అనంతపురం, ఆగస్టు 19 : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసన ర్యాలీలు, ప్రదర్శనలు, దిష్టిబొమ్మల దహనాలు, దీక్షలతో సోమవారం జిల్లా అట్టుడికింది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదుల సమ్మె, ర్యాలీలతో ఉద్యమం ఉగ్రరూపం దాల్చింది. వారికి మద్దతుగా నినదించే వారి సంఖ్య రోజురోజుకూ అధికమవుతోంది. జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ప్రారంభమై 20 రోజులవగా మొదటి రోజు ఉద్యమ వేడి ఎలా ఉందో నేటికీ అదే పరిస్థితి ఉండడం గమనార్హం. ప్రతి రోజూ ఒక్కో కులానికి చెందిన ప్రజలు, కళాకారులు, కవులు, వివిధ కాలనీలు, అపార్టుమెంట్లకు చెందిన వివిధ వర్గాల ప్రజలు ఉద్యమంలో భాగాస్వాములవుతున్నారు. సోమవారం కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమం కావడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. ఇక నగరంలో ప్రధాన కూడళ్లయిన సప్తగిరి సర్కిల్, రఘువీరా టవర్స్, క్లాక్ టవర్, ఆర్ట్స్ కళాశాల ప్రాంగణం, శ్రీకంఠం సర్కిల్, సూర్యనగర్ సర్కిల్‌లు సమైక్యవాదుల ర్యాలీలు, నిరసనలతో కిక్కిరిసిపోయాయి. విద్యుత్ శాఖ ఉద్యోగులు, సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని ర్యాలీ చేపట్టారు. వీరితో పాటు వివిధ కళ్యాణ మండపాలకు చెందిన సిబ్బంది, బి.ఎడ్, డి.ఎడ్ అధ్యాపకుల బృందం, రఘువీరా టవర్స్ కాంప్లెక్స్‌కు చెందిన వివిధ వ్యాపార, వాణిజ్య సముదాయాల యజమానులు, సిబ్బంది వేర్వేరుగా ర్యాలీ నిర్వహించారు. వివిధ కాలనీలకు చెందిన మహిళలు, ఇస్‌క్రీం బండ్ల వ్యాపారులు, న్యాయశాఖ ఉద్యోగులు, హంద్రీనీవా సుజల స్రవంతి ఉద్యోగులు, ప్రైవేట్ బస్సుల యజమానుల సంఘం బస్సులతో సహా ర్యాలీ నిర్వహించారు. వీరితో పాటు కుమ్మర సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై కుండలు తయారు చేస్తూ, లంబాడీలు నృత్యం చేస్తూ, కోలాటం ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఇక రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో సంఘం ప్రధాన కార్యదర్శి జయరామప్ప శ్రీకృష్ణదేవరాయలు వేషధారణలో, మరో ఉద్యోగి అల్లూరి సీతారామరాజు వేషధారణలో ర్యాలీలో పాల్గొని నిరసనను వ్యక్తం చేశారు. ఇలా ఉదయం నుంచే అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలోని కదిరి, తాడిపత్రి, మడకశిర, హిందూపురం, ధర్మవరం, రాప్తాడు, ఉరవకొండ, గుత్తి, గుంతకల్లులలో కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు, ర్యాలీలు, దీక్షలు కొనసాగాయి. సోమవారం నిర్వహించిన ర్యాలీలు, నిరసన ప్రదర్శనల్లో గెజిటెడ్ ఆఫీసర్స్ సైతం పాల్గొనడం గమనార్హం. ఇలా జిల్లాలో గడచిన 20 రోజులుగా విద్యార్థి, ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాదులు, వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదిలా ఉండగా జిల్లా వ్యాప్తంగా మంగళవారం లక్ష మంది విద్యార్థులతో ర్యాలీ నిర్వహించనున్నారు.
