Quantcast
Channel: Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi
Viewing all articles
Browse latest Browse all 69482

హోరెత్తిన సమైక్య నినాదం

$
0
0

కర్నూలు, ఆగస్టు 19: జిల్లాలో సమైక్య నినాదం సోమవారం హోరెత్తింది. గత 19 రోజులుగా సాగుతున్న ఉద్యమం మరింత ఉధృతమై భారీ సంఖ్యలో సమైక్య వాదులు వీధికెక్కి తమ డిమాండ్‌ను సాధించుకోవడం కోసం పోరాటాన్ని సాగిస్తున్నారు. సమైక్య రాష్ట్రం కోరుతూ వైకాపా నేత, మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన రెడ్డి నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. దాదాపు అన్ని శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు ఎవరికి వారు ర్యాలీ నిర్వహిస్తూ కలెక్టర్ కార్యాలయం ఎదుట భారీ ధర్నా నిర్వహించడంతో ట్రాఫిక్ పూర్తి స్థాయిలో స్తంభించిపోయింది. ఇంజనీరింగ్ విద్యార్థులుకు నిర్వహించాల్సిన కౌనె్సలింగ్‌కు సమైక్య సెగ తగలడంతో రెండు కేంద్రాల్లో కౌనె్సలింగ్ నిలిచిపోగా కర్నూలులోని రాయలసీమ విశ్వవిద్యాలయంలోని ఒక కేంద్రంలో అరకొరగా కొనసాగింది. కౌనె్సలింగ్ తొలి రోజున 1 నుంచి 15వేల ర్యాంకు వరకు కౌనె్సలింగ్ నిర్వహిస్తామని నిర్వాహకులు ప్రకటించడంతో కౌనె్సలింగ్ కేంద్రాలకు భారీ ఎత్తున విద్యార్థులు వారి తల్లిదండ్రులు వచ్చారు. కర్నూలులోని పుల్లారెడ్డి పాలిటెక్నిక్ కళాశాల, నంద్యాలలోని పాలిటెక్నిక్ కళాశాల కేంద్రాల్లో సమైక్య వాదుల ఆందోళన కారణంగా కౌనె్సలింగ్ నిల్చిపోయింది. రాయలసీమ విశ్వ విద్యాలయంలో కౌనె్సలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియడంతో అక్కడికి విద్యార్థులతో తల్లిదండ్రులు చేరుకున్నారు. అప్పటికే సమైక్య నినాదాలు చేస్తూ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఆందోళన కార్యక్రమం చేపట్టడంతో అధికారులు కౌనె్సలింగ్‌ను నిలిపి వేసి విద్యార్థులతో చర్చించారు. అయినా ఫలితం లేకపోవడంతో నిలిపి వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో తల్లిదండ్రులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఆందోళనకారులు వెళ్లిన కొద్ది సేపటికి తిరిగి కౌనె్సలింగ్ ప్రారంభించడంతో విద్యార్థులు ఆనందించినా మరో మారు ఆందోళనకారులు రావడంతో కౌనె్సలింగ్ ప్రక్రియ నిల్చిపోయింది. దాంతో కేవలం 19 మంది విద్యార్థులకు మాత్రమే కౌనె్సలింగ్ నిర్వహణ సాధ్యపడిందని అధికారులు వెల్లడించారు. ఇక తెలుగుతల్లి విగ్రహం నుంచి ట్రాన్స్‌కో ఉద్యోగులు, సంక్షేమ భవన్ నుంచి సంక్షేమ శాఖ ఉద్యోగులు, కృష్ణానగర్‌లోని ప్రధాన కార్యాలయం నుంచి ఆర్‌అండ్‌బి ఉద్యోగులు, కార్మిక శాఖ ఉద్యోగులు