కడప, ఆగస్టు 19: ఇటు ఇంజనీరింగ్ ప్రవేశానికి సంబంధించిన ఎంసెట్, అటు భాషా పండితుల ఎంపికకు సంబంధించిన ఎల్పీసెట్ కౌనె్సలింగ్‌ల ప్రక్రియ సోమవారం నిలిచిపోయాయి. కడప, ప్రొద్దుటూరు తదితర ప్రాంతాల్లో వివిధ తెలుగుపండింట్, హిందీ పండింట్ శిక్షణా కళాశాలలో శిక్షణ పొందేందుకు ఎల్‌పిసెట్‌లో ఉత్తీర్ణులైన వారికి రాయచోటి డైట్‌లో రెండు రోజులుగా కౌనె్సలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఇందులోభాగంగా జిల్లా కన్వీనర్, డైట్ ప్రిన్సిపాల్ రామాంజనేయులు ఆది, సోమవారాల్లో డైట్‌లోని కౌనె్సలింగ్ సెంటర్‌కు వెళ్లారు. కౌన్సిలింగ్ అధికారులు, సిబ్బంది గైర్హాజరవడంతో ప్రక్రియ నిలిచిపోయింది. 850 మంది అడ్మిషన్లు పొందాల్సి ఉండగా కేవలం ఆరుగురు మాత్రమే కౌనె్సలింగ్ కేంద్రానికి వచ్చారు. చివరకు వారు కూడా కన్వీనర్‌కు టాటా చెప్పి సమైక్యాంధ్ర జిందాబాద్ అంటూ అక్కడి నుంచి నిష్కృమించారు.
ఎంసెట్ కౌనె్సలింగ్ కేంద్రాలకు తాళాలు
సోమవారం నుంచి జరగాల్సిన ఎంసెట్ కౌనె్సలింగ్‌కు కూడా ముందు నుంచి ఊహించిన విధంగానే సమైక్యసెగ తగిలింది. కౌనె్సలింగ్ ప్రక్రియను ప్రభుత్వ పాలిటెక్నిక్ అధికారులు, సిబ్బంది బహిష్కరించారు. కడప, ప్రొద్దుటూరు ప్రభుత్వం పాలిటెక్నిక్ కళాశాలలకు సమైక్యాంధ్ర జెఎసి నేతలు, ఎన్జీవో నేతలు, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కౌన్సిలింగ్ నిర్వహించే సెంటర్లకు తాళాలు వేశారు. కౌనె్సలింగ్‌కు హాజరుకావాల్సిన విద్యార్థులు కూడా సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా స్వచ్ఛందంగా గైర్హాజరయ్యారు. ఇంజనీరింగ్ కౌనె్సలింగ్ వాయిదా వేసే ప్రసక్తే లేదని సాంకేతిక శాఖామంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ అట్టహాసంగా చేసిన ప్రకటనను విద్యార్థులు, ఉద్యోగులు బేఖాతరు చేశారు. కౌనె్సలింగ్ నిర్వాహకులు, సిబ్బంది ప్రక్రియను బహిష్కరించారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి 25 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. కౌనె్సలింగ్ నిర్వహణపై జెఎన్‌టియు ఎంసెట్ కన్వీనర్, ఉన్నత విద్యామండలి అధికారులు ఏదోవిధంగా కౌనె్సలింగ్ నిర్వహించాలని ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాళ్లకు, అధ్యాపకులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. సిబ్బంది, ఉద్యోగులు, అధికారులుఅందుబాటులో లేకపోతే ఔట్ సోర్సింగ్ సిబ్బంది ద్వారా కౌనె్సలింగ్ నిర్వహించాలని ఆదేశించారు. అయితే కౌనె్సలింగ్‌కు హాజరుకావద్దని సమైక్యాంధ్ర జెఏసి ఉద్యమ నేతలు విద్యార్థులతోపాటు నిర్వాహకులకు పిలుపునిచ్చారు. ఎలాగైనా కౌనె్సలింగ్ జరపాలని సంబంధిత సెంటర్ల వద్ద భారీ పోలీసు బలగాలను మోహరించారు. చివరకు సమైక్యాంధ్ర ఉద్యమ సెగతో కౌనె్సలింగ్ నిలిచిపోయింది.