విద్యార్థుల ర్యాలీకి
అనుమతి నిరాకరణ
* పోలీసుల హెచ్చరికతో వెనక్కితగ్గిన యాజమాన్యాలు
ఆంధ్రభూమిబ్యూరో
అనంతపురం, ఆగస్టు 19 : నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా మం గళవారం విద్యార్థులతో నిర్వహించతలపెట్టిన భారీ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. లక్ష మంది విద్యార్థులతో నగరంలో ర్యాలీ నిర్వహించాలని, అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ముఖ్య పట్టణా లు, మండల కేంద్రాల్లో భారీ ర్యాలీలు నిర్వహించాలని సమైక్యాంధ్ర విద్యార్థి, ఉపాధ్యాయ జెఎసిలు నిర్ణయించాయి. ర్యాలీలకు అనుమతి కోసం పోలీసులను సైతం ఆశ్రయించాయి. పెద్ద సంఖ్యలో విద్యా ర్థులు రోడ్లపైకి చేరుకుంటే వారిని అదుపు చేయడం కష్టమని భావిం చిన పోలీసులు ర్యాలీకి అనుమతి నిరాకరించారు. అయితే రెండు రోజులు ముందుగానే ఆయా ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్థానికంగా ఆయా పాఠశాలల యాజమాన్యాలను పిలిపించుకుని తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసినట్లు సమాచారం. మంగళవారం చేపడుతున్న ర్యాలీకి విద్యార్థులను తీసుకువచ్చారంటే విద్యార్థులతో పాటు మీపై కూడా లాఠీఛార్జి చేయాల్సి వస్తుందని, ఆ తరువాత జైలులో పెడతామని హెచ్చరించినట్లు సమాచారం. దీంతో పాఠశాలల యాజమాన్యాలు వెనక్కు తగ్గాయి. కొన్ని పాఠశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా పోలీసులు ఇదే విధమైన హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. అనవసరంగా తమ పిల్లలు పోలీసు కేసుల్లో ఇరుక్కుంటారన్న భయం విద్యార్థుల తల్లిదండ్రులను వెంటాడుతోంది. దీంతో వారు పిల్లలను పాఠశాలలకు పంపమని యాజమాన్యాలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే సోమవారం రాత్రి వరకు విద్యార్థుల ర్యాలీకి అనుమతి కోసం ఐకాసా నేతలు అన్ని ప్రయత్నాలు చేశారు. చివరకు విద్యార్థులు లేకుండానే ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ చేపట్టాలని నిర్ణయించారు. మరోవైపు పోలీసు శాఖ ఎక్కడికక్కడ పెద్దఎత్తున పోలీసు బలగాలను మోహరించింది.
ఆమరణ దీక్షలు ప్రారంభం
పుట్టపర్తి, ఆగస్టు 19 : సమైక్యాంధ్రకు మద్దతుగా జిల్లాలో పలువురు ఆమరణ దీక్షలు చేపట్టారు. అందులో పుట్టపర్తిలో ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, వైకాపా నేత డాక్టర్ హరికృష్ణ, రాయదుర్గంలో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి, తాడిపత్రిలో వైకాపా నేత పైలా నరసింహయ్య ఆమరణ నిరాహార దీక్షకు శ్రీకారం చుట్టారు. వీరికి పలువురు నాయకులు, జెఎసి నాయకులు, సంఘాలు సంఘీభావం తెలిపాయి.