తమ కార్యాలయం నుంచి ఇలా అన్ని శాఖల ఉద్యోగులు కర్నూలులోని పలు ప్రాంతాల నుంచి ర్యాలీలు నిర్వహించడంతో నగరంలో వాహనాల రాకపోకలకు తీవ్ర స్థాయిలో అంతరాయం ఏర్పడింది. రాజ్‌విహార్, ఎన్టీఆర్ కూడలితో పాటు పాత బస్టాండులోని తెలుగు తల్లి విగ్రహం, కుందు నది ఒడ్డున శ్రీ కృష్ణ దేవరాయలు విగ్రహాల వద్ద సమైక్య ఆందోళనలు మిన్నంటాయి. నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, బేతంచెర్ల, డోన్, నందికొట్కూరు, ఆత్మకూరు తదితర ప్రాంతాల్లో సమైక్య వాదులు తమ ఆందోళనా కార్యక్రమాన్ని తీవ్రతరం చేశారు. అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించి రహదారులపై ధర్నా చేయడంతో ప్రజల జీవనానికి ఆటంకం ఏర్పడింది. జూపాడుబంగ్లా మండలంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డారన్న వార్త సమైక్య వాదుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించింది. వారి పరిస్థితి బాగుందని తెలియడంతో ప్రభుత్వ తీరుకు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ జనం చస్తే కాని సమస్యను పరిష్కరించరా అంటూ మండిపడ్డారు. కాగా ఎన్జీవోల ఆధ్వర్యంలో జరుగుతున్న ఆందోళనా కార్యక్రమాలకు భారీ సంఖ్యలో ప్రజలు మద్దతునిస్తున్నారు. రాజకీయ పార్టీల కన్నా ఎలాంటి స్వార్థం లేని ఎన్జీవోలతో కలిసి ఆందోళన నిర్వహించడానికే ప్రజలు ముందుకు వస్తుండటంతో ఎన్జీవోలు మరింత తీవ్రమైన పద్ధతుల్లో ఆందోళన చేసేందుకు సిద్ధపడుతున్నారు. మొత్తం మీద సమైక్య ఆందోళనా కార్యక్రమాలు 18 రోజుల నుంచి కాస్తంత కూడా సద్దుమణగకుండా కొనసాగుతుండటం విశేషమని సర్వత్రా అభిప్రాయపడుతున్నారు.

ఎంసెట్ కౌనె్సలింగ్‌కు సమైక్య సెగ
కర్నూలు స్పోర్ట్స్, ఆగస్టు 19 : జిల్లాలో సోమవారం జరగవలసిన ఎంసెట్ కౌనె్సలింగ్‌కు సమైక్యంధ్ర సమ్మెసెగ తగిలింది. నగరంలోని రాయలసీమ యూనివర్శిటీ, జి.పుల్లారెడ్డి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరగాల్సి ఉంది. పాల్ టెక్నిక్ కళాశాలలో కౌనె్సలింగ్ జరుగకుండా సమైక్యవాదులు అడ్డుకోవడంతో రాయలసీమ యూనివర్శిటిలో కౌన్సిలింగ్ ప్రారంభమై రెండు గంటల పాటు జరిగి ఆగిపోయింది. సాయంత్రం కౌనె్సలింగ్ నిర్వహించేందుకు అధికారులు ప్రైవేట్ సిబ్బందితో నిర్వహించేందుకు చేసిన కృషి ఫలితం లేకుండా పోయింది. చివరికి జిల్లా పరిషత్త్ సిఇవో సూర్య ప్రకాష్, డ్వామా పిడి నజీర్ అహమ్మద్‌లు రాయలసీమ యూనివర్శిటీ వైస్ ఛాన్స్‌లర్ క్రిష్ణనాయక్‌తో సమావేశమయ్యారు. సమావేశఅనంతరం కౌనె్సలింగ్‌ను నిలిపివేస్తున్నట్లు వారు ప్రకటించారు. తదుపరి తేదిలు ప్రభుత్వ నిర్ణయంపై అధారపడి ఉంటుందని వారు తెలిపారు.
నంద్యాలలో...
