కంఠేశ్వర్, మార్చి 3: నగర పాలక సంస్థ ఆస్తి పన్ను పెంచడం ద్వారా ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం మోపడం అప్రజాస్వామికమని చాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు భక్తవత్సలం, సీనియర్ సిటిజన్స్ ఫోరం ప్రతినిధి గంగాకిషన్ ఆక్షేపించారు. పెంచిన ఆస్తి పన్నును ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. శనివారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో భక్తవత్సలం, గంగాకిషన్‌లు మాట్లాడారు. నగరంలోని ప్రజలకు కనీస వౌలిక సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైన నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులకు పన్నులు పెంచే నైతికత లేదని ఆరోపించారు. ప్రజలకు రక్షిత మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి లైట్లు వంటి సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందన్నారు. చిన్న, పెద్ద, పాత, కొత్త భవనాలు అనే తేడా లేకుండా బల్దియా అధికారులు రెండు వందల శాతం నుండి వెయ్యి శాతం వరకు ఆస్తిపన్నును పెంచడం ఏ మేరకు సమంజసమని ప్రశ్నించారు. నగర పాలక సంస్థ ఒంటెత్తు పోకడల వల్ల ఆస్తి పన్ను కట్టడానికి ప్రజలు ఆస్తులను అమ్ముకునే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని కపిల హోటల్ యజమాని ప్రతి సంవత్సరం రెండు లక్షల రూపాయల మేర ఆస్తి పన్ను కట్టేవాడని అన్నారు. అయితే ప్రస్తుతం పెంచిన పన్ను ప్రకారం 5లక్షల రూపాయలు కట్టాలని బల్దియా అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. దాదాపు నెలకు 50వేల రూపాయల ఆస్తిపన్ను చెల్లించలేక, వ్యాపారం కొనసాగించలేని స్థితిలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారని అన్నారు. ఇలాంటి వ్యాపారులు, మధ్య తరగతి ప్రజలు ఆస్తి పన్ను భారం భరించడం కష్టతరంగా మారిందన్నారు. 13వ ఆర్థిక ప్రణాళిక సంఘం రాష్ట్ర ప్రభుత్వాలు ఆస్తిపన్ను పెంపు విషయంలో ఉన్న అడ్డంకులు ఎవైనా ఉంటే తొలగించుకోవాలని సూచించడం జరిగిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం ఆస్తిపన్ను పెంపుపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ జీవో 88ను జారీ చేసిందని గుర్తు చేశారు. దీనిని ఆసరాగా చేసుకుని నగర పాలక సంస్థ ఇష్టం వచ్చిన రీతిలో ఆస్తి పన్ను పెంచడం అమానుషమని అన్నారు. నగరంలోని ప్రధాన కూడళ్లలో కనీస పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయలేని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆస్తి పన్ను పెంపులో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. అధికారులు పెంచిన ఆస్తి పన్నును వెంటనే ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు యోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కరెంట్ కోతలు, విద్యుత్ చార్జీల పెంపు వల్ల చిన్న పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆస్తి పన్ను, విద్యుత్ చార్జీల పెంపు విషయమై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. విలేఖరుల సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్, సిటిజన్స్ ఫోరం, సిటీ టాక్స్ పేయర్ ఫోరం ప్రతినిధులు గురుప్రసాద్, రాంరెడ్డి, మీసాల సుధాకర్, ధర్మేంద్రగాంధీ, లక్ష్మారెడ్డి, మాస్టర్ శంకర్, రాజీవ్‌దువా పాల్గొన్నారు.
కోరిన కోర్కెలు తీర్చే మోర్తాడ్ శ్రీనివాసుడు
నేటి నుండి బ్రహ్మోత్సవాలు
మోర్తాడ్, మార్చి 3: మోర్తాడ్‌లోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. అత్యంత పురాతనమైన ఈ ఆలయానికి ప్రత్యేక చరిత్ర ఉంది. ప్రతీఏటా మాఘశుద్ధ ఏకాదశి నుండి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. మూడు శతాబ్దాల క్రితం తిరుమల స్వామివారి దర్శనాన్ని కాంక్షించి ఓ మునీశ్వరుడు తడ్‌పాకల్ గోదావరి నది తీరాన తపస్సు చేశాడని ఆలయ చరిత్ర చెబుతోంది. ముని తపస్సుకు మెచ్చి కలలో సాక్షాత్కరించిన వెంకటేశ్వరుడు తాను సర్ప రూపంలో వెళ్తున్నానని, తాను అంతర్థానమయ్యే ప్రదేశంలో ఆలయం నిర్మించి పూజించాలని వరమిచ్చినట్టు గీతా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన స్థల పురాణంలో పేర్కొన్నారు. స్వామి వారు కోరినట్టుగానే సర్ప రూపంలో వచ్చి ప్రస్తుతం మోర్తాడ్‌లో ఆలయం ఉన్న ప్రాంతంలో అంతర్థానం అయ్యారని, అక్కడే ప్రస్తుత ఆలయం నిర్మించబడింది. పద్మావతి, శ్రీనివాసుల విగ్రహాలను ప్రతిష్ఠించారు. ఆనాటి నుండి నిత్యపూజలందుకుంటున్న శ్రీనివాసుడు కోరిన కోర్కెలు తీరుస్తాడనే నమ్మకం భక్తుల్లో బలపడింది.
వార్షిక బ్రహ్మోత్సవాలతో పాటు విజయదశమి, నవరాత్రి ఉత్సవాలు, స్వామివారి జన్మతిథి అయిన శ్రవణ నక్షత్రం రోజున ప్రత్యేక పూజలందుకుంటారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారిని ఊరేగించే రథాన్ని 1932లో రాజా మల్లారెడ్డి నిర్మించారు. తెలంగాణలోనే అతిపెద్ద రథంగా ఇది కీర్తి గడించింది. బ్రహ్మోత్సవాల నిర్వహణ కోసం గ్రామ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. 4వ తేదీన సప్తి పుణ్యహావచనం, అంకురార్పణ, కులదేవత స్థాపన, అఖండ దీపారాధన, అభిషేకం ఇత్యాది కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 5వ తేదీన అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, బలిహరణం, దేవతా ఆహ్వానం, భేరీపూజ, నిత్యహోమం కార్యక్రమాలు ఉంటాయి. 6వ తేదీన ఉదయం 11.06నిమిషాలకు స్వామివారి కల్యాణోత్సవం, అన్నదానం చేపట్టనున్నారు. రాత్రి వేళలో నిత్యహోమం, బలిహరణంతో పాటు గ్రామంలో పెరుమాళ్ల సేవ నిర్వహించనున్నారు.
7వ తేదీన సదస్సు, 8న డోలోత్సవం, 9న పారిజాత సేవ, రాత్రి డోపు కథ, 10వ తేదీన అర్ధరాత్రి 2.12గంటలకు రథోత్సవాన్ని నిర్వహిస్తారు. 11న పూర్ణాహుతి, శంకుతీర్థం, నాగవెల్లి, ఏకాంతసేవ కార్యక్రమాలతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనే దంపతులు ఆలయంలో పేర్లు నమోదు చేసుకోవాలని పూజారి ప్రవీణ్‌చారి తెలిపారు. ప్రజలు అధిక సంఖ్యలో హాజరై బ్రహ్మోత్సవాలను జయప్రదం చేయాలని గ్రామ కమిటీ అధ్యక్షుడు ఎలాల రమేష్ కోరారు.