కాలుష్య నివారణకు కదలిరండి
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 19:ప్రతి ఇంట్లో కనీసం ఒక చెట్టు పెంచి కాలుష్య నివారణకు దోహదపడాలని కలెక్టర్ కోన శశిధర్ ప్రజలకు పిలుపునిచ్చారు. 64వ వనమహోత్స కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం నగరంలో రిమ్స్ సమీపంలో ఉన్న వైఎస్సార్ క్రీడా పాఠశాల ఆవరణంలో జిల్లా కలెక్టర్ మొక్కలు నాటి నీరు పోశారు. వారితోపాటు సిసిఎఫ్ అడీచప్ప, కడప డివిజనల్ అటవీ అధికారి శివాని డోగ్రా, ఫ్లయింగ్ స్క్వాడ్ డిఎఫ్‌వో నాగరాజు, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ సిద్దప్ప గౌరవ్, క్రీడాపాఠశాల విద్యార్థులు మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వృక్షోరక్షతి రక్షితః అన్న పెద్దల నానుడిని ఆచరణాత్మకం చేయాలన్నారు. వృక్షాలను మనం పెంచి రక్షించకుంటే మానవాళి మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్నారు. కడప నగరం చుట్టుపక్కల చెట్లు తక్కువగా ఉన్నాయన్నారు. నగరంతోపాటు జిల్లా అంతటా మొక్కలను పెద్ద ఎత్తున పెంచడం ద్వారా పచ్చదనం పెంపొందించాలన్నారు. ఇప్పటికే రిమ్స్ ప్రాంతంలో 7 హెకార్టర్లలో మొక్కలను పెంపకం జరుగుతోందన్నారు. ఇంకా 9 హెక్టార్లలో మొక్కలుపెంచాలని నిర్ణయించామన్నారు. క్రీడా పాఠశాలల ఆవరణంలో 1200 మొక్కలు సోమవారం నాటి వాటి సంరక్షణ బాధ్యత చేపట్టామన్నారు. అటవీశాఖ ద్వారా ప్రతి ఇంటికి ఒక మొక్క అందచేస్తామన్నారు. ఆ మొక్కలను జాగ్రత్తగా పెంచి కాలుష్య నివారణలకు తోడ్పడాలన్నారు. ఒక మనిషి సగటున రెండు ఎకరాలలో చెట్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి మనిషి వదిలే కార్బన్‌డయాక్సైడ్ వల్ల సంభవించే కాలుష్యం తొలగించాలంటే ఇంటి ఆవరణంలో చెట్లు తప్పనిసరిగా పెంచాలన్నారు. అటవీశాఖ, పురపాలక శాఖలు, సంయుక్తంగా చెట్లు పెంపకానాకి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ముఖ్య అటవీసంరక్షణ అధికారి (సిపిఎఫ్) అడితప్ప, నాగరాజు, రిమ్స్ డైరెక్టర్ సిద్దప్పగౌరవ్, మున్సిపల్ కమిషనర్ చంద్రవౌళీశ్వర్‌రెడ్డి, రహదారుల భవనాలశాఖ ఎస్‌ఇ మనోహర్‌రెడ్డి, క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి రామచంద్రారెడ్డి, అటవీశాఖ అధికారులు మహ్మద్ హయాత్, బాలనరసయ్య, శ్రీనివాస్, క్రీడా పాఠశాల విద్యార్థులు, డాక్టర్లు పాల్గొన్నారు.
తాగునీటి సమస్యల పట్ల
అధికారులు స్పందించాలి
ఆంధ్రభూమి బ్యూరో
కడప, ఆగస్టు 19: జిల్లాలోని గ్రామాల్లో తాగునీటి సమస్యల పట్ల తక్షణమే అధికారులు స్పందించి పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ కె నిర్మల అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్‌లోని సభా భవనంలో జెసి, డిఆర్వోతో కలసి డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్వీకరించిన ఫోన్స్‌కాల్స్ వివరాలు ఇలా ఉన్నాయి. గాలివీడు మండలం ప్యారంపల్లె గ్రామానికి చెందిన డాక్టర్ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలో అన్ని బోర్లు ఎండి పోయాయని, పశువులు, గొర్రెలు తాగునీరు లేక చాల ఇబ్బందిగా ఉందని ఎస్సీ, ఎస్టీ కాలనీలకు సొంత డబ్బుతో నీరు తరలిస్తున్నామని నీటి సమస్యల పరిష్కరించాలన్నారు. బద్వేల్‌కు చెందిన స్వర్ణప్రసాద్ మాట్లాడుతూ జంతు వధశాలను వేరేచోటికి తరలించాలని చాలసార్లు చెప్పినా ఫలితం లేదని ఇకనైనా తరలించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.
ఆచూకీ దొరకని మృతదేహాలు
కమలాపురం, ఆగస్టు 19: వల్లూరు మండలం ఆదినియ్మాయపల్లె ఆనకట్ట వద్ద ఆదివారం గల్లంతై మృతిచెందిన హైదరాబాద్‌కు చెందిన తండ్రి కొడుకులు అనిజ్,సుభాని మృతదేహాల కోసం సోమవారం గజ ఈతగాళ్లతో చెన్నూరు వరకు గాలింపు చర్యలు చేపట్టినట్లు యస్. ఐ. తెలిపారు. గత రాత్రి నదిలో ప్రవాహ ఉదృతి అధికంగా ఉండడంతో ఆర్డీవో వీరబ్రహ్మం ఆదేశాల మేరకు తాసీల్దార్ రాంభూపాల్‌రెడ్డి గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చేపట్టినప్పటికి శవాల లభ్యం కాలేదని మంగళవారం కూడా గాలింపు కొనసాగిస్తామని ఎస్సై తెలిపారు. ఇలా ఉండగా సోమవారం ఓ రైతు ఆనకట్ట వద్ద ఎద్దులబండిని ఆపి శుభ్రం చేస్తుండగా ఎద్దులు,బండి నీట కొట్టుకుపోయి ఎద్దులు మృతి చెందాయి. ఐతే రైతు వాటిని కాపాడెందుకు వెళ్లి ప్రమాద స్థితిలో పడగా స్థానికులు అతనిని కాపాడారు. ఆనకట్ట వద్ద పోలీసులను నియమించినట్లు ఎస్సై వివరించారు.
విభజిస్తే ఊరుకోం
ఒంటిమిట్ట, ఆగస్టు 19:సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం ఒంటిమిట్టలో జెఏసీ నాయకులు కదం తొక్కారు. ఈ సందర్భంగా రోడ్లపైనే వంటావార్పును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బ్రహ్మయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధికార దాహంతో రాష్ట్ర విభజనకు పాల్పడితే ఊరుకోమన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వంటావార్పు నిర్వహించిన జెఏసీ నాయకులను ఆయన అభినందించారు. అనంతరం మండల వైకాపా నాయకులు వేణుగోపాలరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం విభజన జరగకుండా ఉంటేనే అభివృద్ధి తథ్యమన్నారు. ఈ ఆందోళనలో ప్రజలు స్వచ్ఛంధంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. టిడిపి మండల అధ్యక్షులు కొమరా వెంకటనరసయ్య మాట్లాడుతూ ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించడంతో పాటు కలసివున్న రాష్ట్రాన్ని విడగొట్టే హక్కు సోనియాగాంధీకి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ హైకమాండ్ తన పంథాను మార్చుకోకుంటే అందరి సహకారంతో ఇలాంటి కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జెఏసీ నాయకులు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, బొబ్బిలి రాయుడులు మాట్లాడుతూ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలపై ధ్వజమెత్తారు. అంతకు ముందు సోనియా, కెసిఆర్‌ల కటౌట్లు పట్టుకుని ప్రభుత్వ వైఖరికి నిరసనగా బస్టాండ్ నుండి పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించి సహఫంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని హైవేలో నిర్వహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
ఆగని ఆమరణ దీక్షలు
కడప (అర్బన్), ఆగస్టు 19: సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా కడప నగరంలో వైకాపా రాయచోటి ఎమ్మెల్యే జి శ్రీకాంత్‌రెడ్డి, కడప మాజీ మేయర్ పి రవీంద్రనాథ్‌రెడ్డిలు ఐదు రోజులుగా నిర్వహిస్తున్న ఆమరణ నిరాహార దీక్షలను పోలీసులు భగ్నం చేశారు. ఆదివారం రాత్రి వారిని రిమ్స్‌కు తరలించారు. అయినా ఇద్దరూ రిమ్స్‌లో సోమవారం కూడా దీక్ష కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా కడప కలెక్టరేట్ ఎదుట వైకాపా, కడప పార్లమెంటరీ ఇన్‌చార్జి వై అవినాష్‌రెడ్డి, రైతు