నంద్యాల అర్బన్: ఎంసెట్ పరీక్షల్లో అర్హత సాధించి తాము కలలుకన్న ఇంజనీరింగ్ కళాశాలల్లో సీట్ల కోసం గంపెడాశతో ఎంసెట్ కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు సమైక్యాంధ్ర సెగతో వెనుతిరగాల్సి వచ్చింది. సోమవారం నంద్యాల పట్టణంలోని పాలిటెక్నిక్ కళాశాలలో ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం ఉద్ధృతం కావడంతో పాలిటెక్నిక్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు సమ్మెబాట పట్టారు. కనీసం కాంట్రాక్టు సిబ్బందితో కౌన్సిలింగ్ నిర్వహించాలని జిల్లా అడిషనల్ జాయింట్ కలెక్టర్ రామస్వామి చేసిన ప్రయత్నాలు కూడ విఫలమయ్యాయి. కాంట్రాక్టు సిబ్బంది కూడ పనిచేసేందుకు విముఖత చూపిన కారణంగా విధిలేని పరిస్థితుల్లో ఎంసెట్ కౌన్సిలింగ్‌ను నంద్యాలలో వాయిదా వేశారు. దీంతో ర్యాంకులు సాధించి తమకు నచ్చిన కళాశాలను ఎంపిక చేసుకునేందుకు వచ్చిన విద్యార్థులకు, తల్లిదండ్రులకు నిరాశే మిగిలింది. దూర ప్రాంతాల నుండి ఆర్టీసీ బస్సులు తిరగకపోయినా వ్యయప్రయాసలకు వచ్చి నంద్యాలకు వచ్చామని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోయారు. ఒకవైపు తెలంగాణ ప్రాంతంలో కౌన్సిలింగ్ సజావుగా జరుగుతుంటే, సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా ఈ ప్రాంతంలో ఎంసెట్ కౌన్సిలింగ్ జరగని పక్షంలో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందోనని విద్యార్ధులు, వారి తల్లిదండ్రులు అందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా కౌన్సిలింగ్ కేంద్రంలో సర్ట్ఫికేట్‌ల పరిశీలన జరిగితే వెబ్ అప్షన్స్ కోసం ప్రైవేట్ కేంద్రాల్లో పని పూర్తిచేసుకోవచ్చని వాపోయారు. ముఖ్యంగా తొలిరోజు నంద్యాల పట్టణంలో జరగాల్సిన ఎంసెట్ కౌన్సిలింగ్ వాయిదా పడడంతో విద్యార్థులు దిక్కుతెలియని పరిస్థితి నెలకొంది. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఉద్యమం రోజు రోజుకు ఉద్ధృతం అవుతుండడంతో ఎంసెట్ కౌనె్సలింగ్ సాధ్యమవుతుందా అన్న ప్రశ్న అందరిని వేదిస్తోంది. సమైక్యాంధ్ర ఉద్యమం ఎంత త్వరగా విరమిస్తే తమ పిల్లలు ఎంపిక చేసుకున్న కళాశాలల్లో సీట్లు వస్తాయని, తమ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

ఆత్మాహుతికి యత్నించిన
చిన్నారులకు పరామర్శ
నందికొట్కూరు/జూపాడుబంగ్లా, ఆగస్టు 19: సమైక్యాంధ్ర కోసం జూపాడుబంగ్లా మండలం మండ్లెం గ్రామంలో సోమవారం పెట్రోల్ పోసుకుని ఆత్మాహుతికి యత్నించిన చిన్నారులు జగన్, డేవిడ్‌ను పలువురు సమైక్యవాదులు పరామర్శించారు. నందికొట్కూరులోని వాసవి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని జెఎసి జిల్లా చైర్మన్ వెంగల్‌రెడ్డి, నందికొట్కూరు చైర్మన్ రాజశేఖరరెడ్డి, కో-చైర్మన్లు రాముడు, రవికుమార్, సత్యనారాయణ, వైకాపా నాయకులు గౌరు మురళీధర్‌రెడ్డి, కోకిల రమణారెడ్డి, ఐజయ్య పరామర్శించి వైద్యం కోసం ఆర్థికసాయం అందజేశారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమై గాయపడిన జగన్, డేవిడ్‌కు ఉచితంగా వైద్యం అందిస్తామని వాసవి ఆసుపత్రి వైద్యుడు అల్వాల రమేష్ తెలిపారు.
