనాలతో డప్పువాయిద్యాలు, మేళతాళాలతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం మున్సిపల్ కూడలిలో వంటావార్పు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేలా దేవతలు కరుణించాలని, రాష్ట్రం విడిపోతే ఈప్రాంతం బీడుగా మారుతుందని విమలాభాను అన్నారు. తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల ఆధ్వర్యంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, కాంగ్రెస్ నేత పాటిబండ్ల వెంకట్రావు ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో క్రికెట్, కర్రసాము, సామూహిక వంటావార్పు కార్యక్రమాలు నిర్వహించారు.