కర్నూలు, ఆగస్టు 20 : రాష్ట్ర విభజన నేపథ్యంలో రాయలసీమకు మరో శరాఘాతం తగలనుంది. రాయలసీమ, కోస్తాంధ్రకు చెందిన సచివాలయ ఉద్యోగులు ఉద్యమబాటలో ఉండగా తెలంగాణకు చెందిన ఉద్యోగులు సీమకు విఘాతం కలిగించే విధంగా ఓ ఫైలును శరవేగంగా పరుగులు పెట్టిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కృష్ణాజలాల వినియోగం కోసం పాలమూరు ఎత్తిపోతల పథకానికి 70 టిఎంసిల నీటిని కేటాయిస్తూ జీవో జారీ చేయగా, తాజాగా తుంగభద్ర జలాల వినియోగంపై దృష్టి పెట్టినట్లు తెలిసింది. తుంగభద్ర నదిపై రాజోలిబండ మళ్లింపు పథకం (ఆర్డీఎస్) దిగువన, సుంకేసుల బ్యారేజీ ఎగువన తెలంగాణకు ఉపయోగపడే విధంగా ఎడమ కాలువ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలపై ఫైలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదం కోసం అవసరమైన హంగులను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తుంగభద్ర జలాల నుంచి మహబూబ్‌నగర్ జిల్లాలో 85 వేల ఎకరాలకు సాగునీరు అందుతోంది. తుంగభద్ర జలాల్లో పాలమూరు వాటా మొత్తం 15.90 టిఎంసిలు కాగా అందులో ఏడు టిఎంసిలు నికర జలాలు. మిగిలిన జలాలు నదీ ప్రవాహం ఆధారంగా వినియోగించుకోవాల్సి ఉంది. నికర జలాల్లో 1.20 టిఎంసిలు నేరుగా తుంగభద్ర ప్రాజెక్టు నుంచే విడుదల చేస్తున్నారు. మిగిలిన 5.80 టిఎంసిలు ఆర్డీఎస్, సుంకేసుల నుంచి మళ్లిస్తున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సుంకేసుల జలాశయం ఎగువ నుంచి ఎడమ కాలువ ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీరు అందించేందుకు తయారవుతున్న ఫైలు ప్రభుత్వ ఆమోదం పొంది నిర్మాణం పనులు పూర్తయితే నికరజలాలతో పాటు నదీ ప్రవాహంపై ఆధారపడి వినియోగించాల్సిన నీరు పేరుతో భారీ ఎత్తున నీటిని తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎడమ కాలువకు అనుసంధానంగా పాలమూరు, రంగారెడ్డి జిల్లాల్లో జలాశయాలు నిర్మించుకుంటే తుంగభద్ర జలాలు దిగువకు పారడం పూర్తి స్థాయిలో నెమ్మదిస్తుందన్న ఆందోళనను సాగునీటి రంగం నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సుంకేసుల ఎగువన ఎడమ కాలువను ప్రతిపాదించడం ద్వారా దిగువన ఉన్న పాలమూరు ప్రాంతానికి ఎత్తిపోతలతో పని లేకుండా నీటిని తరలించవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు.
తుంగభద్ర జలాల్లో రాయలసీమకు కేటాయించిన 39.90 టిఎంసిల వినియోగం కోసం నిర్మించతలపెట్టిన గుండ్రేవుల, రంగాపురం జలాశయాల ప్రతిపాదనను తిరస్కరిస్తూ ఈ నెల 8న ప్రభుత్వం మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. కృష్ణాజలాలను పాలమూరు ఎత్తిపోతల ద్వారా, తుంగభద్ర జలాలను ఎడమ కాలువ ద్వారా తరలిస్తే దిగువన సుంకేసుల, శ్రీశైలం జలాశయాలకు నీరు చేరడం గగనమవుతుందని ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదిత ఎత్తిపోతల, ఎడమ కాలువ పనులు పూర్తయ్యాక రాయలసీమ 15 సంవత్సరాల కిందటి కరవును మళ్లీ చూడాల్సి వస్తుందని, కరవు రక్కసికి బలికావాల్సి వస్తుందన్న భయం ప్రజల్లో నెలకొంది.
నేడు అవనిగడ్డ ఉప ఎన్నిక పోలింగ్
అవనిగడ్డ, ఆగస్టు 20: కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గ ఉప ఎన్నిక పోలింగ్ బుధవారం జరగనుంది. ఇందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది. నియోజకవర్గ పరిధిలోని అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక, మోపిదేవి, చల్లపల్లి మండలాల్లో ఉదయం 7నుండి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. నియోజకవర్గంలో లక్షా 91వేల 731మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు.
241 పోలింగ్ కేంద్రాలలో ఎన్నికల నిర్వహణకు 265 మంది పోలింగ్ అధికారులు, 265 మంది సహాయ పోలింగ్ అధికారులు, 530 మంది సిబ్బంది, 265 మంది వెబ్‌కాస్టింగ్ సిబ్బంది నియమితులయ్యారు. ఎన్నిక ప్రశాంతంగా జరిగేందుకు జిల్లా కలెక్టర్ డా. బుద్ధప్రకాష్ ఎం జ్యోతి, పోలీసు సూపరింటెండెంట్ జె ప్రభాకరరావు, రిటర్నింగ్ అధికారి జి రవి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 24న ఉదయం 8గంటల నుండి ఓట్ల లెక్కింపు జరుగుతుంది.