ఈరన్నస్వామి దర్శనానికి
పోటెత్తిన భక్తులు
ఆదోని, ఆగస్టు 19: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణ మాస ఉత్సవాల్లో విశిష్టమైన రెండవ సోమవారం దేవాలయం భక్తులతో కిట కిటలాడింది. అయితే భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. ఒక వైపుబస్సులు లేక, ఆటోల్లో ప్రైవేట్ వాహనాల్లో అధిక ఛార్జిలు చెల్లించి అవస్థలు పడుతూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో వసతులు చాలక వర్షంలోనే ఆరుబయట భక్తులు ప్రసాదాలను వంట చేస్తూ చాలా ఇబ్బందులను ఎదుర్కొన్నారు. వసతుల కల్పించడంతో దేవాలయ అధికారులు చేతులెత్తేశారు. ఒక వైపు చినుకులు పడుతున్నప్పటికి లక్షలాది మంది భక్తులు వర్షంకు తడుస్తూనే స్వామివారి దర్శనం చేసుకున్నారు. సోమవారం దాదాపు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. తెల్లవారు జాము నుండి భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఎటు చూసిన భక్తులే కనిపించారు. బస్సులు లేకపోవడంతోప్రైవేట్ వాహనాల్లో దారులు భక్తులతో అధిక చార్జిలు వసులు చేస్తున్నారు.
రాఘవేంద్రస్వామి నామస్మరణతో
పులకించిన మంత్రాలయం

మంత్రాలయం, ఆగస్టు 19: తుంగభద్ర తీరంలో వెలసిన పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి నామస్మరణతో పులకించిపోయింది. శ్రీరాఘవేంద్రస్వామి 342 సప్త ఆరాధనోత్సవాలు రంగరంగ వైభవంగాప్రారంభమైయ్యాయి. ఈ సందర్భంగా మఠంలో శ్రీరాఘవేంద్రస్వామి, మూలరాముల వారికి, ప్రహ్లాదరాయుల వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాలు ప్రారంభత్సోవాల్లో భాగంగా పీఠాధిపతి శ్రీసుయతీంద్రతీర్థులు, సుభూదీంద్రతీర్థులు చేతుల మీదుగా సోమవారం సాయంత్రం గోవుపూజ, గజపూజ, అశ్వపూజ వంటి పూజలు చేసి గ్రామ దేవత మంచాలమ్మదేవికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మఠం పరిపాలన కార్యాలయంలో వున్న క్యాషియర్, ఇంజనీర్, మేనేజర్, కంప్యూటర్, ఆడిట్ శాఖలకు పీఠాధిపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవాల్లో ప్రారంభంలో భాగంగా శ్రీరాఘవేంద్రస్వామి తూర్పు భాగంలో వున్న ముఖ ద్వారం వద్ద ధ్వజారోహణ చేసి పతకాన్ని ఎగురవేశారు. అనంతరం యోగేంద్ర మంటపంపై ఏర్పాటు చేసిన సభ వేధికపై పీఠాధిపతులు చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలను చేసి ఉత్సవాలను ప్రారంభించారు.కోటి రూ. 75లక్షలతోనిర్మించిన నిర్మాణాలు ప్రారంభం: మంత్రాలయంలో శ్రీరాఘవేంద్రస్వామి మఠం ఆధ్వర్యంలో రూ. కోటి 75లక్షలతో నూతనంగా నిర్మించిన కట్టడాలను పీఠాధిపతులు శ్రీసుయతీంద్రతీర్థులు, సుభూదీంద్రతీర్థులు ప్రారంభించారు. కోటి రూ. 40లక్షలతో శ్రీ్భరమణ, దుర్గారమణ కల్యాణ మంఠపాలను శ్రీరాఘవేంద్ర సర్కిల్ వద్ద రూ. 25లక్షలతో నిర్మించిన ముఖ ద్వారాన్ని రూ. 10లక్షలతో ఆధునీకరించిన సిఆర్వో కార్యాలయాన్ని పీఠాధిపతులు ప్రారంభించారు. ముందుగా శ్రీరాఘవేంద్రస్వామి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.
