న్యూఢిల్లీ, ఆగస్టు 19: కేంద్రంలోని యుపిఎ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైనదిగా పరిగణిస్తున్న ఆహార భద్రత బిల్లుకు పార్లమెంట్‌లో ఆమోదముద్ర వేయించాలని పట్టుదలతో ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వీలుగా మంగళవారం ఈ బిల్లుపై లోక్‌సభలో చర్చ జరిపేందుకు ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేశారు. దీంతో పాటు రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ప్రతి రోజూ పోడియం వద్ద గొడవ చేస్తున్న నలుగురు తెలుగుదేశం పార్టీ సభ్యులను అసరమైతే సభ నుండి పంపేయాలని కాగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తోంది. లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ సోమవారం తన చాంబర్‌లో అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆహార భద్రత బిల్లుపై మంగళవారం సభలో చర్చించడం గురించి సమాలోచనలు జరిపారు. ఈ బిల్లుపై చర్చ జరిపేందుకు వీలుగా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఆమె అఖిలపక్ష నాయకులకు వివరించారు.
మంగళవారం సభలో గొడవ చేయవద్దని ఆమె తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు నామా నాగేశ్వరరావును కోరారు. రాష్ట్ర విభజన వలన తమ ప్రాంతానికి జరిగే నష్టాన్ని సభ దృష్టికి తీసుకువచ్చేందుకు సీమాంధ్రకు చెందిన నలుగురు టిడిపి ఎంపీలు సభలో నిరసన తెలుపుతున్నారని నామా నాగేశ్వరరావు వారికి వివరించారు. ఆయన వాదన విన్న అనంతరం మీరాకుమార్ మాట్లాడుతూ, రాజ్యసభలో తెలంగాణపై చర్చ అనంతరం టిడిపి సభ్యులు తమ నిరసనను ఉపసంహరించుకున్నారని, ఇదేవిధంగా లోక్‌సభలో కూడా తెలంగాణపై చర్చకు అనుమతి ఇస్తే నిరసనలు మానేస్తారా? అని ప్రశ్నించారు. దీనికి నామా నాగేశ్వరరావు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు.
రాజ్యసభ సాఫీగా కొనసాగుతోందని, లోక్‌సభలో మాత్రం తెలంగాణపై గొడవ చేయడం ఎంత వరకు సబబని మీరాకుమార్ ప్రశ్నించారు. ఆహార భద్రత బిల్లుకు అడ్డుతగిలితే టిడిపి సభ్యులను సభ నుండి పంపేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుతోందని ఆమె నామా నాగేశ్వరరావుకు చెప్పారు. అయితే రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జరుపుతున్న ఉద్యమం ఆగబోదని నామా నాగేశ్వరరావు ఈ సమావేశంలో స్పష్టం చేసినట్టు తెలిసింది. టిడిపి సభ్యులు సభలో ఎంత గొడవ చేసినా ఆహార భద్రత బిల్లుపై చర్చ జరిపి ఆమోదించాలని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయించారు. లోక్‌సభలో ఆహార భద్రత బిల్లు ఆమోదం పొందిన వెంటనే దానిని రాజ్యసభకు పంపి వీలైనంత త్వరగా ఆమోదం తీసుకుంటారు.
ప్రశ్నోత్తరాల కార్యక్రమం రద్దు అఖిలపక్ష నేతలకు స్పీకర్ స్పష్టీకరణ అవసరమైతే టిడిపి సభ్యుల గెంటివేత
english title:
lok sabha
Date:
Tuesday, August 20, 2013