న్యూఢిల్లీ, ఆగస్టు 19: పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టి చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతో పాటు బిజెపి సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ, శాసనసభాపక్ష నాయకుడు లక్ష్మీనారాయణ తదితరులు హాజరయ్యారు. దేశంలోని 70 కోట్ల మంది బిసిలకు రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులను కల్పించకుండా ప్రధుత్వం అన్యాయం చేస్తోందని కృష్ణయ్య విమర్శించారు. బిసిల అభ్యున్నతికి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. జాతీయ బిసి కమీసన్‌కు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించి క్రీమీ లేయర్ నిబంధనను ఎత్తివేయాలని ఆయన కోరారు. రాజకీయంగా వెనుక బడిన తరగతుల వారికి విపరీతమైన అన్యాయం జరుగుతుంటే రాజకీయ పార్టీలు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలోని 18 రాష్ట్రాల నుంచి ఒక్క బిసి ఎంపీ లేడని ఆయన అన్నారు. వెనుక బడిన తరగతుల సంక్షేమానికి కేటాయించిన 700 కోట్ల రూపాయలు ఏ మూలకూ సరిపోవని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి వెనుక బడిన తరగతుల వారికి అన్యాయం జరుగకుండా చూడాలని, లేని పక్షంలో తీవ్ర మూల్యం చెల్లించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్, ఆల్‌మెన్‌రాజు, మల్లేష్ యాదవ్, అశోక్‌గౌడ్ తదితరులు ప్రసంగించారు. (చిత్రం) చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ బిసి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
సోమవారం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న ఆర్.కృష్ణయ్య, బిజెపి నేత బండారు దత్తాత్రేయ తదితరులు
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బిసి సంక్షేమ సంఘం ధర్నా
english title:
gc welfare
Date:
Tuesday, August 20, 2013