ఆకట్టుకున్న కోలాటాలు
శ్రీరాఘవేంద్రస్వామి ఉత్సవాల్లో భాగంగా యేగేంద్ర మంఠపంలో చిన్నారులచే నిర్వహించిన కోలాటాలు భక్తులను విశేషంగా ఆలరించాయి. మంత్రాలయంలో వున్న శ్రీరాఘవేంద్ర భజన మండలికి చెందిన చిన్నారులతో ఈ కోలాటాలను నిర్వహించారు. అదేవిధంగా కోయంబత్తూరు చెందిన కుమారి శ్రీవతితోనిర్వహించిన సంగీత కచేరి భక్తులను విశేషంగా ఆలరించారు. ఈ ఉత్సవాల్లో ఎఎకె సుయమీంద్రాచార్, ఎఓరొద్దం ప్రభాకర్‌రావు, ఎఎఓ మాధవశెట్టి, మేనేజర్లు వెంకట్‌జోషి, శ్రీపతి ఆచార్, నాగేశ్వరరావు, సురేష్, ఐపి నరసింహమూర్తి, ద్వార పాలక అనందరావు, అనంతస్వామి, గ్రామ సర్పంచ్ భీమయ్యలతోపాటు భద్రినాథ్‌లతో పాల్గొన్నారు.

ట్రాఫిక్ సమస్య పరిష్కరించండి
కర్నూలు, ఆగస్టు 19: నగరంలోని రైల్వేస్టేషన్ సమీపంలోని అశోక్‌నగర్ వద్ద ట్రాఫిక్ సమస్య తలెత్తుతోందని, ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ విశ్రాంతి సూపరింటెండెంట్ సాయిప్రసాద్ ఎస్పీ డా.కె.రఘురామిరెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. మీతో మీ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా సోమవారం 9440795567 సెల్ నెంబర్‌కు జిల్లా మొత్తం మీద పలు సమస్యలపై ఎస్పీకి 70 ఫిర్యాదులు అందాయి. కర్నూలు నగరంలోని అశోక్‌నగర్ లైల్వే ట్రాక్‌బ్రిడ్జీ కింద రెండు రహదారి మార్గాలు ఉన్నాయని, ఇక్కడ వన్‌వే అని బోర్డు ఉన్నా, ఈ దారిలో పోయే వారు ఇష్టం వచ్చినట్లు పోతుండటం వల్ల ట్రాఫిక్ అంతరాయంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సాయిప్రసాద్ ఎస్పీని కోరారు. అదే విధంగా యువకులు, విద్యార్థులు, పిల్లలు సహితం ద్విచక్ర వాహనాల్లో త్రిబుల్ రైడింగ్‌లో అత్యంత వేగంగా వెళ్తున్నారని, దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, వీటిని నిరోధించేందుకు చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఆదోనికి చెందిన పిలప్ అనే వ్యక్తి మనీ స్కీం పేరుతో ఆలూరు పరిసర ప్రంతాల్లో ఒక్కో వ్యక్తి వద్ద నుండి రూ.10వేలు చొప్పున దాదాపు 50 మంది వద్ద వసూలు చేసి దీనికంటే ఎక్కువ మొత్తం ఇస్తానని చెప్పి మోసం చేశాడని, ఈ విషయంలో గతంలో ఆలూరు, ఆదోని పోలీసుల దృష్టకి విషయం తీసుకుపోయినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆలూరుకు చెందిన ప్రభుదాస్ ఎస్పీ దృష్టకి తీసుకువచ్చారు. సుబ్బారెడ్డి అనే వ్యక్తి కల్లూరు మండలం పెద్దటేకూరులోని వాల్మీకిగేరిలో ఎర్రన్న ఇంటివద్ద బెల్టుషాపు నిర్వహిస్తున్నడని, దీనివల్ల ఇంటి చుట్టుపక్కల