హైదరాబాద్, ఆగస్టు 20: ఆగస్టు నెల వేతనం తీసుకున్న వెంటనే నిరవధిక సమ్మె చేయాలని రాష్ట్ర సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. గత మూడు వారాల నుండి ఒకవైపు అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలు చేస్తూ, మరోవైపు విధులకు గైర్హాజరు అవుతూ, సచివాలయంలో ఆందోళనల్లో పాల్గొంటున్న సీమాంధ్ర ఉద్యోగులు ఈ నెల వేతనాన్ని ఆగస్టు 31 (శనివారం) లేదా సెప్టెంబర్ 1 (సోమవారం) తీసుకున్న తర్వాత సమ్మె ప్రారంభించాలని తాజాగా నిర్ణయించారు. ఈ మేరకు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ తదితరులు బుధవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయించారు. సెప్టెంబర్ రెండో తేదీ మధ్య రాత్రి నుండి సమ్మె ప్రారంభిస్తామని వెల్లడించారు. సచివాలయంలో రోజూ మాదిరిగానే మంగళవారం కూడా ఈ ఉద్యోగులు ఊరేగింపు నిర్వహించారు. రాష్ట్రాన్ని విడదీయ కూడదని, కాంగ్రెస్ వర్కింగ్ కమిటి (సిడబ్ల్యుసి) నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, సీమాంధ్ర ప్రజాప్రతినిధులు తమ పదవులకు రాజీనామా చేయాలంటూ నినాదాలు చేశారు.
నల్లరంగు ‘టీ’ షర్టులు వేసుకుని సచివాలయంలోని ప్రధాన మార్గాల ద్వారా ఊరేగింపు నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి సమ్మె నోటీసు ఇచ్చిన తర్వాత మురళీకృష్ణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తాము గత మూడు వారాల నుండి ఆందోళన చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదని ఆరోపించారు. ఈ కారణంగానే సెప్టెంబర్ రెండోతేదీ అర్ధరాత్రి నుండి సమ్మె చేయాలని తమ సంఘం నిర్ణయించిందని వెల్లడించారు.
సీమాంధ్రకు చెందిన 13 జిల్లాల్లోని ప్రభుత్వ ఉద్యోగులు ఇప్పటికే సమ్మె ప్రారంభించగా, సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు మాత్రం ఈ నెల పూర్తయిన తర్వాత వేతనాలు తమ ఖాతాల్లో జమకాగానే నిరవధిక సమ్మెకు వెళుతున్నారు.
ఇలా ఉండగా సీమాంధ్రకు చెందిన ఉపాధ్యాయులు కూడా బుధవారం (ఆగస్టు 21) అర్ధరాత్రి నుండే సమ్మెకు వెళుతున్నామంటూ నోటీసును ప్రభుత్వానికి ఇచ్చారు. ఈ మేరకు సీమాంధ్ర ఉపాద్యాయుల సంఘం నాయకుడు కమలాకరరావు, అప్పారావు మంగళవారం ఇక్కడ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, దాదాపు మూడు లక్షల మంది టీచర్లు సమ్మెలో పాల్గొంటారని స్పష్టం చేశారు. ఎపిఎన్‌జిఓలు ప్రారంభించిన సమ్మెకు తాము ఇప్పటికే మద్దతు ఇస్తున్నామని, వివిధ రకాల ఆందోళనలను చేపట్టామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలంటూ వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు తాము ఆందోళన కొనసాగుతుందని వెల్లడించారు.
సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల సంఘం రేపటి నుండి సమ్మెలో టీచర్లు
english title:
v
Date:
Wednesday, August 21, 2013