ఖమ్మం రూరల్, ఆగస్టు 19: గోదావరి వరద బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ పాలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి మద్దినేని స్వర్ణకుమారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం పెద్దతండాలోని రాంమూర్తినాయక్ ఇంటివద్ద ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గోదావరి వరదల వల్ల ప్రజలు, రైతులు సర్వం కోల్పోయి రోడ్డెక్కిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లైలా తదితర తుఫాన్‌ల ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులందరికీ నేటికీ పంట నష్టపరిహారం అందించలేదని ఆరోపించారు. ఇప్పుడైనా ప్రభుత్వం స్పందించి గోదావరి వరద బాధితులను అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై ప్రజలు ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఉద్భోదించారు. విలేఖరుల సమావేశంలో మండల పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బెల్లం వేణుగోపాల్, దారావత్ రాంమూర్తినాయక్, రెడ్యానాయక్ పాల్గొన్నారు.
సమస్యలను స్థానికంగానే పరిష్కరించండి
* జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్
ఖానాపురం హవేలి, ఆగస్టు 19: అధికారులు ప్రజల సమస్యలను స్థానికంగానే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేష్ కలెక్టర్‌కు సూచించారు. సోమవారం స్థానిక జిల్లా పరిషత్‌లో జరిగిన గ్రీవెన్స్‌డేలో ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ అధికారులు గ్రామ, మండల స్థాయిలోనే సమస్యలు పరిష్కరిస్తే ఫిర్యాదుదారులు ఇక్కడకు వచ్చే అవకాశం ఉండకుండ ఉంటుందని, అందుకు అనుగుణంగా ప్రతి ఒక్కరు పని చేయాలన్నారు. రఘునాథపాలెం మండలంలోని వేపకుంట్ల గ్రామానికి చెందిన కోడూరు ధనలక్ష్మ అనే వికలాంగురాలు ఫ్యాన్సి షాపు మంజూరికై నిధులు కోరుతూ ఎస్సీ కార్పొరేషన్‌కు దరఖాస్తు చేశానని, నిధులు మంజూరు చేయాలని కోరారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లికి చెందిన ప్రజలు గ్రామంలోని నాగుబండి జానయ్య, నల్లొని వెంకటేశ్వర్లు అనే వ్యక్తులు నఖిలి పత్రాలు సమర్పించి సమరయోధులు పెన్షన్ పొందుతున్నారని, విచారణ జరిపి పెన్షన్‌ను రద్దు చేయాలని కోరారు. బూర్గంపాడు మండలం నాగారం గ్రామానికి సుజాత, లాలులు తాము డిఎస్సీలో ఎంపికయ్యామని, తమకు ఏజన్సీ సర్ట్ఫికెట్లు ఇప్పించాలని కోరారు. అదే విధంగా పోడు భూములకు పట్టాలివ్వాలని, బోడు గ్రామ పంచాయతీలో నెలకొల్పే సక్సెస్ పాఠశాలలను వేరోక ప్రాంతానికి తరలించకుండా అదే ప్రాంతంలో నిర్మించాలని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య తమ పార్టీ సర్పంచ్‌లతో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. వైరా మండలానికి చెందిన వెంకట్రామయ్య భార్య పెడమటి లక్ష్మి తన భర్త హత్యకు గురయ్యాడని, తన ఇద్దరు పిల్లను చదివించే ఆర్థిక స్థోమత లేనందున పిల్లలకు విద్యాభ్యాసం అందించాలని కోరుతూ దరఖాస్తును సమర్పించారు. కామేపల్లి మండలంకు చెందిన భుక్యా వీరన్న చెవిటి, మూగ యువకుడు కాగా, డిగ్రీ చదువు నిమిత్తం ఆర్థిక సహాయాన్ని అందించాలని కోరాడు. ఫిర్యాదులను స్వీకరించిన అనంతరం కలెక్టర్ సంబంధిత అధికరాలను సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో జెసి సురేంద్రమోహన్, జడ్పీసిఇఓ జయప్రకాశ్ నారాయణ అన్నిశాఖల అధికారులు పాల్గొన్నారు.