సోనియా కడుపుతీపి కోసం రాష్ట్రాన్ని విడగొట్టిందని ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి ధ్వజమెత్తారు. సోమవారం విభజనను నిరసిస్తూ ఉదయం సత్యసాయి సమాధిని దర్శించి వేలాది మంది అభిమానుల మధ్య ఆమరణ దీక్ష చేపట్టారు. దీక్షకు సంఘీభావంగా దేశం ఎమ్మెల్యేలు పరిటాల సునీత, బికె పార్థసారది, అబ్దుల్ ఘనీ, పొలిట్‌బ్యూరో సభ్యులు కాలువ శ్రీనివాసులు, పేరం నాగిరెడ్డి, వెంకటరాముడు, మహాలక్ష్మి శ్రీనివాస్, సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లె మాట్లాడుతూ సోనియా తప్పిదం లక్షలాదిమంది తల్లుల కడుపుకోతకు కారణమైందన్నారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని ఢిల్లీ కోటలో ఎన్‌టిఆర్ చాటి సమైక్యంగా వుండాలని కోరారన్నారు. విభజన వల్ల సాగు, తాగునీరుతోపాటు ఉద్యోగాలు కోల్పోక తప్పదన్నారు. విభజనకు వైకాపా మూలమన్నారు. అంతకుమునుపు హాజరైన ఎమ్మెల్యేలు, నాయకులు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయక పల్లె ఆమరణ దీక్ష చేపట్టడం అభినందనీయమన్నారు. రాష్ట్రం ముక్కలు కావడానికి అన్ని పార్టీలు తప్పిదం చేశాయని, వైకాపా విజయమ్మ కూడా ఇడుపులపాయ ప్లీనరీలో తెలంగాణకు అనుకూల నిర్ణయాన్ని ప్రకటించారన్నారు. చంద్రబాబు హైటెక్ సిటీగా హైదరాబాద్‌ను తీర్చిదిద్ది లక్షల మందికి ఉపాధి కల్పించి అభివృద్ధిపరచారన్నారు. ఎస్మా ప్రయోగం ద్వారా ఉద్యోగుల ఉద్యమాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం చూస్తోందని వారికి అండగా నిలుస్తామన్నారు. పల్లె దీక్షకు మద్దతుగా మురారీ, వెంకటరాముడు, వెంకటసుబ్బయ్య, జై చంద్రమోహన్, గంగాద్రిలు సైతం దీక్షలో పాల్గొన్నారు. కాగా నియోజకవర్గం నలుమూలల నుండి వేలాది మంది పల్లెకు సంఘీభావం ప్రకటించారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్, కదిరి లాయర్ల సంఘం అధ్యక్షులు వాసుదేవరెడ్డి, పలువురు సర్పంచ్‌లు మాజీలు, నాయకులు పాల్గొన్నారు.
ప్రాణాలైనా అర్పిస్తా : కాపు భారతి
రాయదుర్గం : సమైక్యాంధ్ర కోసం ప్రాణాలైనా అర్పిస్తానని ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి సతీమణి కాపు భారతి స్పష్టం చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సోమవారం రాయదుర్గంలో ఆమె ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమైక్యాంధ్రకు మద్దతుగా వైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా తాను కూడా దీక్ష చేపట్టానని తెలిపారు. కేంద్రం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఉంచేలా ప్రకటన చేసేంత వరకూ దీక్ష కొనసాగిస్తానన్నారు.
పైలా ఆమరణ నిరాహారదీక్ష
తాడిపత్రి : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యాంధ్ర సాధనకై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు పైలా నరసింహయ్య సోమవారం ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. స్థానిక పోలీసు స్టేషన్ సర్కిల్‌లో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన పైలా నరసింహయ్య నాటకీయంగా అక్కడికక్కడే పొట్టి శ్రీరాములు విగ్రహం కింద రోడ్డుపై కూర్చొని ఆమరణ నిరాహార దీక్ష చేపట్టినట్లు ప్రకటించారు. ఈ సందర్బంగా పైలా మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావంగా తాను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టానని తెలిపారు.