సంఘాలు ఆమరణ నిరాహార దీక్షలు చేపట్టారు. గత నాలుగు రోజులుగా రాజంపేట వైకాపా ఎమ్మెల్యే ఎ అమర్‌నాథ్‌రెడ్డి, రైల్వేకోడూరు వైకాపా ఎమ్మెల్యే కె శ్రీనివాసులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రాస్తారోకోలు, రిలే దీక్షలు, మానవహారాలు, బంద్‌లు సోమవారం కూడా కొనసాగాయి. న్యాయవాదులు న్యాయ స్థానాల ఎదుట రిలే దీక్షలు చేపట్టగా జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో తహసీల్దార్లతో సహా ఎన్జీవోలు, సమైక్యాంధ్ర జెఎసి, విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, మెడికల్ సిబ్బంది రిలే దీక్షలు చేపట్టారు. కర్నూలు- చిత్తూరు జాతీయ రహదారి జిల్లా పొడవునా ఆందోళన కారులు బైఠాయించి వంటావార్పూ కార్యక్రమాలు నిర్వహించారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి సంబంధించి జానపద బాణీలో పాటలు పాడి నృత్యాలు చేశారు. జిల్లా వ్యాప్తంగా వైకాపా శ్రేణులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి కార్యాచరణ అమలు చేస్తున్నాయి. సోమవారం కమలాపురం తెలుగుదేశం పార్టీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి చెన్నూరు జాతీయ రహదారిపై భారీ ఎత్తున ఉద్యమకారులను వెంటపెట్టుకొని వచ్చి వంటావార్పు నిర్వహించారు. సాయంత్రం వరకు జాతీయ రహదారిపై రాకపోకలను అడ్డుకున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీలకు చెందిన నేతలు, ముఖ్యంగా ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల అధికారులు, సిబ్బంది, కార్మికులు సోమవారం పెద్ద ఎత్తున్న నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ఇదిలావుండగా కడప నగరంతోపాటు ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, బద్వేల్, కమలాపురం, రాయచోటి, మైదుకూరు, పులివెందుల తదితర ప్రాంతాల్లో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. జిల్లా వ్యాప్తంగా జాతీయ రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రభుత్వ శాఖల ఉద్యోగులంతా ఉద్యమంలో ఉండడంతో కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కాగా అధికారులు పాల్గొనడంతో ఉద్యోగులు ఉద్యమాన్ని వేడెక్కిస్తున్నారు.
విధులను బహిష్కరించిన న్యాయవాదులు
కమలాపురం, ఆగస్టు19: రాష్ట్రంలో జరుగుతున్న సమైక్యాంధ్రా ఉద్యమాన్ని బలపరుస్తూ స్థానిక బార్ అసోషియేన్ అధ్యక్షుడు బి.నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో న్యాయవాదులు సోమవారం తమ విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు నారాయణరెడ్డి మాట్లాడుతూ సమైక్యాంధ్రా విషయంపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన ఇచ్చే వరకు తమ విధులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏకపక్షంగా ఇలా రాష్ట్రాన్ని విభజించడం వల్ల ఉద్యమం చెలరేగి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉద్యమం బాట పట్టడం వల్ల రాష్ట్రంలో పాలన స్థంభించి పోయిందన్నారు. కోర్టు కార్యకలాపాలు కూడా స్థంభించాయన్నారు. కోర్టు పరిపాలనా శాఖ ఉద్యోగులు కూడా సమ్మెబాట పట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు రామచంద్రుడు,పుష్పరాజ్,మహేశ్వర రెడ్డి,శ్రీనివాసులు,గురవయ్య,సుబ్బారెడ్డి,రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.