ప్రజల మనోభావాలతో ఆటలాడుకోవడం మానాలి
కొత్తగూడెం, ఆగస్టు 19: ప్రజల మనోభావాలతో పార్టీలు ఆటలాడడం మానుకోవాలని, అవకాశవాద రాజకీయాలను నడుపుతున్న కాంగ్రెస్ ఆటలు కట్టించేందుకు ప్రజలు సన్నద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శన్ అన్నారు. స్థానిక ఏలూరి మీటింగ్‌లో కొత్తగూడెం డివిజన్ ప్లీనం సమావేశం సోమవారం జరిగింది. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగిస్తూ రాష్ట్ర విభజనపై పార్టీలు రోజుకొక మాట మాట్లాడుతూ ప్రజల మనోభావాలతో ఆటలాడడం సరైంది కాదన్నారు. తెలంగాణ విషయంలో నాన్చుడుధోరణి అవలంబించి పనికిరాని కమిటీలతో కాలయాపన చేసి కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధిని వెనక్కునెట్టిందన్నారు. కాంగ్రెస్ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు. మరోవైపు మరిన్ని బూర్జువా పార్టీలు ప్రాంతీయ ఉద్యమాలను రెచ్చగొడతుంటే తెలంగాణ, సమైక్యల పేరుతో ప్రజల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పక్కన పెట్టిందని విమర్శించారు. రాష్ట్ర విభజన విషయంలో సిపిఎం ఒక్కటే స్పష్టత కల్గివుందని మిగతా పార్టీలన్నీ రెండునాలుకల ధోరణిని అవలంబిస్తూ ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు వ్యవహరించడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా విభజన విషయంలో స్పష్టత కలిగించి రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకవెళ్ళేవిధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యల సాధన కోసం సిపిఎం నిర్వహించే ప్రజాఉద్యమాల్లో అన్ని వర్గాల ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈప్లీనం సమావేశంలో సిపిఎం కేంద్రకమిటీ సభ్యురాలు ఎస్ పుణ్యవతి, రాష్ట్ర నాయకుడు కాసాని ఐలయ్య, నాయకులు ఎం జ్యోతి, కొండపల్లి పావన్, కున్సోత్ ధర్మా, కొండపల్లి శ్రీ్ధర్, యర్రగాని కృష్ణయ్య, ఇట్టి వెంకట్రావు, భూక్య రమేష్, దొడ్డా రవి తదితరులు పాల్గొన్నారు.
భారజల కర్మాగార ఉద్యోగి హత్య?
అశ్వాపురం, ఆగస్టు 19: స్థానిక మణుగూరు భారజల కర్మాగారంలో మెకానికల్ విభాగంలో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్న జికె గౌడ (57) సోమవారం తెల్లవారుజామున హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం ప్రకారం.... కర్నాటక రాష్ట్రానికి చెందిన గౌడ భారజల కర్మాగారంలో క్రేన్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. వ్యక్తిగత పని నిమిత్తం హైద్రాబాద్ వెళ్లిన గౌడ సోమవారం మణుగూరు రైల్వే స్టేషన్‌లో తెల్లవారుజామున రైలు దిగి ఆటోలో అశ్వాపురంలోని గౌతమీనగరం కాలనీకి బయలుదేరాడు. ఈ క్రమంలో మిట్టగూడెం- గోపాలపురం గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బి రహదారిపై ఉన్న ఓ కల్వర్టు సమీపంలో హత్యకు గురయ్యాడు. ఈ సమాచారం అందిన వెంటనే అశ్వాపురం పోలీసులు మృతదేహం వద్దకు చేరుకుని పరిశీలించారు. గౌడ మెడ చుట్టూ నాలుగు కత్తిపోట్లు కన్పించాయి. శరీర భాగంలో ఓ సూది గుచ్చుకుని కన్పించింది. మృతదేహం వద్ద నాలుగు మద్యం బాటిళ్లు, రెండు సెల్‌ఫోన్లు, చెప్పులు, 7500లు నగదు కన్పించడంతో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గౌడ మృతదేహాన్ని స్థానిక భారజలం ఉద్యోగుల కాలనీ గౌతమీనగరంలోని భారజలం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుని భార్య, కుమారుడు బెంగళూరులో ఉండటంతో పోలీసులు వారికి సమాచారం అందించారు. ఇది ముమ్మాటికీ హత్యేనని, దీనిపై లోతుగా విచారిస్తున్నామని అశ్వాపురం సిఐ వేణు చందర్ తెలిపారు. మృతుని కుమార్తె మంజులను విచారిస్తున్నారు. సమగ్ర విచారణ జరిపి నిందితులను పట్టుకుంటామన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా సంఘటనా ప్రాంతాన్ని మణుగూరు డియస్పి రవీందర్‌రావు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
జమలాపురం శ్రీ వేంకటేశ్వర స్వామి సన్నిధిలో
చక్రస్నానంతో ముగిసిన పవిత్రోత్సవాలు