ఎంసెట్ కౌనె్సలింగ్‌కు సమైక్య సెగ
* బహిష్కరించిన అధ్యాపకులు, సిబ్బంది
* ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
అనంతపురం సిటీ, ఆగస్టు 19 : నగరంలోని పాలిటెక్నిక్, ఎస్కేయూలో సోమవారం నిర్వహించ తలపెట్టిన ఎంసెట్ ఇంజినీరింగ్ కౌనె్సలింగ్‌కు సమైక్య సెగ తప్పలేదు. పాలిటెక్నిక్ కళాశాలలో అధ్యాపకులు, సిబ్బంది బహిష్కరించడంతో కౌనె్సలింగ్ ఆగిపోయింది. దీంతో విద్యార్థులు వెనుదిరిగారు. సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురంలోని పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ఎంసెట్ ఇంజినీరింగ్ కౌనె్సలింగ్‌ను బహిష్కరించి కళాశాల గేటు ముందు బైఠాయించి, తెలంగాణా వద్దు-సమైక్యాంధ్ర ముద్దు నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, సంఘం నాయకులు, కన్వీనర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజకీయ లబ్ది కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేయడం యుపిఎ ప్రభుత్వానికి తగదన్నారు. గత 20 రోజులుగా సీమాంధ్రలోని అన్ని ఉద్యోగ సంఘాలు, ప్రజలు ఉద్యమాలు చేస్తున్నా యుపిఎ నిర్లక్ష్యం వహించడం చాలా దారుణమన్నారు. రాష్ట్రాన్ని విభజించడానికి యుపిఎ ప్రభుత్వం చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంటే విధులకు హాజరవుతామన్నారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు. అలాగే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో కూడా కౌనె్సలింగ్ జరగాల్సి వుండగా అక్కడ సర్ట్ఫికెట్లు వెరిఫికేషన్ చేసే ప్రొఫెసర్లు, నాన్ టీచింగ్ స్ట్ఫా ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున, వారు ఎవరు కూడా సర్ట్ఫికెట్లు వెరిఫికేషన్‌కు హాజరుకాకపోవడంతో ఎంసెంట్ ఇంజినీరింగ్ కౌనె్సలింగ్ నిలిచిపోయింది. ఇంజినీరింగ్ కౌనె్సలింగ్‌కు చేరుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అభ్యర్థుల సర్ట్ఫికెట్లు పరిశీలన చేయాలని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సూర్యనారాయణను కోరారు. పాలిటిక్నెక్ కళాశాల అధ్యాపకులు, కన్వీనర్‌లు కళాశాలను మూసివేయడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు తిరిగి వెళ్లిపోయారు. జిల్లాలోని పాలిటెక్నిక్, ఎస్కేయూలో జరగాల్సిన ఇంజినీరింగ్ కౌనె్సలింగ్‌కు సమైక్యాంధ్ర ఉద్యమ సెగకు ఆగిపోయింది. పాలిటెక్నిక్ కళాశాల ఎంసెట్ ఇంజినీరింగ్ కౌనె్సలింగ్‌లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. మంగళవారం కూడా అధ్యాపకులు, సిబ్బంది ఎంసెట్ ఇంజినీరింగ్ కౌనె్సలింగ్ సర్ట్ఫికెట్ వెరిఫికేషన్‌లో పాల్గొనమని తెలిపారు.
అడ్డుకున్న ఎపిఎస్‌ఎఫ్
అనంతపురం సిటీ : ఎంసెట్ ఇంజినీరింగ్ కౌనె్సలింగ్‌ను ఎపిఎస్‌ఎఫ్ అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులు అడ్డుకున్నారు. సోమవారం స్థానిక పాలిటెక్నిక్ కళశాలలో నిర్వహించాల్సిన కౌనె్సలింగ్‌ను అడ్డుకుని ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి జెఎసి నాయకులు మల్లికార్జున, రమేష్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.
విభజన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేంత వరకూ ఉద్యమం
* వైఎస్ వివేకానందరెడ్డి