విజయమ్మకు దీక్షచేసే హక్కులేదు
ఖాజీపేట, ఆగస్టు 19: రాష్ట్ర విభజనకు అంకురార్పణ చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అని ఈ నేపథ్యంలో ఆయన సతీమణి విజయమ్మకు ఆమరణ నిరాహారదీక్ష చేసే నైతిక హక్కు ఎక్కడిదని టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి సూటిగా ప్రశ్నించారు. ఖాజీపేటలో విలేఖరులతో మాట్లాడుతూ 2009లోనే రాష్ట్రం నుండి తెలంగాణను విభజించాలని అప్పటి సిఎల్పీ నేత వైఎస్ మద్దతుతో శాసన సభ్యుడు చిన్నారెడ్డి నాయకత్వంలో సోనియాగాంధీకి లేఖ పంపి తెలంగాణ విభజనకు బీజం వేశారన్నారు. అధికార దాహంతో వైఎస్ రాష్ట్ర విభజనకు శ్రీకారం చుట్టారన్నా రు. నేడు సమైక్య రాష్ట్రం అంటూ కొత్త డ్రామాను వైఎస్ విజయమ్మ తెర మీది కి తెస్తున్నారన్నారు. సమైక్య రాష్ట్రం పేరుతో ముందుగా వైకాపాకు చెందిన 16 మంది శాసన సభ్యులు రాజీనామా చేసిన ఆడిన నాటకం బెడిసి కొట్టి తెలంగాణలో ఆ పార్టీ తుడిచిపెట్టుకుపోయిందన్నారు. ఇరుప్రాంతాలకు సమన్యాయం చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు ప్రధానికి లేఖ రాస్తే వ్యతిరేకించిన వైకాపా ఇప్పుడదే డిమాండ్‌తో దీక్షకు పూనుకోవడం ఏమిటన్నారు. రాష్ట్ర విభజన విషయంలో తెదేపాపై అభాండాలు వేయ డం తగదన్నారు. సమావేశంలో బండి వెంకటేష్, చంద్రశేఖర్‌రెడ్డి, రఘురామిరెడ్డి, బైరెడ్డిలు పాల్గొన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అడ్రస్స్ గల్లంతు
రైల్వేకోడూరు, ఆగస్టు 19:రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతు కావడం తథ్యమని డిసిసిబి మాజీ చైర్మన్, వైకాపా సీనియర్ నాయకులు కొల్లం బ్రహ్మనందరెడ్డి అన్నారు. సోమవారం ఎమ్మెల్యే కొరముట్ల దీక్షా శిబిరంలో ఆయన మాట్లాడారు. ఓట్లు, సీట్లు కోసం సోనియాగాంధీ టిఆర్‌ఎస్ నాయకులతో చేతులు కలపడం వల్లే నేడు రాష్ట్ర విభజనకు ప్రధాన కారణమైందని ఆరోపించారు. సోనియాగాంధీ కుటిల రాజకీయాలతో నిన్నా, మొన్నటి వరకు ఆనందంగా ఉన్న తెలుగు ప్రజల మధ్య ఇలాంటి చిచ్చు రేగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకుంటే ప్రజలే ఉద్యమకారులై ఈ ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తారన్నారు. ఈ సమావేశంలో వైకాపా నాయకులు మంగంపేట రమణారెడ్డి, సాయికిషోర్‌రెడ్డి, వెంకట్రాజు, మారె వెంకటయ్య, అన్వర్‌బాషా, చెవ్వు శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కడప - కర్నూలు జాతీయ రహదారి దిగ్బంధం
చెన్నూరు, ఆగస్టు 19: కడప - కర్నూలు జాతీయ రహదారిలోని చెన్నూరు కొత్త రోడ్డులో తెలుగుదేశం పార్టీ కమలాపురం నియోజక వర్గం ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి, చెన్నూరు మండల తెలుగుదేశం పార్టీ చెన్నూరు మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు. వాహనాలు కొండపేట, చెన్నూరు మధ్య వెళ్తుండడంతో ఆ దారిన కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డును దిగ్బంధనం చేశారు. వందలాది వాహనాలు ఇరువైపులా బారులు తీసి నిలిచిపోయాయి. చెన్నూరు కొత్త రోడ్డులో పుత్తా నరసింహారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు ఐ. శివారెడ్డి, భాస్కర్, ఖాజాహుస్సేన్, అనే మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. సమైక్యాంధ్ర జై అంటూ నినాదాలు చేశారు. పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్రాన్ని ముక్కలు చేయకుండా సమైక్యాంధ్రగానే ఉంచాలని సూచించారు. మధ్యాహ్నం వంటావార్పు నిర్వహించి అందరికీ భోజనాలు పెట్టారు.