న్యూఢిల్లీ, ఆగస్టు 19: తెలంగాణ ఏర్పాటు దాదాపు ఖాయమైపోయినందున ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిపోకుండా తగిన చర్యలు తీసుకుని రెండు ప్రాంతాలకు సమాన న్యాయం చేయవలసిన బాధ్యత కేంద్రంపై ఉందని సిపిఎం ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌కారత్ అన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాలను పరిరక్షించుకోవాలన్న సంకుచిత ధోరణితో కాంగ్రెస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో ఉద్యమాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయని ఆయన సోమవారం ఇక్కడ విలేఖరులతో చెప్పారు. భాషా ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాల విభజనకు తమ పార్టీ వ్యతిరేకమని ఆయన పునరుద్ఘాటించారు. ‘్భషా ప్రాతిపదికపై ఆవిర్భవించిన ఆంధ్రప్రదేశ్‌ను రెండుగా విభజించాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయానికి కార్యరూపం ఇవ్వటానికి ప్రభుత్వం తీసుకునే చర్యలకు పార్లమెంటులో అత్యధిక పార్టీలు మద్దతు తెలియచేస్తున్నందున తెలంగాణ రావటం ఖాయం.’ అని ఆయన చెప్పారు. అయితే తెలంగాణ ఏర్పడిన తరువాత భవిష్యత్తులో భాషా ప్రాతిపదికపై ఏర్పడిన రాష్ట్రాల విభజనకు ప్రభుత్వం స్వస్తి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణను ఇవ్వాలన్న నిర్ణయం వెలువడగానే దేశంలోని అనేక ప్రాంతాలలో ప్రత్యేక రాష్ట్రాల కోసం ఆందోళనలు మొదలయ్యాయని గుర్తుచేశారు. ఈ ఆందోళనలకు ప్రభుత్వం తలవంచితే ఫెడరల్ వ్యవస్థకే ముప్పు తప్పదని హెచ్చరించారు. ఇదిలావుంటే రానున్న ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకునే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోతుందని అనుకుంటున్నందున రెండు రాష్ట్రాలు ఏర్పడేంతవరకూ వేచి చూస్తామని ఆయన చెప్పారు. రెండురోజులపాటు జరిగిన తమ పార్టీ కేంద్ర కమిటీ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక పరిస్థితులపై చర్చించిందని ఆయన తెలియచేశారు.
డాలర్ విలువతో పోల్చితే రూపాయి విలువ 62కు పడిపోవటం తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందన్నారు. ఆర్థిక సంక్షోభం, పెరిగిపోతున్న కరెంట్ ఖాతా లోటు నుంచి బయటపడేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సాధించటానికి చేస్తున్న ప్రయత్నాల వల్ల పరిస్థితి మెరుగుపడదని ఆయన చెప్పారు. బహుళ జాతి సంస్థలు, కార్పొరేట్ సంస్థలకు లక్షల కోట్ల రూపాయలలో రాయితీలను ఇవ్వటం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని ఆరోపించారు. రావలసిన పన్నులను సమర్థవంతంగా వసూలు చేస్తే పరిస్థితి మెరుగుపడుతుందని ఆయన సూచించారు. ఆర్థిక విధానాల విషయంలో కాంగ్రెస్, బిజెపి మధ్య పెద్ద తేడా లేదని ఆయన వ్యాఖ్యానించారు.
సిపిఎం నేత ప్రకాష్ కారత్
english title:
karat
Date:
Tuesday, August 20, 2013