ఎర్రుపాలెం, ఆగస్టు 19: జమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 16నుంచి ప్రారంభమైన పవిత్రోత్సవాలు సోమవారం శాంతికల్యాణం, చక్రస్నానంతో ముగిశాయి. వేకువజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వేద పండితులు కొత్తూరి కోటేశ్వరశాస్ర్తీ, ప్రధాన అర్చకుడు శ్రీనివాస శర్మలు వేదోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏడాది పాటు దైవసన్నిధిలో జరిగే నిత్య పూజ, కైంకర్యాల్లో జరిగే అపచారాలు, దోషాలను నివారించేందుకు పంచవర్ణాల 108నూలు పోగులతో పేనిన ధారాలకు ధాన్య, చేయ, పుష్పాదివాసాలు జరిపి, హోమపూజలతో పవిత్రీకరిస్తారని, అటువంటి పవిత్రాలు స్వామి వారికి ధరింపచేస్తారన్నారు. పవిత్రోత్సవాల్లో భాగంగా అమ్మవారికి శాకంబరి ఉత్సవాలను ఆగమశాస్త్రానుసారం వైభవోపేతంగా నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి దంపతులు, ఇవో వెచ్చా నర్సింహారావు దంపతులు, ఆలయ కమిటీ సభ్యులు కోనా జనార్దన్‌రావు దంపతులు, వజినేపల్లి వెంకటేశ్వర్లు, మాధవి దంపతులు పూజల్లో పాల్గొన్నారు. మాజీ చైర్మన్ ఉప్పల కృష్ణమోహన్ శర్మ, శివరామ్‌ప్రసాద్, విజయదేవశర్మ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
వైరా రిజర్వాయర్‌కు జలకళ
వైరా, ఆగస్టు 19: ఎగువ నుంచి వస్తున్న కొత్త నీరు రాకతో సోమవారం వైరా రిజర్వాయర్ కళకళలాడుతోంది. ప్రస్తుతం ఒకవైపు సాగర్ జలాలు వస్తున్నప్పటికీ మరోవైపు బయ్యారం, ఇల్లందు, ఏన్కూరు, కారేపల్లి, కామేపల్లి మండలాల్లోని వాగులు, వంకల నుంచి స్థానిక రిజర్వాయర్‌కు వరద వస్తుంది. దీంతో ప్రస్తుతం రిజర్వాయర్ నీటిమట్టం 15.5 అడుగులకుపైగా ఉంది. గత రెండు మూడు రోజులనుండి ఒకేసారి 11.5అడుగుల నీటిమట్టం 15.5అడుగులకు పెరగటంతో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టు పరిధికో సుమారు అధికారిక లెక్కల ప్రకారం 30వేల ఎకరాలు ఉండగా అనధికారింగా మరో 5వేల ఎకరాలు సాగవుతున్నట్లు అంచనా. కాగా దీంతో రైతులు వరి నాట్లకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
రెండునెలల కాలంలో కినె్నరసాని రిజర్వాయర్ నుండి
3.78 టిఎంసి నీరు విడుదల
* ఇప్పటికి 10సార్లు గేట్లు ఎత్తివేత
పాల్వంచ, ఆగస్టు 19: బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడనాల కారణంగా కురిసిన భారీవర్షాలకు మండల పరిధిలోని కినె్నరసాని రిజర్వాయర్‌కు వరద నీరు గతంలో కంటే ఈసారి భారీగా వచ్చి చేరింది. దీంతో కెటిపిఎస్ అధికారులు రెండునెలల కాలంలో రిజర్వాయర్ నుండి సుమారు 3.78టిఎంసిల నీటిని బయటకు విడుదల చేశారు. గత నెల 20తేదీన రెండు గేట్లను తేపి 9వేల క్యూసెక్కుల నీటిని బయటకు వదలడంతో ప్రారంభమైన నీటి విడుదల ప్రక్రియ ఆదివారం రాత్రి గేట్లు లేపడంతో పదవసారికి చేరుకుంది. గతంలో ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రిజర్వాయర్‌లోకి వర్షాపునీరు చేరికతో ఆ రెండు నెలల్లోనే ఎక్కువగా లేపేవారు. అయితే ఈ సంవత్సరం గేట్లులేపే ప్రక్రియ జూలైలో ప్రారంభమైంది. కొత్తనీటితో కళకళలాడుతున్న కినె్నరసాని సోయగాలను వీక్షించేందుకు పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. రెండునెలల కాలంగా గేట్లు ఎత్తివేత ప్రక్రియను కెటిపిఎస్ అధికారులు సురేష్, కోటేశ్వరరావు, రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు.
జిల్లాలో జ్వరాలు తగ్గుముఖం
కొణిజర్ల, ఆగస్టు 19: జిల్లాలో మలేరియా జ్వరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా మలేరియా అధికారి ఎ రాంబాబు పేర్కొన్నారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించి జ్వర పీడితులతో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గత ఏడాది 1353 మలేరియా కేసులు నమోదుకాగా ఈ ఇప్పటి వరకు 790 కేసులు మాత్రమే నమోదైనట్లు వెల్లడించారు. మలేరియా కేసులు ఏజన్సీలోనే అధికంగా నమోదవుతున్నాయన్నారు. విష జ్వరాలు ప్రబలటానికి ప్రధాన కారణం వరదలతో పాటు పరిసరాల అపరిశుభ్రత, దోమలు, కలుషితమైన నీరే కారణమన్నారు. ఏ జ్వరాలనైనా కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు మలేరియా, టైపాయిడ్ రోగులంటూ భయపెడుతున్నాయని వాటిల్లో నిజం లేదన్నారు.