వారితో పాటు గ్రామంలోని మహిళలు, ప్రజలకు తాగుబోతుల కారణంగా అనేక ఇబ్బందులు ఎరుర్కొంటున్నారని పెద్దటేకూరు గ్రామానికి చెందిన కలకండయ్య ఫిర్యాదు చేశారు. అదేవిధంగా పలు సమస్యలపై ఎస్పీకి ఫిర్యాదులు అందాయి. దీనిపై ఎస్పీ మాట్లాడుతూ తన దృష్టికి వచ్చిన సమస్యలపై విచారించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ప్రజలకు హామీ ఇచ్చారు.మీతో మీ ఎస్పీ కార్యక్రమంలో భాగంగా ఎక్కువ ఫిర్యాదులు అక్షయ గోల్డ్ ప్రైవేటు లిమిటెడ్‌కు సంబంధించినవే వస్తున్నాయని, ఇప్పటికే కర్నూలు సిఐడి డీఎస్పీకి తమ ఫిర్యాదులు ఇవ్వాలని ఎస్పీ తెలిపారు. వాటికి సంబంధించిన కేసులు కర్నూలు సిఐడి దర్యాప్తు చేస్తున్నారని, వారిని సంప్రదించాలన్నారు.
అక్రమ బొగ్గు వ్యాపారుల అరెస్టు
నంద్యాల, ఆగస్టు 19: గడివేముల మండల పరిధిలోని జెఎస్‌డబ్ల్యు సిమెంట్ ప్యాక్టరీకి అగ్రిమెంట్‌పై బొగ్గు సరఫరా చేస్తూ మార్గమధ్యంలో కల్తిబొగ్గుతో మోసాలకు పాల్పడిన 6 మంది నిందితులను అరెస్టు చేసి, బొగ్గుతో ఉన్న 13 లారీలను, మొత్తం ఆస్తి రూ.ఒ 10కోట్లు సీజ్ చేశామని నంద్యాల డిఎస్పీ అమరనాథనాయుడు తెలిపారు. సోమవారం నంద్యాల డిఎస్పీ కార్యాలయంలో పాణ్యం సిఐ శ్రీనాథరెడ్డి, గడివేముల ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డిలతో కలిసి డిఎస్పీ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ సౌత్ ఆఫ్రికా దేశం నుంచి నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం ఓడరేవు ద్వారా జగత్ ట్రాన్స్‌ఫోర్టు, పరమేశ్వర ట్రాన్స్‌పోర్టు కంపెనీలు లారీలతో మైదుకూరు, నంద్యాల మీదుగా గడివేముల మండలం జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి నాణ్యమైన బొగ్గు సరఫరా చేస్తున్నాయని వివరించారు. అయితే కొందరు లారీ డ్రైవర్లు, లారీ యజమానులు నాశిరకం బొగ్గు అక్రమ వ్యాపారులతో చేతులు కలిపి కృష్ణపట్నం నుంచి మైదుకూరు మీదుగా జిందాల్ ఫ్యాక్టరీకి లారీలు రాకుండా నేరుగా కృష్ణపట్నం ఓడరేవునుంచే ప్రకాశం, గుంటూరు, నల్గొండ జిల్లా మీదుగా హైదరాబాద్ సమీపంలోని కొత్తూరు అక్రమ బొగ్గు వ్యాపారితో చేతులు కలిపి సౌత్ ఆఫ్రికాకు చెందిన నాణ్యమైన బొగ్గును సగంలారీ డంప్ చేసి, నాశిరకం బొగ్గును లోడ్ చేసుకొని జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీకి బొగ్గు సరఫరా చేస్తు లక్షలాధి రూపాయలు దోచుకుంటున్నట్లు విచారణలో తేలిందన్నారు. జగత్, పరమేశ్వర ట్రాన్స్‌పోర్టు కంపెనీల ఫిర్యాదు మేరుకు జిల్లా ఎస్పీ రఘురామిరెడ్డి ఆదేశాలతో పాణ్యం సిఐ శ్రీనాథరెడ్డి, గడివేముల ఎస్‌ఐ సుధాకర్‌రెడ్డిలు విచారణ చేసి అక్రమ బొగ్గు వ్యాపారానికి కారణమైన హైదరాబాద్ సమీపంలోని కొత్తూరు వద్ద ఉన్న నాశిరకం అక్రమ బొగ్గు వ్యాపారి అక్రం, అతని సూపర్‌వైజర్ హారిఫ్, కమిషన్ ఏజెంట్లు యూసుఫ్, లారీ డ్రైవర్లు జంగయ్య, యాదయ్య, శేఖర్‌గౌడులను అరెస్టు చేసి విచారించగా కోట్లాది రూపాయల అక్రమ బొగ్గు వ్యాపారం బయటపడిందన్నారు. అదేవిధంగా జిందాల్ సిమెంట్ ఫ్యాక్టరీలోని ఆధునిక యంత్రాలు కూడా నాశిరకం బొగ్గుతో నాశనం అయ్యాయని, సిమెంట్ కూడా నాణ్యత లేకుండా తయారై భవన నిర్మాణ రంగాన్ని దెబ్బతీసిందని డిఎస్పీ వివరించారు. దీంతో నిందితులను సోమవారం అరెస్టు చేశామని, నాశిరకం బొగ్గులోడుతో వచ్చిన 13లారీలను కూడా సీజ్ చేశామని తెలిపారు.

వైఎస్‌ను మరిపించడానికే విభజన కుట్ర
కల్లూరు, ఆగస్టు 19 : జరుగబోయే ఎన్నికల్లో వైకాపా రాష్ట్ర పగ్గాలు చేపట్టడం ఖాయమని తెలుసుకున్న కాంగ్రెస్, టిడిపి, టిఆర్‌ఎస్‌లు ప్రజల నుండి వైఎస్‌ను మరిపించడానికే రాష్ట్ర విభజనను తెరపైకి తెచ్చారని వైకాపా నేత ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వైకాపా అధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్షలకు సంఘీభావంగా సోమవారం ఎస్వీ మోహన్ రెడ్డి స్థానిక శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం ముందు ఆమరణ దీక్షలను చేపట్టారు. అంతకు ముందు నగరంలో వైకాపా ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర నినాదాలతో భారీ ఎత్తున ర్యాలీ చేపట్టి దీక్ష శిబిరానికి చేరుకుని ఆయన మాట్లాడుతూ జగన్ ప్రభంజనాన్ని తట్టుకోలేని కాంగ్రెస్ ప్రజల్లో చిచ్చు రేపి విభజన మంత్రాంగంతో ముందుకు వచ్చి తెలుగు ప్రజలను చీల్చి వేయడానికి కంకణం కట్టుకున్నారన్నారు. ముఖ్యమంత్రిగా పదవిలో వైఎస్.రాజశేఖరరెడ్డి ఉన్నంత కాలం ఎలాంటి ప్రాంతీయ విభేదం లేకుండా అభివృద్ధితో ముందుకు సాగారని దాంతో రాష్ట్ర ప్రజల్లో వైఎస్‌కు ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు వచ్చాయని అన్నారు. వైఎస్ మరణంతో జగన్‌కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, షర్మిలా పాదయాత్రతో రాష్ట్ర ప్రజలందరు వైకాపా పక్షాన నిలుస్తున్నారన్న వార్తలతో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతి పక్ష తెలుగు దేశం, టిఆర్‌ఎస్‌లు తమ రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ప్రజలను పావులుగా వాడుకుంటున్నారని అన్నారు. విభజనపై స్పష్టమైన సాంకేతాలు ఉన్న అధికార ప్రతిపక్ష ప్రజా