న్యూఢిల్లీ, ఆగస్టు 19: పాకిస్తాన్ గూఢచార సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్‌ఐ) మాజీ చీఫ్ హమీద్ గుల్‌ను తరచూ కలిసే వాడినని, 1995లో ఆయనతో జరిపిన భేటీ అనంతరం ఐఎస్‌ఐతో తనకు సంబంధాలు ఏర్పడ్డాయని పాక్ తీవ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన కరడు గట్టిన ఉగ్రవాది, బాంబుల తయారీ నిపుణుడు అబ్దుల్ కరీమ్ తుండా (70) ఇంటరాగేషన్‌లో వెల్లడించాడు. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు అత్యంత సన్నిహిత సహచరుడైన తుండా సౌదీ అరేబియా మీదుగా పాకిస్తాన్ చేరుకుని అక్కడ హమీద్ గుల్‌ను కలుసుకున్నాడని ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా వంటి అనేక తీవ్రవాద సంస్థలు ఐఎస్‌ఐ ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయని, వీటన్నింటికీ ఐఎస్‌ఐ అధికారిక సంస్థగా వ్యవహరిస్తోందని, ఐఎస్‌ఐ అధికారులు ఈ తీవ్రవాద సంస్థలను సామాజిక సంస్థలుగా పిలుస్తారని తుండా స్పష్టం చేసినట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు. తాను పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు ఐఎస్‌ఐతో పాటు లష్కరే తోయిబా, జైష్ ఎ మహ్మద్, ఇండియన్ ముజాహిదీన్, బబ్బర్ ఖల్సా వంటి తీవ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నానని, హఫీజ్ సయ్యద్, వౌలానా మసూద్ అజర్, జకీయుర్ రెహ్మాన్ లఖ్వీ, దావూద్ ఇబ్రహీం వంటి వ్యక్తులతో పాటు భారత్ ఎంతో కాలం నుంచి వెతుకుతున్న అనేకమందిని కలిశానని పోలీసులకు తుండా వివరించాడు. ప్రస్తుతం లష్కరే తోయిబా తీవ్రవాదుల్లో ఎక్కువ మంది పంజాబీలే ఉన్నారని, వీరికి ప్రతి నెలా 3 వేల నుంచి 4 వేల రూపాయల వేతనం చెల్లిస్తున్నారని తుండా వెల్లడించినట్టు సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే తుండా వెల్లడించిన విషయాలను హమీద్ గుల్ తోసిపుచ్చాడు. 1989లో తాను ఐఎస్‌ఐ నుంచి రిటైర్ అయ్యానని, 1995లో తనతో పరిచయం ఏర్పడినట్టు తుండా చెబుతున్నాడని, అప్పటికే తాను సర్వీసు నుంచి రిటైర్ అయ్యానని గుల్ బుకాయిస్తున్నాడు.
హమీద్ గుల్‌తో తరచూ భేటీలు హఫీజ్, దావూద్ సహా ఎంతో మందిని కలిశా ఇంటరాగేషన్‌లో తుండా వెల్లడి
english title:
isa mother of all outfits
Date:
Tuesday, August 20, 2013