కదిరి, ఆగస్టు 19 : యుపిఎ ప్రభు త్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని రా ష్ట్రంలో అల్లకల్లోలాలు సృష్టించిందని, విభజన ప్రకటనను ఉపసంహరిం చుకునేంత వరకూ ఉద్యమం కొనసాగించాలని వైఎస్ వివేకానందరెడ్డి పి లుపునిచ్చారు. గుంటూరులో వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షకు మద్దతుగా సోమవారం కదిరిలోని ఇందిరా కూడలిలో జెసిబి ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్షా శిబిరాన్ని వివేకా సంద ర్శించారు. ఈ సందర్భంగా వివేకా మాట్లాడుతూ సాగు, తాగునీరు, విద్య, ఉద్యోగాలు తదితర సమస్యలపై స్పష్టమైన అభిప్రాయాలు తెలుసుకోకుండా కాంగ్రెస్‌పార్టీ ఏకపక్షంగా విభజన చేయడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన ప్రకటన వెలువడిన రోజు నుంచి సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం పార్టీలకతీతంగా జరుగుతుందని, ఈ ఉద్యమానికి మరింత బలం చేకూరే విధంగా విజయమ్మ గుంటూరులో దీక్ష చేపట్టిందని తెలిపారు. అంతకు ముందు ఆయన అంబేద్కర్ కూడలి లో కదిరి జెఎసి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో మాజీ మంత్రి మహమ్మద్ షాకీర్, మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్య, ఇస్మాయిల్, ఆరిఫ్‌అలి, వేమల ఫర్హానా ఫయాజ్, శాంతమ్మ, శివారెడ్డి, మాధురి రాజారెడ్డి, లింగాల లోకేశ్వర్‌రెడ్డి, బయప్ప, వేమల ఫయా జ్, బాషా, ఖాదర్‌బాషా, ఎహసాన్, అప్పల్ల వైకా పా అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట
ఆదర్శరైతు ఆత్మహత్యాయత్నం
విడపనకల్లు, ఆగస్టు 19: మండల పరిధిలోని కరకముక్కల గ్రామానికి చెందిన ఆదర్శరైతు బి.రమేష్ సోమవారం పాల్తూరు పోలీస్‌స్టేషన్ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పాల్తూరు ఎస్‌ఐ పి.జనార్ధన్‌నాయుడు తెలిపిన వివరాలు.. కరకముక్కల గ్రామంలో ఆదర్శరైతు రమేష్‌తో పాటు మరికొందరు యువకులు, చిన్నారులు వినాయక చవితి కోసం రోడ్డుకు అడ్డంగా తాడు పట్టుకుని చందాలు వసూలు చేస్తున్నట్లు సమాచారం అందిందని తెలిపారు. దీంతో కానిస్టేబుల్ వారి వద్దకు వెళ్లి ప్రమాదాలు జరుగుతాయని, పోలీస్‌స్టేషన్‌లోని ఎస్‌ఐ దగ్గరకు రావాలని ఆదర్శరైతు రమేష్‌కు తెలిపాడు. అయితే రమేష్ పోలీస్‌స్టేషన్ చేరుకుని క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అయితే ఈ విషయంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
ఘనంగా జిహ్వేశ్వర జయంతి
రాయదుర్గంరూరల్, ఆగస్టు 19 : పట్టణంలోని శ్రీహటకేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వకులశాళి సమాజ మూలపురుషుడు భగవాన్ శ్రీజిహ్వేశ్వర స్వామి జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. స్వామి వారి చిత్రపటాన్ని రథంపై ఉంచి పట్టణ పురవీధుల్లో డప్పు వాయిద్యాలు, భాజాభజంత్రీలతో ఊరేగించారు. సమాజ సత్రంలో ముత్తయిదువుల చేత స్వామి వారికి నామకరణం జరిగింది. సఫారే పురుషోత్తం స్వామి వారి చరిత్ర పురాణపఠనం చేశారు. ఈ సందర్భంగా హటకేశ్వరస్వామికి రుద్రాభిషేకం, జిహ్వేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమాజ విద్యావర్తక సంఘం కార్యదర్శి రామకృష్ణ సంఘం నివేదికను చదివారు. అనంతరం ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన ఆరుగురు విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతి అందజేశారు. అలాగే ఆలయంలో ప్రతి మంగళవారం భజన చేస్తున్న వారిని నూతన వస్త్రాలతో సత్కరించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో సమాజ అధ్యక్షులు సుందర్‌రావు, కార్యవర్గం సభ్యులు సుందర్‌రావు, సాయిప్రసాద్, శివకుమార్, శివానందమూర్తి, యువజన సంఘం సభ్యులు, రాజరాజేశ్వరి మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.
బాలిక దారుణ హత్య
కణేకల్లు, ఆగస్టు 19 : మండల పరిధిలోని హనకనహాల్ గ్రామంలో నివాసం వుండే హరిజన హనుమంతరాయుడు కుమార్తె శృతి (7) దారుణ హత్యకు గురైనట్లు రాయదుర్గం డీఎస్పీ మోహన్‌రావు, సిఐ భాస్కర్‌రెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాలు.. హనుమంతాయ్రుడు కుమా ర్తె శృతి ఆదివారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యా రు.