ప్రతినిధులు ఎందుకు రాష్ట్ర విభజనపై ప్రజలకు స్పష్టమైన సమాధానం ఇవ్వలేదని అయన అన్నారు. ఉద్యోగులు, విద్యార్థుల భవిష్యత్‌తో చెలగాటమాడుతున్న కాంగ్రెస్, టిడిపిలకు రాజకీయ భవిష్యత్ లేకుండా చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇప్పటికైన కేంద్రం స్పందించి రాష్ట్ర విభజన వివాదానికి అడ్డుకట్ట వేయాలని లేదా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతామన్న నిర్ణయాన్ని ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత, వైకాపా నాయకులు కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి, నిడ్జూరు రాంభూపాల్ రెడ్డి, గౌరు వెంకటరెడ్డి, సురేంద్ర రెడ్డి, జయరాజ్ పాల్గొన్నారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ టిడిపి నాయకులకు తగిన గుణపాఠం చెప్పడానికి ప్రజలు ఎదురు చుస్తూన్నారన్నారు. వైఎస్ అభివృద్ధి చేసిన రాష్ట్రాన్ని ముక్కలు చేయడమే కాంగ్రెస్ లక్ష్యంగా ఎంచుకుందని ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన వైఎస్‌ని ప్రజల నుండి దూరం చేయడం ఎవ్వరికి చేతకాదన్నారు.
అవుకు రిజర్వాయర్ స్పిల్‌వే గేటు
టాప్‌సీల్ ఊడింది..
అవుకు, ఆగస్టు 19: అవుకు రిజర్వాయరు మిగులు జలాలను విడుదల చేసేందుకు స్పిల్‌వే గేట్లను నిర్మించారు. ఈ గేట్ల ద్వారా రిజర్వాయరులో వున్న అదనుపు జలాలు గొల్లలేరు డ్రైన్‌కు విడుదల చేస్తారు. రిజర్వాయరుకు ప్రమాదం పొంచివుండకుండా స్పిల్‌వే గేట్లు రక్షణ కవచంగా వుంటాయి. ప్రాముఖ్యత కల్గిన గేట్లకు వుండాల్సిన రేడియం టాప్‌సీల్ ఊడిపోవడం అందోళన కల్గిస్తుంది. రిజర్వాయరులో ప్రస్తుతం వున్న నీటి నిల్వ 216.5 మీటర్ల లెవెల్‌కు వుంది. 220 మీటర్ల వరకు నీటి నిల్వచేరితే టాప్‌సీల్ ఊడిపడిన ఆరవ గేటు నుండి నీరు లీకేజీ జరిగే అవకాశం వుంది. ఈ విషయంపై ఇఇ వెంకటేశ్వరరావు సోమవారం మాట్లాడుతూ స్పిల్‌వేలో వున్న 6 గేట్లలో ఒకదానికి రేడియం టాప్‌సీల్ ఊడిపోయిందన్నారు. కర్నూలు నుండి గేట్లకు సంబంధించిన నిపుణుడైన డిఇని మంగళవారం అవుకుకు రప్పిస్తున్నట్లు తెలిపారు. ఆయన సూచనల మేర కు తాము సీల్ ఏర్పాటు పనులు చేస్తామని అన్నారు. రిజర్వాయరుకు ఎలాంటి ప్రమాదం లేదని ఇఇ వెల్లడించారు.

* ఎస్వీ ఆమరణ దీక్ష * వీధికెక్కిన ప్రభుత్వ ఉద్యోగులు * తోపుడు బళ్ల వ్యాపారుల ర్యాలీ
english title: 
h

Viewing all articles
Browse latest Browse all 69482

Trending Articles



<script src="https://jsc.adskeeper.com/r/s/rssing.com.1596347.js" async> </script>