సంగారెడ్డి,ఆగస్టు 18:జిల్లాలో క్రమం తప్పకుండా రోజూ కురుస్తున్న వర్షం రైతాంగానికి ఇబ్బందిగా మారింది. ఇపాటికే జిల్లా వ్యాప్తంగా 4.25 లక్షల హెక్టార్లలో వివిధ పంటలను కర్షకులు సాగు చేశారు. అయితే ఈ సాగులో అత్యధికంగా వరి,పత్తి, చెరుకు, మొక్కజొన్న, పెసర, మినుము, సోయాబీన్, కంది లాంటి పంటలు ఉన్నాయి. వరి, చెరుకు పంటలకు రోజూ కురుస్తున్న వర్షం వరంగా మారింది. కాగా,మిగతా పంటలైనా పత్తి,మొక్కజొన్న, పెసర, మినుము మరియు సోయాబీన్‌కు నష్టం కలిగే పరిస్థితి నెలకొంది. ఈ పంటల్లో కనీసం కలుపు మొక్కలను కూడా ఈ వర్షం తీయనీయడం లేదు. దీంతో రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతోంది. దాదాపు 40 వేల హెక్టార్లలో పత్తి, 10 వేల హెక్టార్లలో మొక్కజొన్న, మరో పది వేల హెక్టార్లలో ఇతర పప్పుదినుసుల పంటలను రైతాంగం సాగు చేసింది. జూన్, జూలై, ఆగస్టులో కురిసి మంచి వర్షాలతో బోరు బావులతో పాటు చిన్న చెరువులు, కుంటల కింద కూడా రైతాంగం వరి పంటను గణనీయంగా సాగు చేస్తోంది. ఇంకా కొన్ని ప్రాంతాల్లో వరినాట్ల ప్రక్రియ కొనసాగుతోంది. కాగా,వర్షం వరి పంటకు మొత్తంగా అనుకూలంగా మారగా ఇతర పంటలన్నింటికీ ప్రతికూలంగా మారింది.ఈ వర్షాలతో చెరుకు పంటగా ఈపుగా పెరుగుతున్న కలుపు తీయడానికి సమయం దొరక్కపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతోంది. 30 వేల హెక్టార్లలో చెరుకు పంట జిల్లాలో సాగవుతోంది. అలాగే రోజూ వర్షంతో పత్తి, మొక్కజొన్న,పెసర,మినుము,కంది,సోయాబీన్‌లో కలుపు మొక్కలు విపరీతంగా పెరిగిపోయాయి.ఇదే రీతిలో ఆగస్టు మాసంలో వర్షాలు కురుస్తే పంట చేతికి రావడం కష్టమేనని రైతాంగం దిగులు చెందుతోంది.అన్ని రకాల పంటల దిగుబడులు గణనీయంగా తగ్గిపోవడం ఖాయమని ఖరాఖండిగా రైతులు చెబుతున్నారు. ఇపాటికే లోతట్టు ప్రాంతాల్లో ఉన్న అన్ని రకాల పంటలకు అతి వానలతో వివిధ రకాల తెగులు సోకి చనిపోవడం జరుగుతోంది.దీంతో రైతాంగం ఈ పంట నష్టాన్ని ఎలా తగ్గించాలని మదన పడుతున్నారు.ఈ ఏడాది జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 44 శాతం అధికంగా వర్షం పాతం కురిసింది. ఆగస్టు రెండవ వారం నాటికే ఈ పరిస్థితి ఉండగా మూడవ వారం వర్షపాతం ఇంకా పెరిగింది.తాజా వాతావరణ పరిస్థితుల్లో ఇంకా వర్షం కురుసే అవకాశం ఉందని తెలస్తుండడంతో రైతాంగం తీవ్ర నిరాశకు గురవుతోంది. వరణుడు కొంత మేర కరుణిస్తే వ్యవసాయ పనులు సాఫీగా సాగవని రైతాంగం భావిస్తోంది. అయితే ఏ మేరకు కర్షకుల ఆశలపై వర్షం కరుణిస్తోందో వేచి చూడాల్సిందే.
-కర్షకుల్లో నైరాశ్యం
english title:
r
Date:
Monday, August 19, 2013